1
నెలవంక
సముద్రమూ
పక్షులూ
నేనూ
వొంటరులమే-
నువ్వు తోడు లేనంతవరకు
2
ఎడబాటును మోస్తూ మోస్తూ
పొద్దుట్నుంచీ గాలి వీస్తోంది బరువుగా
నీ గొంతు వినగానే
రెక్కలు కదిలాయి చూడు
ప్రేమ అని అంటారు కానీ
పునర్జననం నిజానికి
3
లోలోపల అల్లుకుపోయి
తిరిగి తిరిగి చివురులెత్తే
వేర్ల పేరే ప్రేమ
మనసుది క్షేత్రస్వభావం
4
ఇన్నిన్ని
ఒడుదుడుకులు దాటుతూ
విసిగి వేసారినా
అడుగుల్ని కదిపే జీవితేచ్ఛ
ప్రేమకాక మరేమిటీ?
5
“మనం బైట చూడగోరే వింతలన్ని
మనలోనే మోసుకొని తిరుగుతూ ఉంటాం”
అంటాడు రూమి!
ప్రేమ-
మనిషిని మరో మనిషిగా మార్చి మార్చి
జీవితమంతా గిరగిరా తిప్పుతూనే ఉంటుంది.
6
పిల్లలతో
భలే ఆనందంగా ఆడుకుంటున్నావు చూడు
పువ్వులమధ్య
నువ్వో పువ్వులా మారిపోయావు చూడు
నవ్వుల్లో నవ్వుగా
పరిమళిస్తున్నావు చూడు
నువ్విప్పుడు
ప్రేమను తొడుక్కున్న దేహంతో
ప్రకాశిస్తున్నావు అందంగా.
7
ప్రేమకు
సార్వజనీన నిర్వచనం
ఉంటుందా
ఒక్కొక్కరూ
ఒక ప్రపంచం కదూ!
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
అడుగుల్ని కలిపే జీవితేచ్ఛ
PREMANU TODUKUNNA DEHAM TO.
EXCELLENT ONE KAVI GARU