ఈ పరిస్థితి మళ్లీ రాకూడదు!

అసలు ఈ ఘాతుకానికి ఒడిగట్టినది మనుషులేనా, వీళ్లు మనుషులయితే మరి రాక్షసు లెవరు?

న్యూజీలాండులో అధికంగా ఉన్న పాల ఉత్పత్తి గూర్చి ఆమధ్య ఒకళ్లు ఫేస్‌బుక్‌లో నాకు ఒక విడియో చూడమని పెట్టారు. అప్పుడే పుట్టిన దూడ భూమిమీద పడగానే దాన్ని తల్లినించీ వేరుచెయ్యడమే గాక నాలుగు కాళ్లూ పట్టుకుని ఒక ఫ్లాట్ బెడ్ పికప్ ట్రక్ లోకి విసిరెయ్యడమూ, తరువాత అలాంటి దూడలు – చచ్చినవీ, కొనవూపిరితో ఉన్నవీ – కుప్పగా పడివుంటే ఆ కుప్ప మీద ఆ దూడని పడేయడమూ, వాటిల్లో కొన్ని కాళ్లు ఆ ఇనప గేటు మూసెయ్యడానికి అడ్డుపడుతుంటే రక్తం ఓడుతున్నఆ కాళ్లమీద నుంచే గేటుని బలంగా లాగి గడియపెట్టడమూ అందులో ఉన్నది. దీన్ని క్రూరత్వమని అనేట్లయితే ఆ జంతువుల స్థలంలో మనుషులు ఉంటే దాన్నేమనాలి?

ఈ ప్రశ్న మేదోమధనానికి సంబంధించినది కాదు. రెండవ ప్రపంచ యుద్ధానికి నాంది పలికిన జర్మనీ తన దేశంలోని యూదుల మీద జరిపిన అమానుష చర్యలు పై జంతువులమీద చర్యల కేమీ తీసిపోవు, ఇంకా ఒకటో రెండో అడుగులు ముందుకు వేస్తాయి కూడా అని అర్థ మవుతుంది “దిస్ వే ఫర్ గాస్, లేడీస్ అండ్ జెంటిల్మన్!” అన్న కథని చదివిన తరువాత. పోలిష్ భాషలో Tadeusz Borowski  రాసిన కథకి ఆంగ్లానువాదం చేసింది  Barbara Vedder. యూదులని చిన్నా, పెద్దా, ముసలీ, ముతకా, ఆడా, మగా తేడాల్లేకుండా గాలి సోకని రైలు బళ్లల్లోకి మిలిటరీ ఆధ్వర్యంలో కుక్కి, బోగీలకి తాళాలేసి, చివరికి రైలు ఆగి, దాని తలుపులు తెరచుకున్న తరువాత బతికున్నవాళ్లు “అమ్మయ్య!” అని గాలి పీల్చుకుంటుండగా వాళ్లని ట్రక్కుల్లోకి బలవంతంగా ఎక్కించి పంపిన దెక్కడికి? శాశ్వతంగా ఈ లోకం నుంచీ నిష్క్రమించడం కోసం విషవాయువులని గుండెల్లోకి తోసే గదుల్లోకి. రైలు ప్రయాణం ఏమయినా సుఖవంతంగా జరిగిందా అంటే, అదొక భూలోక నరకం. శవాలు, మలమూత్రాల మధ్యలో జరిగిన ప్రయాణాన్ని వర్ణించడానికి అంతకంటే మాటలు దొరుకుతాయా? రైలులోనే విముక్తి లభించిన కొంతమంది అదృష్టవంతులు. వాళ్లని కుప్పలుగా ఫ్లాట్ బెడ్ ట్రక్కులలోకి విసిరేశారన్న సంగతి వాళ్లకు తెలియదు. వాటిమీదే విసిరెయ్యబడ్డ కొనవూపిరితో ఉన్నవాళ్లకు తెలిసినా వాళ్లు చెయ్యగలిగేదేమీ లేదు.

ఉత్తమపురుషలో రాసిన కథనంలో కథకుడు స్వయంగా రచయితే. ఒక రోజున వచ్చిన 15 రైలుబళ్లల్లో బండికి వెయ్యి చొప్పున యూదులలో బతికినవాళ్లు బలవంతంగా ట్రక్కులలో ఎక్కించబడగా వాళ్లు తమతో తెచ్చుకున్న సామగ్రిలోంచి బంగారాన్ని, డైమండ్లను నాజీపార్టీ మిలిటరీవాళ్లకి అందజేసి, బోగీల్లో మిగిలిన శవాలని ట్రక్కులలోకి చేర్చి, ఒకటీ, అరా బట్టలకోసం, బండీలో దొరికిన తిండిపదార్థాలకోసం ఆశపడ్డ బందీల్లో ఒకడు.  ఒక తల్లికి తను చావబోతున్న దన్న సంగతి తెలిసి, తన బిడ్డ నించీ ఆ పిల్ల తన బిడ్డ తనది కాదంటూ దూరంగా వెడితే కూతురు బతుకుతుందని ఆశపడితే ఆ తల్లిని జుట్టుపట్టుకుని లాక్కెళ్లి ట్రక్కులో పడెయ్యడమే గాక ఆ చిన్నపిల్లని పైన చెప్పిన దూడలాగా ఆమె కాళ్లవద్దకు విసిరెయ్యడాన్ని, ఇంకా అలాంటివి ఎన్నో విషాదాలని కళ్లారా చూసిన వ్యక్తి.  జలియన్‌వాలాబాగ్ దారుణంలో స్వదేశస్థుల మీదే కాల్పులు జరిపిన భారతీయుల లాగా అతను కూడా యూదుడయి వుండి ఈ దారుణంలో పాలుపంచుకోలేదు. అతను పోలాండ్ నించీ వచ్చిన బందీ. రష్యా, ఫ్రాన్స్, గ్రీసు, పోలాండ్ దేశాల నుండీ వచ్చిన బందీలని కాన్సన్‌ట్రేషన్ కాంపులలోకి నెట్టినా చంపబడ్డ యూదులతో పోలిస్తే వీళ్ల గతి మెరుగు అనుకోవడానికి వీలులేకుండా వేలమంది ఉన్న ఆ కాంపులో అందరి బట్టలలోని పేలనీ ఒకేసారి వదలగొట్టడంకోసం అందరి బట్టలూ విప్పించి, పక్కమీద కూడా కనీసం ఒక నూలుపోగు కూడా లేకుండా చేసిన ఒక ఎండాకాలం రోజున ఈ కథ మొదలవుతుంది. ఇనప ముళ్ల కంచెకు అవతలగా పక్కన వేరేగా ఇరవై వేల మంది వున్న స్త్రీల కాంపులో పరిస్థితి కూడా అదే.

ప్లస్ మార్క్ వేసివున్న రెడ్ క్రాస్ బండీలని విషవాయువుల సిలిండర్లని సరఫరా చెయ్యడానికి ఉపయోగించడంకన్నా విషాదకరం ఇంకొకటి ఉంటుందా? నియంతృత్వ రాజ్యంలో ఇవన్నీ సామాన్యాలే అవుతాయి గామోసు! విషవాయువులవల్ల చంపబడ్డ యూదుల సంఖ్య 45 లక్షలు. అది ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు జనాభాలని కలిపినంత అని తెలుసుకున్న తరువాత ఇంత అమానుషాన్ని ప్రపంచంలో మిగతా దేశ ప్రజల మాట అటుంచి, జర్మనీ దేశ ప్రజలే ఎలా సహించారు, అసలు ఈ ఘాతుకానికి ఒడిగట్టినది మనుషులేనా, వీళ్లు మనుషులయితే మరి రాక్షసు లెవరు, ఆకలికి మాత్రం ఇంకొక జంతువుని చంపే మృగత్వం దీనికంటే ఎంతో నయం కదా, అన్న ప్రశ్నలు లేశ మయినా కారుణ్యాన్ని తమలో కలిగినవాళ్లల్లో తలెత్తక మానవు.

అమానుషమూ, కిరాతకమూ, రాక్షసత్వమూ లాంటి పదాలేవీ ఇందులో వర్ణించిన ఘాతుకాలకి నిర్వచనాన్ని ఇవ్వలేవని ఈ కథ చదివిన తరువాత పాఠకులు అంగీకరించక తప్పదు. ఇలాంటిదే ఇంకొక స్వీయచరిత్ర – యూదుడిగా ఆ కాంపులలో శిక్షని అనుభవించి, బతికి బయటపడ్డ ఎలి వీసెల్ (Elie Wiesel) రాసిన “నైట్” అన్న చిన్న నవల. మానవులు తమలో కొందరిపైన జాతి వివక్షతతో ఎలాంటి దారుణాలని జరపగలరో తెలుసుకోవడానికి మాత్రమే గాక అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా వుండడానికి తమ వంతుగా ఏం చెయ్యగలరని ఆలోచించడానికి కూడా ఆ నవలనీ, ఈ కథనీ చదవి తీరాలి.

By Unknown – Wiesław Głębocki; Karol Mórawski (1985) Kultura Walcząca 1939-1945, Warsaw: Wydawnictwo Interpress, pp. p.96 ISBN 83-02-00773-0, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=745734

Tadeusz Borowski  పోలిష్ తల్లిదండ్రులకి యుక్రెయిన్లో 1922లో పుట్టాడు. మొదటి ప్రపంచ యుధ్ధంలో పోలాండు మిలిటరీలో వుండి యుధ్ధం చేశాడని అతని తండ్రిని యుక్రెయిన్ కమ్యూనిస్టులు రష్యాలోని గులాగ్‌లో ఖైదు చేశారు. 1930లో అతని తల్లిని సైబీరియాలోని ఒక కాంపుకు పంపగా అతను ఒక ఆంట్ (అత్త/పిన్ని/పెద్దమ్మ) వద్ద పెరిగాడు. పోలాండ్ రెడ్ క్రాస్ పూనుకుని అతణ్ణి వార్సా వట్టణానికి చేర్చగలిగింది. 1934కి అతని తల్లిదండ్రులు అక్కడ అతణ్ణీ, అతని సహోదరుణ్ణీ కలిసే వీలయింది. పోలాండుని నాజీలు ఆక్రమించిన తరువాత అండర్‌గ్రవుండ్ బడులలో చదివాడు గానీ 1944 చివరిలో నాజీలు అతణ్ణి పట్టుకుని భయంకర మయినదిగా చెప్పబడిన ఆష్విట్జ్ కాన్సన్‌ట్రేషన్‌ కాంపుకి పంపారు. అక్కడి నించీ రెండు మూడు కాంపులకు మార్చబడి చివరికి మే 1, 1945న అమెరికన్ల చేత విడుదల చెయ్యబడ్డాడు. కాన్సన్‌ట్రేషన్ కాంపు నించీ విడుదల చెయ్యబడ్డ ప్రియురాలిని 1946లో పెళ్లి చేసుకుని 1948 నించీ కమ్యూనిస్టు పత్రికలో పాత్రికేయుడిగా పనిచేశాడు. జులై 1, 1951లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సాహిత్యం రెండవ ప్రపంచ యుధ్ధం తరువాతి పోలిష్ శాస్త్రీయ సాహిత్యంగా పరిగణిచబడుతోంది.

తాడికొండ శివకుమార శర్మ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు