రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనేది ప్రమాదకర, విచ్ఛిన్నకర భావజాలాన్ని సమాజంలో వ్యాపింపజేయడానికి ఏర్పడిన సంస్థ, భారత సమాజపు సరస్సులో అది ఒక విష ప్రవాహపు పాయ, భారత సమాజ వృక్షానికి పట్టిన చీడ అనే అభిప్రాయాలు చిన్నప్పటి నుంచీ, దాదాపు యాబై ఏళ్లుగా చదువుతూ, వింటూ, మాట్లాడుతూ, అక్కడక్కడ రాస్తూ ఉన్నప్పటికీ, దాని మీద ఒక పూర్తి పుస్తకమే రాస్తానని, రాయవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కాని నూరేళ్లుగా చాపకింద విషంలా వ్యాపించిన ఆర్ఎస్ఎస్, దాని పరివారం గత పది సంవత్సరాలుగా అధికార పీఠం ఎక్కి దేశంలో సాగిస్తున్న బీభత్సం చూస్తూ, ఆ కాషాయ విష విద్వేష ప్రమాదాన్ని ప్రతి ఒక్కరి దృష్టికీ తేవడం, సంఘ్ పరివార్ పట్ల ప్రతిఘటన ఆలోచనలను సమీకరించడం ఒక ఆలోచనాపరుడిగా నా బాధ్యత అని గుర్తించినందువల్ల ఈ పుస్తకం రాయక తప్పలేదు. భారత సమాజపు బహుళత్వాన్ని, సహనాన్ని, సహజీవనాన్ని గౌరవించే చరిత్ర విద్యార్థిగా కూడ ఈ పుస్తక రచన నా బాధ్యత. ప్రస్తుత సమాజపు చెడుగులను నిర్మూలించి ఒక ఉన్నతమైన సమసమాజ దిశగా నడిపించాలనే లక్ష్యపు మార్గంలో ఒకానొక కార్యకర్తగా కూడా సంఘ్ పరివార్ తిరోగమన, అభివృద్ధి నిరోధక భావజాలాన్ని ప్రజలకు విప్పిచెప్పడం నా కర్తవ్యం.
ఇది హిందూ ధార్మిక ఆలోచనలను, ఆచార వ్యవహారాలను అమాయకంగా విశ్వసించే కోట్లాది మంది ప్రజల మీద విమర్శ ఎంతమాత్రమూ కాదు. ఆ అమాయకత్వాన్ని తమ స్వార్థ రాజకీయాలకు వాడుకోదలచిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని పరివారంలోని వందలాది సంస్థల దుష్ట పన్నాగాల మీద వివరణా విమర్శా మాత్రమే.
అడుగు తీస్తే, అడుగు వేస్తే నిత్యమూ శ్రీమన్నారాయణ అంటూ ఉండే ఆస్తికుడైనప్పటికీ, తన ఇంట్లోనే భిన్నాభిప్రాయాలు, హేతువాద చర్చలు, తన ఆస్తికత్వం మీద ధిక్కారాలు విస్తరిస్తుంటే సహనంతో ఆమోదించిన మా బాపు, నెల్లుట్ల వరవరరావు (1913-1998) ను ఈ సందర్భంగా తలచుకోవాలి. తన మత విశ్వాసాలకు పూర్తిగా భిన్నమైన, ఆ విశ్వాసాలను కూలదోసే మార్క్సిస్టు దృక్పథం, విప్లవోద్యమ సానుభూతి, మమేకత తన ఇంట్లోనే తలెత్తుతుంటే అంగీకరించిన సహన, సహజీవన, బహుళత్వ హిందూ జీవన శైలికి ఆయన ఒక ప్రతీక. ఇవాళ హిందూ మతం ప్రమాదంలో ఉందనే అబద్ధంతో, దాన్ని రక్షించే బాధ్యత తమదేననే ప్రగల్భంతో బయలుదేరిన సంఘ్ పరివార్ మా బాపు వంటి కోట్లాది మంది అమాయక హిందువులకు ఎంతమాత్రమూ ప్రతినిధి కాదు. అది కేవలం తన రాజకీయార్థిక ప్రయోజనాల కోసం, తన హింసా ప్రవృత్తికి మేలి ముసుగుగా “హిందూ” పేరును వాడుకుంటూ కోట్లాది మంది హిందువులను బలి చేస్తున్నది.
ఒక మత విశ్వాసంగా, ఒక ఆధ్యాత్మిక ఆలోచనగా, వర్తమాన సమాజపు సమస్యల నుంచి ఒక ఉపశమనంగా, అమాయకంగా ఎవరైనా హిందువులుగా ఉండవచ్చు. హేతుబద్ధ, శాస్త్రీయ ఆలోచనా మార్గంలో పయనిస్తే ఆ మతంలో ఉన్న అసమానతనూ, పీడననూ, హింసనూ గుర్తించి అసలు మతం గురించే విచికిత్సలో పడవచ్చు. కాని, హిందుత్వ వేరు. సంఘ్ పరివార్ భావజాలం వేరు. తాము హిందూ మతోద్ధారకులమని హిందువులలో కొందరినైనా అబద్ధాలతో మాయ చేసి, భ్రమల్లో ముంచి, ఆకర్షించి, హింసా ప్రవృత్తిలోకి దించి తమ రాజకీయార్థిక ప్రయోజనాలను తీర్చుకోదలచిన పిడికెడు మంది రాజకీయ వ్యాపారుల చేతిలో ప్రధాన సాధనం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. పరాయి మతస్తుల బూచి చూపి విద్వేషాన్ని ప్రచారం చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి తమ పాలన సజావుగా సాగించుకోవడానికి పాలకవర్గాలు కనిపెట్టిన ఆయుధాలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. అది సృష్టించిన వందకు పైగా సంస్థల పరివారం.
సంఘ్ కూ, సంఘ పరివారానికీ హిందూ మత విశ్వాసాలతో పెద్ద సంబంధం లేదు. సంఘ్ పరివార్ సిద్ధాంతకర్త వినాయక దామోదర్ సావర్కర్ (1883-1966) తాను హిందుత్వ అని చెప్పేదానికి మతంతో సంబంధం లేదని స్పష్టంగానే రాశాడు. ఈ వాస్తవాన్ని హిందూ మత విశ్వాసులకు కూడ తెలియజెప్పడం, సంఘ్ పరివార్ చేస్తున్న విష విద్వేష ప్రచారాల, హింసాకాండల అసలు ఉద్దేశాలను ప్రజలందరికీ విప్పి చెప్పడం అనే బాధ్యతల నిర్వహణే ఈ పుస్తకం.
సంఘ్ పరివార్ దుర్మార్గాల గురించి నాకు తెలియడం ప్రారంభమైనది 1970ల మొదట్లో. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ మాగజైన్ కోసం శ్రీశ్రీ దగ్గర వ్యాసం అడిగి తీసుకున్న ప్రిన్సిపాల్, ఆర్ఎస్ఎస్ భావజాల ప్రోద్బలం వల్లనే ఆ వ్యాసం చించివేసి మాగజైన్ పంచినప్పుడు సృజన ముఖపత్రంగా ఆ వ్యాసం వేశారని విన్నాను. నాకు పదకొండో ఏడు నడుస్తున్నప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జిరెడ్డి అనే అద్భుతమైన విద్యార్థి నాయకుడిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) అనే సంస్థకు చెందిన గూండాలు హత్య చేశారనీ, ఆ సంస్థను నడిపించే శక్తి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనీ మొదటిసారి విన్నాను. మా సృజన మాసపత్రిక జూన్ 1972 జార్జిరెడ్డి ముఖచిత్రంగా వెలువడింది. ఆ తర్వాత ఏడాదికి చదువుకోసం హనుమకొండకు వచ్చిన నాకు వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఇసి) విద్యార్థులు పరిచయమయ్యారు. అప్పటికింకా విప్లవ విద్యార్థి ఉద్యమ నిర్మాణాలు ప్రారంభం కాలేదు గాని, ఆర్ఇసి లో ప్రగతిశీల విద్యార్థులకూ ఎబివిపి విద్యార్థులకూ నిత్యం ఘర్షణలు సాగుతుండేవి. ఎక్కువగా బీహార్ భూస్వామ్యవర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎబివిపిలో ఉండేవారు. ఆ ఘర్షణలు భౌతిక దాడుల దాకా కూడ పరిణమించాయి. అది ఏదో రెండు విద్యార్థి సమూహాల మధ్య ఘర్షణ కాదు. అప్పటికి తెలంగాణలో తీవ్రతరమవుతున్న వర్గపోరాటానికి అది ఒక ప్రతిఫలనం. విద్యార్థి రంగంలో ఆ వర్గపోరాటానికి ప్రతిఫలనంగా ప్రగతిశీల విద్యార్థులు ప్రజల వైపు, ప్రజాపోరాటాల వైపు, సత్యం వైపు, న్యాయం వైపు, చరిత్ర వైపు నిలబడ్డారు. ఎబివిపి విద్యార్థులు పాలకవర్గాల వైపు, భూస్వామ్య వర్గాల వైపు, అధికార వర్గాల వైపు, అసత్యం వైపు, అన్యాయం వైపు, దోపిడీ పీడనల వైపు, తిరోగమనం వైపు నిలబడ్డారు. ఆరోజుల్లో విప్లవోద్యమానికీ, విప్లవ విద్యార్థి ఉద్యమానికీ నిజమైన ప్రత్యర్థులుగా పాలకపక్షం, దాని చెప్పుచేతల్లో ఉండే పోలీసు వ్యవస్థలతో సమానంగా ఆర్ఎస్ఎస్, ఎబివిపి వ్యవహరించాయి.
ఆ పరిణామాలను దగ్గరిగా చూస్తుండడంతో నాలో ఉన్నత పాఠశాల విద్యార్థి దశ లోనే ఆర్ఎస్ఎస్ వ్యతిరేక ఆలోచనలు మొదలయ్యాయి. అప్పటికే హనుమకొండలో కొన్ని చోట్ల జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శాఖలు, వాటి గురించి సహవిద్యార్థులు చెపుతున్న విషయాలు నా వ్యతిరేకతను పెంచాయి. ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువలో ఆర్ఎస్ఎస్ జనతాపార్టీలో భాగమై, కాస్త గౌరవనీయతను సంపాదించుకున్నప్పటికీ అప్పటికే భారత చరిత్ర, మార్క్సిస్టు దృక్పథం అధ్యయనం మొదలుపెట్టాను గనుక ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సైద్ధాంతికంగా వ్యక్తిగత స్థాయిలో కూడా వ్యతిరేకించడానికి పునాది బలపడింది. సరిగ్గా అప్పుడే ఉత్తర భారతంలో మత కల్లోలాల గురించి ఎన్నో నివేదికలను సృజన లో ప్రచురణ కోసం ఇంగ్లిష్ నుంచి తెలుగు చేస్తూ, ఆర్ఎస్ఎస్ దుర్మార్గాన్ని మరింతగా అర్థం చేసుకున్నాను.
ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీలో చేరి రాడికల్ విద్యార్థి సంఘం కార్యకర్తను కావడంతో, అక్కడ ఆర్ఎస్ఎస్ తో, ఎబివిపితో నిత్య ఘర్షణలో నేనూ భాగమయ్యాను. ఆ మూడు సంవత్సరాల్లో మా కాలేజీలో భౌతిక ఘర్షణలు జరగలేదు గాని, దాదాపు ప్రతి వారమూ ఎబివిపి విద్యార్థులు చేసిన ఏదో అరాచకం మీదనో, తప్పుడు వాదన మీదనో, వాళ్లు వేసిన పోస్టర్ కు వ్యతిరేకంగానో, జవాబుగానో, సాధారణంగానో భూస్వామ్య భావజాలాన్ని విమర్శించే ‘రాడికల్ వాయిస్’ పోస్టర్ ప్రతి వారమూ రాసి పెట్టే బాధ్యత నామీద ఉండేది. మా కాలేజీలో అప్పటికి ఎబివిపి విద్యార్థులంటే ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో లక్ష్యంగా ఉండిన భూస్వాముల పిల్లలే. అదే ఉత్తర తెలంగాణలో తమ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడుతుండిన సబ్బండ వర్ణాల పిల్లలు సహజంగానే రాడికల్ విద్యార్థులుగా ఉండేవారు. గ్రామాల్లో జరుగుతున్న వర్గపోరాటమే కాలేజీలో కూడా ప్రతిఫలిస్తుండేది. ఆ వర్గ పోరాట ప్రతిబింబమైన నిత్య వివాదంలో నేనూ ఒక పాత్ర పోషించాను. అలా ఆర్ఎస్ఎస్ ఎంత దుర్మార్గమైన శక్తో అంతకంతకూ ఎక్కువగా తెలుస్తూ వచ్చింది, తెలుసుకోవలసి వచ్చింది. అక్కడి నుంచి ఎంఎ కోసం ఉస్మానియాకు వచ్చాక అది మరింత ఎక్కువగా కొనసాగింది. ఆ నాలుగైదు సంవత్సరాల్లో తెలంగాణలో ప్రతి కళాశాలా ఎబివిపికి, ప్రగతిశీల విద్యార్థులకు ఘర్షణా వేదికే. కాలేజీ విద్యార్థి సంఘం ప్రారంభ, ముగింపు సమావేశాలు రెండు భావజాలాల మధ్య తీవ్రమైన చర్చకు వేదికగా ఉండేవి.
అప్పుడే ఆర్ఎస్ఎస్, ఎబివిపి శక్తులు విప్లవ విద్యార్థుల మీద, మేధావుల మీద ఎన్నో హంతక దాడులు చేశాయి. నల్లగొండలో శేషు సారు మీద దాడిచేసి చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లారు. ఉస్మానియా క్యాంపస్ లో వరవరరావు మీద హత్యా ప్రయత్నం చేశారు. జగిత్యాలలో కె. బాలగోపాల్ మీద కత్తులతో, సైకిల్ చైన్లతో దాడి చేశారు. అంతకు ముందే జైలులో చెరబండరాజు మీద ఆర్ఎస్ఎస్ నాయకుడు నరేంద్ర చేసిన దాడి తర్వాత కాలంలో చెరబండరాజు తలనొప్పికీ, మెదడులో ట్యూమర్ కూ, అంతిమంగా మరణానికీ దారి తీసింది. ఆర్ఎస్ఎస్-ఎబివిపి మూకలు 1981 ఏప్రిల్ లో జగిత్యాలలో పి డి ఎస్ యు నాయకుడు చాంద్ పాషాను, 1982 డిసెంబర్ లో నల్లగొండలో ఆర్ ఎస్ యు నాయకుడు శేషయ్యను, 1985 జనవరిలో జగిత్యాలలో న్యాయవాది గోపి రాజన్నను, 1986 డిసెంబర్ లో హైదరాబాదులో ఆర్ ఎస్ యు నాయకుడు జయరాజు ను హత్య చేశాయి (ఈ హంతకదాడులు ఆ తర్వాత కూడా కొనసాగాయి. 1999 ఫిబ్రవరిలో కల్వకుర్తిలో అప్పటి తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ నాయకుడు సి. కాశీమ్ మీద హత్యా ప్రయత్నం జరిగింది).
పోలీసు అధికారి ఎచ్ జె దొర “ఏబీవీపీ వాళ్లు మా కళ్లూ చెవులూ” అని బహిరంగంగా పొగిడి ఆయుధాలు కూడా అప్పగించిన వ్యవహారం కూడా జరిగింది. ఒకవైపు కాలేజీల్లో ప్రాంగణం లోపల కూడా 144 సెక్షన్ విధించి విప్లవ విద్యార్థుల మీద దమనకాండ అమలు జరుపుతూ మరొకవైపు ఎబివిపి విద్యార్థుల హింసాకాండకు మాత్రం పోలీసులే మద్దతుగా నిలిచిన రోజులవి.
అప్పుడే “లాల్ గులామీ చోడ్ కర్, బోలో వందే మాతరం’ అని ఎబివిపి ఇస్తుండిన నినాదాన్ని తిప్పి కొడుతూ, మా ఎన్ కె ‘లాల్ బనో, గులామీ చోడో, బోలో వందే మాతరం’ అని అద్భుతమైన దీర్ఘ కవిత రాశాడు. ఆ కవిత సృజనలో అచ్చు వేసి, సృజన ప్రచురణగా పుస్తకంగా తెచ్చినప్పుడు, ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి కె. బాలగోపాల్ సుదీర్ఘమైన ముందుమాట రాశారు. అప్పుడే రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘాల సంయుక్త ప్రచురణగా ఆర్ఎస్ఎస్ భావజాలం మీద విమర్శ పుస్తకం (‘విప్లవోద్యమంపై విషం కక్కుతున్న విద్యార్థి పరిషత్ ప్రచారాన్ని ఎండగట్టండి’, 1984) వెలువడింది. అప్పుడే, 1985 జనవరిలో గద్వాలలో జరిగిన విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాలలో కె వి ఆర్ ‘మతవర్గతత్వం’ అనే లోతైన ప్రసంగం చేశారు.
ఈ పరిణామాలకు సమాంతరంగా హైదరాబాద్ రాజ్య చరిత్ర, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర అధ్యయనం ప్రారంభించాను. అటు ఇస్లామిక్ ఛాందసవాదాన్ని ప్రబోధిస్తూనే ఇటు హిందూ భూస్వాముల ప్రైవేటు సైన్యంగా అరాచకాలు సాగించిన రజాకార్లను కేవలం ముస్లిం తీవ్రవాదులుగా చిత్రిస్తూ తప్పుడు చరిత్ర ప్రచారం చేస్తున్న ఆర్ఎస్ఎస్ విభజన విద్వేష వైఖరి ఆ అధ్యయన క్రమంలో మరింతగా అర్థమయింది. హైదరాబాద్ రాజ్యంలోనూ, దేశవ్యాప్తంగానూ మత విభజనలో, మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో, హంతక మత కల్లోలాలు సృష్టించడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి తవ్వినకొద్దీ వివరాలు తెలుస్తూ వచ్చాయి. 1980ల చివరిలో కశ్మీర్ లో జరిగిన మత కల్లోలాల నేపథ్యంలో కశ్మీర్ చరిత్ర అధ్యయనం, ప్రత్యేకించి కశ్మీరియత్ మేధావి బాలరాజ్ పూరీ పౌరహక్కుల సంఘం ఆహ్వానం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినప్పుడు రెండు మూడు చోట్ల ఆయన ఉపన్యాసాలు అనువదించడం మొత్తంగా సంఘ్ పరివార్ సంస్థల దుర్మార్గ రాజకీయాలను, భావజాలాన్ని నా అవగాహనలోకి తెచ్చింది.
1990ల మొదట్లో అప్పటికి దేశాన్ని పట్టి కుదుపుతుండిన సమస్యల మీద ట్రాక్ట్స్ ఆఫ్ ది టైమ్స్ పేరుతో చిన్న చిన్న పరిచయ పుస్తకాలు ప్రచురించాలని తలపెట్టిన ఓరియెంట్ లాంగ్మన్స్ చరిత్రకారులు సుమిత్ సర్కార్, తనీకా సర్కార్, తపన్ బసు, ప్రదీప్ దత్తా, సంబుద్ధ సేన్ లు ఆర్ఎస్ఎస్ మీద రాసిన ‘ఖాకీ షార్ట్స్ అండ్ సాఫ్రన్ ఫ్లాగ్స్’ పుస్తకం ప్రచురించి, దాన్ని వెంటనే తెలుగు అనువాదం కూడా చేయించారు. ఆ అనువాదం సరిచూడమని అప్పటి ఓరియెంట్ లాంగ్మన్స్ సంస్థ ఎడిటర్ వేంకటేశ్వర రెడ్డి గారు నాకు పంపారు. ఆర్ఎస్ఎస్ ఎంత ప్రమాదకరమైన సంస్థో క్లుప్తంగా వివరించిన మంచి పుస్తకం అది. ఆ అనువాదం సరిచూసే పనిలో భాగంగానే గోల్వాల్కర్ ‘పాంచజన్యం’ చదివి ఇంత అమానుషమైన, సంఘ వ్యతిరేకమైన ఆలోచనలు ప్రతిపాదించిన పుస్తకం ఎన్ని మెదళ్లను విషపూరితం చేస్తున్నది అని విచారించాను. ఆ తర్వాత ఏడెనిమిది సంవత్సరాలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాధికారానికి వచ్చి రాజ్యాంగం మార్పు అనే ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు, ఆర్ఎస్ఎస్ మొదటి నుంచీ ప్రకటిస్తున్న రాజ్యాంగ వ్యతిరేకత మీద రాష్ట్రంలో చాలా చోట్ల ఉపన్యాసాలు ఇవ్వాల్సి వచ్చి, ఆర్ఎస్ఎస్ గురించి మరింతగా చదివాను. ఈ క్రమమంతటిలోనూ ఆర్ఎస్ఎస్ భావజాలం మీద, ఆచరణ మీద వ్యాసాలు రాశాను, ఉపన్యాసాల్లో ప్రస్తావించాను.
అయితే ఇంత చెప్పినప్పటికీ, సంఘ్ పరివార్ భావజాలాన్ని వ్యతిరేకించే, ఎండగట్టే, ప్రతిఘటించే ఆలోచన, ఆచరణ వ్యక్తిగతంగా గాని, మొత్తంగా ప్రగతిశీల ఉద్యమాల వైపు నుంచి గాని జరగవలసినంత జరగలేదనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో నేను ఇప్పుడు ఇలా పూర్తి స్థాయి పుస్తకం రాయడానికి ప్రధాన కారణం మాత్రం చిరకాల మిత్రులు, తత్వశాస్త్ర అధ్యాపకులు ఎన్ అంజయ్య గారు. విశాఖపట్నం భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు జె వి సత్యనారాయణమూర్తి (నాని) గారు. ‘భారతదేశ చరిత్ర, సంస్కృతి: శాస్త్రీయ దృక్పథం’ అనే అంశంపై భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ ఒక అధ్యయన శిబిరం నిర్వహించనున్నదనీ, దానిలో ఏయే పాఠాలు ఉంటే బాగుంటుందో సూచించమనీ అంజయ్య గారు అడిగారు. చర్చా క్రమంలో ‘సంఘ్ పరివార్ భావజాలం గురించీ, చరిత్ర గురించీ, ఆ పరివారంలోని వివిధ సంస్థల గురించీ, వాటి కార్యక్రమాల గురించీ ఒక పాఠం ఉంటే బాగుంటుంది. అది చాల పెద్దదవుతుందనుకుంటే మూడు నాలుగు పాఠాలుగా విభజించి వేరువేరు అధ్యాపకులకు ఇవ్వవచ్చు’ అన్నాను. అలా చర్చిస్తూ ఉండగానే ఆయన ‘ఆ మొత్తాన్నీ ఒకటే పాఠంగా మార్చి, మీరే చెపితే బాగుంటుంది’ అని ఒక సూచనలా కూడ కాకుండా ఆదేశంగానే అన్నారు. అలా 2022 నవంబర్ 19న విశాఖపట్నంలో అధ్యయన తరగతుల్లో చేసిన మూడు నాలుగు గంటల ఉపన్యాసం ఈ పుస్తకానికి తొలిరూపం. ఆ అధ్యయన తరగతి నిర్వాహకులకూ, శ్రోతలకూ కృతజ్ఞతలు. నిర్వాహకులు ఆ ఉపన్యాసాన్ని అప్పటికప్పుడు లైవ్ స్ట్రీమ్ చేయడం మాత్రమే కాక, ఆ తర్వాత యూట్యూబ్ మీద కూడా పెట్టారు. దాన్ని మరెందరో షేర్ చేసి విస్తృత ప్రచారం కల్పించారు. ఆ ఉపన్యాసాన్ని ఓపికగా అక్షరీకరించి పంపిన భువనగిరి జి శ్రీనివాసాచారి గారికి కృతజ్ఞతలు. ఆయన అక్షరీకరణను కొంత దిద్ది వీక్షణం 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సంచికలలో ధారావాహికగా ప్రచురించాను. వీక్షణంలో వెలువడిన వ్యాసాన్ని పునర్ముద్రించిన ప్రజాపంథా, రైజింగ్ న్యూడెమోక్రసీ సంపాదకులకు కృతజ్ఞతలు. ఆ వ్యాసంలో అవసరమైన మార్పులూ చేర్పులూ చేసి ఇప్పుడు ఈ పుస్తకం ప్రచురిస్తున్నాను. వంద సంవత్సరాలలో సంఘ్ పరివార్ ఆడిన అబద్ధాలు, వ్యాపింపజేసిన విష, విద్వేష ప్రచారం, అన్ని వ్యవస్థలనూ లోలోపలి నుంచి తొలిచివేస్తూ చేసిన విధ్వంసం, చేసిన అక్రమాలు, మారణకాండలు… ఆ చరిత్ర వివరంగా రాయాలంటే కొన్ని వందల పేజీల పుస్తకమైనా సరిపోదు. ఈ పుస్తకం చదువరులకు సులభంగా వంద పేజీల లోపు ఉండాలని నిర్ణయించుకోవడంతో చాలా విషయాలు వదిలేసి, ముఖ్యమైన విషయాలకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది.
ఆర్ఎస్ఎస్ ఎంత దుర్మార్గమైన భావజాలాన్ని ఈ సమాజంలో వ్యాపింపజేస్తున్నదో, దాని పరివారంలోని అనేక సంస్థలు ఆ విచ్ఛిన్నకర, విష, విద్వేష రాజకీయాలను ఎలా ముందుకు తీసుకుపోతున్నాయో, ఆ రాజకీయాచరణలో వాళ్లు ఎటువంటి సంఘ విద్రోహకరమైన, అమానుషమైన, మానవతా వ్యతిరేకమైన పనులు చేస్తున్నారో ప్రజల దృష్టికి తేవడమే ఈ పుస్తక రచనలో నేను పెట్టుకున్న లక్ష్యం. ఈ అవగాహనను ఇంకా మెరుగుపరిచే, పదునెక్కించే విమర్శలను మీ నుంచి కోరుకుంటున్నాను.
*
2022 లో. మీరు చేసిన ఆ నాలుగు గంటల ప్రసంగం లింక్ ఇవ్వగలరు