హిమాలయమంత ప్రేమ
అది మానవ హృదయాంతరాళాలలో నిబిడీకృతమైన మహోత్తర భావనలలా, విశాల గగనాంతరాళాలలోకి విస్తృతమైన చూపు విసిరే హిమాలయా పర్వతాలు. సాక్షాత్తు త్రిలోక శంకరుడు జగజ్జేయమానంగా వెలుగొందుతూ, అసురసంధ్యవేళ అత్యంతవైభొవోపేతంగా నర్తించే నాట్యరంగం – ఈ హిమనగం. దేవామృత సదృశ్యమైన పవిత్ర గంగానదీ పరివాహకమైన మహాత్భుత పర్వతశ్రేణి. ఆ సాయంసంధ్యవేళ, యావత్భారతానికీ ప్రచండుడై ప్రభవించిన దినకరుడు, ఈ శీతల పర్వతాలపైన సౌమ్యుడై తన మయూఖ రేఖలను అలవోకగా జారవిడుస్తున్న సందర్భం.
పీయుష్ ప్రకృతి కలిగిస్తున్న పారవర్శ్యాన్ని మనసారా అనుభవిస్తున్నాడు. పక్కనే వున్న నైమిష చాలాసేపటి నుంచి మాట్లాడలేదని గ్రహించి ఆమె వైపు చూశాడు.
“హే.. వాట్సప్ బడ్డీ? ఏంటి పొద్దున నుంచి డల్ గా వున్నావ్?” అడిగాడు
“నథింగ్… జస్ట్ ఫీలింగ్ చిల్డ్” సమాధానం చెప్పింది నైమిష.
“కమాన్ యార్ లెట్స్ హావ్ సమ్ ఫన్!! ఇంత దూరం వచ్చి ఇలా డిప్రెస్డ్‍గా వుంటే మజా ఏముంటుంది. సీ ద బ్యూటీ మై డియర్ బ్యూటీ” కాస్త చిలిపిగా మాట్లాడితేనన్నా ఆమె పలుకుతుందేమోనని అతని ప్రయత్నం.
“కొండలని చూస్తే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తుకొస్తాడు. నీకు తెలుసుగా బెంగుళూరు దగ్గర రామ్‍ఘడ్ కొండలని ట్రెక్కింగ్ చేస్తూ ఏక్సిడెంటల్‍గా చనిపోయాడు” చెప్పిందామె. ఆమె గొంతులో విషాదం పీయుష్ ని నిరుత్తరుడిని చేసింది. మౌనంగా వుండిపోయాడు.
పీయుష్, నైమిష బొంబాయిలో ఒక పబ్‍లో కలిసారు. పీయుష్ ప్రియురాలు జో అతన్ని వదిలేసిన వారం తరువాత. అప్పటికి నైమిష లవర్ చనిపోయి నెల దాటింది. ఇద్దరూ ప్రేమకు దూరమై వున్న కారణం వల్లేమో వెంటనే కలిసిపోయారు. “ఎక్కడికైనా దూరంగా వెళ్దాం” అని నైమిష అడిగితే హిమాలయాలకి సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేశాడు పీయుష్.
నైమిషకి ఈ మంచు కొండల మధ్యనే ప్రొపోజ్ చేయాలని అతని ఆలోచన. కానీ ఇప్పుడు నైమిష వున్న మూడ్ చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించటంలేదు.
***
గత వ్యాసంలో ఇచ్చిన కథా ప్రారంభం ఇది. చదివినవాళ్లు (ఉన్నారనే అనుకుంటున్నా) ఎవరూ కథ గురించి మాట్లాడలేదు. కానీ, కథలో ఉన్న సమస్య అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నాను.
కథ మొదలు గ్రాంధిక భాషలో ఉంది. ఆ తరువాత పేరా నుంచి భాష కాంటెంపరరీగా మారిపోయింది. ఇది స్పష్టంగా కనపడుతూనే ఉంది. దాని వల్ల పాఠకుడికి కలిగే ఇబ్బందేమిటి? తెలుసుకుందాం రండి.
మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఒక పాఠకురాలు మీ వెనక సీట్‌లో కూర్చోని ఉంది. చాలా వెగంగా వెళ్తూ ఉన్నట్టుండి బ్రేక్ వేశారనుకోండి. ఏమౌతుంది? సదరు పాఠకురాలు ముందుకి పడుతుంది. అలా కాకుండా నెమ్మదిగా వెళ్తున్న కార్ ఉన్నట్టుండి వేగం అందుకుంటే అదే పాఠకురాలు వెనక్కి తూలుతుంది. అదే టూ వీలర్ మీద అయితే కింద పడే అవకాశం కూడా ఉంది. మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు పాఠకులని ఎలా తీసుకెళ్లాలని అనుకుంటున్నారో అదే దారిలో, అదే వేగంతో మొదలుపెట్టాలి. ఉన్నట్టుండి దూకిస్తే తల బొప్పి కట్టే అవకాశం ఉంది. నెమ్మదిగా మొదలుపెట్టి ఉన్నట్టుండి వేగం పెంచడం కూడా ఇబ్బందే కానీ కార్ లాంటి నవల, సినిమాలలో అంత ఇబ్బందిపెట్టదు. టూ వీలర్ లాంటి కథలో ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. రోలర్ కోస్టర్ లాగా నెమ్మదిగా మొదలుపెట్టి, వేగం పెంచి, ఎక్కించి, దూకించి, చివరికి, నెమ్మదిగా, క్షేమంగా వదిలేయడం ఎప్పుడైనా మంచి నడక అవుతుంది. ఈ నడక గురించి మళ్లీ మాట్లాడతాను. ఇప్పటికి మనం కథారంభం గురించి చర్చ కొనసాగిద్దాం.
పైన ఇచ్చిన కథలో కథా ప్రారంభానికీ కథకి పొంతన లేకపోవటం గురించి మాట్లడుతున్నాం. దీనికి ఒక టెక్నికల్ పదం పరిచయం చేస్తాను – అనుభూతి ఐక్యత. పాఠకులకి ఎలాంటి అనుభూతి ఇవ్వాలని అనుకుంటున్నామో ఆ అనుభూతికి సిద్ధపరుస్తూ మొదలుపెట్టి అదే దారిలో తీసుకెళ్లే ప్రయత్నం కథా ప్రారంభం చెయ్యాలి. మొదట్లో వాక్యాలు పురాణంలా ఉండి తరువాత పేరగ్రాఫ్ పబ్‌లో నడిస్తే అది పాఠకులకి సయించదు. “బిర్యానీ అనుకుని తిన్నాను, పంటి కింద కిస్మిస్ వచ్చేసరికి తినలేకపోయా గురూ” అంటాడు. ఇదే అనుభూతి ఐక్యత లేకపోవటం అంటే.
కొన్నిసార్లు ఇలాంటి ప్రయోగాలు (చాలా మంది చేశారు) ఫలిస్తాయి, కానీ దాని వెనుక కథాశంలో అలాంటి ప్రయోగం చెయ్యాల్సిన అవసరం, రచయిత అపారమైన ప్రతిభ ఉంటాయి. కామెడీగా మొదలై చివర్లో విషాదాతం చేయడం లాంటివి అన్నిసార్లు మంచి ఫలితాలను ఇవ్వలేవు. కనీసం ఇది విషాదం వైపు వెళ్తుందన్న క్లూ పాఠకులకి ఇవ్వకపోతే “బానే ఉంది కానీ…” దగ్గర ఆగిపోతుంది. వేగం పెంచచ్చు, దారి మళ్లించచ్చు, కానీ జర్క్ ఇచ్చి చెయ్యకూడదు. కథకే కాదు, నవల అయినా సినిమా అయినా ఈ సూత్రం వర్తిస్తుంది. “ఇప్పటిదాకా ఇది చూశావు కదా, ఇప్పుడు మరో కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాను, సీట్ బెల్ట్ పెట్టుకో” అని చెప్పి తీసుకెళ్లాలి.
పైన చెప్పిన పాఠకుడికి తల బొప్పి కట్టడం కన్నా పెద్ద ప్రమాదం ఇంకొకటి ఉంది. అనుభూతి ఐక్యత లేని కథలు రచయిత నిజాయితీని కూడా ప్రశ్నిస్తాయి. ఉదాహరణకి – పోలీసుల కష్టాలు చెప్తూ ఆర్ద్రంగా మొదలైన కథ నక్సలైట్లకు మద్దత్తు ఇస్తూ వీరభీభత్స రసాలతో ముగిస్తే పాఠకుడు రచయిత సైద్ధాంతిక నిజాయితీని ప్రశ్నించే ప్రమాదం వుంది.
మనం ఇకంకా కథలోకి వెళ్లి చర్చించట్లేదు. కేవలం కథా ప్రారంభంలోనే ఉన్నాం. మరి ప్రారంభంలోనే ఈ అనుభూతి ఐక్యత సాధిచడం ఎట్లా? చెప్పబోయే కథ ఎలాంటి కథో రచయితకి ముందే తెలుసుకాబట్టి కథ ప్రారంభం కూడా ఆ దిశగా పాఠకుడిని తీసుకెళ్లేలా చెప్పడం మంచి పద్ధతి. ఇది భాష, జానర్, టోన్, నడక వీటన్నింటికి వర్తిస్తుంది. “చీకట్లో ఏ తప్పు చేస్తున్నాడో తెలియకుండా చంద్రుడు మబ్బుల దుప్పటి కప్పుకున్నాడు” అని మొదలైన కథ అలాంటి ఒక తప్పు చేసే పాత్ర గురించి అయితేనే ఆ ప్రారంభం బాగుందని అనిపిస్తుంది. “గుంపులు గుంపులుగా వున్న మబ్బులు కోర్టు హాలులో వరసగా కూర్చున్న వకీళ్లను గుర్తుచేస్తున్నాయి” అనగానే ఆ కథ కోర్ట్ రూమ్‍కి సంబంధించినదో, న్యాయం, చట్టం గురించి ప్రశ్నించే కథగానే ఊహించవచ్చు.
ఈ వ్యాసం ప్రారంభంలో ఉన్న కథనే మళ్లీ చూద్దాం. ప్రేమ విఫలమైన అమ్మాయి, దగ్గరైన మరో అబ్బాయితో కలిసి హిమాలయాలకి ట్రెక్కింగ్‌కి వెళ్లింది. ఆ అమ్మాయి మనసులో ఇంకా పాత ప్రేమ జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ప్రేమ సక్సస్ అవుతుందా లేదా అని కథ. అనుకుందాం.
“నేను నిర్మాతని. మీ కథ తర్వాత వింటాను. ఇది ఎలాంటి కథో చెప్పండి చాలు” అంటే ఏం చెప్తారు?
“ప్రేమ కథ. కామెడీ అదీ ఉండదు. సీరియస్ కథే. ముఖ్యంగా ఈ కాలం పిల్ల ప్రేమలు ఎలా ఉంటున్నాయి. మాజీ ప్రేమ ప్రభావం లాంటివి చెప్పాలని. చివరికి ఇద్దరినీ కలపను. ఇంకా టైం కావాలి, స్పేస్ కావాలి అనుకోని వెళ్లిపోతారు”
బాగుంది. అయితే ఇలాంటి కథ చెప్పబోతున్నాను అని పాఠకుడిని సిద్ధం చేసేలా కథ ఎలా మొదలుపెట్టచ్చు?
“ప్రేమించిన మనిషి జ్ఞాపకాలు నెమ్మదిగా కరిగినట్లు ఆ పర్వతాలపైన తెల్లటి మంచు కరుగుతోంది. అందువల్ల ముందుకి నడవటం కష్టంగానే ఉంది ఆ ఇద్దరికీ.” బహుశా ఈ కథ ఇలా మొదలైతే బాగుండేదేమో. లేదా “ప్రేమించిన మనిషి దూరమైనా వదిలిపోని జ్ఞాపకాల్లా వున్నాయి హిమాలయ పర్వతాలు” అని కూడా మొదలుపెట్టచ్చు.
ఈ వాక్యాలు రాయాలని నేను ముందుగా అనుకోలేదు. ఈ వ్యాసం రాస్తున్నప్పుడు అప్పటికప్పుడు పుట్టుకొచ్చినవి. మోరల్ ఆఫ్ ది స్టోరీ – ఇలా కథని, సందర్భాన్ని, ముందు ముందు జరగబోతున్న సంగతులని కలిపి ఆలోచించి మొదటి వాక్యం రాసే ప్రయత్నం చేస్తే, చాలాసార్లు కొత్త ఉపమానాలు, భిన్నమైన వర్ణనలు రచయితకి పుట్టుకొస్తాయి.
వర్ణన అంటే గుర్తుకొచ్చింది. ఈ కథలో మొదట్లో ఉన్న వర్ణన కూడా ఇబ్బందికరంగానే ఉంది. మొదట్లోనే కాదు ఏ సందర్భంలో అయినా మితిమీరిన వర్ణన పని చెయ్యదు. పాఠకుడు ముందుకెళ్లడానికి మార్గం సుగమం చేసే వర్ణన వుండాలి కానీ అవి స్పీడ్ బ్రేకర్లలా అడ్డం పడకూడదు. మధురాంతకం నరేంద్రగారు ఒక కథలలో “ఒకదాని పక్కన ఇంకొంకటిగా వున్న ఇళ్లు తెరిచిపెట్టిన ఎలకల బోనులా వున్నాయి” అంటారు. ఠక్కున ఒక విజువల్ కనపడుతుంది. కథ ఎక్కడ జరుగుతోందో, అక్కడ ఇళ్లు ఎలా వున్నాయో తెలుస్తుంది. అక్కడేదో ప్రమాదం వుందని మనల్ని సిద్ధం చేస్తుందా వాక్యం.
ఈ టాపిక్ గురించి మరో విషయం చెప్పి ముగిస్తాను. నిజానికి అన్నింటికన్నా ముఖ్యమనది ఇదే – పాఠకుడిని సిద్ధం చెయ్యకపోవటం కన్నా ఘోరమైన తప్పు ఒకటి ఉంది. అది పాఠకుడిని మోసం చెయ్యడం. నిన్నటి కథా ప్రారంభంలో హిమాలయ వర్ణన అందులో శివుడి ప్రస్తావన వల్ల అది పౌరాణిక కథలా అనిపించవచ్చు. ఆ పేరగ్రాఫ్ తరువాత “పాండవమధ్యముడు సౌగంధికా పుష్పం కోసం అలుపెరగకుండా నడుస్తూనే ఉన్నాడు” అని ఉంటే పాఠకుడిగా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈ చర్చ ఉండేదే కాదు. ఆ వాక్యాల తరువాత అలాంటి కథనే కదా పాఠకుడు ఊహిస్తాడు? కానీ, అనుకున్నదానికి భిన్నమైన కథ కనపడగానే రసభంగం జరుగుతుంది. చిరాకనిపిస్తుంది. తరువాత చదవాలనిపించదు. “ఉన్నట్టుండి బండి రైజ్ చేసి నన్ను పడేశావ్. ఛీ, ఇంక చచ్చినా నీ బండి ఎక్కను ఫో బావా” అంటారు పాఠకులు.
ఒక్కసారి పైన చెప్పిన విషయాలు అన్నీ కలిపి మీ ముందు పెడతాను –
అనుభూతి ఐక్యత లేకపోవటం, రచయిత నిజాయితీని శంకించడం, స్పీడ్ బ్రేకర్ లాంటి వర్ణన చిరాకుపెట్టడం, రచయిత నన్ను మోసం చేశాడు అని పాఠకుడికి అనిపించడం – ఇవన్నీ ఒక కథలో జరిగితే పాఠకుడి దృష్టిలో రచయిత ఏమౌతాడు? రచయిత మీద పాఠకుడికి గౌరవం పోతుంది. గౌరవం లేకపోతే మీరు చెప్పే కథని వినడు, విన్నా నమ్మడు, నమ్మినా అనుభూతిని పూర్తిగా పొందడు.
నాయనమ్మ కథ చెప్తాను అంటే పిల్లలు బిలబిలమంటూ వస్తారు. పిల్లాడు ఒక కథ చెప్తాను అంటే ముచ్చటకోసం వింటారేమో కానీ నమ్మరు. పురాణం చెప్పడానికి పెద్దాయన కూర్చుంటే శ్రద్దగా వింటారు. స్నేహితులు “ఆపరా బాబు కహానీలు” అంటారు. హాలీవుడ్ దర్శకుడు కంప్యూటర్‌తో తయారైన బొమ్మల కథ చెప్తానంటే డబ్బులు ఇచ్చి మరీ వెళ్తారు. బాస్ దగ్గర ఏదైనా చెప్తే “డోంట్ టెల్ మీ కాక్ ఎండ్ బుల్ స్టోరీస్” అంటాడు. భార్య దగ్గర తాగి వచ్చిన భర్త కథ చెప్తే… అన్నీ వివరంగా చెప్పాలా ఏంటి? మీకు అర్థమైంది కదా? ముందుకు వెళ్దాం.
పైన చెప్పిన అన్ని సందర్భాలలో కథ వినడానికి పాఠకుడు సమాయత్తం అయిన సందర్భాలు గమనించండి. వాటిల్లో పాఠకుడికి కథ చెప్పబోతున్న వ్యక్తి మీద ఒక నమ్మకం, ఒక గౌరవం కనపడుతుంది. మంచి కథ చెప్తాడు/చెప్తుంది అని నమ్మిన పాఠకుడే ఊ కొడుతూ కథ వింటాడు. పురాణం చెప్పే పెద్దమనిషి మీద గౌరవం (అతని వ్యక్తిగత జీవితం గురించి కాదు, ఒక కథకుడిగా, కథా ప్రవచనకారుడిగా ఉండాల్సిన గౌరవం) ఉంటేనే పురాణం అయినా వినబుద్దేస్తుంది. లేకపోతే చిత్తం పులిహోర మీద, చర్చ మోదీ రాజకీయాల మీద ఉంటుంది. మరి ఈ గౌరవం రచయిత ఎలా సంపాదించుకోవాలి?
పాఠకులని గౌరవించి.
అవును. పాఠకుడు రచయితని గౌరవించాలి అంటే, రచయిత పాఠకుడిని గౌరవించాలి.
ఇది ఈ శీర్షిక మూల సూత్రం. ఈ వ్యాసాలన్నీ ఈ ఒక సూత్రం మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ వ్యాసాలన్నింటికీ ఏక వాక్య సంక్షిప్త రూపం ఇది –
పాఠకులని గౌరవించండి. రచయితగా పాఠకుల గౌరవం పొందండి.
Give and take respect.
ఎలా? ఒక పాఠకుడికి రచయిత మీద గౌరవం ఎప్పుడు కలుగుతుంది? చాలా సింపుల్ విషయం. ఒక రచన చదివిన పాఠకులకి అది బాగుంది అన్న తృప్తి కలిగితే చాలు, ఆ రచయిత మీద గౌరవం కలగచ్చు. అంతేనా? అంతే! కానీ ఆ గౌరవం కలగకుండా అడ్డంపడేవి ముఖ్యం. అవి తెలుసుకోవాలి. నడక, శైలి, శిల్పం వగైరా వగైరా పెద్ద పెద్ద విషయాల నుంచి అచ్చుతప్పుల వరకు చాలా చెప్పుకోవచ్చు. అవన్నీ చెప్పడమే ఈ వ్యాసాల ఉద్దేశ్యం. అందులో పేలవమైన ప్రారంభం లేదా ముగింపు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి.
పాఠకుడు మీ చెయ్యిపట్టుకోని మీరు చెప్పబోయే కథలోకి ప్రవేశిస్తాడు. అది కథైనా, నవలైనా, సినిమా అయినా, నాన్-ఫిక్షన్ అయినా సరే. అతనికి మీరు మొదట్లో ఒక వాగ్దానం చేస్తారు – “నేను నీకు ఒక అందమైన ప్రేమ కథ చెప్పబోతున్నాను, సావధానంగా విను” అని మొదలుపెట్టారు. అవి ఇందిరాగాంధీ ఎమర్జెనీ పెట్టిన రోజులు అని మొదలై, జయప్రకాష్ నారాయణ్, జార్జ్ ఫర్నాడేజ్ జైలుకి వెళ్లిన వృత్తాంతాన్ని వివరంగా చెప్పి, ఆ కాలంలో స్వేఛ్చ స్వతంత్రం లేని పరిస్థితులని వర్ణిస్తూ… పాఠకుడు లేచి నిల్చుని “రచయితగారూ, మీ వాగ్దానం ఏమైంది?” అని అడుగుతాడు. కథ చెప్పేటప్పుడు కథా ప్రారంభమే ఈ వాగ్దానం.
పాఠకుడు లేచి నిలబడతాడా? అని ఆశ్చర్యపోకుండా ఒక్కసారి ఆలోచించండి. ఒక వేళ ఇలాంటి అవకాశమే ఉంటే పాఠకుడు ఎప్పుడు లేచి నిలబడతాడు. మీ కథ మీ నుంచి విడిపడి, ఏ పత్రికలోనో, ఏ పుస్తకంలోనో చేరిన తరువాత పాఠకుడు దాన్ని చదివేటప్పుడు ఇబ్బంది కలిగితే లేచి నిలబడి “హలో… రచయితగారూ! ఇటు.. ఇటు” అంటాడు. అలా పాఠకుడు లేచి నిలబడకుండా ఉండాలంటే ఎం చెయ్యాలి? రాసేటప్పుడే పాఠకుడు ఏ పేజీలో, ఏ పేరా దగ్గర లేచి నిలబడి ప్రశ్నిస్తాడో ముందే తెలుసుకుని, దాన్ని ముందే సరిదిద్ది పాఠకుడికి లేచి నిలబడే అవకాశం లేకుండా కూర్చోపెట్టడం. ఇంతే! పాఠకుడిని గౌరవించడం అంటే ఇంతే! ఈ వ్యాసాలతో చేస్తున్న ప్రయత్నమదే. ఏ పొరపాటు చేస్తే పాఠకుడు లేచి నిలబడతాడో, ఆ పొరపాట్ల గురించి తెలుసుకోని, అవి చెయ్యకుండా ఉండేందుకు ఈ వ్యాసాలు సాయపడతాయని అనుకుంటున్నాను.
ఇందులో ఒక్క మినహాయింపు ఉంది. పాఠకుడిని తెలివిగా బురిడీ కొట్టించడం మోసం కింద పరిగణించబడదు. అంటే ఏమిటి? ఉదాహరణకి మనం ఒక క్రైమ్ ఇన్వస్టిగేషన్ డ్రామా తీసుకుందాం. హంతకుడు ఎవరో తెలియకుండా పాఠకులని/ప్రేక్షకులని ఉత్కంఠతలో పెట్టి కథని నడిపిస్తున్నారు. హంతకుడు ఎవరా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు క్లైమాక్స్ దగ్గర హంతకుడుని రివీల్ చేశారు. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది?
“వీడా? నేనస్సలు ఊహించలేదు. కథంతా మంచోడిలా తిరుగుతూనే ఉన్నాడుగా? భలే తెలివిగా చేశాడు డైరెట్రు!” ఇలా అంటే కథ డిస్టింక్షన్‌లో పాస్ అయినట్లు.
అలా కాకుండా –
హంతకుడు ఎవరో కాదు. ఇన్వస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసరే. ఇప్పటిదాకా మీకు చెప్పని రహస్యం ఉంది. అతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజాడర్ ఉంది. రాత్రిపూట హంతకుడిగా మారతాడు. ఆ విషయం అతనికే తెలియదు. పొద్దున పోలీస్ ఆఫీసర్‌గా అతను చేసిన హత్యలని అతనే ఇన్వస్టిగేట్ చేస్తుంటాడు.
ఇలా ముగిస్తే ఎలా ఉంటుంది. ప్రేక్షకుడు ఏమంటాడు?
“మోసం! మీరు కావాలని అతని డిజాడర్ గురించి మాకు చెప్పకుండా దాచిపెట్టి, చివర్లో కేస్ ముగించడం కోసం రివీల్ చేస్తారా? ఇది అన్యాయం” అంటాడు. పాఠకుడు/ప్రేక్షకుడు రచయిత చేతిలో మోసపోవడం గురించి ఇదొక ఉదాహరణ.
షెర్లాక్ హోమ్స్ సూపర్ హిట్ అవటానికి కారణం అదే. రచయిత పాఠకుడిని మోసం చెయ్యడు. డిటెక్టివ్ చేతిలో ఎలాంటి క్లూస్ ఉన్నాయో అవన్నీ పాఠకుడి కళ్ల ముందే ఉంచుతాడు. హోమ్స్ కనిపెట్టిన తరువాత – “It was so obvious. How did I miss?” (“elementary Watson”) అనిపించేలా చేస్తాడు. రచయిత నన్ను తెలివిగా బురిడీ కొట్టించాడు అనుకుంటాడు తప్ప, మోసం చేశాడు అని పాఠకుడు అనుకోడు.
మరి హిందీ టీవీ సిరీస్ సీ.ఐ.డీ. ఎందుకు హిట్ అయ్యింది?
నిజం చెప్పండి. మీరు ఆ సిరీస్ అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ చూద్దామని అనుకోని చూశారా? What is the promise of the premise?” Entertainment. Fun. డిటెక్టివ్ కళ్ల ముందే ఉన్న క్లూస్, వాళ్ల కన్నా ముందు మనకి కనపడతాయి. వాళ్ల కన్నా ముందు మనమే హంతకుడిని పట్టేసుకుంటాం. ఇలాగే ఉండాలని ముందే అనుకుని ఈ సిరీస్ రాసారా లేదా నాకు తెలియదు. కానీ if the promise of the premise is entertainment, this series is delivering 100% on that.
ఈ రూల్స్ బ్రేక్ చేసిన కథలు లేవా అని మీరు అడగచ్చు. ఉన్నాయి. కానీ రూల్ ఏంటో తెలుసుకోని, అది బ్రేక్ చేయడం వల్ల వచ్చే నష్టం కూడా అర్థం చేసుకోని, ఆ నష్టం కన్నా అలా చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఎక్కువ అనిపించినప్పుడు తప్పకుండా చేయచ్చు. అందుకు ఉదాహరణగా నేను రాసిన కథ ఒకటి చూపిస్తాను.
ఒక భార్యా భర్త. భర్త ఉద్యోగరీత్యా ఎదుర్కునే స్ట్రెస్ కారణంగా పడక గదిలో విఫలమౌతుంటాడు. ఇంగ్లీష్ అడ్డం పెట్టుకోని చెప్పాలంటే Stress induced erectile disfunction. భావం చెడకుండా, కథని పల్చన చెయ్యకుండా ఇది పాఠకులకి ఎలా చెప్పాలి అని నేను సంవత్సరం రాయకుండా ఆపేశాను. 2018లో మొదలుపెట్టిన కథని 2019లో పూర్తి చెయ్యగలిగాను. కథ పేరు “డబుల్నాట్”. ఇంతకీ ఏం చేశాను. కథా ప్రారంభ వాక్యాలకోసం వ్యవహారిక భాషకు దూరంగా వుండే కవిత్వ భాషని తీసుకున్నాను. ఆ తరువాత మామూలు భాషే వుంటుంది. అంటే నేను పైన చెప్పిన ఉదాహరణలో ఏ తప్పు చెయ్యకూడదని చెప్పానో, అదే తప్పు చేశాను. ఆ కథని, ఆ కథ రాసిన విధానం గురించి సారంగలో నేను రాసిన వ్యాసం ఇక్కడ చదవచ్చు.
ఈ పూటకి ఇక్కడ మజిలీ చేద్దాం. మళ్లీ ప్రయాణం మొదలయ్యే లోగా ఈ కథ చదివి మీకేమనిపించిందో చెప్పండి.
మగతనం
రచన: దండిభట్ల నాగేంద్రరావు
నాకు పంచె కట్టు అంటే చాలా ఇష్టం. అసలు పంచె సరిగ్గా కట్టడం రావాలే కానీ, ఆ కట్టులోనే ఎంతో హుందాతనం, అందం వుంటుంది. తెల్లగా తళతళలాడే ఖద్దరు పంచె కట్టి దానిపైన ఇంతింత అంచు వున్న కండువా వేసుకుంటే ఆ అందం, ఆ కళ.. ఎంత బాగుంటుంది?
మా రాజాగాడికి ఆ విషయం చెప్పి చెప్పి నా ఓపిక నశించింది. ఎంతకీ ఒప్పుకోడే.
“కనీసం పెళ్ళి పీటల మీద కూర్చునేటప్పుడైనా పంచె కట్టుకోరా” అంటే –
“నీకు అంత ఇష్టమైతే నువ్వే కట్టుకో” అంటూ కొత్త పంచెని నా ముఖం మీద విసిరేసి చరచరా బయటికి వెళ్ళిపోయాడు. చేసేది లేక పంచె లోపల పెట్టి బయటికి వచ్చి వరండాలో పడక్కుర్చీలో కూర్చున్నాను. కాస్సేపు కళ్ళు మూసుకోని ఆలోచిస్తే పంచెకట్టుతో కళకళలాడుతూ అన్నగారు రామారావుగారు కళ్ళముందు మెదిలారు. ఆ వెనుకే అక్కినేని, సినారే..!!
బయట గేటు చప్పుడైతే అటువైపు చూశాను. మా ఇంటికి రెండిళ్ళ అవతల వుండే పంకజంగారు.
“ఏం పంకజంగారు బాగున్నారా?” అన్నాను.
“బాగున్నాను పిన్నిగారు. మీరెలా వున్నారు” అందావిడ.
నేను లేచి ఊడిపోయిన తల కొప్పు సరిగా చుట్టుకుంటూ “రండ్రండి..” అన్నాను.
***
Add comment