ఈ టైటిల్ లో ఎంత వేదన ఉందో….

విదేశాల్లో ఉంటూ సంవత్సరానికొక్కసారి ఇండియాకి వచ్చి పోయే వాళ్ళు సాహిత్య కృషి ఏం చేస్తారు ? అనుకోవచ్చు. కవిత ఉస్మానియా విశ్వవిద్యాలయం ముందు నలుగురు కుర్రాళ్ళతో కలసి కవిత్వం చదువుతుంది. రవీంద్రభారతి లో పుస్తకావిష్కరణలకు వస్తుంది. ఎంత మాత్రం చదువుతుందో చెప్పలేను కానీ చాలా పుస్తకాలనైతే తిరిగి తిరిగి మోసుకు తీసుకెళ్తుంది. వెరసి కవితలో తన కన్నా అందంగా కాకపోయినా ఇప్పుడిప్పుడే కండ గడుతున్న ఒక నునులేత శైశవ సాహిత్య సృజన రూపం తొణికిసలాడుతుంది. అటువంటి కవిత ‘జస్ట్ ఎ హౌజ్ వైఫ్’ అంటూ ఈ మధ్య కవితా సంపుటి ప్రకటించారు. ఆ సందర్భంగా కుందుర్తి కవితతో  శ్రీరామ్ పుప్పాల  సంభాషణ ప్లస్ గిరిప్రసాద్ చెలమల్లు  సమీక్ష:

ఫ్రీవర్స్ ఫ్రంట్ కి మళ్లీ పునర్వైభవం తెచ్చే పని చేస్తున్నారా ? 

 నాకసలు పునర్వైభవం అనే పదమే సరిగా అనిపించడం లేదు. దాని వైభవం ఎప్పటికీ గొప్పగా నిలిచే ఉంది. ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఇసుకలో దొర్లాడే ఉడుతపిల్లలు. వచన కవిత్వానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ ఒక ముద్ర వంటిది.

 అన్ని ప్రక్రియల్లో వచన కవిత్వం కు ఉన్న ప్రాధాన్యత, ప్రభావం ఎంత ?

చాలా సహజంగా అందరూ మాట్లాడుకునే మాటల్లో రాయగలిగినందుకు ఈ ప్రక్రియ ప్రాధాన్యం గలది. ఎక్కువమందికి సూటిగా అర్థమయ్యేట్టుగా చెప్పడం ఇక్కడే వీలుంటుంది. పాండిత్య ప్రదర్శనలు అవసరం లేదుకదా.

 ⁠మీకిష్టమైన వచన కవి ఎవరు ? ఎందుకు ?

మొదట కవిత్వం అంటే నాకు గుర్తొచ్చే పేరు కుందుర్తి గారు. కవి అంటే మొదట నాకు ఆయనే. ఆ తరువాత ఎక్కువ చదివింది శ్రీశ్రీ, తిలక్, శివారెడ్డి గారిని. ఇంకా చదివింది రేవతీదేవిని. ఆమె ప్రభావం నామీద చాలా ఎక్కువ ఉంది.

 ⁠జస్ట్ ఏ హౌజ్ వైఫ్ – అనే శీర్షిక మీ పుస్తకానికి ఎలా సరైనదిగా భావిస్తున్నారు ?

చదివాక అందరికి అర్థం అవుతుంది. నేనేదో మామూలు గృహిణిని అని ఇలా చెప్తున్నాననుకుంటారేమో. కానే కాదు. ఈ టైటిల్ లో ఎంత వేదన ఉందో, నొప్పి ఉందో తెలియజేయడమే నా కవిత్వం ఉద్దేశ్యం. ఇందులో పన్ ఉంది గమనించారా ?

 ⁠మీ భవిష్యత్ సాహితీ లక్ష్యాలేమిటి ?

 అంత పెద్ద పెద్ద మాటలనవసరం. ప్రస్తుతానికి శీలా సుభద్రాదేవి గారితో కలసి ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ గ్రూప్ ని విజయవంతంగా నడపాలి. ఆనవాళ్లు పుస్తకం ప్రతియేడు తేవాలి. మంచి కవిత్వం రాసేవాళ్ళతో కలసి నేనూ నడవాలి. ఇండియా వచ్చినప్పుడల్లా ఇలా అందరితో కలసి సభలకి వెళ్ళాలి. జీవితం కవిత్వమయం కావాలి.

*

ఒక అభిప్రాయం:

అనేక కోణాల ఆవిష్కరణ 

కుందుర్తి కవిత జస్ట్ ఎ హౌజ్ వైఫ్ కవితా సంపుటి లో పుస్తకం పేరు కి తగ్గట్టు గానే మహిళ చుట్టూ అల్లుకున్న అన్ని సంకెళ్లను తనదైన శైలి లో సుతి మెత్తగా సూటిగా ప్రశ్నిస్తూ పరిష్కారం చూపుతూ తెగ నరకాల్సిన చోట సంకోచించకుండా కలం నడిపించారు. అభివ్యక్తి ఎంపికలో జాగ్రత్త వహించి వచన కవిత్వాన్ని నిర్మిస్తూ ఫెమినిజం ఆనవాళ్ళను ప్రతిబింబించారు. పండుగల కవితల్లో బాల్యాన్ని క్రోడీకరిస్తూ వర్తమానాన్ని జోడిస్తూ  విశిష్టతను వివరించారు. కవిత్వంలో పరిణతి సాధించిన వ్యక్తుల్లో ఒకరిగా చెప్పడం కన్నా విభిన్న కోణాలను ఆవిష్కరించిన వ్యక్తి గా చెప్పవచ్చు .
 1990 వ దశకంలో వచ్చిన ఫెమినిజం కవిత్వానికి చలం రాసిన ఆమె కి భిన్నంగా తన కలం ద్వారా అదే భావాలను తనపై ఎటువంటి అనుకరణ లేని విధంగా ఆమె పక్షాన వ్రాసిన కవితలివి. కలంలో ఏ సిరా పోసుకున్నదో కూడా స్పష్టంగా చెప్పలేం కానీ పోరాటం ఆరాటం అంతా ఆమెలో ని పలుకోణాల వ్యక్తీకరణ. ప్రకృతి చుట్టూ చుట్టి గది నాలుగు గోడల మధ్య గల సంకెళ్ళను తెంచే ప్రయత్నం శ్లాఘనీయం.

 ఇట్లు నీ కవిత అనే కవితలో నాన్నను యాది చేసుకుంటూ “భళ్ళున వెలిగే నీ నవ్వు నా చుట్టూ మొలిచే పంజరాల్ని ఎప్పటికీ బద్దలు కొడుతుంది”అని నాన్నలోని ధైర్యాన్ని టానిక్ గా పుణికి పుచ్చుకుంది. ”ఇద్దరు ఆడపిల్లల తల్లినయ్యాక తండ్రి మనసు తెలిసి వస్తోంది”అని మధ్య వయస్సు లో తండ్రి పడే సామాజికార్థిక ఒడిదుడుకులను పిల్లలు గ్రహించే కాలాన్ని ఒడిసి పట్టడం జరిగింది.

మబ్బులు కవిత లో “స్థిరం లేని ఊహల్లా దారి దొరికిన తావుల్లా నీతి నియమాల్లా వాటిని అతిక్రమించేలా చినుకులుగా జల్లులుగా.. అంటూ సాగే కవిత వరాలు తీయని పెదాల ముద్దులుగా చినుకులను అభివర్ణించి కొత్తదనాన్ని పరిచయం చేసింది.
“ నేనిప్పుడు నేను కాను నీ కోసం మారాను” అంటూ మొదలెట్టిన మార్పు కవితలో  “మారి మారి మరబొమ్మనయ్యాక నీకు నచ్చని నేను… “ అని తనలోని వేదనను పలికించి “వాలి పోతున్న రెక్కలకి ఆధారమవుతావనుకున్నా అలసట కూడా నచ్చనంత అలుసై పోయాను” బాధను వెళ్ళగక్కి “దారి మరల్చుకునేదిపుడు నాకోసం నాలో దాగున్న నా పునాదుల్ని వెతుక్కోడానికి” ఆత్మ ప్రభోదానుసారంగా ముగింపు వాక్యాల నిర్మితం శ్లాఘనీయం.
  ఇదంతా వద్దులే గానీ కవితలో “పాత పుస్తకం పేజీల మధ్య గులాబీ పువ్వునై దొరికిపోతే దుమ్మని చెప్పి దులిపేసుకుందువు లే… అని అనుమానం వ్యక్తం చేస్తూ “రాత్రులూ నా లాగే నిదుర వాలని రెప్పలవ్వాలి”అని పరోక్షంగా హెచ్చరిక జారీ చేసారు.   జస్ట్ ఎ హౌజ్ వైఫ్ కవితలో “పూవు నుండి పుప్పొడి ధూళినై రేగాను”అంటూ ఆత్మ విమర్శ చేసుకుంటూ “చేపలు వలను తెంపడం చూసాననే” తెగింపుకి ఊతం కనబరుస్తూ “అవమానాల వానల్లో తడిచి వణికినప్పుడు జాలి గొడుగైనా పట్టని నీకు ప్రశ్నల వర్షం కురిపించే హక్కుందా?”ప్రశ్నలేవనెత్తింది.”కిందపడిన ఆకు మట్టిలో కలిసిపోతుంది ఆ కొత్త సారం కడుపులోంచి మళ్లీ పుట్టడం నాకిష్టం” పావురాలకు కొత్త రెక్కలు తొడిగి స్వేచ్ఛా జీవితం ఆవశ్యకతను నొక్కి వక్కాణించింది
 యుద్ధమూ – నేల కవితలో “గుండెల్లో నేలను దాచుకున్న వాళ్ళే కదా ప్రేమికులు” అనే భావన ను రాజేసి “తడిమిన చోటల్లా చీకటి చిదిమిన నల్లటి మసి ఎదురు చూస్తున్న కళ్ళకి కన్నీటి కాటుక దిద్దుతుంది” అని విషాదాన్ని నింపింది . యుద్ధం సామ్రాజ్య వాద కాంక్షనే విషయాన్ని తేటతెల్లం చేసారు. యుద్ధం జరిగే ఏ నేలైనా రక్తతర్పణం తో తల్లడిల్లిపోవాల్సిందేనని రచయిత్రి ఆవేదన వ్యక్తం చేసింది.
   కవిత్వాన్ని “ప్రతీ కాగితంపై నే విత్తు కున్న సంపెంగ చెట్టు” గా అభివర్ణిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగించి “కవిత్వమా! నన్ను విజయ తీరం చేర్చావో సమూలంగా విధ్వంసం చేసావో నువ్ నా పేరు పిలిచి నప్పుడల్లా వివశమై పోతాను” అని కవిత్వం పట్ల ప్రేమను ప్రకటించారు.
గడియారంలో ముళ్ళను ఆమెను పోల్చుతూ “నీ రెండు ముళ్ళకీ నా మెళ్ళో మూడు ముళ్ళకీ మనమెప్పుడూ బందీలమే” అని ఖరాఖండిగా చెబుతూ “నువు మనుగడకీ నేను మగాడికీ ఎవరి చేతిలో ఎవరు చిక్కుకున్నదీ ఎప్పటికీ చిక్కువీడని ప్రశ్నే” అని లోలకం కవితలో వ్యవస్థ అవగాహన ను కల్పించే ప్రయత్నం చేసారు. దాగని వెలుగు కవితలో ఆదిమ తల్లి ని పరిచయం చేసే క్రమంలో ఆమె చేయి అందుకోగానే తన చేతి వేళ్ళ మీద నే దోగాడిన బాల్యాలు కనిపించాయి చర్మం మీద ప్రశ్నల ముడతలున్నాయంటూ ఆమె బతుకు చుట్టూ అల్లుకున్న ప్రశ్నలను ముడుతలుగా ఆవిష్కరించే ప్రయత్నం బావుంది. అదే కవితలో “ఆకాశాన్ని పాపిటగా తీసి దాచిన వెలుగుల్ని దారంతా చుక్కల్లా పరిచింది” అంటూ దిక్సూచిగా అడవి బిడ్డను సాక్షాత్కరింప చేసారు రచయిత్రి.
 ముగిసీ ముగియ కుండా కవిత లో “చెవులు చిట్లిపోయే శాశ్వత నిశ్శబ్దం పగిలింది చెంప కాదు అద్దం వెనుక దాచిన అస్తిత్వం” లోని నిగూఢత పగిలిన మనసుకు మాత్రమే తెలుసు. “మాటలూ యుద్దమైన చోట కలిసుండడం విధ్వంసమే” అంటూ విరుచుకు పడింది కలం.  సంప్రదాయం నడ్డి విరిచే క్రమం లో తనను గొంగలిపురుగు గా చూపెడుతూ ప్రేమ రంగుల సిల్క్ దారాలు చుట్టి సీతాకోకలుగా మలుస్తామని బంగారు వలలో పడేస్తుందీ సంప్రదాయం అని వాస్తవికతను ప్రతిబింబించారు.
  ఈ సంపుటి తో కవిత  పాఠకుల మన్ననలు అందుకోగలదని నిర్ద్వందంగా చెప్పవచ్చు.  తనదైన శైలిలో ప్రతీ కవితను మలిచారు.  ప్రతీ కవితా ప్రతీ పాఠకునికి చేరువ కావాలని ఏమీ లేదు. పితృ స్వామ్య వ్యవస్థ పై ఎక్కుపెట్టిన అస్త్రాలు ఈ సంపుటిలోని కవితలు.
ప్రతులను పొందగోరే వారు సమత. కె. 9849572722 లేదా అమెజాన్ లో సంప్రదించవచ్చు.
-గిరి ప్రసాద్ చెలమల్లు 

ఎడిటర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Editor Kalpana Garu,
    Meeru raasina TANHAE chadivaanu. naaku chaalaa NACHHINDI. saili baagundi. adbhutam. meeru chaalaa special writer ANIPINCHINDI.
    ”saaranga ” meeru staapinchinattu ippude TELISINDI.3tv network channel lo mee Interviews choosaanu. mee meeda INKAA abhimaanam perigindi. mee maataa teeru cheppinavidhaanam….anni special .mee vaagdhaati apoorwam. nenu CALIFORNIA lo vuntaanu. nenu writer nu. mee Patrika ku story’s pampaalani Vundi. mee mail id IVVANDI patrikalo please.mee abhipraayaalu NAA abhipraayaalu vokkate kaavadam santoshamgaavundi.
    with best wishes.
    Annapurna.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు