పదును
-జూపల్లి ప్రేమ్ చంద్
వర్షం… వర్షం…
రాళ్ళ సీమపై రతనాల వర్షం
పెళ పెళార్భాటాలతో ఉరుములు
తళ తళార్భాటాలతో మెరుపులు
వెండి ధారలతో నింగికీ నేలకూ సేతువు అమరినట్లు
వర్షం… వర్షం… సర్వత్రా హర్షం…
నెర్రె లిచ్చిన నేలను మెల్ల మెల్లగా గుచ్చుతూ
పగుళ్ళిచ్చిన నేలను పదును చేస్తూ
ఒక్కొక్క చినుకే కురుస్తున్నది సుతారంగా మేను మీద
ఎండను శరీరంతో తాగి తాగి ఎండిపోయిన శరీరం
ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు పులకరించింది,
ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ఒళ్ళు జలదరించింది
హృదయం దూది పింజెలా మేఘాల్లో విహరించింది
ఎట్టకేలకు పదును అయ్యింది
పలుగూ, పారా మడకా కాడీ చేను కాడికి చేరాయి
నేలతల్లి గర్భకుహరాన్ని చీల్చిన విత్తనాలు
చేశాయి సూర్య నమస్కారం!
కల చెదిరింది… కథ మారింది.
పల్లెల్లో, పల్లె పల్లెల్లో కాయలు కాచిన కళ్ళల్లో పూచాయి కలబంద పువ్వులు
ఎడారి మొక్కలకు వ్రేల్లాడుతున్నాయి శూన్య దృక్కులు
ఇక్కడ మనుషులు చదరంగం పటం మీద పావులు
భారంగా ఈదుతున్న జీవితాలు, బోదకాలు బతుకులు
హోరు గాలిలో రెప రెపలాడుతున్న దీపాలు
ఆశగా ఆబగా ఆలంబన కోసం అనాదిగా చూపుల పహారాలు కాస్తున్నారు
ఇక్కడ ఆకాశం ఎన్నో ఏళ్ళుగా మచ్చలేని అద్దం ముక్క
మేఘ శకలాల్లోంచీ కన్నీటి ప్రవాహం తప్ప నీటి ప్రవాహం వర్షించదు
ముఖాలన్నీ చిట్లిన గాజు ముక్కల్లా కన్నీటి చారికలు కడతాయి
కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, భయాలు
వర్షం… వర్షం… నీళ్ళు… నీళ్ళు…
ఎన్నో ఏండ్లుగా ఇదే పలవరింత… ఇదే కలవరింత
ఈ ఎడారి ముఖాలపై
ఈ ముడతలు తేరిన ముఖాలపై
చినుకు చింత తప్ప కాసింత చిగురింత కన్పించదు
ఇక్కడ జీవితం మిథ్య!
జీవితం అంటే అకాలంలో పండిన పండుటాకు కావొచ్చు
జీవితం అంటే నిర్లక్ష్యంగా రాలిపోయే ఎండుటాకు కావొచ్చు.
జీవితం అంటే నగ్నంగా నాగలిమీద శిలువెక్కటం కావొచ్చు
ఇక్కడ మృత్యువు ఎప్పుడూ అకాలంలోనే దాడి చేస్తుంది
మృత్యువే కాదు బాల్యం యవ్వనం వృద్ధ్యాప్యం
ఇవేవీ క్రమానుగుణంగా సంభవించవు
సంభవించవు గాక సంభవించవు
బాల్యాన్నీ యవ్వనాన్నీ అకాల వృద్ధాప్యం
హటాత్తుగా దాడిచేసి పీడిస్తుంది!
పీడన ఇక్కడ కొత్తకాదు
పుట్టుక ఒక పీడకల
అప్పుల్లో పుట్టి.. అప్పుల్లో పెరిగి… అప్పుల్లో చచ్చి పోయే రుణగ్రస్త
జీవితాలకు పీడన కొత్తకాదు!
ఇక్కడ
జీవితం పట్ల పూచీ లేదు కనుకే జీవితం మీద ప్రేమా లేదు
జీవితమంటే నిర్లక్ష్యం, జీవితమంటే క్షామం
క్షామం నిలువెత్తు రాక్షసిలా నిత్యం వెంటాడుతుంటే
క్షణ క్షణం నిరాశా నిట్టూర్పు సెగలు నిర్వీర్యం చేసి కాటేస్తుంటే
జీవితం మీద ప్రేమ ఎట్లా సాధ్యమౌతుంది
అందుకే ఇక్కడ క్షుద్రమైన రాజకీయాలకే
మాటలు పదునెక్కుతాయి
ఈటెలు పదునెక్కుతాయి
కోడి మెడల్లా తెగి పడతాయి తలకాయలు
నేల ఎర్రబారుతుంది నాటు బాంబులు బ్రద్దలై
మూర్తీభవించిన స్వార్థం విజృంభిస్తుంది ప్రైవేటు సైన్యమై
రంగస్థలం ఎప్పుడూ రౌద్రంగా ప్రకాశిస్తున్నప్పుడు
భీభత్స రస ప్రధానంగా గతమంతా
ఆర్తా రావాలతో ప్రతిధ్వనిస్తున్నపుడు
జీవితం మీద ప్రేమ ఎట్లా వికసిస్తుంది
జీవితం మీద ప్రేమ ఎట్లా ప్రవహిస్తుంది
ఈ మోడు బారిన తోటలో పూవులు ఎట్లా పుష్పిస్తాయి!
తొలి కారు మబ్బుల్లో దొంగాటలాడే వాన దగాకోరుదైనప్పుడు
కమలిన క్షుదార్తి బ్రతుకొక దుర్భరమై జీవితమొక అస్థిరమై
ఎండలలో మండి మండి బండబారిన జీవితంలో వలస వెళ్ళే బాటసారికి
మృత్యు ద్వారాలను తెరుస్తున్న నగర రాక్షసి పరాయీకరణ నీడ
ప్రసరిస్తున్న జీవితం మీద ప్రేమ ఎట్లా ప్రవహిస్తుంది
అయినా తప్పదు… జీవించక తప్పదు… జీవితాన్ని ప్రేమించక తప్పదు.
జీవితంలో అనునిత్యం పోరాడుతూనే ప్రేమించక తప్పదు!
నీవు మౌనంగానే దాటి పోదామనుకుంటావు
నీ చుట్టూ ఉన్న ప్రపంచం మీద నీకు లక్ష్యం లేదనుకుంటావు
ఒక్కొక్క అడుగూ పల్లేరు ముళ్ళపై పడుతూ రక్తాలోడుతుంటే
గాయాలన్నీ విచ్చుకొని గాయం శరీరమై మెలిపెడుతుంటే
బాధ ఎప్పుడూ ఏకవచనం కాదు
బాధకు పర్యాయపదం నీవు ఒక్కడు కాదు
బాధకు నిర్వచనం బహువచనం
సమూహంలో ఒంటరితనం పనికిరాదు
సామూహిక ధ్యానం అనివార్యం
సామూహిక జలపాత స్నానం అనివార్యం.
జీవితమంతా ఎదురు తెన్నుల్లో ఆకాశంకేసి చూస్తూ
ఉత్తరభాద్ర ఉరుములు లేకుండా వెళ్ళిపోతుంది
అశ్విని మెరుపు గుర్రాలెక్కి వెళ్ళిపోతుంది
భరణి గాలి దుమారాన్ని వెంట తెస్తుంది
కృత్తిక రోహిణి మృగశిర పుష్యమి
మాఘ పుబ్బ ఒక్కొక్క కార్తిలో నాలుగంటే నాలుగు
చినుకులు కురుస్తాయని వళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురుచూస్తే
ఎదురయ్యేవి చివరికి ఎండమావులే!
వేసిన విత్తనం కాయ కూడా చేతి కందదు
మేసేందుకు మేత లేదు
తాగేందుకు గుక్కెడు నీళ్ళు లేవు
హృదయ విదారకంగా రోదిస్తున్న పశుజీవాల్ని
కసాయిలకు తెగనమ్ముకోక తప్పనిస్థితి
కొండలన్నీ ఎండిపోయాయి, పొలాలన్నీ మాడిపోయాయి
బావులు చచ్చిపోయిన కళేబరం కనుగుడ్లలా నోర్లు తెరిచాయి
మార్కెట్లో ఆరబెట్టుకుంటున్నాయి శీలాన్ని, మానావమానాలు
బోరు బావులు బావురు మంటూన్నాయి నాలుగు చినుకుల సీతాకోక చిలుకలకోసం!
మైళ్ళకు మైళ్ళు మంచి నీళ్ళ ప్రయాణం తప్పదు
కరువు అంటే తిండి లేకపోవటం కాదు
కరువు అంటే పంటలు పండకపోవటం కాదు
కరువు అంటే గిట్టుబాటు ధర లేకపోవటం కాదు
కరువు అంటే నిత్యం కొద్ది కొద్దిగా రక్తం పీల్చే రక్తపింజారి
కరువు అంటే నిత్య ఆత్మహననం
కరువు అంటే అనునిత్యం ఆత్మహత్యించు కోవటం!
ప్రకటించాల్సిందే
కరువు మీద యుద్ధం ప్రకటించాల్సిందే
మానవ క్రౌర్యం మీద కౌటిల్యం మీద
కపట రాజకీయం మీద యుద్ధం ప్రకటించాల్సిందే
సవాలక్ష వలపాక్షిక అభివృద్ధి పరంపర మీద యుద్ధం ప్రకటించాల్సిందే
జీవితంలో పచ్చదనాన్ని పునరుద్ధరించి నేలనూ జీవితాన్నీ పదును చేసే
చినుకు దీపాన్ని చిదిమి చిరుదీపాన్ని వెలిగించి
చీకటి భీభత్సం మీద యుద్ధాన్ని ప్రకటించాల్సిందే!
– ప్రజాసాహితి, సెప్టెంబర్ 1993
( జూపల్లి ప్రేమ్ చంద్ గారి ” అవేద ” కవితా సంపుటి నుంచి )
నీళ్ళు మానవుల ప్రాథమిక అవసరాల్లో ఒకటని, నీళ్ళు ఉన్నచోటే బతుకులు బాగుంటాయని మనకు తెలుసు. నీళ్ళు లేకుంటే ఎక్కడైనా ఏముంది జీవితం? కన్నీళ్ళే కదా.
ఈ కవిత రాయలసీమ కష్ట నష్టాలకు అద్దం. రాయలసీమ (మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా) ముఖచిత్రం. రాయలసీమ రాళ్ళసీమ అయినా ఒకప్పుడు వైభవంతో విలసిల్లిందే. రాను రాను వర్షాభావం పెరగడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, చారిత్రకంగా జరిగిన రాజకీయ తప్పిదాలు, న్యాయంగా అందాల్సిన నీటివాటాలు అందకపోవడం, పాలకుల నిర్లక్ష్యం… ఇవన్నీ ఇవాళటి రాయలసీమ క్షామ పరిస్థితులకు కారణాలు.
ఈ కవిత ప్రధానంగా రాయలసీమ వర్షాభావ పరిస్థితులను ప్రస్తావిస్తున్నది. ఈ పరిస్థితుల పర్యవసానాలనూ పేర్కొంటున్నది.
” ఈ ఎడారి ముఖాలపై
ఈ ముడతలు తేరిన ముఖాలపై
చినుకు చింత తప్ప కాసింత చిగురింత కనిపించదు “
ఇక్కడ ” జీవితం అంటే అకాలంలో పండిన పండుటాకు కావొచ్చు.
జీవితం అంటే నిర్లక్ష్యంగా రాలిపోయే ఎండుటాకు కావొచ్చు.
జీవితం అంటే నగ్నంగా నాగలి మీద శిలువెక్కటం కావొచ్చు”.
ఇక్కడ ” బాల్యం యవ్వనం వృద్ధాప్యం క్రమానుగతంగా సంభవించవు “
ఇదీ పరిస్థితి రాయలసీమలో. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో.
కరువు ఉన్నచోట అప్పులు తప్పవు. తిప్పలు తప్పవు. పీడనా తప్పదు!
నీళ్ళు లేనిచోట, ” క్షామం నిలువెత్తు రాక్షసిలా నిత్యం వెంటాడేచోట , క్షణ క్షణం నిరాశా నిట్టూర్పు సెగలు నిర్వీర్యం చేసి కాటేసేచోట” జీవితం మీద ప్రేమలేకపోవడంలో ఆశ్చర్యం ఏముంది?
“మూర్తీభవించిన స్వార్థం ప్రైవేటు సైన్యమై విజృభించడానికి, రంగస్థలం ఎప్పుడూ రౌద్రంగా ఉండటానికి ” కూడా ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, క్షామం, పీడన కారణాలు అంటున్నారు ఈ కవి.
వర్షాభావ పరిస్థితుల వల్ల పంట చేతికందదు. పశువులకు మేత దొరకదు. గుక్కెడు తాగునీళ్ళకూ కటకట!మైళ్ళకు మైళ్ళు మంచినీళ్ళ కోసం ప్రయాణాలు! ఇక రైతుల బాధలైతే వర్ణనాతీతం. చివరకు బలవన్మరణాలే శరణ్యాలవడం. ఇట్లా, అనేక రాయలసీమ విషాదాలను ఏకరువు పెడుతున్నదీ కవిత.
మరి ఏమిటి దీనికి పరిష్కారం, కవి సూచిస్తున్న పరిష్కారం? – పోరాటం!
” మానవ క్రౌర్యం మీద కౌటిల్యం మీద కపట రాజకీయం మీద,
సవాలక్ష వలపాక్షిక అభివృద్ది పరంపర మీద యుద్దం ప్రకటించాల్సిందే!”
జీవితంలో పచ్చదనాన్ని పునరుద్ధరించుకోవడం కోసం యుద్ధం ప్రకటించాల్సిందే!
ఇదీ ఈ కవి పిలుపూ, ఆకాంక్షా.
*
నిజానికి ఇది కనీసం రెండు భాగాల కవిత. మొదటి భాగం గతం లేదా సమీపగతం. రెండవ భాగం వర్తమానం. రెండవ భాగాన్ని విడిగా రాయకుండా ” కల చెదిరింది… కథ మారింది…” అనే పాట పల్లవితో అనుసంధించారు కవి. ఇదొక శిల్ప విశేషం.
” పల్లెల్లో, పల్లె పల్లెల్లో కాయలు కాచిన కళ్ళల్లో పూచాయి కలబంద పువ్వులు ” _ కళ్ళు కాయలు కాయడం తెలుగు జాతీయమని మనకు తెలుసు. ఇది ఎదురుచూపులకు సంకేతం. కలబందకు పువ్వులు పూయడం కూడా అటువంటి నుడికారమే. కలబందకు ఆలస్యంగా పూలు పూస్తాయి. పూసినా అరకొర. మొత్తంగా ఇదొక విశేష వాక్యం. ” ఎడారి మొక్కలకు వ్రేల్లాడుతున్నాయి శూన్య దృక్కులు” – అనేది, పై వాక్యానికి వివరణ వంటి పొడిగింపు. రాయలసీమ పల్లెవాసులే ఇక్కడ ఎడారి మొక్కలు. వాళ్లకు మిగిలేవి శూన్యదృక్కులు అంటే నిరాశలు.
ఎండను శరీరంతో తాగి తాగి ఎండిపోయిన శరీరం; ఆకాశం ఎన్నో ఏళ్ళుగా మచ్చలేని అద్దం ముక్క; ఎండలలో మండి మండి బండబారిన జీవితం; బావులు, చచ్చిపోయిన కళేబరం కనుగుడ్లలా నోర్లు తెరచి ఉండడం – రాయలసీమ వాస్తవ స్థితిగతులను బలంగా చెప్తున్న , దృశ్యమానం చేస్తున్న అభివ్యక్తులు.
మొత్తంగా ఇదొక ఆర్ద్రమైన, ఆర్తితో నిండిన కవిత అనడంలో సందేహం లేదు.
*
Add comment