ఇవి కొన్ని నీటి చుక్కలే అనుకుంటా

“కవిత్వమంటే… ఇష్టమని అనుకోవడం కన్నా అదే ప్రాణ వాయువేమో? నాకు. సాహిత్య ప్రక్రియలు అన్ని ఇష్టమే అయినా కవిత్వపు దారుల్లో సంచరించడం ఇష్టం.కవిత్వమంటే ఇలానే వుండాలనే ఖచ్చితత్వం లేని వాణ్ణి.ఉప్పూ,పప్పూ,గ్యాస్ ఎట్లా నిత్య జీవితావసర వస్తువులో అట్లా కవిత్వం కూడా ఒక నిత్యాజీవితావసర వస్తువేమో అని నమ్మే వాణ్ణి.అందుకే కవిత్వం పాలుపడ్డాను.” –  అని తనను తాను నిర్వచించుకున్నసాహితీ వేత్త రాజారామ్ తూముచర్ల.

కవి , విమర్శకులైన రాజారామ్ తూముచర్ల మూడవ కవిత్వ విమర్శా “ పూల మీద వాలిన తేనేటీగ ఆవిష్కరణ సందర్భంగా  వారితో సంక్షిప్త ముఖాముఖి.

ఆధునిక వచన కవిత్వంలోని సౌందర్యం మీద జరిగిన విమర్శ (రూప విమర్శ ) చాలా తక్కువ. కారణాలు ఏమిటి ? అంటే వస్తు విమర్శ వచ్చినంత రూప విమర్శ రాలేదు అని.

విమర్శకులు ఎక్కువగా కవిత్వంలో వస్తువుకు ఇచ్చినంత ప్రాధాన్యం రూపానికి ఇవ్వకపోవడమే రూప  లేదా  సౌందర్య విమర్శ తక్కువగా రావడానికి కారణమై వుండవచ్చు. తెలుగు సాహిత్యంలో మార్క్సిష్ట్ విమర్శకులే ఎక్కువ.వారెక్కువగా వస్తువుకు ప్రాధాన్యతనిస్తారు.అయితే రా.రా లాంటి వాళ్లు సమతూకం పాటించారు.ఈ వస్తు విమర్శనే నిబద్ద విమర్శగా చూస్తారు.రసాస్వాదన ప్రధానం కాదు ఈ విమర్శకి. మార్క్సిష్టు  శాస్త్ర పరికరాలను ఉపయోగిస్తున్న విమర్శకులు ఎక్కువ వస్తు విమర్శనే చేశారు. ఆలోచనల్లో  స్వతంత్రత, వ్యక్తీకరణలో స్వేఛ్చ వున్న విమర్శకులు రూప విమర్శకు ప్రాధాన్యత నిచ్చారు. అయితే ఈ  రెండూ వస్తు విమర్శ, మీరనే సౌందర్య విమర్శ జమిలీగా మిళితం చేసి రాసే విమర్శే ఈనాడు ఎక్కువగా కనిపిస్తొంది. కట్టమంచి వారు కళాపూర్ణోదయ విమర్శ చేసినా ,రా.రా గారు శ్రీ శ్రీ ని, తిలక్ ని విమర్శ చేసినా ఆ విమర్శలో సౌందర్యమే వుందనుకుంటాను.

 మీరు ప్రధానంగా కవి.మీలోని కవి ఇతర కవుల కవిత్వాన్ని చదువుతున్నప్పుడు విమర్శకుడిగా ఎలా రూపాంతరం చెందారు?

కవిగా నేను రాసింది చాలా తక్కువే. ‘ అతడే’ – అనే దీర్ఘ కవిత ఒక్కటే నాదంటూ చెప్పుకోదగ్గది. అడపాదడపా కవి సమ్మేళానాల కోసమో, రేడియో కోసమో రాశానే తప్ప కవిత్వ తపస్సు చేయలేదు.

నన్ను నేను విమర్శకుడు అని ఎప్పుడూ అనుకోవడం లేదు.ఒక కవిత్వ ఐంద్రికున్ని మాత్రమే నేను. కవిత్వం పట్ల మోజెక్కువ కావడానికీ రాధేయ నిర్వహించే పురస్కార సభల్లో అవార్డ్ పొందిన పుస్తకాన్నిపరిచయం చేయడం ఒక కారణం. అందుకే నేను చదివిన కవులపై  నాకు నచ్చిన అంశాలనే ఎక్కువగా రాశానేమో?.నేను ఇట్లా కావడానికీ రాయడానికీ   ప్రధానంగా ముగ్గురు కారణం. అఫ్సర్, యాకూబ్, నాగసూరి వేణుగోపాల్ గార్లు ముగ్గురు నన్ను ఇట్లా రూపాంతరం అయ్యేటట్లు చేశారనుకుంటా. చదువుతున్నప్పుడు నా కళ్లను నిలిపి వేసే వాక్యాన్ని రాసిన ప్రతి కవి నన్ను మలిచిన శిల్పే. నా విమర్శనా పరికరం పఠానుభవమే.

తెలుగు సాహిత్యంల్లో ఇప్పుడు ప్రత్యేకంగా విమర్శకులంటూ ఎవరూ లేరు. కవులే ఎక్కువగా విమర్శకులు. ముందు కవిత్వం రాసే వాళ్లంతా  ఇప్పుడు విమర్శ రాస్తున్నారు. నేనూ అంతే. కవిత్వం రాయడం కన్నా చదివిన కవిత్వాన్ని నేనేమనుకుంటున్నానో రాయడం సులువు అనే ఒక తప్పుడు భావన కారణంగా రాసిన రాతలివి.

మీరు సమకాలికులైన 26 మంది కవులను ఈ పుస్తకంలో సమీక్షించారు.ఎవరి కవిత్వంలో ఎక్కువ మమేకత్వాన్ని పొందారు?

ఈ ప్రశ్నకు జవాబు చాలా సులభంలా అనిపిస్తుంది కానీ ఎంతో కష్టం. నా పూర్వ కవుల గురించి రాయడం వల్ల వారితో ఏ పేచీ వుండదు.సమకాలిక కవుల గురించి రాయడం ఒక రకంగా కత్తి మీద సామే. ఈ  పుస్తకంలో నేను పరిచయం చేసిన 26 మంది కవుల్లో ఎక్కువ మంది నాకు వాళ్ళ కవిత్వం ద్వారా పరిచయమయ్యారు. పంచ భక్ష్యపరమాన్నాలు పళ్లెంలో పెట్టి ఏది ఇష్టం అంటే ఏం చెబుతారు ఎవరైనా.  ఏ కవి కవిత్వమైతే నా కళ్లను, మనసును కట్టిపడేసాయో వాళ్లని మాత్రమే పలవరించాను. దాదాపు 200 మందికి పైగా కవులను పరిచయం చేశాను. అందరూ ఇష్టమే. అయితే ఒక్కొక్క కవిలో ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది. దాన్ని నా కవిత్వంగా మమేకవుతాను. ఈపుస్తకంలో చేర్చబడ్డ కవులందరు కావ్యానందాన్ని ఇచ్చిన వారే.

సమకాలీన కవిత్వంలోని మధువుని ‘ పూల మీద వాలిన తేనెటీగ’ ఎంతవరకు గ్రోలిందనుకుం టున్నారు?

‘ పూల కడుపులలో తేనె పోసెనెవడో దాని తీయు నేరుపు తుమ్మెదకు లభించే” – అంటాడు రాయప్రోలు గారు. కావ్యం అందమైన పువ్వయితే అందులో కవిత్వ సౌందర్యం తేనే, దాన్ని పాఠకులకు చేర్చే తేనెటీగ విమర్శకుడు అనే భావనతో ఈ పుస్తకానికి ఈ శీర్షిక ఉంచా. నాకు తెలియని లోతులు, నేను చూడని అందాలు ఈ కవుల కవిత్వంలో ఇంకా ఎన్నైనా ఉండొచ్చు. తేనెటీగ కడుపు ఎంతో అంతే తేనెను గ్రోలుతుంది కదా! సమకాలీన కవుల్ని ఇంకా ఎందర్నో చదువలేకపోయాను. చదివినా రాయలేకపోయాను.అది నా అశక్తత కావొచ్చు.అసమర్థత కావొచ్చు. సాయం సంధ్యలో చెరువు అలలపై మిలమిలలాడుతూ ఎగిరిపడుతూ జారిపోయే వర్ణ సంచాలిత శఫరుల్లా కొందరి కవిత్వం నాలోంచి జారిపోయింది. పరిచయం చేయాల్సిన  సమకాలిక గొప్ప కవుల కవిత్వాన్ని పరిచయం చేయలేకపోయాను.

ఇది మీ మూడవ విమర్శా గ్రంధం.ఈ పుస్తకానికీ ముందు వచ్చిన రెండింటికీ మధ్యవున్న తేడా ఏమిటి?

కవి సంగమం  అనే అంతర్జాల కవుల సమూహంలో  “చదివిన కవిత్వ సంపుటి” అనే శీర్షికతో ఒక ఏడాది పాటు , “కవితాంతరంగం” – అనే శీర్షికతో మూడేళ్ళ పాటు వారం వారం రాసిన వ్యాసాలను ‘ ఏడాదికీ ఒకటి చొప్పున పుస్తకాలుగా వేశాను. నా రాతల్లో కొన్నిటిని ‘ కవయిత్రుల కవితాంతరంగం’ అనే పేరుతో 32 మంది కవయిత్రుల కవిత్వాన్ని పరిచయం చేశాను.రాయలసీమకు చెందిన కొందరు   కవుల కవిత్వంపైన రాసిన వ్యాసాలను “ మట్టి పూలు” – అనే పేరుతో ప్రచురించాను.ఈ “పూల మీద  వాలిన తేనెటీగ “ అనే పుస్తకంలో  26 మంది కవుల కవిత్వపు  పరిచయ వ్యాసాలు వున్నాయి అఫ్సర్ నుంచి శ్రీనివాస్ వాసుదేవ్ వరకు. “తేనె పూల మీద తుమ్మెద “ రాబోయే పుస్తకం. ఈ వ్యాసాలన్నీ నాలుగేళ్ళ క్రితం రాసినవి. కొత్తలో రాసిన  వ్యాసాలు నాకే నచ్చలేదు. తరువాత తరువాత కొంచెం మెరుగ్గా రాస్తునన్న స్పృహ కలిగింది. అయితే రాయగా రాయగా రాయి అయినా మెరుస్తుంది కదా! అట్లాగే చదువరుల స్పందన,కవుల మాటలు నన్ను వివశున్ని చేసిన మాట వాస్తవం. ఈ వ్యాసాలు ఒక ప్రణాళిక బద్దంగా రాసినవి కాదు. ఒక వివశత్వంతో రాసినవే ఇవి.నా మీద  నన్నునేనే సానపెట్టుకున్నప్పుడు తెలిసిన సత్యం ఏమిటంటే విమర్శ అంత తేలికైన విషయం కాదని.  వారంలో  ఏ రోజు ఫేస్ బుక్ గ్రూప్ లో ఉంచాలో ఆ ముందురోజు రాత్రి రాసినవి.అందుకే నేను రాసిన రాతల్ని విమర్శ అనుకోను. ముందు వచ్చిన రెండు పుస్తకాలకన్నా ఈ మూడో పుస్తకం కవిత్వ సౌందర్యాన్ని దర్శించడంలో  కొంచెం మెరుగ్గావుందనుకుంటాను.ఇవి  తెలుగు కవిత్వ విమర్శకు చేర్పు మాత్రం కాదు. విమర్శనా సముద్రంలోనో సమీక్ష సముద్రంలోనే  కొన్ని నీటి చుక్కలు మాత్రమే.

     *

అంకె శ్రీనివాస్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు