1
నేను సముద్రం
ఇంకా-
ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది
ఎదను నిమిరే స్పర్శలాంటి నీ పాటకు
చరణమైన నాటినుండి ఎప్పుడూ
ఇదే ఊహ పదేపదే స్పురిస్తూనే ఉంది.
భగ్నమైన ఏకాంతాలమధ్య
నిద్రలేని రాత్రుల్లో
నీ అసంపూర్తివాక్యాల్ని అల్లుకుంటునే ఉంటాను.
మిగిలిన ఒంటరితనంలో
పూరించలేని ఖాళీని పొగిలే దుఃఖంతో నింపుకుంటూ
విరిగిన మనసును ఎన్నిసార్లు అతికించుకోవాలి
లీలగా వినబడే
ఆనాటి పల్లవి నిండా పగుళ్లపడ్డ రాగాలు
ఇప్పటికీ పల్లవిస్తూనే ఉన్నాయి
ప్రతి ఉదయం
తీరని కాంక్షతో తెలియని తృష్ణ
మనసును మెలిపెడుతుంటే-
తీరం ఒరిగిన ఆకాశం
ఎగిరిపడే అలలకు ఎదోచెప్పినట్టు
భ్రమలో సముద్రం
… నీ ప్రేమలో నేను !!
2
కలసి నడుద్దాం
సంధ్య అంచుల్లో
చీకటిని కప్పుకొంటుంది రాత్రి
చిగురుటాకు చాటున
నక్కిపోయే ప్రయత్నంలో మోడు.
గుంటనక్కల ఊలలు పల్లెలపై
వలలై పరుచుకొంటున వేళ.
శిశిరం మిగిల్చిన చివరాకు సందుల్లో
ఆడవి
కొంగు సవరించుకోన్నట్టు.
కాలం
మాఘమాసపు మంచుమత్తులో
మెత్తని అడుగుల కవాతు.
ఊపిరి దిగమింగుకున్న
ఉద్విగ్న క్షణాల మధ్య
ఎండుటాకులకు నోరుతెరువని ఉద్వేగం.
ఇప్పుడు…
ఏ గాలి ఎ దిక్కు ఎలా సుడిరేగుతుందో
ఎక్కడ ఏ మినుగురు ఎలగడిని రాజేస్తుందో
మళ్లీ
ఏ ఉదయం నెత్తుటి అరుణిమను పులుముకుంటుందో.
అయినా మనం
రక్తం వొలికిన ఈ నేలమీద కొంచెం
అమృతం చిలకాలి
మళ్లీ అక్కడే కదా మృత కణాలు
ఆయుధమై మొలకెత్తాలి
నేనిప్పటి దాక పాడని కొన్ని చరణాలను
ఒక్కొక్కటిగా కూర్చి పట్టుకురా ప్రియా
ఓ పాటగా-
బాట కఠినమైన బాసటగా
మాటకైన తూటకైన
– కలసి నడుద్దాం !!
*
వైఫల్యాల నుంచి కొంత ఓదార్పు కోసం….
కవిత్వమే ఎందుకు రాస్తున్నారు?
నా జీవిత వైఫల్యాల నుండి దుఃఖం నిండిన బతుకును ఎవరితో చెప్పుకోలేక లోన కలిగే ఆవేదనను వ్యక్తికరించడలో ఉపశమనం పొందే ప్రక్రియగా కవిత్వాన్ని ఆశ్రయించాను నేను అతి సామాన్యుని అసలు కవిత్వానికి పనికొస్తానోలేదో కానీ నాలో ఉన్న సాహిత్య అభిరుచి కవిత్వం పట్ల ఉన్న అభిమానం తప్ప కవిత్వం అంటే వేరే ఆపేక్షలేని ఒక ప్రేమ అంతే అందులో దొరికే తృప్తి ఒక సాంత్వన నాకు
రెండు కవితలు చాలా బావంటాయి. కష్టాలు విషాదాలు వైఫల్యాలు విజయాలు కవిత్వాన్ని సానబెట్టే సాధనాలు