పాతికేళ్లకిందట దక్షిణ భారతదేశాన్ని సిద్ధసమాధియోగ అనే సాధనాశిక్షణ హోరెత్తించింది. ఎంతో మందిమి ఆ రోజుల్లో పధ్నాలుగు రోజుల ఆ శిక్షణలో మహా ఉత్సాహంగా పాల్గొన్నాం
అందులో ఇంగ్లీషు మంత్రాలుండేవి. దాంట్లో’ సో వాట్’ అన్నది ప్రధానమైనది. దీన్ని ఇద్దరితో అభ్యాసం చేయించేవారు. నేను ఇంత చదివేను అంటే రెండో వారు సో వాట్ అంటారు. ఇంతపెద్దఉద్యోగం అంటే సో వాట్. ఇలా చివరి దాకా (చివర ఉండదు నిజానికి) నడుస్తుంది. ఇది అప్పట్లో నన్ను ఆశ్చర్యపరచింది.
దానికి ఆధారమైన భర్తృహరి శ్లోకం ఇది.
ప్రాప్తః శ్రియం సకల కామ దుఘాన్ తతః కిం
న్యస్తః పదం శిరసివిద్విషతాం తతః కిం
సంపాదితాః ప్రణయినో విభవైః తతః కిం
కల్పస్థితాః తనుభృతాం తనవః తతః కిం
ఈ శ్లోకం నాకు రవీంద్రనాధ్ టాగూర్ ఒక వ్యాసంలో దొరికింది. ఆ వ్యాసం పేరే ‘తతః కిం’. అంటే మన సో వాట్ కి సంస్కృతం అనమాట. అక్కడనుంచి తెచ్చుకున్నారనమాట ఎస్ఎస్వై సాధకులు
తతః కిం అంటే తరువాత ఏమిటి అని అర్ధం.
భర్తృహరి ఇలా అంటున్నాడు
సమస్తమైన కోరికలూ తీర్చే ధనాన్ని సంపాదించామే అనుకో తర్వాత ఏమిటి? శత్రువుల తలమీద కాలుపెట్టి తొక్కిఉంచాం తర్వాత ఏమిటి? వైభవం వల్ల ఎందరో అభిమానులు దొరికారు తర్వాత ఏమిటి? దేహధారుమైన మనం కల్పాంతం దాకా శరీరంతోనే మిగులుతాం. అంటే మరణమే ఉండదు. ఐతే తర్వాత ఏమిటి ఏం చేస్తావ్ ఇదీ ప్రశ్న.
దీనికి సమాధానంగా టాగూర్ ఇలా రాస్తాడు
“అనగా ఈ సమస్తమైన కామ్యవిషయముల ద్వారా మనుషుని అల్పునిగా చేసిచూస్తే పనికిరాదు. కానీ మనిషి వీటన్నిటి కన్న అధికుడు. మనిషి లో అన్నిటికన్నా ఏది ఉన్నతమైన సత్యమో దాని వేపు ప్రయాణించవలసి ఉంది.” అంటాడు.
ఇంకా ఇలా అంటాడు
“యూరోపు లో స్వాతంత్య్రం యొక్క గొప్పదనాన్ని నిత్యం గానం చేస్తూఉంటారు. ఈ స్వాతంత్ర్యానికి అర్ధం వస్తుసేకరణ చేసే స్వాతంత్య్రం, భోగం అనుభవించే స్వాతంత్య్రం, కార్యసాధన చేసేస్వాతంత్ర్యం.
ఈ స్వాతంత్య్రం అంత తక్కువ విలువైనది కాదు. ఈ సంసారంలో దీన్ని కాపాడుకోవడానికి చాలా శక్తి చాలా పరిశ్రమ అవసరమౌతాయి.
కానీ ప్రాచీన భారతవర్షం దీని ఎడ కూడా అవజ్ఞ చూపి తతః కిం అని ప్రశ్నించింది. భారత వర్షం దీని కన్న పెద్ద స్వాతంత్య్రాన్ని వాంఛించింది. కోరికలనూ, కర్మనూ మించిన స్వాతంత్య్రం అది.”
దాన్నే ఆయన ముక్తి అంటాడు. ఇది మరీ పెద్ద పదం కాదు. ఎక్కడికక్కడ విడిచి పెట్టగలగడం. ఇదీ మరీ కష్టమైనది కాదు. తతః కిం అనే ప్రశ్న అక్కడ ఆగగలుగుతుంది.
కానీ ఎందుకు కష్టమైందో ఇలా రాస్తాడు.
” మనం ఎన్నడుగాని ఇంతటి బజారు మనుష్యులుగా లేము. ఈ నాడు మనం బజారుమధ్యకు వచ్చి తోసుకుంటూ ఛీత్కారం చేస్తున్నాం. మనం మారిపోయాం. కలహములతో మత్తిల్లిపోయాం. పదవులకోసమని ఒకరి తో ఒకరు పోటీ పడుతున్నాం. పెద్ద అక్షరాలతోనూ ఉచ్ఛకంఠం తోనూ చేసే విజ్ఞాపనల ద్వారా మనలను మరి పదిమందికంటే ముందుకు తోసుకోడానికి శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాం. కానీ ఇది కేవలం కృత్రిమ బ్రతుకు. ఏమాత్రం సత్యం లేదు.
ఈ కృత్రిమయుగం రాకముందు మనలో ఒక స్వాభావిక మర్యాద ఉండేది. దారిద్ర్యం లోనైనా మన ఆత్మగౌరవైన్ని కోల్పోలేదు. ముతక అన్నం వల్ల ముతకబట్ట వల్ల మనకి గౌరవహాని కలిగేది కాదు. ఆ ఆభిజాత్యమే మన గర్వకారణం. ఇది దొంగిలించడానికి వీలైన వెలుపల వస్తువు కాదు. ఇది ఆంతర్యం లోని వస్తువు “
ఇవి దాదాపు వందేళ్ల కిందటి మాటలు. అప్పటికే ఈ యుగలక్షణం ప్రారంభమైనదనమాట.
చూడండి ఇంకా ఎలా అంటున్నాడో
” ఇప్పుడు మనం విశ్వసమక్షాన లజ్జతో తలవంచుకోవలసిన స్థితి లో ఉన్నాం. ఇప్పుడు మన వేషభాషలలోనూ, వస్తువాహనాలలోనూ ఏమాత్రం లోపమైనా ఇక మనం తలెత్తుకోలేక పోతున్నాం. గౌరవం అనేది ఇప్పుడు బాహ్యవస్తువైపోయింది. అందుకోసం కేవలం బాహ్యాడంబరాన్నే పెంచుకుంటున్నాం.
మనకు ఆంతరసామగ్రి గా ఉంటూవచ్చిన గౌరవమర్యాదలను ఈనాడు బయటకు లాగి వాటిని జోళ్లదుకాణాలవెంటా, బట్టల దుకాణాలవెంటా, గుర్రపు సంతలవెంటా, శకటపు కార్ఖానాల వెంటా తిప్పడానికి ప్రారంభిస్తే ఎక్కడి వరకూ తీసుకపోయి “కూచో ఇక చాలు విశ్రమించు” అని చెప్పగలం?
ఇలా మనం సంతోషాన్నే సుఖం గా భావిస్తున్నాం.
దానికోసం ఈ కృత్రిమగౌరవభారాన్ని కూలివాళ్లలా మోస్తున్నాం. ఇలా జాతి బయటి విషయాలకు పరాధీనమైపోయి హృదయ దాస్యం చేస్తో “దంటాడు ఆయన.
ఇప్పుడు మనందరం దాని గురించి ఆలోచించుకునే సందర్భాన్ని ప్రకృతి కల్పించింది. సో వాట్ అని పెద్ద ప్రశ్న కళ్లముందే నిలిచింది. ఎవరేనా దానికి తగిన సమాధానం చెప్తే బావుండునని అందరం ఎదురుచూస్తున్నాం
ఇప్పుడు ఎవరేనా ఇలా చెప్తే బావుంటుంది అని ఆ ఎవరేనా ఎలా చెప్పాలో ఇలా చెప్తాడు.
“ఈ అసంపూర్ణమైన ప్రయాస లో, ఉన్మత్తమైన ప్రతిద్వంద్వతలో, అనిత్యమైన ఐశ్వర్యంలో మన శ్రేయస్సు లేదనీ,
జీవితానికి ఒక పరిణామం ఉన్నదనీ,
సమస్త కర్మసాధనలకూ ఒక సంపూర్ణ పరిసమాప్తి ఉన్నదనీ
అదే మనందరిలోని ప్రతి ఒక్కరికి చరమ సార్ధకత అనీ
దాని ముందు మిగిలినవన్నీ తుచ్ఛమైనవనీ
ఎవరైనా ఒకరు మన మధ్యనిల్చి ఆధికారికమైన స్వరం తో చెప్తే ఈ నాటికీ ఈ సంతబజారు కోలాహలం నడుమనైనా మనకు సంతృప్తి కలుగుతుంది “అంటాడు
అప్పుడేమో గాని ఇప్పుడు మాత్రం మనం ఇంతకాలం జీవించిన ఈ మిధ్యాజీవితం మనకు ఈ పరీక్షాకాలంలో అక్కరకు రాదని తెలిసిపోయింది.
తతః కిం అంటే జవాబు లేదు. తర్వాత ఏమిటో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ దశలో నిజంగానే మనకు ఇలాంటి ఒక స్వరం అవసరం అనిపిస్తోంది. అందరం అలాంటి ఆధికారిక ధైర్యవచనంకోసం నిలబడి ఉన్నాం.
ఇక ఇప్పుడు అతడేమంటాడో చూద్దాం.
భారతీయాలైన అరణ్యాలవైపు చూడమంటాడు.మన అరణ్యాలన్నీ తపోవనాలు. ఆ తపోవనాలిచ్చిన సందేశం విన మంటాడు.
అవి తీసుకోవడం కాక ఇవ్వడం నేర్పేయి. కేవలం ఇవ్వడం వల్లనే అమృతత్వం వస్తుందని చెప్పేయి.
న కర్మణా న ప్రజయా ధనేన
త్యాగేనైకే అమృతత్వమానశుః
అన్న మాట మరీ ఆచరణదూరమైనది కాదంటాడు.
భారతీయ సంస్కృతి అరణ్యాలనుంచి ఏర్పడిందని, అది ప్రకృతికి దగ్గరగా ఉంటూ దాన్ని ఆరాధిస్తూ ఉండడం నేర్పిందనీ అందువల్ల తీసుకోవడం కన్న ఇవ్వడం తాలూకు, అంశం లోని గొప్పదనాన్ని గ్రహించగలిగిందనీ అంటాడు టాగూర్
ప్రాచీన సంస్కృత కావ్యాల నిండా ఇదే ఉందని అంటాడు.
ఒక ఆశ్రమం (కణ్వాశ్రమం) లో ప్రేమించుకుని గాంధర్వవివాహం చేసుకున్న శకుంతలా దుష్యంతులు నగరంలో రాజభవనంలో కలవలేకపోయారు. తిరిగి అపార్ధాల నుంచి బయటపడి మరొక ఆశ్రమంలోనే (మారీచమహాముని ఆశ్రమం) కలుసుకోగలిగేరు
ప్రకృతిని ఆరాధించే ఆశ్రమాల మహిమ మనుషులను కలిపిఉంచగలగడం లో ఉందంటాడు ఆయన
అక్కడ ఇంకా ఇంకా కావాలనే దాహాలకు విముక్తి ఉంటుందని ఇక ఇది చాలుననే సంతృప్తి లభిస్తుందని నిజమైన ఆనంద పదం అక్కడే సార్ధకత పొందుతుందని అంటాడు
అందుకే శకుంతల నువు మహారాజువైతే నాకేమి. నువు పరిణయమాడిన స్త్రీని నేనెరగనంటున్నావు. అలాంటి నీవు అనార్యుడివే అనగలుగుతుంది.
సో వాట్ అంటే తతః కిం అన్న మాట ఇక్కడ ఆగుతుంది
నువు రాజాధిరాజువైనా సరే నువు తప్పనిసరిగా చెయ్యవలసిన అంతర్లోక ప్రయాణం ఒకటి ఉంది సుమా అని ఆ మాట హెచ్చరిస్తుంది.
ప్రపంచమంతటా ఒక నిప్పులేని పొగ ఆవరించినప్పడైనా మనం ఇక ఈ పరుగులు చాలిద్దాం, మనం మన లోపలికి చూద్దాం అనుకోగలిగితే ఇంత కన్న తగిన సందర్భం మరొకటి దొరకదు. కర్కశమైన ఖడ్గమే బంధనాలకు తగిన వరం.
దూరాన్ని పాటిస్తూ మనస్సులు దగ్గర చేసుకోవాల్సిన అవసరం ప్రకృతి కల్పించినప్పుడు…
తతః కిం?
చూడగలిగితే గ్రహించగలిగితే
అంతా కాంతి శాంతి శాంతి!!!
*
లక్ష్మీ! ‘ఈ పరుగులు చాలిద్దాం’ ద్వారా ఎన్ని వంతెనలను జోడించారు ! ఒకటి సిద్ది సమాధి యోగ 2. భర్తృహరి శ్లోకం, 3. రవీంద్రనాథ టాగూరు. మీరు చదివినది, మీ జీవితంలోని అనుభవాలతో ‘ఈ పరుగులు చాలిద్దాం’ కు రహదారి వేశారు. ప్రారంభదశలో ప్రకృతికి భయపడ్డ మనిషి, ఆ శక్తులను నియంత్రించటం తెలుసుకున్న తరువాత ,తాను ప్రకృతిని గెలిచేశానని విర్రవీగుతాడు. ప్రవాహాలు,భూకంపాలు ,కార్గిచ్చు , సునామీ ఇలా ప్రకృతి తన వికోపాన్ని చూపించింది.ఎవరు ఎవరిపైన విజయం సాధించింది.!!! మనిషి దురాశకు ఒక అంతేలేకపోయింది. ఐషారామ జీవితపు మత్తులో ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ఏవీ తనను తాను రక్షించుకోవడానికి పనికిరాకపోయాయి. ఏం చేసిన!ఎంత సాధించినా ! సో వాట్!!!! ఇప్పుడు రాజు పేద విబేధంలేకుండ చేతులుకట్టి కూర్చొన్నాడు. !! శారీరకంగా ఎంతోదూరమై ఆత్మీయులు మనస్సుకు అంత దగ్గరైపోయారు . ఊరడింపు , సమాధానం మనస్సుకు లక్ష్మీ!
సమయానికి తగిన శేఫాలిక మీ కాలం నుంచి పూచింది. ప్రపంచం మొత్తం ‘సో వాట్ ‘ అనుకోవాల్సిన తరుణం ఇది.అభినందనలు💐💐🙏🙏
అంతా, శాంతి కాంతి..!👍బాగుంది.. మేడం.
అద్భుతమైన వ్యాసం అందించారు. తెలుసుకోదగిన మాట.
ఇటువంటి రచన ఈ మధ్య కాలం లో నేను చదవ లేదు. చెంప చెళ్లుమనిపించింది. చాలా ఆలోచింప చేసింది. ప్రతీ రోజూ చదివి, మననం చేసుకొని, ఆచరించి జీవితాన్ని సార్థకం చేసుకోమని చెప్తున్నాయి మీ శెఫాలికలు. మీ మేలు ఎలా మరువగలను. 🙏🙏🙏 రవీంద్ర కవీంద్రుడు కి వేల వేల నమస్సులు.