ఈ రాత్రి ఇలాగే సాగిపోనీ..

ఆ రాత్రి నీవెక్కడో. నేనెక్కడో. కాని వాక్యాలు మనను కలుపుతున్నాయేమో. నిన్నటి  కరచాలనం భుజంపై ఇంకా వెచ్చగా పరుచుకున్నట్లున్నది.

రాత్రి అక్షరాల మధ్య సుదీర్ఘంగా సాగుతోంది. ఒక రాత్రి ఒక యుగంలా గడుస్తుంది.మరో రాత్రి ఒక తరంలా గడుస్తుంది. రాత్రి వెలుగుకోసం తపిస్తుందా, వెలుగు రాత్రి కోసం దహించుకుపోతుందా చెప్పలేను.

కాని రాత్రి ఆత్మలు పలకరిస్తాయి. జనఘోష సద్దుమణిగిన తర్వాత శబ్ద ఘోష ప్రతిధ్వనిస్తుంది.

ఉదయం నడుస్తున్న శవాలతో సంభాషణ జరుగుతుంది. రాత్రి శవాలు సజీవమై ఉదయాలను చిగురిస్తుంది. మూసిన కనురెప్పల్ని లేపి జీవన సౌందర్యాన్ని కనిపెట్టమంటుంది.

ఉదయం పాదాలు నడుస్తాయి. దారీ తెన్నూ లేకుండా. మళ్లీ వచ్చిన చోటికే తిరిగి వస్తాయి. రాత్రి పాదాలకు అంటిన మరకలు రేపటి మర్మాన్ని శోధించమంటాయి.

నినాదాలు సాగుతూనే ఉంటాయి. నిరాఘాటంగా. చితికిన గొంతుల పెగలని ధ్వనుల్లో ప్రతిఘటనల్ని ఏరుకొమ్మంటుంది రాత్రి. కుప్పకూలిన గోడల శిథిలాల మధ్య రాలిన నినాదాలకోసం అటూఇటూ పచార్లు చేయమంటుంది చీకటి.

ఉదయమంతా ఎవరికోసమో నివాళులు అర్పించేందుకే సరిపోతుంది. రాత్రి సామూహిక ఖననాల మధ్య ప్రణవనాదం ఆలపిస్తుంది.

పగలంతా అవమానాలే. చీదరింపులు. ఛీత్కరింపులు. ఉద్యోగ భయాలు, అభద్రతలు. రాత్రి లెక్కలేని గాయాలను వెంటతీసుకుని బానిసత్వం నుంచి చీకట్లను వేరు చేస్తుంది.

రోజంతా ఎక్కడకు వెళ్లినా గుండెలు బాదుకుంటున్న తల్లుల చేతుల మధ్య మరణ మృదంగ ధ్వనులే. రాత్రి ఎక్కడి నుంచో అమ్మ కాగితాల మధ్య ప్రత్యక్షమై  అన్నం తిన్నావా అని పలకరిస్తుంది.

ఫోన్లు, పలకరింపులు, మాటలు, ఉపన్యాసాలు ఎవరూ సహజంగా భుజంపై చేయి వేసేవారు లేరు దినమంతా. రాత్రి ఆకాశంలో తారలమధ్య స్నేహితుల్ని వెతుక్కుంటున్నాను. రాలిపడిన వెన్నెల ముక్కల్లో స్మృతుల్ని మృదువుగా స్పృశించగలుగుతున్నాను.

ఆకాశం ఒక ఎడారి. మేఘాలు సందేశాల కోసం ఎదురు చూస్తున్నట్లున్నాయి. ఒక్క నిజమైన ప్రేమ పిలుపైనా వర్షిస్తుందో, ఒక వెచ్చటి చుంబన స్వర్గాన్ని అందిస్తుందేమో అని ఎండిపోయిన పెదాలతో ఆశగా తలెత్తి చూస్తున్నాను.

దూరంగా ఎవరో శంఖారావం చేస్తున్నట్లున్నారు. భూమధ్య రేఖ చెదిరిపోతుందేమో.

మేఘాలు పెటిల్లున బ్రద్దలైన శబ్దం వినిపిస్తోంది. రాతి గోడలు కొట్టుకుపోతున్నాయేమో.

నేల ఎక్కడో ఏ కేంద్రం వద్దో కదిలినట్లున్నది. ఎవరి కాళ్ల క్రింద బీటలు వారుతున్నాయో..

సముద్రం సమీపంలో లేకపోయినా అలలు కిటీకిని తగులుతున్నట్లున్నాయి. ఎక్కడో సునామీ పెల్లుబుకుతుందేమో..

ఎవరో పిడికిలి బిగించిన శబ్దం వినపడుతోంది. మూడోపాదాన్ని పాతాళానికి లాగుతుందేమో..

వాడంటున్నాడు. నన్ను పరాయీవాడిగా చూస్తున్నారని. వాడిని వాడే వెలివేసుకున్నాడేమో .. ఈ రాత్రి  చుక్కల మధ్య కూడా వెన్నెల నన్ను వెలివేశారని చెప్పుకుంటోంది.

చీకట్లో నిశ్చలంగా ఉన్న చెట్టు తాను కదలలేకపోతున్నానని, ఏళ్ల తరబడి ఏకాకిగా ఉన్నానని బాధపడుతోంది. ఆకులన్నీ సామూహికంగా సంభాషిస్తున్నాయని తెలియదేమో..

అడుగుకూ అడుగుకూ మధ్య ఎంతో దూరం. కాని అడుగులన్నీ చేరేది ఒక్క చోటికే.

పక్షి ఒంటరిగా ప్రయాణిస్తున్నానని విలపిస్తోంది.  పచ్చగడ్డీ. చెట్టుకొమ్మా, పిల్లగాలీ వెంబడిస్తాయని తెలియదేమో.

పేర్లు వేర్వేరు. చేతి వ్రేళ్లు ఒకటే. అవే పుటల్ని పదే పదే స్పృశిస్తుంటాయి. ఎక్కడ నిద్రపోతామో చెప్పలేం. కాని కలలు మాత్రం అవే ఆలోచనల్ని పంచుకుంటాయి.

ఆ రాత్రి నీవెక్కడో. నేనెక్కడో. కాని వాక్యాలు మనను కలుపుతున్నాయేమో. నిన్నటి  కరచాలనం భుజంపై ఇంకా వెచ్చగా పరుచుకున్నట్లున్నది.

ఈ రాత్రి నరాల్లో నెత్తురు  సంగీతమై మోగుతోంది. ఆలోచనలన్నీ కవిత్వంగా మారి జీవితపు జెండాగా ఎగురుతున్నాయి. రాత్రి గడవడమంటేనే కవిత్వం.

*

 

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గొప్ప వాక్యాలు. లోతైనవి. పదేపదే చదవాలనిపించే సమకాలీన జీవిత సత్యాలు. రాత్రుళ్లు, పగళ్ళు ఇలానే సాగిపోతాయి. ఆలోచనల్ని రేకెత్తించే అక్షరాల తూటాలు. కృష్ణుడి కి శుభాకాంక్షలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు