‘ఎవడి పుట్టుకో ఒక ఆయుధమయ్యాక ఇక వాడి బతుకే ఒక యుద్ద భూమి’ అన్నాడు ఇబ్రహీం నిర్గుణ్ తన ఒక కవితలో..
‘అడవిలో మోదుగుపూలు అన్యాయాన్ని ప్రశ్నించడానికే పూస్తాయేమో.. కరడు గట్టిన బుల్లెట్ చేతులు పువ్వుల మీద రక్తపు ధారలు గీస్తాయేమో..’ అన్నాడు మెట్టా నాగేశ్వ రరావు మరో కవితలో..
‘మా అస్తిత్వంలో వేలు పెట్టి చూడు. తుపాకీల్లో మరణించి తూటాలమై జన్మిస్తాం.’. అన్నాడు సిద్దార్థ కట్టా ఇంకొక కవితలో…
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నవయుగ బుక్ హౌజ్ లోనో, మిత్రుడు యాకూబ్ వద్దో కవితా సంకలనాలు సేకరించి తీసుకువెళ్లడం నాకు అలవాటు. ఆ రకంగా నాకు వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా ఈ ముగ్గురు కవులు నాకు సుపరిచితులయ్యారు. ఇబ్రహీం నిర్గుణ్ రాసిన ‘ఇప్పుడేదీ రహస్యం కాదు’, మెట్టా నాగేశ్వరరావు రాసిన ‘మనిషొక పద్యం’, సిద్దార్థ కట్టా రాసిన ‘ఒక….’ కొన్ని లాక్ డౌన్ రాత్రుళ్లు నాకు నిద్ర పట్టకుండా చేశాయి.
నాకు వ్యక్తులతో పనిలేదు. అసలు నాతోకూడా నాకు పనిలేదు. మనల్ని మనం సమాజం నుంచి తొలగించుకుని మనలో సమాజాన్ని ఇంకింప చేసుకున్నప్పుడే మన రాస్తున్నప్పుడల్లా ఒక సామాజిక ధార ప్రవేశిస్తున్నట్లుంటుంది.
కవిత్వం చదవడం, ఊగిపోవడం, కవిత్వం రాయడం చర్చించడం ఒక వ్యాపకమైంది. జీవితం కవితా అసిధార మారింది.
ఇది ఇప్పటిది కాదు.. ఎప్పటిదో చెప్పలేం.
‘కవిత్వం ఆదిమమైంది. రైతు శ్రమ నుంచే కవిత్వం పుట్టింది. అతడి ఆకలి, పేదరికం నుంచి కవిత్వం పుట్టింది. ఇవాళ కూడా అదే పరిస్థితి నెలకొంది.. జీవితం సంక్లిష్టమైంది, భౌతిక పరిస్థితులు మారాయి కాని అతడి జీవన గానం మారలేదు.’. అన్నాడు క్లిస్టఫర్ కాడ్వెల్.
ఇవాళ పగిలిన పాదాలతో నా శరీరంపై నడుస్తున్న వలస జీవులను చూస్తుంటే, వారి చూపులు నా ఆత్మను ఛిద్రం చేస్తుంటే కాడ్వెల్ 90 ఏళ్ల క్రితం రాసిన మాటలు నిజమేనేమో.. అనిపిస్తుంది. 90 ఏళ్లేమిటి, తొమ్మిది వేల సంవత్సరాలనుంచైనా ఈ ఆదిమ గీత ప్రకంపనలు ఆగలేదేమో అనిపిస్తుంది. .
కాడ్వెల్ అతడి పేరు కాదు, అతడి అమ్మ పేరు. స్పెయిన్ విముక్తి కోసం బ్రిటన్ నుంచి బయలు దేరి యుద్దం లో పాల్గొన్నాడు. 29 ఏళ్ల వయసులో అతడు తన డైరీల్లో రాసుకున్న రచనలు చదివి అబ్బుర పడ్డ సోదరుడు అతడి లాంటి గొప్ప రచయిత మనకు అవసరమని, వెనక్కి రప్పించమని బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీని కోరాడు. బహుశా అప్పటికే ఆలస్యమైందోమో. కాడ్వెల్ మృత్యు దరహాసం చేస్తూ ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. అతడి హత్యకు కారణమైన జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో 1939 నుంచి 1975 వరకు దేశంపై నియంతృత్వం సాగించాడు. అంటే 36 ఏళ్లు.. ఈ లోపు ఎన్ని అమూల్యమైన యువకుల అమూల్య ప్రాణాలు గాలిని ప్రేమించాయో…
ప్రపంచ కాలగమనంలో ఎందరో నియంతలు వచ్చి పోయారు.. మన అనుభవాలేమీ కొత్తవి కావు.. స్పెయిన్ అంతర్యుద్దం కంటే ముందే శ్రీశ్రీ మరో ప్రపంచం గురించి కలలు కన్నాడు. ఊష్ణ రక్త కాసారాల్ని ఆహ్వానించాడు. ఎందరు నియంతలు వచ్చిపోయారో.. ఎందరు ఫ్రాంకోలు చరిత్ర పుటల రెపరెపల్లో కొట్టుకుపోయారో. ఎందరు నేల తల్లి ని హత్తుకుని శాశ్వతంగా నిద్రించారో.. ఎందరు కటకటాల్లోంచి వెన్నెలను తిలకించారో చెప్పలేం.
కాలం మారదా…?
ఆదిమ గీతానికి అంతం లేదా?
ముగ్గురు యువకవులు ఇబ్రహీం నిర్గుణ్, మెట్టా నాగేశ్వరరావు, సిద్దార్థ కట్టా ఇవాళ ఎన్నో వేల ఏళ్ల ఆదిమ గీతాలాన్ని ఆలపిస్తున్నారు. మట్టిని పిండి ఇంకిపోయి నెత్తుటి వాసన చూస్తున్నారు. వ్యవస్థ దుర్మార్గ స్వరూపాన్ని మట్టికొట్టుకుపోయిన తమ దేహాల కళ్లతో రెప్పలార్చకుండా గమనిస్తున్నారు.
అవును. ఇబ్రహీంకు ఏదీ రహస్యం కాదు.’కొన్ని దుఃఖాలు రాల్చిన తడి నన్ను తడుపుకుంటూ కవిత్వమై ప్రవహిస్తుంది..’ అంటాడు.
‘బతుకులు వలసవుతున్నప్పుడు కాలి బాటకు మనుషులు అడుగడుగునా కళేబరాలై దారుల మీద చెరగని చిత్రాలవుతుంటారు. ఒకటి కాదు, వందల మైళ్లు జానెడు పొట్టను నద్దిమూటలా మోసుకెళ్తుంది వలస’ అని ఇవాల్టి వలసదృశ్యాల గురించి ఆయన ఎప్పుడో రాశాడు.
‘ఎన్ని చెలకల్ని దొడ్డేసినా గుడిసె మేడగాలేదు. ఎన్ని శాల్తీలను బేరానికిచ్చినా అతడి బతుకు ఎక్కడ వేసిన గొంగడక్కడే. పాదాల్లో పగులు లోయలు మొలిచాయి తప్ప జీవితమొక చిన్న శిఖరమైనా ఎక్కలేకపోయింది..’ అని ఆయన ఏనాడో వాపోయాడు.
‘ఎవరి రక్తాన్ని కాళ్ల క్రింద కార్పెట్లుగా పరుస్తారో కాని ఈ సారి రక్తపు పాదాలతో ఆ పదవిని అలంకరించే వారెవరో రాబోయే రోజుల్లో’ అని ప్రశ్నించడం ఇబ్రహీంకు తెలుసు. ‘రాజ్యం దేన్నయినా సహిస్తుందేమో కాని ప్రశ్నల గొంతుపై రాజ్యం తాళమై మూసేస్తుంది’ అన్నఅవగాహన ఆయనకుంది.
‘ఈ వెన్నెల నీది కాదు. కళ్లని కూడా దాటకముందే చంద్రుడు అంతర్జాతీయ మార్కెట్ లో వేలం వేయబడ్డాడు’ అన్న అవగాహన ఆయనకున్నది.
‘మనం పాడిన పాట ఇక్కడ విత్తనంలా మిగలాలి. మనం రాసిన కవిత జనుల కన్నీటి ని తుడుస్తుండాలి’ అన్న స్పృహ ఉన్న ఇబ్రహీం ఇంటి గోడ ‘మట్టిటుకల్ని తాకితే సింధునది అలలు మనసు తీరాన్ని తాకినట్టుంటది’ అని రాసినప్పుడే అతడి కవితాసంకలనం అతడి హృదయాన్ని స్పశింపజేసింది.
‘నల్ల రేగడి బురద పొలంలో నాటుకున్న అమ్మ చేతి వేళ్లు వరిగంటెలకు పురుడు పోసిన స్పర్శ’లా అతడి కవిత తాకుతూనే ఉంటుంది.
…. ….. …….. …….
‘చాకిరేవులో నానీనానీ పగుళ్లొచ్చిన నాయన పాదాల ముందు ఈ అక్షరాల్ని పెట్టొస్తాను..’అన్న వాక్యం చదివినప్పుడు మెట్టా నాగేశ్వరరావు కవితా వాక్యాలు నన్ను ప్రక్షాళన చేసినట్లనిపించాయి.
‘గాలిలోంచో.. గగన సీమల్లోంచో పద్యాలు పుడతాయనుకోవడం మన భ్రమే! మట్టికుదురు లేకపోతేపద్యాలు నాల్కలకెక్కడం వట్టి మాటే. చొక్కాలు తొడుక్కుని గంప నిండా బతుకును మోస్తున్న కూలి తల్లుల పాదాల్లోంచి కాయలు కాసిన చేతుల్లోంచి రక్తాన్ని పూసుకుని పుడుతాయి పద్యాలు.. చాకిరేవుల్లోంచి, కుమ్మరి సారెల్లోంచీ, జాలరి వలనుంచీ. డప్పు తాత దైన్యం నుంచీ సబ్బండ బతుకుల అంగుళమంగుళం నుంచీ పద్యాలు పురిటియాతనల్ని పాడుతాయి. మనిషి గుండె గాయాల సలుపుని పాదాల్లోకి దిగుమతి చేసుకుంటాయి పద్యాలు.. మనిషిని పద్యం చేసి ఆకాశం నుదుటిపై నినాదంగా రాస్తాయి. ‘అన్న నాగేశ్వరరావు వాక్యాలు కృత్తిమ జీవితాలను బూడిద చేస్తున్నట్లనిపిస్తుంది. ‘కప్పుకున్న కార్పొరేట్ ముసుగుల్ని తీసి పేదబిడ్డల పచ్చి పులుసు పాత్ర వైపు చూడండి’..అని ఆయన వాస్తవికతను అద్దం పట్టగలడు. ‘పల్లెను కలగంటూ దోసిలి నిండా పల్లెను తీసుకుని ఆకుపచ్చని పద్యంలా’ మిగిలిపోగల శక్తి ఆయనకున్నది.
….. …….. ………… ….
సిద్దార్థ కట్టా ను ఆయన వాక్యాల్లోనే చెప్పాలంటే నరాల్ని తెంచుకుని దేహాల మీద ఒరుసుకుపోయిన కలల్ని కాగితాలు చేయగలడు. . రెండు చేతులూ విప్పార్చి కొత్త గాయాలకు స్వాగతం పలక గలడు. సూదిమొనలమీద సూర్యోదయాలు సుందరమైనవనీ, బిడ్డ వాలిన అమ్మ భుజం లాంటి హిమ శిఖరాలనీ చెప్పగలడు. .. ఒక్కొక్కరి ఊహలనూ అగ్గిపూలను చేయగలడు.
‘నీకెప్పుడైనా కవిత్వం రాద్దామనిపిస్తే నాన్న పేరో పదిసార్లు రాయి ఆ కాగితం ఎందుకు కవిత్వం కాదో చూద్దాం.. నాకు తెలిసి నాన్నంటే చెమట చుక్కల దేహం.. ఆకలే తెలియని శ్రామికుల సమూహం’ అన్న ఆయనకు కవిత్వ మార్మికత తెలుసు.
‘గాలి బుడగలు ఊదే పసిపాప అరచేతుల వెనుక పరుచుకున్న సబ్బు నురగ పూలతోటను చూడు.. సౌందర్యానికి నీకు తెలిసిన అర్థం మారుతుంది.. వెన్నెల రాత్రి ఆకాశాన్ని నదిలో మోయగలిగిన వాడే నింగికి సూర్యుణ్ణి అతికించగలడు..’ అన్న సిద్దార్థకు కవిత్వ సౌందర్యమూ తెలుసు.
…….. ……. ……. ……….
ఈ ముగ్గురూ తమలో తాము రగిలిపోతుంటే, కసిగా రాస్తుంటే ఉన్నట్లుండి శరీరంలో నెత్తురు వేడిగా మారుతున్నట్లు అనిపిస్తుంది. రాత్రి చీకట్లు పారిపోతున్నట్లనిపిస్తుంది.
కాని అనిపిస్తుంది మాత్రమే.
‘వాడిని వాడు ఆయుధంగా ప్రకటించుకున్న తర్వాతే వాడు గడ్డమీద కుంకుమ పూవై పూశాడు.బాయినెట్ మొన మీద సింధూరం దిద్దుకుంటున్న పడమటి ఆకాశం అడవి వెన్నెల కలల్ని కంటుంది. చీకట్లకు నిప్పు పెట్టి గుట్టమీద దీపమై వెలిగిపోతాను.’.అని ఇబ్రహీం మండిపడుతుంటే కొన్ని దశాబ్దాలుగా అవే అక్షరాలకు సానపెట్టి మరింత పదును తేలుస్తున్నట్లనిపిస్తుంది. కాగితం మీద విరిగిన కలను ఆరేసుకోవడం, కాగితాలను ధగ్దం చేయడం అతడికి అలవోకగా అబ్బిందంటే గత కొన్ని దశాబ్దాలుగా తెలుగునేల కవిత్వ నిర్వచనాన్ని అతడిలో జీర్ణించేలా చేసిందని అర్థమవుతుంది.
‘ఒక అక్షరాన్ని పాతిపెడితే వేల గొంతులమై కలబడతాం..’ అంటాడు మెట్టా నాగేశ్వరరావు ‘ఖబర్దార్ దుండగుడా.. నీ హంతక పర్వాన్ని కాలం క్షమించదు.. నీ అరాచక ఎజెండాకు కాలం చెల్లే రోజులు వచ్చాయి..’ అని హెచ్చరిస్తాడు. కవిత్వంలో ఈ పిడికిలి బిగింపులు ప్రతి సారీ ఒక అందాన్ని తీసుకువస్తాయనడంలో సందేహం లేదు.
సిద్దార్థ కట్టాకు ఆగ్రహం వస్తే ఆపడం కష్టం. ‘ఉమ్మరా నాకొడకా ఉమ్ము.. దేశపు యోనిలో మహానగరాలు చూపించి పెట్టుబడిదారుల మర్మాంగాలకు కండోములు తొడిగి ఈ దేశపు నాయకుల మీద ఉమ్ము.. చూపుడు వ్రేళ్ల ఎక్సర్ సైజు చేద్దాం.. చేతుల్లో తుపాకి పడ్డప్పుడు వేళ్లకూ ట్రిగ్గర్లకూ అనుసంధానం కుదరాలి కదా మరి.’ అని రాస్తూ పోతాడు. ఈ వాక్యాలు ఏనాటి యుద్ద ప్రకంపనల్నో, ఏ దిగంబర, తిరగబడు కవుల ఆక్రోశాన్నో పునరుత్థానం చేస్తున్నట్లనిపిస్తుంది.
… ……. …….. …… …..
కవిత్వం రాయగలిగిన వాళ్లూ, జీవితాలను అనుభవించిన వాళ్లూ, చెమట, నెత్తుటి తడి విలువ తెలిసిన వాళ్లూ, పూలూ, ఆకాశం, వెన్నెలా, నేలా, సెలయేళ్లూ, పక్షులూ అన్నిటికి మించి మానవ సంబంధాలు తమ బతుకుల్లో భాగమైన వాళ్లూ ఇవాళ రాయవలిసిన జీవన సంక్షోభం చాలా దట్టంగా ఉన్నది. వ్యవస్థ దుర్మార్గాలు ఎంతో లోతుగా, దట్టంగా ఉన్నాయి.
తుపాకులూ, అడవులూ, తూటాలు, ఆయుధాలు, యుద్దభూముల పరిభాషకు కాలం చెల్లింది. కొన్ని దశాబ్దాలుగా తెలుగు కవిత్వానికి వీటి తుప్పు అంటుకుని వదలడం లేదు. నినాదం కవిత్వానికి పాచిలా పట్టుకుంది.
మనం కాడ్వెల్ లు చావాలని కోరుకోకూడదు. పాణి గ్రాహులూ బతకాలని కోరుకుందాం.
ఆధునిక యువత సంధిగ్ద దశలో ఉన్నది. కాళ్ల క్రింద లావాను గమనించని భక్తులు పారవశ్యంలో ఉన్నారు. నెత్తుటి పూరు ఆఘ్రాణిస్తున్న కాలభైరవుడి అర్థ నిమీలిత నేత్రాల్లో నిశ్చల నిర్వికార ప్రశాంతత తాండవిస్తోంది. మోగుతున్న గంటల మధ్య మృత్యు కాహళి వినిపించడం లేదు. దద్దరిల్లుతున్న కరతాళ ధ్వనుల మధ్య కుప్పకూలిపోతున్న శవాలు కనిపించడం లేదు. అనామకుల ఆత్మహత్యల వెనుక కుప్పకూలిపోతున్న వ్యవస్థల ధ్వనులు చెవికి సోకడం లేదు. మనసుల్లో మతం విషవాయువులా చొచ్చుకు రావడాన్ని గ్రహించడంలేదు.
ఇవాళ పోరాడే శక్తులన్నీ ఓటమి పాలైనట్లు కనిపిస్తున్నాయి. పాత పదాలతో, చెల్లిపోయిన నినాదాలతో ఎవర్నీ మేలుకొలపలేరు. చెట్లకు వ్రేళ్లాడుతున్న శిరస్సులకు ప్రాణం పోయలేరు.
మాటల్ని వృధా కానివ్వకండి. మనుషుల్ని వృధా కానివ్వకండి ముఖ్యంగా పసిపిల్లల ప్రాణాల్ని వృధా కానివ్వకండి.
మృత్యువును కాదు, జీవితాన్ని ప్రేమించండి.. గుండెల్లో చీకట్లను తరిమేయండి.
*
నమస్తే సర్ !
కృష్ణపక్షం చాలా చాలా బాగుంది.
స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు సర్.
బావుంది
ఆ ముగ్గురి కవితావేశాన్ని, కవిత్వ పఠిమను కృష్ణుడి write -up ద్వారా తెలుసుకున్న తర్వాత పరుగు పరుగున పుస్తాకాల షాపుకు వెళ్లి ఆ కవిత్వ భండాగారాలను అమాంతం సొంతం చేసుకొని ఆ భావావేశం లో తడిసిపోవాలని మనసు తొందరపెట్టింది. కానీ లాక్ డౌన్ సమయం! బయటికి కదలలేని పరిస్థితి. ఏమయినా, 21 వ శతాబ్దపు ఆధునికతను సంపూర్ణoగా తెలుగు కవిత వంటబట్టించుకొని ప్రపంచ సాహిత్యంలో తలమానికంగా ఉందన్న సంతృప్తి కలిగింది.
ఒకే వ్యాసంలో ముగ్గురు కవుల కవితా సంకలనాలపై మీ సమీక్ష అద్భుతంగా వుంది… ఎవరికి వారే స్వంత గళమున్న కలాలు…
ధన్యవాదాలు