ఇలా రాయడం ఇప్పటికీ కల!

ఈ నిజమైన యుద్ధాల విషయాలను వార్తల్లో, వార్తాపత్రికల్లో చూసి నిలువునా నీరు కారిపోయేదాన్ని. ఆ బాధను ఎలా వ్యక్తపరచాలో తెలియక, తెలిసిన ఆ నాలుగు అక్షరాల రూపంలో బయటపెట్టుకునేదాన్ని.

రాధకృష్ణ కర్రి… లైఫ్‌డ్రామా కవిత్వ సంకలనంతో తెలుగు సాహిత్య లోకం మీదకి వచ్చారు. 35 కవితలున్న ఈ సంకలనం ఇప్పటికే పాఠక, విమర్శకుల మనన్నలు పొందింది. సాధారణ గృహిణిగా ఊహించుకునే ఈ కవయిత్రి ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు స్పందించి వాటిని కవిత్వీకరించారు. తొలి కవిత్వ సంపుటితో వచ్చిన రాధకృష్ణతో పాఠకురాలిగా నాలుగు మాటలు…

గృహిణిగా ఉన్న మీరు అసలు సాహిత్యలోకంలోకి ఎలా వచ్చారు. తొలి  కవిత్వ సంకలనం మీకు ఎలా అనిపించింది..?

నాకు కాలేజి రోజుల్లో ఆత్రేయ గారి సాహిత్యాన్ని చదవటం , ఆత్మకథలు కథలు చదవటం అలవాటుగా ఉండేది. కాకపోతే అంత తీవ్రస్థాయిలో ఎక్కువగా చదివేదాన్ని కాదు. ఉద్యోగినిగా ఉన్నప్పుడు 2019లో వృత్తిలో భాగంగా వెబ్సైట్ సెర్ఫింగ్ చేస్తున్నప్పుడు,  అనేక రచనలు చదువుతూ ఉండేదాన్ని. ఆ చదువే సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచింది.  కానీ నాకు, కవితలంటే ఎలా ఉండాలో, మెటాఫర్స్, సిమిలిస్, శిల్పం, ఇలా వగైరాలు తెలుసుకున్నది మాత్రం 2023 నుండే. తొలి కవితా సంకలనానికి కర్త కర్మ క్రియ అంతా గురువుగారు ముక్కామల చక్రధర్ గారే. ఈ సంకలనం రావడం ఇప్పటికీ కలగానే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ నేను నేర్చుకునే, అవగాహన చేసుకునే స్థితిలోనే ఉన్నాను కాబట్టి.

గాజా కావచ్చు… మరో యుద్ధం కావచ్చు.. వీటిపై మీ లైఫ్‌డ్రామాలో కవితలున్నాయి. ఈ కవితలు రాయడం వెనుక మీ ఉద్దేశ్యం… ఇవి రాసినప్పుడు మీ స్థితి ఎలా ఉంది..?  

ఈ యుద్ధం మీద కవితలు రాసే సమయానికి నేను పూర్తిస్థాయి గృహిణిగా మారేను. అప్పుడు, అంతకు మునుపు ఉద్యోగినిగా నా అస్థిత్వం కోసం,  బతుకు కోసం చేసిన యుద్ధం గుర్తొచ్చింది. కాకపోతే అందులో మానసికంగా మాత్రమే ఓడిపోవడం, గెలవడం ఉంటుంది. ఇది బ్రతుకు యుద్ధం. కానీ ఈ బాహ్య ప్రపంచంలో జరిగే యుద్ధాలవలన రక్తపాతం, శరీర అవయవాలు చెల్లాచెదురు కావడం వంటివి చూసి మనసు కకావికలం అయ్యేది. సినిమాల్లో యుద్ధం / ఫైట్స్ సీన్స్ చూసినపుడు అది కేవలం సినిమా, అదంతా నటన అని తెలిసినా చలించిపోయే నేను, ఈ నిజమైన యుద్ధాల విషయాలను వార్తల్లో, వార్తాపత్రికల్లో చూసి నిలువునా నీరు కారిపోయేదాన్ని. ఆ బాధను ఎలా వ్యక్తపరచాలో తెలియక, తెలిసిన ఆ నాలుగు అక్షరాల రూపంలో బయటపెట్టుకునేదాన్ని.

మీ కవిత్వంలో అలతి అలతి పదాలే ఎక్కువగా ఉన్నాయి. పాఠకురాలిగా నన్ను ఆకర్షించింది కూడా ఆ శైలే. ఇది ఎలా సాధ్యమైంది మీకు…..?

అనేకానేకుల రచనలు నాకు ఇలా అలతి పదాలతో రాయడానికి ప్రేరణ. బహుశా నేను పామరుల వర్గానికి చెందినదాన్ని కూడా అయి ఉండొచ్చు. అందుకే ఎక్కువ చిన్న చిన్న పదాలలోనే రాసే అలవాటు అయ్యిందేమో.

 భావ కవిత్వం, ప్రేమ కవిత్వంతో పాటు ఓ నిరాశ కూడా మీ కవిత్వంలో కనిపించింది. ఇది మీ వ్యక్తిగత నిరాశా లేక ప్రాపంచిక నిరాశ అనుకోవాలా….?

కవిత్వం, కథ …ఏదైనా ముందు రచయిత తన వ్యక్తిగత అనుభంలోకి …అది నేరుగా, లేదా మానసికంగా అయినా సరే వస్తేనే అది ఆ రచయిత ఇష్ట ప్రక్రియ రూపంలో బయటకు వస్తుంది. ఆ నిరాశ వ్యక్తిగతమేమో అనుకుంటున్న సందర్భంలో సామూహికంగా కనబడ్డ నిరాశే ఎక్కువ కదిలించింది నన్ను.

 కవిత్వం కాకుండా ఇతర సాహిత్య ప్రక్రియలు కూడా రాసారా.. ఒకవేళ రాయకపోతే భవిష్యత్‌లో రాస్తారా..?

కవిత్వం కాకుండా కథలు, ఒక సినిమా మీద రివ్యూ, మూడు పుస్తక సమీక్షలు కూడా చేశాను. భవిష్యత్తులో విమర్శనా రంగంలో అడుగులు వేయాలని, మంచి కథలు రాయాలని అనుకుంటున్న.

 సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉండాలనుకుంటున్నారా.. లేక వ్యక్తిగతం అయితే చాలని  అనుకుంటున్నారా..?

సాహిత్యానికి కావలసినదే సామాజిక ప్రయోజనం. కాళిదాసు నుండి కాళీపట్నం రామారావుగారు, శ్రీ శ్రీ గారి నుండి సిరివెన్నెలగారి వరకు…అలాగే ఇతర కాకలుదీరిన సాహితీవేత్తలు తమ సాహిత్యాన్ని సమాజానికి హేతువుగానే మలిచారు.

ఇన్ని ప్రక్రియలు మీరు చేశారు కదా, మొదటి పుస్తకం కవిత్వం మీద వచ్చింది. మరి మీ రెండో పుస్తకం ఎప్పుడు, ఏ ప్రక్రియ మీద వస్తుంది?

ప్రస్తుతానికి రెండో పుస్తకం తీసుకువచ్చే ఆలోచనలో లేను. ఎందుకంటే మన, అలాగే ప్రపంచ సాహిత్యాన్ని విస్తృతంగా చదవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. అప్పుడే రెండో పుస్తకం గురించి ఆలోచించేది.

లైఫ్ డ్రామా ప్రతుల కొరకు సంప్రదించవలసిన చిరునామా: శ్రీమతి రాధకృష్ణ కర్రి, ఫ్లాట్ నెం. 201, శ్రీ సాయి ఎంక్లేవ్, జైన్ మందిర్ స్ట్రీట్, కబేలా రోడ్, విజయవాడ.  సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 9951916499.

వనజాక్షి, ఎస్.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు