శ్రీనివాస్ గౌడ్ ఒక “ప్రజాకవి”. ఇలా ఎందుకు అంటున్నాను అంటే కవిత్వం అంటేనే అదేదో చదువుకున్న వాళ్ళలో చదువుకున్న వాళ్లకి మాత్రమే అర్థమయ్యే వ్యవహారం అనుకునే పరిస్థితులలో, ఎవరైనా ఒక సాధారణ పాఠకుడు, అదాటున పాత దినపత్రిక పేజీ మీద కనబడి చదివినా ఆహా ఈ విషయం మీద ఇంత గొప్పగా, సింపుల్ గా రాశాడే! అని అనుకో గలిగే కవి ఇతడు. కవిత్వంతో పరిచయం లేనివాడు చదివినా ఇట్టే అర్థమయ్యే కవి శ్రీనివాస్. అందుకనే ఇతడు ప్రజాకవి, జనంకవి.
తన ఇటీవలి ప్రచురణ “ధైర్య వచనం”లో అన్ని కవితలు చదివితే, ఒక కొండ కొమ్మున నిలబడి చుట్టూ చూస్తే, ఎట్లా అనిపిస్తుందో ! అలా కనిపిస్తుంది . పచ్చటి మైదానాలు, ఎండిన చెరువులు, పారే కాలువలు, ఎగిరే పిట్టలు, రెక్కలు విరిగిన పక్షులు, కొండ మీది నుంచి దొర్లేరాళ్ళూ, గుళ్ళూ, గోపురాలు, మసీదులు, బెల్ టవర్లు, వాటిలోంచి మనుషుల్ని మాయం చేసే మాటల వలలు, అన్నీ కనపడతాయి. ఊరికి ఆ చివరన ఉన్న ఒంటరి ఇళ్ళూ, వాటి మీద నుంచి లేచే చెమట పరిమళపు దూసర గాలులు, అన్ని అన్నీ అన్ని కానవస్తాయి.
కొద్దిగా నిశ్చింత ను అన్వేషిస్తూ, కవిత్వమై సాగుతున్న కవిత్వపు దీగూడు శ్రీనివాస్ గౌడ్ చెబుతున్న ధైర్య వచనాలను కాసేపు కలవరిద్దాం ఇవాళ.
రాజ్యం ఎన్నికల మైకంలో పడి జనాన్ని రాబందులకు అప్పగించి, తను శీతల గదుల్లో పచార్లు చేస్తున్న వేళ, వేయాల్సిన మాటు గురించే ఇతడు మాట్లాడుతున్నాడు. సున్నితంగా, సుతారంగా, సూఫీతత్వపు పాటలా సాగే శీను కవిత్వం ఒక లేపరిమళం.
“మాటల మీద మాటు వేయండి” అంటూ మన్కీబాత్ ల మాటల మీద ఎలా కలబడ్డాడో చూద్దాం..
” మాటలు మాటలు, అదృశ్య తీగల మీద దొర్లి పోతూ అంతూ దరీ లేని మాటలు, ఒట్టి ఓటి మాటలు ,
నీటి మూటల్లాంటి నోటి మాటలు, పెదవుల చివర్ల నుండి రాలే పొడిపొడి మాటలు, మాటల్లో జీవంలేదు ,తడి లేదు, మాటల్లో మనసు లేదు,
మనిషి లేడు, ..
ఒట్టి మాటల్లో మనిషి లేనితనాన్ని గుర్తింప చేస్తూ,అల్లాల్సిన వలల గురించి కవిత్వం అయ్యాడు శ్రీనివాస్.
ఎవడు ముందుండి ఈ వలలు విసరాలో చెప్పిన కవిత ఇది.
” మాటల వెనక నక్కి,
పేదపొలాల్ని ఎగురేసుకెళ్లే గద్ద కంపెనీల మీద కన్నేసి ఉంచండి,
ఊరుతున్న మాటల ఊటల్లో,
ఏ వేటగాడి వ్యూహాలు ఉన్నాయో గమనించండి” అంటూ హెచ్చరిస్తూనే మాటల మీద మా ఓటు వేయాల్సిన సత్యాన్ని అక్షరాలా చెప్పేస్తాడు.
” మాటల మీద మాటు వేయండి, మత్తుగా నవ్వుతూ, గమ్మత్తుగా మన నెత్తిమీద పెట్టే మాయ మాటల ముళ్ళ కిరీటం గురించి, ఒకళ్ళని ఒకళ్ళు హెచ్చరించు కోండి ” అంటాడు అసలు ఎవరు ముందునడవాలో ఎవడు మాట్లాడాలో చెబుతూ “పనిముట్లను సృజించినవాడు, పనోడు ఇప్పుడు మాట్లాడాల, మట్టిలోంచి అన్నం ముద్ద సృష్టించే మట్టి మనిషి ఇప్పుడు మందికి ముందుండాల, మూల వాసుడి చెమట చుక్కల్లోంచి, మాటల నక్కల కనికట్టు కర్ణభేరుల్లో తుడుంపాట లాగా ,
కణకణ డప్పు మోత లాగా, దద్దరిల్లి మోగుతూనే ఉండాల” అంటాడు.
కొత్తగా కవిత్వీకరించడం. అందులోంచి బారెడు లైన్లు కాకుండా గుప్పెడు అక్షరాలలోనే గుండెచప్పుళ్ళను ఆవిష్కరించగలగడం “ధైర్య వచనం” లో చూస్తాం. బడిని కొత్తగా పిట్ట పాటలతో తూనీగల గుంపుతో పోల్చి గొప్ప దృశ్యాల్ని ఆవిష్కరించాడు గౌడ్.
“ఎక్కడైనా పిల్లలు” అంటూ, పట్టుపట్టి పిల్లలందరినీ వరుసలో నిలబెట్టి పాటను బట్టీ పెట్టియ్యాలని ఒక టీచర్ తాపత్రయం . “ఆమె పిచ్చి గాని, ఎక్కడైనా నా తూనీగలు వరుసలో ఒదిగి ఉంటాయా!? ఎక్కడైనా పిట్టలు ముక్తకంఠంతో ఒకే పాట పాడుతాయా?!” అంటాడు తూనీగలు, పిట్టలు బడిలో కొలువైయ్యేటట్లైయితే ఇక కొదువెరముందీ .
కవి గొప్ప కలలు కనేవాడు కనుకనే కొత్త బడిని కనీసం కవిత్వంలో నైనా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. బాల్యం ఎంత విలక్షణమైన దో చెప్పే పని చేశాడు ఈ కవితలో.
నేటివిటీని కవిత్వం చేయటం ద్వారా కాలూనిన నేలనూ,ఆ నేలమీది అనేకానేక విశేషాలను కవిత్వీకరించి లోకం మొత్తం చూపించే ఛాన్స్ ఉంటుంది కవికి.
ధైర్యవచనంలో అనేక సామజిక కొణాలు కవితలై కనబడతాయి. పుస్తకంలోని కవితల వెంట వెళుతూ ఉంటే ” బజాట్లో నడస్తా ఉంటేనో,రైల్లో పోతా ఉంటేనో,సరుకులకోసం సూపర్ మార్కెట్ లో తిరుగుతా ఉంటేనో, లేదా ఒక ఛాయ్ కార్నర్ దగ్గరనిలబడి నాలుక వేడిగా చురుక్కు మనేలా ఒక చాయ్ తాగుతున్నప్పుడో మనం సెన్స్ చేయగలిగే అనేక అంశాలు సందర్భాలు సంఘటనలు కవితలై కనపడుతూ వెంట నడుస్తాయి.
“అనేకానేకం” పేరిట రాజ్యపు కాల్పనిక మొహాలకు చిత్తు చిత్తు అవుతున్న జనాన్ని చిన్నచిన్న పదాల్లో కి ప్రక్షేపితంచేసి దగ్గర్నుంచి చూపించిన కవిత ఇది. ” నీకు తెలీకుండానే నీలో ప్రశ్నల గొంతు నొక్కి, విలువల సమాధుల మీద నిలబడి బానిస జెండా ఎగరేస్తావు ?నీకు తెలియకుండానే నీకు నువ్వు రాజ్యం వాడి కోరల చివర మెరుపు అవుతావు, నీవు అల్లిన సాలెగూడు లోనేచిక్కి శల్యమవుతావు. నీకు తెలీకుండానే చిన్న,చిన్నగా చచ్చిపోతున్న నువ్వు.అలవాటవుతావు..అనేకానేకా లకు” అంటూ తాత్కాలికాలకు అర్రులు చాస్తూ శాశ్వతాలను దూరం చేసుకుంటూ, సమస్తాలను రాజ్యపు వాడి గొర్ల కింద పాతిపెట్టి బువ్వ దొరకటం లేదనీ, గాలి ఆడటం లేదనీ, ఆసుపత్రి తలుపులు పుచ్చిపోయినాయనీ దవడలు నొప్పి పుట్టేలా పళ్లు కొరికే సగటు మనిషి చసవు భాగ్యాన్ని కళ్ళముందు ఆరేశాడు.
నాన్న ,అమ్మ జన్మకు కారకులు కనుక అనేక మంది కవులు విభిన్న శైలిలో విభిన్న వృత్తుల, ప్రవృత్తుల నాన్నలను, అమ్మలను అక్షరీకరించడం చూశాం. ఎవరి చూపు వారిదే, ఎవరి భావచిత్రాలు వారివే, ప్రతి మనిషికి నాన్న ప్రత్యేకమే, గౌడ్ కు అంతే కదా ! గౌడ్ గుండెల్లో కొలువైన నాన్న తన బతుకు లోని నాన్న ఇలా కనబడి……. కదా! అనుకునేలా రాశాడు. “నాన్న ఏం చేస్తాడు” పొయెంలో *దారిలో వెలుగు పూలు పరచి తాను చీకటి చెట్టులా ఉండిపోతాడు, ఏ అర్ధరాత్రో నిశ్శబ్దంగా చెంపల మీద దొంగ ముద్దయి దొరలి పోతాడా!?” ఏమో నాన్న ఎలా ఉంటాడో గాని, ఒక నాలుగు మాటల్లోకి మలచడం ఎలానో చేసి చూపాడు ఈ కవి. నాన్న నాన్న అని హృదయం కొట్టుకులాడినప్పుడు నాన్న ఏం చేస్తాడు కళ్ళలోని కన్నీటి బొట్టు మీద ధైర్యం రూపం ఆకృతి దాల్చి చిరునవ్వు తో భరోసా ఇస్తుంటాడు ఈ కవి అనువాదాలు కూడా గొప్పగా చేసి మూల రూపం రాసిన కవి భావనలు అచ్చంగా అతడి లానే తెలుగులోకి పొదగగ గల గొప్ప నేర్పు ఉన్న వాడు.
తను రాస్తున్న ప్రక్రియలనే కాకుండా ఇతరేతర భాషల, దేశాల, బాణీల ప్రాచీన రూపాలను కూడా సొంతం చేసుకుని తనదైన శైలి తో రాయగలగడం శ్రీనివాస గౌడ్ ప్రత్యేకత.
“ఒక” భావన ల పేరిట రాసిన ఐదు లైన్లు భావచిత్రాలు జపనీయ ప్రాచీన పద్యం అందమైన రూపాలను మన ముందు అచ్చ తెలుగు పద్యాల్లా నిలబెట్టాడు.
1.”కుక్క పిల్ల చనిపోయింది..
ఆ తల్లి కుక్క ,ఆ పిల్లోడి మూగ కళ్ళల్లో, సుడులు తిరిగే బాధ ఒక్కటే “
2.ఎప్పటికీ నీ గురించి ఆలోచించకూడదనుకున్నాను,
కానీ నా గుండెగొంతును నొక్క లేక పోతున్నాను”
ఇలా సాగిన పద్యాల చివరన పొదిగిన వజ్రం లాంటి పద్యం ఇది
” ప్రేయసి సమాధి మీద పువ్వులా రాలి పోకూడదు, చెంతనే చెట్టునై వికసిస్తుండాలి” అంటూ నైరాశ్యాన్ని తరిమేస్తూ ప్రేమ వృక్షమై కొనసాగామటున్న ప్రేమికుడి హృదయాన్ని ఆవిష్కరిస్తాడు.,
సందర్భాలను కవిత్వం చేయటం అనాదిగా సాగుతున్న బాగుపడే. అయినా ఆయా సందర్భాలలో కవులు కొత్తగా చూస్తూ ,రాస్తూ జనంలోకి పిట్టల్లా వచ్చి వాలుతూనే ఉంటారు. ఎన్ని ప్రభుత్వ రేడియేషన్లు ఉన్నా ఖాతరు చెయ్యరు కవులు. కళ్ళంటూ ఉంటే చూసీ, వాక్కుంటే రాసి..అన్నట్టు..
వలస కార్మికుల నడక పాదాలకు కవిత్వం లేపనాలై పాదాలొత్తిన కవులెందరో … అందులో గౌడ్ ది ఒక ముఖమల్ స్పర్శ. వలస పాదాల కోసం వంతెనలైన మనుషుల కోసం ఇక్కడ గౌడ్ కవిత్వం అయ్యాడు. “దయా దీపాలు” పేరుతో “రహదారులన్నీ తుమ్మ ముళ్ల దోవలైనప్పుడు ,
పరుచుకున్న పాదరక్షలౌతారు. తలుపులు, కిటికీలు, హృదయాలు, మూసుకుని నగరాలు రోడ్డుమీదకు వదిలేస్తే, రెక్కలు కొట్టుకుంటున్న బక్క కూలి పక్షులకు దారి చూపే బాటలు అవుతారు బావుటాలు అవుతారు”
అద్దంలోకి తొంగిచూసుకుంటున్నట్లు, ఒక్కడు చూసుకుంటే తనలోని ఎందరో కనబడినట్టు, ప్రతి ఒక్కరి లోపలి ఎందరినో చూపించే కవిత “క్రూర ప్రపంచమా” కవి రాసింది చదివినప్పుడు నేరుగా చదివేవాడికి కనిపించే అనేకానేక రూపాలు బట్టబయలై, సర్దుకుని కూర్చుని, మరొక స్టాంజాలోకి వెళదామా? వద్దా? అనుకుంటూనే చదివేస్తాడు.
ఎలిజీలు జ్ఞాపకాల జాజిపూలై విరుస్తాయి కొన్నిసార్లు, విషాదాల విరించులై నిలుస్తాయి కొన్నిసార్లు, వెళ్లిపోయిన వాళ్ళ గురించి కన్నీరై కవిత్వపు ధారలౌవుతారు కొన్నిసార్లు, గౌడ్ మాత్రం తన పాజిటివిటీ ను ఈ కవితలోనూ బయట పెట్టాడు. దేవి ప్రియ కోసం “అమ్మ చెట్టు కింద” అంటూ …
ఈ నాలుగు లైన్లూ చాలవూ ఆ ప్రేమైకమూర్తిని తలచుకునేందుకు..
“శీనూ అని అన్నపుడు
ఎండిన చెట్టుమింద
పచ్చటి పిట్ట వాలుతుంది
ఆత్మిక పుష్పం పూస్తుంది
తరువు ,తనువు,జలదరిస్తుంది”
ప్రియ దేవిప్రియ ను పచ్చటి చెట్టునుచేసి గుండె నేల మింద విత్తనంగా నాటిన వాక్యాలివి.
మాయమైన వాళ్ళకోసం ఏంచేస్తాం!!? మామూలు మనుషులకూ అర్థమయ్యేలా ఇలా మంచి పద్యాలు రాస్తా అంటూ పద్యాలు రాయడం ఒక్కటే ఆయన్ను చేరగలిగే కాంతి ద్వారం అంటూ ముగిస్తాడు.
అన్ని మాట్లాడుకున్నాక ధైర్యవచనం లో ఆ కవితల గురించి మాటాడుకోకపోతే అసంపూర్తిగా ఉంటది. అసలు తనభూమిక గా నిలిచే కవితలు అవి. అతడి పాదాలు పొద్దున్నే నిలబడే నేల అదే, అందుకే అతడిలోని పునాది భావాలైన ఆ కవిత గురించి ప్రస్తావించి తీరాలి.
బహుజనులు అనగానే సామాజికంగా బహువిధాలుగా బయటికి నెట్టి వేయబడ్డ, గాయాలపాలైన సమూహం గా అనిపిస్తుంది, అర్థం అవుతుంది, జనబాహుళ్యంలో వారు బహు జనులు అయినా ,ఎలా బతికేం?
ఎలా బతుకుతున్నాం ?ఎలా బతకాల? అని చర్చించే లా చేసిన కవిత “చెప్పాలంటే సవాలక్ష” బలే పరిగెత్తింది ఈ కవిత “ప్రశ్నలన్నీ గొంతులోనే కుక్కుకొని తలవంచుకు బతకడమే తరతరాల వారసత్వంగా నేర్చి పడిచచ్చాం కదా ,ఇంతా చేసి ఏమయ్యాం, చెమటయ్యాం చేనయ్యాం, చేనులో గింజయ్యాం, గుప్పెడు గింజల మీద హక్కు లేక నూర్పిళ్ళలో ఎగరగొట్టిన తాలయ్యాం,అన్నంపెట్టిన మెడలో చెప్పులదండయ్యాం.”
మరొక జీవితంలో ఒక చిన్న పాటి చిరునవ్వు వెలిగించే పనే చేయాల్సింది..
అని శ్రీనివాస్ గౌడ్ రాసినట్లే –
మనం రాయటమే కాదు చుట్టూ పోగులు పడుతున్న మనోవైకల్యాలను శుభ్రం చేసుకునేలా మంచి పుస్తకాలను చదువుకోవడమే చేయగలిగింది. అట్టా ఇంకొంతమంది కాడికి ఇట్టాటియ్యే కొన్ని కవిత్వ పాదాలనూ ప్రవహింప జేయడమే చేయాల్సిందల్లా ……
*
బావుంది చాలా ధైర్యంగా