ఇల్లుండాలి
చిన్నదో… పెద్దదో ఓ ఇల్లుండాలి
గిజిగాడు గూడులాంటిదో
కాకిగూడు లాంటిదో ఓ ఇల్లుండాలి
ఎండకి… వానకి తలదాచుకుందుకో
రెక్కలు ముక్కలు చేసుకున్నాక
రాత్రికి ప్రశాంతంగా నడుము వాల్చేందుకో
ఓ సొంత ఇల్లుండాలి
అయినదానికి…కాని దానికి
ఇంటి యజమాని విసుక్కుంటుంటే
ఎన్నాళ్లని పిల్లలను నోటకరుచుకొని
ఇంటింటికి తిప్పిన పిల్లుల్లా తిరుగుతాం
పొద్దంతా ఆకాశంలో
పనిచేసిన సూరీడు సైతం
సాయంత్రానికి చేరుకునేది
పడమటి సొంత గూటికే
రాత్రంతా వెన్నెల టార్చ్ లైటుతో
లోకానికి కాపలా కాసిన చంద్రుడు
పొద్దున్నే చేరేది పగటిగూటికేనన్న
సొంతింటి కల…
ఇప్పుడందరినీ వెంటాడుతుంది
***
వెతికినా మనుషులే కానరాని
ఆకాశమంత భవంతులు ఒకవైపు
మనుషులు మసలడానికే వీలులేని
అగ్గిపెట్టెల్లాంటి అద్దె ఇల్లు మరోవైపున్న లోకంలో
ఇల్లుండాలి… ఓ సొంతిల్లుండాలి
సొంతింటి కల కోసం
తమ జీవితాలను
ఈ.ఎం.ఐ.లగా మలుచున్నవారికి
ఇల్లే ఓ ప్రపంచం
ఇప్పుడు ఇల్లే ప్రపంచమని
నిత్యం మనల్ని నమ్మించినోడికి
ప్రపంచమే ఒక ఇల్లు.
*
బావుంది కవిత.ముగింపు వాక్యంలో ధ్వని ఉంది.