ఈ నవ్వు – – ఏడ్వలేక నవ్వుతున్న నవ్వు!!

అందమైన బాల్యం
నాకెప్పుడూ అందని చందమామే!
నవ్వొస్తుంది
నువ్వు చెప్పిన పంచకళ్యాణి కథలన్నీ వింటే –
నెలల లెక్కల్లో నాదెప్పుడూ కొసప్రాణమే
ఊహరెక్క తెగగానే ఊపిరి పోసుకున్నాను
కథలో కవిత్వమో మహాకావ్యాలో అక్కర్లేదు
నీ కన్నీటి చుక్కలు చుక్కలైన
మహాసముద్ర దూరాల్ని నేనింక మోయలేను
నా లోకానికి ఎల్లలేమిటని నువ్వడిగినప్పుడు
నాకు గోడలు తప్ప యింకేమీ కన్పించలేదు –
నా భాషకు నిఘంటువు ఏమిటని
నువ్వడిగినప్పుడు
నాకు వెక్కిళ్లు తప్ప యింకేమే విన్పించలేదు
అమ్మ పొత్తిళ్లలోని వెచ్చదనం
ఎప్పటికీ తెలియనిదాన్ని
అనుమానాల ముళ్లచూపులతో
వొళ్లంతా ముక్కలైనదాన్ని
చిరునవ్వులకు కూడా లింగభేదం వుందని
ఊయల్లోనే తెలుసుకున్నదాన్ని
నా ఆటపాటల్లో, నా మాటల్లో, చేష్టల్లో
ప్రతి క్షణం, ప్రతి కదలికా
నేను ‘ ఆడ ‘ పిల్లలేనని
ప్రతిసారీ అందరూ గుర్తుచేస్తూనే వున్నారుగా
చిన్నమ్మాయినే
అనుక్షణం చిన్నబోతున్నదాన్నే
నాన్న కళ్లల్లో కురుస్తున్న నిప్పుల్లోంచి
అమ్మ కళ్లల్లోంచి రాల్తున్న చీకటి కన్నీళ్లలోంచి
నా ప్రతిరూపం ఎప్పుడూ చిన్నబోతున్నదే
వంటింటి కిటికీ రెక్కమీద
మశూచి పొడలాంటి ఎండ
నన్నుచూసి నవ్వుతోంది
అద్దంలా తుడిచిన గిన్నెల మీద
నేను మసిబారిన నీడనవుతాను
ఎవరూ నా గురించి కలలు కనరు
కలలు కనే నిదురసీమలేవో నాకు తెలియదు
పుట్టుకతోనే నేనొక యంత్రాన్ని
అచ్చంగా పనిపిల్లని –
నవ్వొస్తుంది
మీ ప్రకృతి ప్రేమల్ని తలుచుకుంటే ;
వంటింటి గోడల మధ్య
పొయ్యిలో కట్టెలు, చిదుకలు తప్ప
ఆకుపచ్చ చెట్ల సంగీతాన్ని గురించి
నాకేం తెలుసు?
నవ్వొస్తుంది
చిదిమితే
పాల్గారే బుగ్గలపై ముద్దుల్ని తలుచుకుంటే ;
ముళ్లచూపులే తప్ప
ముద్దుల భాష నాకేం తెలుసు?
నవ్వొస్తుంది
బోలెడన్ని పుస్తకాల మధ్య
మీ ప్రపంచాన్ని చూస్తే ;
చిన్నప్పుడే విరిగిన పలక
మళ్లీ కొనలేనని నాన్న కోప్పడ్డప్పుడే
చదువు నాకు ఓ అందమైన నెమలికన్ను
కలలోనే దాచుకున్న కలవరింత
నవ్వొస్తుంది
మీరు కవితలై పదాలై పాడుతుంటే
మగ నిఘంటువుల తెరచాటుగా
నిస్సహాయంగా చూస్తూ వుంటే
కవిత్వమో కథలో కావ్యాలో వద్దు
నాకొక పదాన్నివ్వండి
ఊయెల ఊహల నుంచి
యౌవన స్వప్నాల వరకూ
యౌవన స్వప్నాల నుంచి వృద్ధాప్యపు
చివరంచు వరకూ
నన్ను ‘ ఆడ ‘ పిల్లగా చూడలేని
ఒకే ఒక్క పదాన్నివ్వండి చాలు.
” మా భూమి ” వారపత్రిక, 5.2.1999
( కల్పనా రెంటాల  ” నేను కనిపించే పదం ” కవితాసంపుటి నుంచి )
సంతోషాలకు, చదువులకు నోచుకోని పేదబాలికల తరఫున రాసిన కవిత ఇది.
” నా లోకానికి ఎల్లలేమిటని నువ్వడిగినప్పుడు
నాకు గోడలు తప్ప యింకేమీ కన్పించలేదు – –
నా భాషకు నిఘంటువు ఏమిటని
నువ్వడిగినప్పుడు
నాకు వెక్కిళ్లు తప్ప యింకేమీ విన్పించలేదు “
ఈ మాటలు ఎవరికైనా అతిశయోక్తులుగా అనిపించవచ్చునేమో గానీ అవాస్తవాలు కావు. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో పేదరికం, బాలికల పట్ల వివక్ష జమిలిగా కలగలిసిపోయి వుండడం చూస్తూనే వున్నాం.
” ఎవరూ నా గురించి కలలు కనరు
కలలు కనే నిదురకనులేవో నాకు తెలియదు
పుట్టుకతోనే నేనొక యంత్రాన్ని
అచ్చంగా పనిపిల్లని”
ఎంత వాస్తవం ఈ మాటలు!ముఖ్యంగా గ్రామీణప్రాంత బాలికల విషయంలో!
” చదువు నాకు ఓ అందమైన నెమలికన్ను
కలలోనే దాచుకున్న కలవరింత “…..
అమ్మాయిలకు చదువుకోవాలని ఉన్నా ఆ చదువును ముందుకు సాగనివ్వవు తల్లిదండ్రుల ఆలోచనలు.
వీటికి కారణాలు ఏమిటో  అన్వేషించడానికి ప్రయత్నించారు కవయిత్రి ఈ కవితలో.
” ప్రతి క్షణం, ప్రతి కదలికా
నేను ‘ ఆడ ‘ పిల్లనేనని
ప్రతిసారీ అందరూ గుర్తుచేస్తూనే వున్నారుగా “
_ ఇదీ అసలు విషయం.
” ఎపుడొ పరిణయమైన
 ఈడ వుండదు కాన
 ఆడ దనబడె చాన”  _ అంటూ ఆరుద్ర చమత్కరించారు గానీ ( ఇది ఆరుద్ర మీద కంప్లయింట్ కాదు ) ఈ మాటను ఇప్పటికీ యథాతథంగా నమ్మే తల్లిదండ్రులు లేకపోలేదు. ‘ ఆడ ‘ పిల్ల – అని భావించి పెంచడంలోనే లోపమంతా ఉంది అని చెప్పడం ఈ కవితలో కవయిత్రి ఉద్దేశ్యం.
అందుకే కవిత ముగింపులో ఇలా అంటున్నారు :
” కవిత్వమో కథలో కావ్యాలో వద్దు
నాకొక పదానివ్వండి
ఊయెల ఊహల నుంచి
యౌవన స్వప్నాల వరకూ
యౌవన స్వప్నాల నుంచి వృద్ధాప్యపు
చివరంచు వరకూ
నన్ను ‘ ఆడ ‘ పిల్లగా చూడలేని
ఒకే ఒక్క పదాన్నివ్వండి చాలు” – – అని!
కవయిత్రి అడిగిన పదాన్ని నేటికైనా ఎవరమైనా ఇచ్చామా? ఇవ్వవలసే వుందా!?
ఈ కవితలో అక్కడక్కడా వచ్చే  ” నవ్వొస్తుంది ” అనే మాటకు ఒక భిన్నమైన అర్థం ఉన్నదని మనకు సులభంగానే తెలుస్తున్నది. ఇది బాధనూ నిస్సహాయతనూ వ్యక్తం చేస్తున్న మాట. ఈ నవ్వు – – ఏడ్వలేక నవ్వుతున్న నవ్వు!!
*

మంత్రి కృష్ణ మోహన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు