ఈ నగరంలో ఏదో పిచ్చి పరాయితనం
ఏదీ నాదనేది కాదనే పిస్తోంది
పల్లెటూరి నుంచి వచ్చిన ఈ వెర్రి కుర్రవాడు
ఇసుకలో జారిపోయిన సత్తు రూపాయి బిల్లలా
భవిష్యత్తుని వెతుకుతున్నాడు.
వాడి వెనుకాల వాడి పల్లె మెల్లగా కనుమరుగవుతోంది
ఏదో వెలితి
సరదాలు, సాహసాలు,
గుండెని కండల్లో పెట్టుకు తిరిగి రోజుల అదృశ్య తనం
ఒట్టి ఒంటరితనమే
మనసు విప్పి కాసేపు
జ్ఞాపకాలను నెమరేసుకుందాం అంటే
మరుపు
ఇటు ఏ అనుభవం లేదు
అటు ఏ జ్ఞాపకం మిగిలి లేదు.
నలిగిపోయిన కాగితం మాత్రమే,
కొట్టేసిన అక్షరాలైనా లేవు
దిగుల మునకలో నిరాశ
చుట్టూ చూసినా ఏ దిక్కూ రామ్మని పిలవదు
కాస్త తాకుతూ
మరికాస్త వినిపిస్తూ మనుషులు వెళుతూ ఉంటారు
ఎటూ పోలేక
తాకిన ఏ మానవ స్పర్శా
నిన్ను గతంలోకి తీసుకెళ్ళేది కాక.
ఈ ఒంటరితనమే
పారతో మడవలకి
నీళ్ళు మళ్లించిన చేతుల్లో
వెలితిని మిగుల్చుతుంది.
*
నలిగిపోయిన కాగితం మాత్రమే
కొట్టేసిన అక్షరాలైనా లేవు
కవిత అంతా ఒక దిగులు
దిగులుతో నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేక
మరింత దిగులు.
చాలా బాగుంది