……ఇపుడు కవిత్వం నా వెంట పడింది!

 నూర్జహానుకు ప్రేమలేఖ విడుదల సందర్భంగా–

ఒకే సంవత్సరంలో రెండవ కవితా సంపుటి వెలువరించారు .అభినందనలు. ఎలా అనిపిస్తుంది?

ధన్యవాదాలు సర్

ఒక తడి అనేక సందర్భాలు  (2004), తూనీగతో సాయంకాలం (2021), నూర్జహానుకు ప్రేమలేఖ  (2022), 2004 పుస్తకం తరువాత పెద్ద గ్యాప్ పుస్తకం వేయాలని చాలా తపించాను. చాలా కారణాలవల్ల వేయలేకపోయాను. ఇప్పుడు అసలుకు వడ్డీలా వరుసగా వేయాలనుకుంటున్నాను.ఆ సంతోషం మాగిన పండు రుచంతగా ఉంది.

ఒక తడి అనేక సందర్భాలు కవితా సంపుటి తరువాత వెలువడిన రెండు కవితా సంపుటాల్లోని  వస్తువేమిటి,  శిల్పమేమిటి?

మొదటి కవితా సంపుటిలో అన్ని స్పందనల భావ రూపాల గుచ్చం కనిపిస్తుంది. రెండవ సంపుటిలో కూడా అనుభూతి  ప్రదాన అంశంగా రాశాను. శిల్పవిషయంలో ‘తూనీగతో సాయంకాలం ‘తో పెద్దగా మార్పు జరగలేదు.

మీ రెండవ కవితా సంపుటి తూనీగతో సాయంకాలం , మొదటి సంపుటి ఒక తడి అనేక సందర్భాలుకు కొనసాగింపుగా అనిపిస్తుంది. ఏమంటారు?

ఆ కవిత్వం అంతా 2004 నుంచి 2015 వరకు రాసిన కవిత్వం. అందుకే మొదటి సంపుటి, రెండవ సంపుటి  కవిత్వం రూప విషయంలో  మార్పుకు గురికాలేదు. కొన్ని కవితల్లో తప్ప! మూడవ సంపుటి ‘నూర్జహానుకు ప్రేమలేఖ ‘లో  ప్రేమ కవితలు పూశాయి. శిల్పవిషయంలో పరిణితి చెందాను అని అనుకుంటున్నాను. పాఠకులు చెప్పాలి  ఆవిషయం.

 నూర్జహానుకు ప్రేమలేఖ కొత్త టైటిల్ కొత్త అభివ్యక్తిగా ఉంది. ముందటి కవిత్వంతో పోల్చితే భిన్నంగా ఉండేదుకు కారణం ఏమిటి?

మంచి ప్రశ్న . నది ఎపుడూ ఒకేలా ప్రవహించదు. కవి కూడా, ఆయా కాలాల్లో ఒడిదుడుకులు  ఎదుర్కొని మార్పుకు గురి అవుతాడు. గురి కావాలి కూడా. వాన జల్లును బట్టి నది ఒరవడిని మార్చుకున్నట్టు కవి కవిత్వం పై మోహాన్ని బట్టి రూపం, సారం, ప్రయోగం ఇత్యాదులు నవీనతను సంతరించుకుంటాయి. నాకు కవిత్వం ధ్యాస, శ్వాస. ఒక  సమయంలో కవిత్వం వెంట పడ్డాను. ఇపుడు కవిత్వం నా వెంట పడింది.

 ఎవరెవరిని చదువుతారు? మీ కిష్టమైన కవులెవరు? మీ మీద ఎవరి ప్రభావం ఉంది?

కవిసంగమం గ్రూపులో( 2017) చేరిన తరువాత నాకు కొత్త చూపు కొత్త ఎరుక వచ్చాయి. అంతకు ముందు లేవా అంటే ఉన్నాయి. కానీ ఇంకా కొత్తగా రాయాలన్న తలంపు బాగా తొలిచింది. పరోక్షంగా కర్నూలు కవి మిత్రుడు జిగిరీ దోస్త్ జి పి రామ్ చంద్ కూడా కారణం. కొత్త కవుల కవిత్వం చదివాకా తెలియని మార్పుకు లోనయ్యాను. ఒక కాలంలో చెట్టు ఆకులు రాల్చుకుని కొత్త ఆకులు చిగురించినట్టు నేనూ ఆ స్థితిని పొందాను. ఇష్టమైన కవుల జాబితా చాలా పెద్దది. స్పేస్ సరిపోదు. చాలామంది తాత్విక, మార్మిక, అనుభూతి , కవుల ప్రభావం నా మీద ఉంది. ముఖ్యంగా మోడ్రన్గా రాసే కవుల రాతలు నన్ను నీడల్లా వెంటాడుతాయి. బాగా కథలు చదువుతాను. నా వద్ద కథాపుస్తకాల సంఖ్య కవిత్వం కన్నా ఎక్కువగా ఉంది. కారణం మొదట నేను కథకుణ్ణి.  ఐదు ప్రశ్నలతో నన్ను బోనెక్కించిన వెంకటకృష్ణ గారికి, అవకాశమిచ్చిన సారంగ సంపాదకులు అఫ్సర్ గారికి, హృదయపూర్వక ధన్యవాదాలు.

*

వెంకట కృష్ణ

ఇంటర్మీడియట్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్నా.నా తరం అందరిలాగే శ్రీశ్రీ ప్రభావం నామీదుంది.అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల రా.వి.శాస్త్రి రుక్కులూ, రంగనాయకమ్మ బలిపీఠం హైస్కూల్ దినాలకే చదివున్నాను.యండమూరీ,చందూసోంబాబు,తదితర కమర్షియల్ సాహిత్యం కూడా ఇంటర్ రోజుల్లో విపరీతంగా చదివున్నా సీరియస్ తెలుగు సాహిత్యం తోనే నా ప్రయాణం కొనసాగింది.1994 నవంబర్ నెలలో మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైంది . అప్పటిదాకా రాసుకున్న అచ్చు కాని కవిత్వాన్ని 2000 సంవత్సరం లో లో గొంతుక గా నా మొదటి కవితా సంపుటి.1994నుండీ 2000 దాకా నెమ్మదిగా రాసాను.2000 తర్వాత రెగ్యులర్ గా రాస్తున్నా.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అభినందనలు వెంకటేష్ గారు…
    ఇప్పుడు కవిత్వం మీ వెంటపడింది..

    మీ కవిత్వం కొత్త పుంతలు తొక్కుతుంది 🌿💐🌿

  • మీ కవిత్వం కొత్త పుంతలు తొక్కుతుంది వెంకటేష్ గారు..
    ఇప్పుడు కవిత్వం మీ వెంట పడుతుంది
    అభినందనలు వెంకటేష్ గారు 🌿💐🌿

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు