అత్యంత సులభమైన పని అత్యంత కష్టం అంటుండేవాడు మా ఎన్ కె చాల తరచుగా.
అవును, చాల మామూలుగా, సహజంగా, వాటి గురించి ప్రత్యేకంగా ఆలోచించడమే అనవసరమన్నంతగా నిత్య జీవితంలో, ఆలోచనల్లో భాగమైన విషయాల గురించి నిజానికి మనకసలు ఏమీ తెలియదేమో… వాటిని నిశితంగా, సూక్ష్మంగా ఎన్నడూ చూసి ఉండమేమో…
నిజమే, ఎప్పుడైనా చేతుల గురించి, అరచేతుల గురించి ఆలోచించామా? ఆలోచించారా? నావరకు నాకు ఎప్పుడూ ఆలోచించినట్టు గుర్తు లేదు.
వారం కింద ఒక వ్యక్తి తన రెండు అరచేతులూ చాపి నీళ్లు నిండిన కళ్లతో వాటివైపు చూసుకుంటున్న దృశ్యం దినపత్రిక కాగితం మీది నుంచి నా మనసులో దిగి అల్లకల్లోలం సృష్టించింది. నిలువనీటి గుంటలో రాయి విసిరినట్టు అలలు అలలలలుగా ఎన్నెన్నో ఆలోచనలు చెలరేగాయి.
ఆ వ్యక్తి రాత్రి చిమ్మ చీకట్లో మోటార్ సైకిల్ మీద రోడ్డు మీద వెళుతుండగా హఠాత్తుగా మోటార్ సైకిల్ దారి పక్క దిగుడుబావిలో పడిపోయింది. పడిపోతున్న మోటార్ సైకిల్ ను వదిలి రెండు చేతులతో ఆ బావిలో పంపుసెట్ పైపులను పట్టుకుని వేళ్లాడాడు. ఆ బావిలో తిరుగాడుతున్న పాము మీద చేతికందిన గడ్డిపరకలూ, మట్టిబెడ్డలూ విసిరాడు. ఎన్నెన్ని కేకలు వేశాడో, మృత్యుభీతితో హాహాకారాలు చేశాడో తెలియదు.
ఆ రాత్రీ, ఆ మర్నాడూ అటువైపు ఎవరూ రాలేదు. మర్నాడంతా అలా చేతులతో పైపులు పట్టుకుని ఓపిక ఉన్నప్పుడల్లా కేకలు వేస్తూనే ఉన్నాడు. ఎవరూ రాలేదు. అంటే ఎవరూ ఆ కేకలు వినలేదు. చివరికి మరొక రాత్రి గడిచి మరొక పొద్దు పొడిచాక చిట్టచివరి ఓపికతో వేసిన కేకలు పొలం పనికి వచ్చిన వాళ్లకు వినిపించాయి. వాళ్లు పరుగెత్తుకొచ్చి చూస్తే ఎండాకాలం కావడం వల్ల అడుగున చారెడు నీళ్లలో పడి ఉన్న మోటార్ సైకిల్, బావిలో మధ్యదారిలో పైపులు చేతులతో పట్టుకుని వేళ్లాడుతున్న మనిషి. ముప్పై గంటలు పైపులకు అతికించిన చేతులు కాపాడిన మనిషి.
బైటికి తీశాక నిస్త్రాణగా నిలబడిన ఆ మనిషి తన అరచేతులు రెండూ చాపి వాటివైపే తదేకంగా చూస్తున్నాడు. బొబ్బలెక్కిన చేతులు. ప్రాణాలు కాపాడిన చేతులు.
ఎంత గొప్ప దృశ్యం అది!
ఎప్పుడైనా ఎవరైనా తమ చేతులను అంత దీక్షగా, అంత ప్రేమగా, అంత కృతజ్ఞతతో చూశారా?
చేతులు తమకేం చేశాయో, చేస్తున్నాయో ఎవరైనా ఎప్పుడైనా గుర్తించారా, తలచుకున్నారా, తలపోశారా?
ఎప్పుడో నలబై ఏళ్ల కింద ‘పొయెట్రీ ఆఫ్ ది థర్టీస్’ పుస్తకంలో డిలాన్ థామస్ ‘ది హాండ్ దట్ సైన్డ్ ది పేపర్’ కవితలో చేతులకు కన్నీళ్లు లేవు (హాండ్స్ హావ్ నో టియర్స్ టు ఫ్లో) అనే వాక్యం చదివి మనసులో గుచ్చుకుని ఎలా కన్నీళ్లు కార్చానో ఆ అనుభవం పునర్జీవించాను. ఏకదీక్షతో చేతులను చూసుకుంటున్న ఆ కన్నీరు నిండిన కళ్లను చూసి నా కంట కన్నీరుబికింది.
నిజమే ఎంత గొప్పవీ చేతులు.
తల్లికోసం, ప్రాణాధారమైన స్తనం కోసం వెతుక్కున్న చేతులు.
ఆటలు నేర్పిన చేతులు.
సైగలు చేసిన చేతులు.
అక్షరాలు దిద్దిన చేతులు.
పుస్తకాల పుటలు తిప్పిన చేతులు.
ఆటల్లో మెలితిరిగిన చేతులు.
అన్నం తినిపించిన చేతులు.
శ్రమ నేర్పించిన చేతులు.
శ్రమలో రూపొందిన చేతులు.
వాహనాలు నడిపిన చేతులు.
ఆనకట్టలు కట్టిన చేతులు, గోడలను కూల్చేసిన చేతులు.
రాసిన చేతులు, విన్యాసంతో వ్యక్తీకరించిన చేతులు.
స్నేహానికి పర్యాయపదమైన కలయికను, స్పర్శను అనుభవించిన చేతులు.
కనబడిన వారిని గౌరవించే పలకరింపు చేతులు.
నెచ్చెలిని బిగి కౌగిలిలో బంధించిన చేతులు.
బిడ్డలను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న చేతులు.
అన్యాయం అనుకున్నదాన్ని ఆపడానికి కలబడిన చేతులు.
న్యాయం కోసం పిడికిలి బిగించిన చేతులు.
అలసటతో వాలిపోయిన చేతులు.
చివరి క్షణం దాకా పనివదలని చేతులు.
ఈ చేతులే లేకుంటే ఏమవుదుం?
*
అద్భుతం… ఇది చదివి ఒక్కసారి అరచేతులు చూసుకున్న… నిజంగా ఎంత గొప్పవి ఈ చేతులు…ఎన్నడూ ఇట్ల ఆలోచించనే లేదు.
కృతజ్ఞతలు.
చేతుల గొప్ప తనాన్ని ఒక మంచి కవితతో వివరించారు వేణూ గారూ. అభినందనలు
కృతజ్ఞతలు సుబ్రహ్మణ్యం గారూ… కాని అది కవిత కాదనుకుంటాను!!!
It looked like. You I only read literature but not a literary writer. So my knowledge very limited. I liked that whatever form it has been written in.
Venue Garu as you I only read literature. It looked like a kavita for me a person who is not familiar of all forms of literature.
Venue Garu I only wanted to emphasise that the importance of hands has been well portrayed. For a non literary reader like me the bhavam as expressed impressed. Whether it is a story, a novel or kavita how it reaches is more important
Please pardon me for mention in it as kavita. I only wanted to say the expressed words are very touching.
” న్యాయం కోసం పిడికిలి బిగించిన చేతులు,
చివరి క్షణం దాకా పనివదలని చేతులు,
ఈ చేతులే లేకుంటే ఏమవుదుం? ” వేణుగోపాల్ గారూ?
స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం .. సమ సమాజ స్థాపన కోసం … సామాజిక న్యాయం కోసం …
చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన మహనీయుల చేతులే లేకుంటే ఏమవుదుం? వేణుగోపాల్ గారూ?
చేతుల మీద అనేకానేక విషయాలను గుర్తు చేశారు సర్ చాలా ధన్యవాదాలు💐💐👌👌