ఇప్పుడు మార్చాల్సింది ప్రశ్నాపత్రం కాదు

“పాతాళ గరిగె”(1993) నుండి “ఒక కప్పు చాయ్ నాలుగు మెసేజ్ లు” (2003) వరకు మూడు దశాబ్దాల కవిత్వంతో కాలం కంటే ముందు పరుగెడుతున్న ముందుతరం అత్యాధునిక కవి మన ‘జూకంటి జగన్నాథం’ . బహుశా భారతదేశంలో LPG ( లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) ప్రవేశించడం కంటే ముందుగానే జరుగబోయే పరిణామాల్ని పసిగట్టిన పస వున్న కవి. కొలుకలూరి భాగీరథీ కవితా పురస్కారం అందుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ జూకంటి రాసిన ‘దారులు’ కవితనొకపాలి కండ్లకద్దుకుందాం.
*
దారులు
ఈ దారి కడుపులో ఏం దాగుంది
కాలిబాటొకటి నవజాత శిశువులా కదలాడుతుంది.
ఈ బాట ఎటు వైపు వెళుతుంది
 పిడికెడు మెతుకులు పెట్టే పంటపొలంకు నాగలిని తోలుకపోతుంది
ఈ నీటి కాలువ ఎటు ప్రవహిస్తుంది
 బీడునేల నోళ్ల ఆకలి తీర్చ పాల స్తన్యం నీళ్లు పట్టేందుకు పరుగుతీస్తుంది.
ఈ తోవ నావలా ఏ తీరం చేరనుంది
సముద్రం ముద్ర తనలో ఇమిడ్చుకొని
 ఈ తోవ గమ్యాన్ని లక్ష్యాన్ని చేరనుంది
ఈ రహదారి ఎటు పోతుంది.
జేబును కాక కడుపుని చూసే తల్లిలాటి
మా ఊరికి పోతుంది ఈ మనుషులు ఎటు పోతున్నారు
పనులు వెతుక్కుంటూ పట్టణానికి వెళ్తున్నారు
జీవితానికి రక్షణ లేకున్నా గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డుగా
అపార్ట్మెంట్ వాచ్మెన్ రక్షకుడిగా ఆటో డ్రైవర్లుగా ఏమారుతున్నారు
(“ఒక కప్పు చాయ్ నాలుగు మెసేజ్ లు” కవితా సంపుటి నుండి)
*
దారి, బాట, తోవ, రహదారి మొ.నవి అన్నీ మనం వాడుతున్న రోడ్డు (road) పదానికి పర్యాయపదాలు. ఒకపారి వాడిన పదం మరోపాలి వాడకుండా ప్రశ్నోత్తర పద్థతి (Question & Answer method)ని ఉపయోగించి అనుకున్న గమ్యం వైపు కవితను నడిపించిన టెక్నిక్ (technique) అసలు ప్రశ్నకు సమాధానాన్ని చూపెడుతుంది. కవిత్వ నిర్మాణ వ్యూహం కవి అనుభవాల్ని, జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి తనకుతానుగా రెండు విధాలుగా ప్రశ్నయి, జవాబయి మన ముందు ఆవిష్కరించుకునే తీరును నిలకడగా చూపెడుతుంది.
కనికి ‘దారి’ అమ్మలా, ‘కాలిబాట’ నవజాతశిశువులా కనిపిస్తుంది. సాధారణంగా జనం ‘ఈ రోడ్డు ఎక్కడికెళ్తుంది? ‘ అని ప్రశ్నిస్తారు? ఈరోడ్డు ఎక్కడికీ వెళ్లదు.. మనమే వెళ్లాలి అంటూ జనంలోంచి ఒకరు ఛమత్కరిస్తారు. సంభాషణలో ఛమత్కారంగా అనిపించినప్పటికీ అదే నిజం. “ఈ బాట ఎటు వైపు వెళుతుంది ” అని కవి తనకుతాను ప్రశ్న వేసుకుని ‘కార్యకారణ సంబంధం’ నుండి దూరంగా విడివడక సమాధానమై నిలుస్తాడు. మరోసారి ‘తోవ’ నావలా అనిపిస్తుంది. గమ్యం, లక్ష్యం వైపు చూపును విస్తరిస్తుంది.
ప్రశ్నాపత్రం తయారు చేసే నిపుణుడైన ఉపాధ్యాయుడు కవిలో దర్శనమిస్తాడు. ప్రశ్నాపత్రం తయారీ కాఠిన్యత స్థాయిని బట్టి నిర్ణయించబడుతుంది. ఇప్పుడు ప్రశ్నలను ఒకసారి గమనిద్దాం.
   1. ఈ దారి కడుపులో ఏం దాగుంది?
2. ఈ బాట ఎటువైపు వెళుతుంది?
3. ఈ నీటి కాలున ఎటు ప్రవహిస్తుంది?
4. ఈ తోవ నావలా ఏ తీరం చేరనుంది?
5. ఈ రహదారి ఎటు పోతుంది?
6. ఈ మనుషులు ఎటు పోతున్నారు?
పాఠకులు విద్యార్థులైతే పై ప్రశ్నలకు ఏ జవాబులు దొరుకుతాయి? వైయక్తిక సామర్థ్యాలు ఆయా ప్రశ్నలకు సమాధానాలు చెబుతాయి.
కవి కోరుకున్న సమాధానాలే రావాల్సిన అవసరం లేదు. వస్తుందన్న గ్యారెంటీ అక్కర్లేదు. ఇక్కడ ‘పిడికెడు మెతుకులు పెట్టే పంటపొలం కు నాగలిని తోలుకపోవడం’, ‘బీడు నేల నోళ్ల ఆకలి తీర్చే పాల స్తన్యం నీళ్లు పట్టేందుకు పరుగులు తీయడం, ” సముద్రం ముద్ర తనలో ఇముడ్చుకొని గమ్యాన్ని లక్ష్యాన్ని చేరడం’, ‘జేబును కాక కడుపుని చూసే తల్లిలాంటి ఊరికి పోవడం, మొ.నవి కవి నాస్టాల్జియా (Nostalgia) నిర్ణయించినట్టు ముందుగానే  స్థిరీకరించబడిన సమాధానాలుగా చెప్పవచ్చును. అయినప్పటికీ వ్యక్తి మారినప్పుడు జవాబు సైతం మారే అవకాశాల సంభావ్యతనే ఎక్కువ.
కాని చివరి ప్రశ్నకు వ్యక్తులు మారినా సమాధానాలు మారని సార్వత్రికత వుంది. అది ప్రపంచీకరణ ఫలితం. అంతిమంగా కోల్పోయినవి, కొత్తగా పొందినవి నిలకడలేని జీవితాలు, అభద్రతా భావం నిండిన భవిష్యత్తు మాత్రమేనని, ఇప్పుడు మార్చాల్సింది మూల్యాంకన విధానమే కానీ ప్రశ్నాపత్రం కాదు అని ముగింపుకు అర్ధం బోధపడుతుంది.
*

బండారి రాజ్ కుమార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు