ఈ కృషి “హర్షణీయం”!

హర్షణీయం” పోడ్కాస్ట్ గురించి అంతర్జాల తెలుగు సాహితీ ప్రేమికులు వినే ఉంటారు. స్పాటిఫై, ఆపిల్ పాడ్కాస్ట్ వంటి మాధ్యమాలలో తెలుగు వినేవారి మధ్య బాగా ప్రాచుర్యం పొందిన పాడ్కాస్ట్ లలో ఇది ఒకటి.  తెలుగు కథలని, అప్పుడప్పుడు ఇతర భాషల కథలని, ఆడియో రూపం లో అందించడం మొదలుకుని రచయితలూ, ప్రచురణకర్తలతో సంభాషణల వరకు 2020 నుండి ఎన్నో ఆడియో ఎపిసోడ్స్ మనకి అందించిన ఈ “హర్షణీయం” వెనుక ఎవరున్నారు? ఇవన్నీ ఎందుకు, ఎలా చేస్తున్నారు? అన్న కుతూహలం పోడ్కాస్ట్ తరుచుగా వినేవారిలో కొద్దిమందికైనా కలిగి ఉంటుంది. ఆ కుతూహలంతోనే హర్షణీయం బృందం తో జరిపిన చిన్న ఈమెయిల్ ఇంటర్వ్యూ ఇది.  

ప్రశ్న: మొదట, అసలు “హర్షణీయం” వెనుక ముగ్గురు మిత్రులు ఉన్నారని తెలుసు కానీ, ఆ ముగ్గురు ఎవరు? వాళ్ళ నేపథ్యం ఏమిటి? మీ గురించీ, హర్షణీయం నేపథ్యం గురించీ పరిచయం చేస్తారా? 

‘హర్షణీయం’ పాడ్కాస్ట్ దాదాపు ముప్ఫయి మూడు మాసాల క్రితం (జూన్ 2020 ) లో హర్ష రాసిన కథలతో మొదలైంది. మేము ముగ్గురం  – హర్ష, గిరి, అనిల్. మెకానికల్ ఇంజనీరింగ్ కలిసి చదువుకున్నాము. హర్ష, అనిల్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటే గిరి న్యూయార్క్ కు దగ్గరలో ఉంటాడు. ముగ్గురికీ కాల్పనిక సాహిత్యం చదివే అలవాటుంది. గిరికి  తెలుగు ఇంగ్లీష్ కాకుండా తమిళ సాహిత్యంతో కూడా బాగా పరిచయం వుంది. 

హర్ష తాను చూసిన జీవితాన్ని ఆసక్తికరమైన కథలుగా మార్చి, 2020 మార్చి లోఒక బ్లాగ్  తయారు చేసి అందులో ఉంచి, దగ్గర స్నేహితులు ఒక పది మందితో పంచుకునేవాడు. కథ రాసిన తర్వాత గిరికి పంపిస్తే, గిరి మార్పులు, చేర్పులు చేసేవాడు. తర్వాత బ్లాగ్లో పెట్టేవాళ్ళం.  ఈ కథలకు ఆడియో  జోడిస్తే, బాగుంటుంది అన్న గిరి చేసిన సూచనతో,  ఆడియోని  బ్లాగు లో  జతచేయడం మొదలైంది. దీనితో  చదివే వాళ్ళ , వినే వాళ్ళ సంఖ్య  పెరిగింది. ఆ సంఖ్య  క్రమేపీ  ఒక మాసంలోనే  రెండు వందలకి చేరి, మూడు నెలల్లో ఐదు వందలు దాటింది. మొదటి మూడు నెలల్లో  హర్ష దాదాపు ఎనభై పైగా చిట్టి కథలు రాసాడు. కొంతకాలం  తర్వాత ‘హర్షణీయం’ ను  పూర్తి స్థాయి పాడ్కాస్ట్ గా మార్చాము. దీనితో స్పాటిఫై ఆపిల్, గూగుల్ పాడ్కాస్ట్ ఆప్ ల ద్వారా మొబైల్ ల్లో ఎక్కువమందికి చేరడం సాధ్యం అయ్యింది. 

ప్రతినెలా ఇరవైకి పైగా దేశాల నుంచి, 2500 మంది శ్రోతలు,  క్రమం తప్పకుండా ఇప్పుడు హర్షణీయం పాడ్కాస్ట్ ని వింటున్నారు. వీరిలో  75 శాతానికి పైగా శ్రోతలు ఇరవై నించి నలభై సంవత్సరాల వయస్కులు.

(ఈ స్టాటిస్టిక్స్ అన్నీ పాడ్కాస్ట్ హోస్టింగ్ సైట్ ఎప్పటికప్పుడు అందిస్తుంది.) 

తొందరలో హర్ష రాసిన చిట్టి కథలు పుస్తక రూపంలో అందించబోతాము.

ప్రశ్న:హర్షణీయం మొదట 2020లో మొదలుపెట్టారు కదా? నాకు తెలిసిన మొదటి ఎపిసోడ్స్ హర్ష గారు రాసిన కథలు. అక్కడి నుంచి ప్రముఖ రచయితల కథల పరిచయాలు, ఆడియో రూపంలో ఆ కథలని అందించడం, అలాగే కథలపై ఇతరుల అభిప్రాయాలు – ఇలాగ మొదలుపెట్టి ఈమధ్య కాలంలో ఐతే తరుచుగా కొత్త రచయితలూ, కొత్త/పాత ప్రచురణకర్తలను (ఒకోసారి తమిళ, కన్నడ వారిని కూడా) ఇంటర్వ్యూ చేస్తున్నారు. అసలు మీ ఇంటర్వ్యూల లక్ష్యం ఏమిటి? ఎవరితో మాట్లాడాలో ఎలా ఎంపిక చేసుకుంటారు ? 

ఈ పాడ్కాస్ట్ పరిణామ క్రమం చూసుకుంటే –  ‘హర్షణీయం’ అనేది కథాసాహిత్యం మీద ఆసక్తి వున్న ముగ్గురు పాఠకుల ప్రయాణం. ఆ ప్రయాణాన్నే రికార్డ్ చేసి పాడ్కాస్ట్ ద్వారా శ్రోతలకు అందిస్తున్నాము. 

హర్ష తాను రాయదల్చుకున్న కథలు ఇంకో రెండువారాల్లో ముగిసిపోతాయనగా, హర్షణీయం ముందుకు ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన మొదలైంది. తెలుగులో ప్రసిద్ధ రచయితలు రాసిన కథలు చదివి అర్థం చేసుకుని వినిపిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. కానీ దాంట్లో సాధక బాధకాలు ఏవుంటాయో తెలుసుకోడానికి, మాకు పూర్వ పరిచయం వున్న నవోదయ బుక్ షాప్ కోటేశ్వరరావు గారినీ, సాంబశివరావు గారినీ కలవడం జరిగింది. వారు కొన్ని కథా సంకలనాలు చేతికిచ్చి, కథ వాడుకోవాలంటే రచయిత అనుమతి తీసుకోడం అవసరం అన్నారు. కథను పరిచయం చేస్తూ, రచయిత తో సంభాషిస్తే, ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఇంటర్వ్యూ ఎలా చేయాలి అని వెతుకుతూ వున్నప్పుడు డాక్టర్ మృణాళిని గారు రచయితలను పరిచయం చేసే ‘అక్షర యాత్ర’ అనే కార్యక్రమం గురించి తెలిసింది. ఆ వీడియోలు చూసాక ఇంటర్వ్యూలో పాటించవలసిన పద్ధతులు అర్థం అయ్యాయి. 

పుస్తకం చదివి నచ్చితేనే, రచయితను హర్షణీయంతో సంభాషించడానికి అభ్యర్థించడం అనే సూత్రాన్ని పాటిస్తూ, ఇప్పటిదాకా ముప్ఫయి ఐదు తెలుగు కథా  రచయితలను ఈ పాడ్కాస్ట్ ద్వారా శ్రోతలకు పరిచయం చేశాం.  రచయితల ఇంటర్వ్యూలతో, రాను రానూ కథలు వినేవాళ్ళ సంఖ్య పెరిగింది. అదే క్రమంలో తెలుగు పుస్తకాల ప్రచురణ, పంపిణీ  ఎలా జరుగుతోంది, అని అర్థం చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రచురణ కర్తలను ఇంటర్వ్యూ చేసాము. ప్రస్తుతం వేరే దక్షిణాది భాషల్లో ఏమి జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో అనువాద కథలను పరిచయం చేయడం, ఆయా భాషల్లో రచయితలు,  ప్రచురణ కర్తలతో సంభాషిస్తున్నాము.  

తెలుగు కథలకు వుండే ఆదరణే, అనువాద కథలకూ,  ఈ తెలుగు/ఇంగ్లీష్ లో చేసే  సంభాషణలకూ ఉంటోంది. నిజానికి ఈ సంభాషణలను ఇంటర్వ్యూలు అనడం కన్నా క్యాజువల్ చాట్ అనవచ్చు. 

ప్రశ్న:మధ్యలో కొన్నాళ్ళు వనవాసి నవల పఠనం, అలాగే పర్యావరణ రంగంలో పనిచేస్తున్న పాతిక మంది పరిచయం అని ఒక సిరీస్ చేశారు. ఆ సిరీస్ ఎందుకు మొదలైంది? ఆ ఇంటర్వ్యూల అనుభవాల గురించి చెప్పండి. 

కథారచన కు  ప్రాసంగికత ఉండడం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు మేము వెతుక్కున్న సమాధానం –  ‘వనవాసి’ శబ్ద రూపకం. వనవాసి పుస్తకం మొదట చదివినప్పుడు, అటవీ సౌందర్య వర్ణన కంటే పర్యావరణ విధ్వసం-తద్వారా మారుతోన్న గిరిజనుల, వలస కూలీల జీవితాల  గురించి  రాసిన నవలలా  అనిపించింది.  అప్పుడు  హైదరాబాద్ బుక్ ట్రస్ట్  అనుమతితో వనవాసి నవల మొత్తం యాభై భాగాలుగా ప్రసారం చేయడంతో పాటూ,  అటవీ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో బాటు, దేశవ్యాప్తంగా ఈ రంగంలో కృషి చేస్తున్న ముప్ఫై మందికి పైగా పర్యావరణ వేత్తల, కార్యకర్తలతో సంభాషించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రసారం చేసాము. 

ప్రశ్న:మీ సంభాషణలు ఎలా జరుపుతారు? ముఖాముఖి కూడా చేస్తారా, లేకపోతే అన్నీ ఆన్లైన్ సంభాషణలా? ఒక ఎపిసోడ్ కి ప్రశ్నలు ఎలా సిద్ధం చేసుకుంటారు? 

ముఖాముఖి చేసినవి రెండో మూడో, ప్రత్యేక పరిస్థితుల్లో చేసాము. అన్నీ ఆన్లైన్ లోనే జరుగుతాయి. ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి లభించిన వెంటనే ఆన్లైన్ లో ఆయా వ్యక్తుల గురించిన సమాచారం సేకరిస్తాము. లేదంటే, వారిని గురించి తెల్సిన సాహితీ మిత్రుల ద్వారా సమాచార సేకరణ జరుగుతుంది. రచయితలైతే  వారు రాసిన, మాకు నచ్చిన  పుస్తకం మీద కూడా కొంత నోట్స్ రాసుకోడం తప్పనిసరి. ప్రశ్నలు తయారు చేసుకుని ముందుగా వారికి పంపించి, వారి నిర్ణయానికి లోబడి మార్పులూ చేర్పులూ,తీసివేతలూ చేస్తాము. కేవలం వారికి  సాహిత్యం తో వుండే పరిచయం, కృషి, వారి రచనలను ప్రభావితం చేసిన వ్యక్తిగత అనుభవాలూ, రచనా జీవితం మీద మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. 

ప్రశ్న:నిడివి విషయం లో ఒకోసారి గంట దాటేసినవి, ఒకటి బదులు పలు ఎపిసోడ్లుగా మారినవి కనిపిస్తూ ఉంటాయి – ముందు అనుకుని చేస్తారా మల్టీ ఎపిసోడ్ సిరీస్? 

వనవాసి, నవల కాబట్టి అనేక భాగాలుగా ప్రసారం చేసాము. పెద్ద కథలను, ఇంటర్వ్యూ లను  మల్టిపుల్ ఎపిసోడ్స్ లో చేయడం, శ్రోతల వెసులుబాటుకై చేసిన  ఒక చిన్న ప్రయోగం. కానీ విషయం ఆకట్టుకుంటే, పనికి వచ్చేదయితే,  శ్రోతలకు నిడివితో సంబంధం ఉండదు అని అర్థమయ్యాక , ఇప్పుడు ఎంచుకున్న అంశాన్ని ఒకే ఎపిసోడ్ గా ప్రసారం చేస్తున్నాము.  

ప్రశ్న:ఒక సంభాషణ తరువాత ఒక ఎపిసోడ్ బయటకి రావడానికి మధ్య ఏమి జరుగుతుంది? ఆడియో ఎడిటింగ్ గురించి కొంచెం వివరిస్తారా? 

ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రతి ఒక్కరి వాయిస్ నీ , సెపరేట్ ట్రాక్స్ లో రికార్డు చేస్తాము. తరవాత ముందుగా రికార్డింగ్ రెండు సార్లు విని , శ్రోతలకు ఆసక్తి కలిగించే విధంగా (ఒక కథ చెప్పినట్టుగా) ప్రశ్నలనూ సమాధానాలనూ ముందుకూ వెనక్కూ జరుపుతాము. ఆడియో క్వాలిటీ పెంచడానికి, అనవసరమైన భాగాలను తొలగించడానికి ఇంకొంత  ఎడిటింగ్ అవసరం ఉంటుంది. సుమారుగా గంట సేపు సంభాషిస్తే, నాలుగు గంటలు ఎడిటింగ్ చేయాల్సి రావచ్చు. ఇదయ్యాక షో నోట్స్ రాసి, ఆడియో, షో నోట్స్ జత చేసి పాడ్కాస్ట్ హోస్టింగ్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేయటం చివరి పని. 

ప్రశ్న:మీ పాడ్కాస్ట్లో మీకు బాగా నచ్చినవి, మీకు బాగా కష్టంగా అనిపించినవి ఏవి? విభిన్నంగా అనిపించినవి ఏవన్నా ఉంటే కూడా చెప్పండి. 

కష్టపడ్డవి ఏవీ లేవు. అన్నీ ఇష్టపడుతూ చేసినవే. పూర్తిగా సంతృప్తినిచ్చినవే. కొన్నే చెప్పాలంటే, మధురాంతకం నరేంద్ర, పతంజలి శాస్త్రి (మొదటి భాగం, రెండో భాగం, మూడవ భాగం, నాలుగవ భాగం), ఛాయా మోహన్, పల్లవి పబ్లికేషన్స్ నారాయణ, వెంకట్ శిద్ధారెడ్డి (మొదటి భాగం, రెండో భాగం) , సవెం రమేష్ (మొదటి భాగం, రెండవ భాగం), గీతా రామస్వామి, ఉణుదుర్తి సుధాకర్, ఎండపల్లి భారతి (మొదటి భాగం, రెండవ భాగం), సమతా ఫౌండేషన్ రవి (మొదటి భాగం, రెండవ భాగం), కిషోర్‌, ఈఏఎస్ శర్మ (మొదటి భాగం, రెండవ భాగం),  అనిల్ బత్తుల (మొదటి భాగం, రెండవ భాగం), మనం రాయుడు (మొదటి భాగం, రెండవ భాగం), సోలోమన్ విజయకుమార్, నల్లగొండ మల్లికార్జున్ (మొదటి భాగం, రెండవ భాగం), కన్నడ రచయితా, ప్రచురణకర్త వసుధేంద్ర, వాసిరెడ్డి నవీన్ (ఆరు భాగాలు), శ్రీసుధ మోదుగు గార్లవి … ఇలా కొన్ని. 

ప్రశ్న:కొన్ని తమిళ కథలకి స్వీయ అనువాదాలు చేశారు కదా. కథల అనువాదం లో మీ అనుభవాల గురించి పంచుకుంటారా? తెలుగు నుండి తమిళంలోకి అనువాదం కూడా ప్రయత్నిస్తారా? 

అనువాదం అనేది  –  కొన్ని ఇంగ్లీష్ లో చదివిన కథలు , విపరీతంగా ఇష్టపడి వాటిపై  పాఠకులుగా మా స్పందన తెలియచేయటానికి,  తెలుగులో రాసినవి. మిత్రులు అవినేని భాస్కర్ గారు , రమణ మూర్తి గారు చాలా సహాయం చెయ్యబట్టే ఇది కార్యరూపం దాల్చింది. అనువాదాలు తరచూ చేసే ఉద్దేశ్యం లేదు. అనువాదాలు చేయడం చాలా శ్రమతో, సృజనతో కూడుకున్న వ్యవహారం. 

ప్రశ్న:కొత్త, పాత రచయితలను (అనువాదకులను), ప్రచురణకర్తలని ఇంటర్వ్యూ చేశారు; తమిళ, కన్నడ భాషల ప్రచురణకర్తలతో కూడా సంభాషించారు – ఇన్ని చూసాక సమకాలీన తెలుగు సాహిత్య గమనం పైన మీ ఆలోచనలు ఏవైనా పంచుకుంటారా? 

పుస్తకాలను పాఠకులకు అందుబాటులో ఉంచితే, కనీసం ఐదు వందల కాపీలు అమ్మటానికి ఇబ్బంది ఉండదు అనేది, ఒక పరిశీలన. అందుబాటులోకి ఎలా తీసుకురావాలి అనేది ప్రచురణ కర్తలు నిర్ణయించుకోవాలి. తీరుబడి ఉన్నప్పుడు  ప్రభుత్వాలు కూడా కొంత మేరకు చేయూతనివ్వగలిగితే బావుంటుంది.  

ప్రశ్న:త్వరలో మూడేళ్లు పూర్తి చేసుకుంటున్నారు, అభినందనలు. ఈ సందర్భంగా మీ భవిష్యత్ ప్రణాళిక ఏదైనా ఉందా? 

ధన్యవాదాలు. ప్రణాళికలు ఏవీ లేవండీ…ఇంతకు ముందు చెప్పినట్టు కథాసాహిత్యానికి సంబంధించి, మాకు కలిగే ప్రశ్నలకు, తీరిగ్గా సమాధానం వెతుక్కోవటమే..  తెలుగు అర్థం చేసుకోగలిగిన స్మార్ట్ ఫోన్ యూసర్లు  ప్రతి వెయ్యి మందిలో ఒక్కర్ని హర్షణీయం పాడ్కాస్ట్ కి  ఫాలోవర్ గా మార్చే ప్రయత్నం చేస్తాము. ఒక అంచనా  ప్రకారం, ఈ కేటగిరీలో వున్నవాళ్ళు  ఐదు కోట్ల  మంది వున్నారు.  

*****

అడగగానే ఒప్పుకుని, ప్రశ్నలు పంపగానే రెండ్రోజుల్లో జవాబులు కూర్చి పంపిన హర్షణీయం బృందానికి ధన్యవాదాలు. మంచి సంభాషణలతో, కథా పరిచయాలతో నిండిన మూడు సంవత్సరాలు పూర్తి చేయబోతున్న సందర్భంలో అభినందనలు, శుభాకాంక్షలు! మీ నుంచి మరిన్ని మంచి ఎపిసోడ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాము. 

హర్షణీయం ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా వినడానికి – https://bit.ly/harshspot

హర్షణీయం ఐఫోన్ ద్వారా వినడానికి – https://apple.co/3mB7ttA

 

V.B. Sowmya

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • హర్షణీయం వారి కృషి హర్షణీయమే .

    ఇటీవల వీరు ‘కాలచ్చువడు పబ్లికేషన్స్’ అనే తమిళ ప్రచురణ సంస్థ అధినేత కణ్ణన్ సుందరం తో చేసిన ముఖాముఖి నన్ను ఆకర్షించింది. దాదాపు 3 దశాబ్దాలు తమిళనాడులోని మద్రాసులో ఒక పుస్తక విక్రేతగా, అక్కడి వార్షిక పుస్తక ఉత్సవాలలో తెలుగు పుస్త్కాలు మాత్రమే అమ్మే పుస్తకవిక్రేతగా, ఒక రయితగా, అనువాదకుడిగా, సాహిత్య అభిమానిగా ఉన్న నన్ను ఈ తమిళ ప్రచురణ కర్త ముఖాముఖి చాలా ఆకర్షించింది. మన రచయితలు, పాఠకులు, ప్రచురణ కర్తలు, పుస్తక విక్రేటలు, పత్రికలు వాటి సంపాదకులు, మన ప్రభుత్వాలు తెలుసుకో దగ్గవి చాలా ఉన్నవి. తమిళనాడు ప్రభుత్వం పుస్తకాలకి ఇస్తున్న ఆదరణ, ప్రోత్సాహం చాలా గొప్పవి. ఈ ముఖాముఖి ద్వారా ఇవన్ని అందించినందుకు హార్షణీయం బృందానికి ధన్యవాదములు.

  • సైట్ లోకి వెళ్లి రెండు కథలు విన్నాను, చాల మంచి ప్రయత్నం. అభినందనలు.

    సాహిత్యాన్ని కొత్త తరానికి, పాత తరానికి చేరవేసే మంచి ప్రయత్నం.

    “పుస్తకాలను పాఠకులకు అందుబాటులో ఉంచితే, కనీసం ఐదు వందల కాపీలు అమ్మటానికి ఇబ్బంది ఉండదు అనేది, ఒక పరిశీలన. అందుబాటులోకి ఎలా తీసుకురావాలి అనేది ప్రచురణ కర్తలు నిర్ణయించుకోవాలి.” అని హర్షణీయం వాళ్ళు చెప్పిన మాట లు నాలా స్వంతంగా పుస్తకాలు ప్రచురణ చేసే వాడు ఆలోచించాలేమో. చూడాలి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు