జూలై ఒకటి సారంగ సంచిక ఇది. ఈ సంచిక నుంచి మూడు కొత్త శీర్షికలు మొదలవుతున్నాయి. ఒకటి: పుస్తక ప్రపంచం, రెండు: సీమ పల్లె గొంతు, మూడు: కథలోపలి కథ.
పుస్తకం హస్తభూషణం అని నిన్నమొన్నటిదాకా వినిపించేది. ఇప్పుడు మొబైల్ హస్తభూషణం అనాల్సి వస్తోంది. ఎందుకంటే, పుస్తకం స్థానాన్ని మొబైల్ ఆక్రమించింది. అలాగే, ముఖ పుస్తకమే అన్నిటికీ కేంద్రమయింది. అంటే, అసలు పుస్తకం ప్రమాదంలో పడిందని అనుకోవాల్సిందేనా? ఏమో, చెప్పలేం! ఇప్పటికీ దూరదూరాలు వెళ్లి, పుస్తకం సంపాయించి, చదవాలనే తపన వున్నవాళ్ళు వున్నారు. కాని, మొబైల్ చేతిలో వుండగా ముఖపుస్తకానికి వుండే కనికట్టు వేరే! ఈ సందర్భంలో చదువరుల తపనని గుర్తు చేసే శీర్షిక “పుస్తక ప్రపంచం.” ఈ శీర్షికకి ఎవరైనా రాయవచ్చు. ఈ సారి మనందరికీ తెలిసిన మంచి చదువరి కన్నెగంటి రామారావు తన తొలినాటి పుస్తక అనుభవాలను అందిస్తున్నారు.
రెండో శీర్షిక ప్రసాద్ చరసాల “సీమ పల్లె గొంతుక”. పల్లె కన్నీరు పెడుతోందని వాగ్గేయకారుడు అన్నాడు కదా! కాని, సీమ పల్లె కతలూ కబుర్లూ వేరే వున్నాయి. అందరి బాధలూ వొక్కటే అయినా ప్రాంతాల్ని బట్టి కొన్ని బాధల స్వరూపాలు మారుతాయి. ఆ మార్పుని అక్షరాల్లో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సామాజిక వ్యాఖ్యాత ప్రసాద్ చరసాల.
మూడో శీర్షిక జి. లక్ష్మీనరసయ్య “కథలోపలి కథ”. ఇప్పటికే కథకి సారంగ పెద్ద పీట వేస్తున్న విషయం మీకు వేరే చెప్పక్కర్లేదు. కాని, కథా నిర్మాణం గురించి ఇంకా కొంత అవగాహన పెంచే కృషి జరగాలని చాలా మంది కొత్త కథకులు, విమర్శకులు మమ్మల్ని అడుగుతున్నారు. కవిత్వ నిర్మాణ పద్ధతుల చర్చ ద్వారా తెలుగు సాహిత్య విమర్శలో అందరికీ పరిచితులైన జి. లక్ష్మీనరసయ్య ఈ విషయంపై దృష్టి పెట్టి, మీతో నిర్మాణాత్మకమైన సంభాషణ కోసం ఈ శీర్షిక రాస్తున్నారు.
ఇక జులై సంచికలో ఇతర విశేషాలు ఇవి:
ముళ్ళపూడి వారి గురించి వంగూరి చిట్టెన్ రాజు కబుర్లు, కొన్ని శేఫాలికలు శీర్షికలో రెండు బయో పిక్ లాంటి చిత్రాల గురించి వాడ్రేవు వీరలక్ష్మీదేవి, పాజిటివ్ దృక్పధం నిజంగా ఎంత పాజిటివ్ అన్న అంశం మీద అనుభవిక వ్యాసం జలంధర అనుసంధానం శీర్షికలో చదవండి.
‘న్యూ మ్యూజింగ్స్” శీర్షికకి కూడా ఇక నుంచి ఎవరైనా రాయవచ్చు. మీ అనుభవాలూ జ్ఞాపకాలూ రాసి పంపించండి. చర్చ శీర్షికలో తెలుగింగ్లీష్ సమస్యల గురించి ఎలనాగ చర్చ మొదలెట్టారు. మీరూ ఆ చర్చలో పాల్గొని, మీ అభిప్రాయాలు రాయండి.
‘అనగనగా ఒక మంచి కథ” శీర్షిక కూడా మీ అందరిదీ.
మీ రచనలు పంపించాల్సిన ఈ-చిరునామా : editor@saarangabooks.com
చదువరులకి చాలా పని పెట్టారుగా . మీ బిజీ లైఫ్ లో కూడా ఇంత సమయాన్ని పత్రికకి కేటాయించి , డాన్ని మరింత మెరుగు పరచాలి అనే నిరంతర తపన కి వేల నమస్కారాలు .
సీమపల్లె.గొంతుక చాలా మంచి చేర్పు.రాయలసీమ జీవితం పట్ల ఓ నిరాశక్తత సాహిత్యరంగంలో కూడా లేకపోలేదు. కరువు ప్రాంతంలోని పల్లె జీవనాన్ని తెలుసుకోవాలనుకునే వారికి కావలసినంత స్థలం ఇస్తుంది. ప్రసాద్ మంచి ఆలోచనాపరులు. ఈ శీర్షిక రాయలసీమ జనజీవితాన్ని అధ్యయనం చేయాలనుకునేవారికి బాగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.