ఇన్ని ఆంక్షలు ఎందుకు? : మీరా

న్ను నేను స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునే అవకాశం కోసం వెతికేదాన్ని. అవి ఎప్పుడూ కూడా ఒంటరితనంతోనే వుండేవి. సమూహంతో కలిసికట్టుగా ఆడుకునే అవకాశం నాకు చిన్నతనంలో ఎప్పుడూ రాలేదు. మాటలైనా, నన్ను నేను ఊహించుకున్నా, ఆలోచించినా అన్నీ ఒంటరిగానే. ఈసమాజం ఎందుకు నామీద ఇన్ని ఆంక్షలు పెడుతోందనే ఆలోచన! అంత చిన్నవయసులో అర్థం కాలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ క్రూరత్వం అర్థమవుతూ వచ్చింది. కానీ, నా లోపలి నేను దానిని అంగీకరించలేదు. నేను అమ్మాయిని మాత్రమే. నాది కాని శరీరంలో నేనున్నాను. నాకు సంబంధం లేని పేరుతో పిలవబడుతున్నాను అంతే. ఇట్‌ ఈజ్‌ డిసైర్‌ టు బి ఒన్‌ సెల్ఫ్‌.

వీటన్నిటిలో నాకు లోపల్లోపల చాలా సఫకేషన్‌ వుండేది. ఎనిమిదేళ్ల వయసులో ఒక పెద్ద ఫంక్షన్‌ చేసి నాకు, అన్నయ్యకు జంధ్యం వేశారు. బంధువుల ఒత్తిడే ఇక్కడ కూడా! అది నాకు ఇష్టమనిపించలేదు. ఎట్‌రాషియస్‌ ఎక్స్ పీరియన్స్‌ అది. నాకు ఎంత దు:ఖం అనిపించిందో ఇప్పుడు చెప్పలేనక్కా!… నాలుగైదువందలమంది ముందు ఒంటిమీద చొక్కాలేకుండా అన్ని గంటలపాటు వుండటం నాకు ఎంతో అవమానంగా అనిపించింది. దాన్ని ఎలా చెప్పాలో కూడా అప్పుడు నాకు తెలియలేదు. ఒకరకంగా అది నా మీద జరిగిన అత్యాచారంగా భావించాను అప్పుడు. ఈ పదం అర్థం అప్పుడు నాకు తెలియదు కానీ, నా ఇష్టంతో, నిర్ణయంతో సంబంధం లేకుండా నాకు అలా జరగటం అనేది ఇప్పటికీ నేను అంగీకరించలేకపోతున్నాను. ఇప్పుడు తలచుకున్నాగానీ ఆ సంఘటన నాకు తట్టుకోలేనివిధంగా వుంటుంది.(ఆగని కన్నీళ్ల్లు…గద్గదమైన గొంతు…)అది నా అస్థిత్వంగా నేను అప్పుడే కాదు ఎప్పటికీ ఒప్పుకోలేను. ఏవేవో మంత్రాలు  చెప్పటం తప్పితే, జంధ్యం ఎందుకు వేస్తారు, దాని పర్పస్‌ ఏంటి అని అర్థమయ్యేట్టు చెప్పటం అనేదే లేదు. ఇది మన ఆచారం కాబట్టి వేసుకోవాల్సిందే అనే నిర్భంధమే తప్ప. ఆ తర్వాత కూడా ప్రతిరోజూ వంటిమీద చొక్కాలేకుండా సంధ్యావందనం చేయాల్సి వచ్చేది. అలా రెండున్నర నెలలు చేశానేమో! ప్రతిరోజూ ఏడుపే చేయనని. ఆ తర్వాత ఇంక భరించలేక తీసిపారేశాను. అప్పుడు నాన్నతో చాలా గొడవైంది. కులం, మతం, జండర్‌ భావనలను ఇలాంటి ఆచారాలతోనే స్థిరపరుస్తారు అని పెద్దయిన తర్వాత అర్థమయింది. ఇప్పటికీ మంచితనం, సమన్యాయం అనే భావనని నమ్ముతాను కానీ, ఎప్పుడూ మతపరమైన భావనతో నన్ను నేను గుర్తించుకోను.

స్కూల్లో పీర్‌గ్రూప్‌ పిల్లలతో కూడా అనేక సమస్యలక్కా! వాళ్లు నా అస్థిత్వాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదనిపిస్తుంది. నాకు కూడా నా స్థితిమీద చాలా గందరగోళంగా వుండేది. బయటకేమో నేను అబ్బాయిగా అందరూ అనుకుంటారు. కానీ, నా లోపల నేను అమ్మాయిని. అబ్బాయిలతో కలిసి ఆడుకోవాలనిపించకపోయేది. అమ్మాయిలు తమతో కల వనిచ్చేవాళ్లు కాదు. పిల్లలు అనుకుంటాం గానీ అక్కా, ఎంత క్రూరత్వం చూపించేవాళ్లో ఈ జండర్‌ అస్థిత్వంలో. చాలా ఎగతాళి చేసేవారు. అబ్బాయిలు, అమ్మాయిలు కూడా! వారికర్థమైన సమాజ సూత్రాలకు ఏ మాత్రం తేడాగా కనిపించినా వాటిని ఎగతాళి చేయటంలో, అవమానించటంలో పిల్లలు  బాగా ముందుంటారు. ముఖ్యంగా మగపిల్లలు. నన్ను రకరకాల పేర్లతో అవమానించేవారు. సెక్సువల్ గా హెరాస్ చేసేవారు.(మౌనం)…ఎవరికి చెప్పుకోగలను? అందుకే నాకు స్కూల్‌కి వెళ్లాలన్నా, కిరాణాషాప్‌కి వెళ్లాలన్నా, వారితో ఆడుకోవాలన్నా భయంగా వుండేది. ఒక ఒంటరితనం! చెప్పాలంటే నాకసలు  బాల్య మే లేదు! నన్ను నేను స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునే పరిస్థితులే లేవు! అందుకని నన్ను నేను ఎప్పుడూ దాచుకుంటూ ఇంట్లోనే వుండేదాన్ని. నేను ఒంటరిగా వున్నప్పుడే నాకు చాలా స్వేచ్ఛగా అనిపించేది. ఎవరన్నా చుట్టుపక్కల వుంటే నేను నాది కాని శరీరంతో, ప్రవర్తనతో చాలా సంఘర్షణకు గురయ్యేదాన్ని. దాన్నుంచి తప్పించుకోవటం కోసం సబ్జక్ట్‌ పుస్తకాలు తెగ చదివేదాన్ని. న్యూస్‌ పేపర్స్‌ ఎడిటోరియల్స్ తో సహా అర్థమయినా కాకున్నా చదివేదాన్ని. అదే కొంత రిలీఫ్‌. దానివల్ల తర్వాతి కాలంలో రాయటం కూడా అల వాటయింది.

నాకు చిన్నప్పటి నుంచీ డాన్స్‌ అన్నా, సంగీతమన్నా ఇష్టంగా వుండేది. భరతనాట్యంలో చేరాను కూడా. అయితే అక్కడ మాస్టర్‌ నా ప్రతి కదలికనీ సరిచేస్తూనే వుండేవాడు. అబ్బాయిలా చేయటం లేదని గద్దించేవాడు. నేను ఇష్టంగా దానిలో ఇమిడిపోయే పరిస్థితి లేకుండా పోయింది. ఆయన చాలా రూడ్‌ గా వుండేవాడు. ఆ క్లాస్‌కి వెళ్లటం అంటే నాకు ఒక శిక్షలాగా అయిపోయింది. డాన్స్‌ అంటే ఎంతో  ఇష్టమున్నా కానీ, అక్కడ ఇమడలేక మానేశాను. ఇప్పుడు అనిపిస్తోంది, మానేయకుండా వుండాల్సింది అని! కానీ, అక్కడ కాకుండా వేరేచోట చేరి నేర్చుకునే సపోర్ట్‌ సిస్టం లేదు. అంత చిన్నవయసులో అలాంటి వ్యతిరేక వాతావరణంలో ఇమడటం సాధ్యమయ్యే విషయం కాదు. నాకు బాగా కోపం అనిపించేది కానీ, ఏమీ చేయలేని నిస్సహయత!

స్టడీస్‌లో కూడా నాకు ఎప్పుడూ, లాంగ్వేజస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఇష్టంగా వుండేవి. మాథ్స్‌ అంటే అస్సలు ఇష్టం వుండేది కాదు. ‘అబ్బాయివి అయ్యుండి మాథ్స్‌ అంటే ఎందుకు ఇష్టం లేదు’  అని టీచర్స్‌ అనేవాళ్లు. ఇంజనీరింగ్‌ చదవకపోతే మీ బతుకే వేస్ట్‌ అని బాగా ఊదరగొట్టేవాళ్లు. ఎంత మూస ఆలోచనలంటే, చెప్పలేం! అసలు ఒక సబ్జెక్ట్‌ కి జండర్‌ని ఆపాదించమేంటి? నాకు అర్థమయ్యేది కాదు. ఈ ధోరణి దక్షిణభారతదేశ రాష్ట్రాల్లో మరీముఖ్యంగా అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువ. మాథ్స్‌ అబ్బాయిలది. ఇష్టమున్నాలేకపోయినా వాళ్లు తప్పనిసరిగా చదవాల్సిందే. ఇప్పుడు కొంచెం పరిస్థితి మారినట్టుంది!

లెక్కలు నాకు ఇష్టం లేదు మొర్రో అన్నా వినిపించుకునేవాళ్లు కాదు. మాట్లాడనిచ్చేవాళ్లు కాదు. అలా పదవ తరగతి వరకూ ప్రతిరోజూ ఒక సంఘర్షణే. ప్రతిదీ జండర్‌కు సంబంధించిందే! ఎక్కడయినాగానీ నాకు ఒక అస్థిత్వమే లేదు. కేవలం  నాలుగ్గోడల మధ్య ఎవరూ లేనప్పుడే నేను స్వేచ్ఛగా వుండేదాన్ని. నా జండర్‌ ప్రతిచోటా ‘సరిచేయబడుతూ’ వుండేది. స్పోర్ట్స్‌ విషయంలో కూడా ఇదే రకమైన రిజిడిటీ, బైనరీ మనస్థత్వాలే వుంటాయి. నాకు కొన్ని ఆటలు ఆడాలని వుండేది. అవి ఆడపిల్లలు ఆడేవి అని రానిచ్చేవారు కాదు. ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరూ కూడా చాలా ఎగతాళిగా నవ్వేవారు. ఆడినా, ఆడకపోయినా గానీ, వాళ్ల ఈ ప్రవర్తన నన్ను ఒక నూన్యతలోకి నెట్టేసేది. దాంతో, నాకసలు ఎవరూ బాల్యస్నేహితులు లేకుండా అయిపోయారు. పిటి టీచర్‌ అయితే మరీ హారిబుల్‌ పర్సన్‌. చాలా భయమనిపించేది. దాంతో గేమ్స్‌ పిరియడ్‌ అనంగానే నాకు జ్వరం వచ్చేసేది. వాళ్లు నన్ను అబ్బాయిగానే చూసేవాళ్లు కాబట్టి చాలా పనులు తప్పనిసరిగా చేయించేవారు. నా శరీరం అందుకు సహకరించేది కాదు. నా శరీరం కానీ, నా మనసుగానీ, నా ఆలోచనలు ఏవీకూడా ఆ పనులకు సరిపోయేవిగా వుండేవి కావు. వాళ్లు బలవంతంగా నా మీద రుద్దే ఆ ప్రయత్నాలకి భయమనిపించేది. చాలా టెన్షన్‌ వుండేది. ఒక మగతనపు ప్రవర్తనను ఎదుర్కోవాల్సి వచ్చినపుడల్లా ఆ టెన్షన్ తట్టుకోలేక నాకు తెలియకుండానే పక్క తడిపేసేదాన్ని. ఒక్కోసారి స్కూల్లోనే ఆ పరిస్థితి ఎదురైయ్యేది. ఏడవ తరగతి వరకూ ఇదే పరిస్థితి. జండర్ నిర్భంధానికి ఈ పరిస్థితికి చాలా సంబంధం వుందని ఇప్పుడు నేను అర్ధం చేసుకోగలుగుతున్నాను.

థియేటర్‌లో(నాటకాల్లో) పాల్గొన్నప్పుడు మాత్రం, అచ్చు ఆడపిల్లలానే వున్నావ్‌ అంటూ నన్ను ఆడవేషాలకు మాత్రమే తీసుకునేవారు. చాలా బాగా చేశావ్‌ ఆడపిల్లలాగా అని టీచర్లు పొగిడేవారు. ఒకవైపు పొగుడుతున్నట్లు వున్నాగానీ, వాళ్ల మాటల్లో ఎక్కడో నా మనస్థత్వాన్ని అర్థం చేసుకోవటం కన్నా, ఎగతాళే కనిపించేది. మామూలు సందర్భాలలో నన్ను నిరంతరం జండర్‌ మూసలోకి బలవంతాన కుక్కుతూ ఇలాంటప్పుడు మాత్రం మెచ్చుకోవటం నాకు నచ్చేది కాదు.

పది తర్వాత ఇంటర్లో సిఇసి తీసుకున్నాను. అది కూడా ఒక ఘర్షణే. నేను వున్న మధ్యతరగతి వాతావరణంలో మాథ్స్‌ కాకుండా వేరే కోర్స్‌ లో చేరటమనేది తెలివితక్కువ పని.  బంధువులందరూ అడిగేది ఒకటే, మగపిల్లాడివైయుండి మాథ్స్‌ ఎందుకు తీసుకోలేదనే! ప్రతిసారీ ఎవరెవరితోనో పోల్చి మాట్లాడుతుండేవారు. ఫలానా వాళ్ళు యుఎస్ వెళ్లారు, ఫలానా గొప్ప కాలేజీలో ఇంకో గొప్ప కోర్సు చదువుతున్నారు అంటూ మొదలెట్టేవాళ్ళు. వాళ్ళని ఆపటం అనేది అసాధ్యమైపోయేది. మీకెందుకు అన్నామా ఇంక రాద్ధాంతమే! ఇంటర్‌ తర్వాత, నా లోపలి ప్రశ్నకు సమాధానం ‘లా’ లో దొరకచ్చు అని ఐదేళ్ల కోర్స్ లో చేరాను. ఇక్కడ కూడా నాన్నతోనే నాకు పెద్ద సమస్య. నా చదువు వేస్టు, నాకు కట్టే ఫీజు దండగ అంటూ నా అస్థిత్వాన్నిపదేపదే విమర్శించేవారు. నిజానికి నాకు ఐదేళ్లకు కలిపి పాతికవేలు కూడా అవలేదు. అదే మా అన్నయ్య ఇంజినీరింగ్ కి చాలా ఖర్చు పెట్టారు. వీటన్నితో పాటు, జండర్‌ అస్థిత్వంతో నా లోపలి సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలో తెలియకుండా అయిపోయింది. ప్రతిరోజూ, ప్రతిచోటా అందరితో నా అస్థిత్వానికి సంబంధించి రకరకాలుగా అనిపించుకోవటం నరకంగా వుండేది. నాలోపలి సంఘర్షణ బయటకు తెలియటం ఇష్టం లేక, అందరి దృష్టి నుంచీ తప్పించుకోవటం కోసం అప్పటినుంచీ గడ్డం పెంచటం ఒక మార్గంగా చేసుకున్నాను. పైకి ఎలా మాస్కులిన్‌లా కనిపించినా గానీ, నా లోపల నేను అమ్మాయినే.

స్కూల్లో, కాలేజీలో తోటిపిల్లలతో సెక్సువాలిటీకి సంబంధించిన మాటలు చాలా సహజంగా నడుస్తుంటాయి. అలాంటి సందర్భాలలో నాకు చాలా ఇబ్బందిగా వుండేది. ఒకపక్క ఆ సంభాషణల్లో వుండాలని, ఆ చర్చల్లో పాల్గొనాలని వుండేది. కానీ, ఉండలేక పోయేదాన్ని. ఎందుకంటే నేను నా లోపలి తత్వాన్ని బయటకు చెప్పుకునే అవకాశం లేదు. ఒకవిధంగా ఇంటర్ పెర్సొనల్ రిలేషన్ షిప్స్ లో ఇది చాలా పెద్ద సవాలు. ఇప్పుడు కూడా ట్రాన్స్ విమెన్ తమ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడటం అంత సులభమేమీ కాదుకానీ, ఇంతకూ ముందున్న సమస్య అయితే లేదనుకుంటున్నాను. కొంతమంది అయినా బయటకు వచ్చి  మాట్లాడుతున్నారు.

ఈ సంఘర్షణను తట్టుకోలేక, ఇంట్లో ఆదరించేవారు లేక, ట్రాన్స్ జండర్‌ వ్యక్తులు తమలాంటి వాళ్లను వెతుక్కుని పారిపోతారు. నేను కూడా అలా వెళ్లిపోయివుండాల్సిందేమో అనిపిస్తూవుంటుంది నాకు అప్పుడప్పుడూ. అయితే, నాకు అప్పుడు ఎవరూ అలా పరిచయమవ్వలేదు. తెలిస్తే వెళ్లిపోయేదాన్నేమో! కానీ, నాన్న వైపు నుంచీ ఒక ఇన్‌డిఫరెన్స్‌ వున్నప్పటికీ అమ్మ ఎప్పుడూ నాకు సపోర్టివ్‌గానే వుండేది. ఆమె నాకోసం నిలబడింది. నేను ఆమె కోసం నిలబడ్డాను. బహుశా, నేను తన ప్రేమ వల్లనే అంతకాలం ఇంట్లో వుండగలిగాను. చదువుకోగలిగాను. సామాజిక అంశాల మీద ఆలోచించటం నేర్చుకున్నాను. స్కూల్లో వున్నప్పుడు మాకు మొదటి భాషగా హిందీ, రెండోది ఇంగ్లీషు, మూడోది తెలు గు వుండేవి. దానితో తెలుగు సాహిత్యంతో ఎక్కువ పరిచయం లేదు. ఇప్పుడు బాధనిపిస్తోంది. చిన్నప్పటి నుంచీ వివిధ భాషలంటే ఇష్టంగా వుండేది. ఎంత కొత్త భాషైనా చాలా తొందరగానే నేర్చుకోగలను.

ఇంటర్‌లో వున్నప్పుడే లైబ్రరీకి వెళ్లటం అలవాటు చేసుకున్నాను. ఫిక్షన్‌ కన్నా, నాన్‌ ఫిక్షన్‌ ఎక్కువ చదివాను. తొమ్మిదవ తరగతిలో వున్నప్పుడే అరుంధతి రాయ్‌ ‘గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌’ చదివాను. ఒక ప్రత్యేక సామాజిక స్థితిలో ఆడవాళ్లు చేసే పోరాటాలు, అలానే కుల దురాగతాల గురించి దీనిలో బాగా వివరిస్తుంది. నాకు బాగా నచ్చింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో వున్నప్పుడు ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ లక్ష్మణ్‌ గైక్వాడ్‌’ చదివాను. మరాఠీ నుంచి ఇంగ్లీషు అనువాదం అది. ఈ  పుస్తకం ప్రభావం నామీద చాలావుంది. సంచార జాతులకు సంబంధించిన పుస్తకం. నేరస్థులుగా ముద్రపడిన సమూహం అది. పోలీసుల నుంచి, సమాజం నుంచి వాళ్లెదుర్కొన్న చిత్రహింసలు, అవమానాలు  చదువుతుంటే లోలోపల దు:ఖం సుళ్లు తిరుగుతుంది. ఇంగ్లీషులోనే అంత కదిలించేదిగా వుంటే మరాఠీలో ఇంకెంత బాగా వుండేదో అనుకునేదాన్ని. ట్రాన్స్ జండర్ సమూహాలను కూడా ఇదే విధంగా నేరస్థులనే ముద్ర వేయటం ద్వారా సామాజిక వెలివేతకు గురిచేస్తారు.

రోజులు గడుస్తున్నకొద్దీ నేను మళ్లీ చాలా ముడుచుకుపోయాను. పైకి అబ్బాయిగా వుండటం, నా లోపల నేను అమ్మాయిగా వుండటం…ఈ పరిస్థితి లోపల్లోపల నన్ను తినేసేది. చెప్పుకోటానికి ఎవరూ వుండేవారు కాదు. స్పష్టత లేదు కానీ, నా లోపలి ఆలోచనల మీద చాలా ఆలోచిస్తూ వుండేదాన్ని. నా ఆలోచనలకు సమాధానాలు  న్యాయవిద్యలో దొరకచ్చు అని సబ్జెక్ట్‌ బాగా చదివేదాన్ని. మామూలుగానే, బయట చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఎవరన్నా కనిపిస్తే నాకు ముందు ఏడుపు వచ్చేది. ఇది చిన్నప్పటి నుంచీ వుండేది. ఆకలితో వున్న చిన్నపిల్లల్ని చూసినా, అడుక్కుతినే వృద్ధుల్ని చూసినా, బాలకార్మికులను చూసినా మనసు బాధగా అయిపోయేది. ఆ పరిస్థితుల  మీద కోపం వచ్చేది. ఏం చేయాలో తోచేది కాదు. ఈ విషయాల మీద గైడ్‌ చేసేవాళ్లు ఎవరూ లేరు. రోడ్డుమీద వీధిబాల లెవరైనా ఒంటరిగా కనిపిస్తే వారిని ముందు ఇంటికి తీసుకువెళ్లి తిండి పెట్టి ఆ మర్నాడు స్ట్రీట్ చిల్డ్రెన్ హోమ్ లకు చేర్చే దానిని.

ఒకరకంగా ‘లా’ కాలేజీ నాకు మనస్ఫూర్తిగా సౌకర్యంగా అనిపించిన ప్రదేశం. ఇంకో ఇల్లు లాగా. అక్కడ ఒక మేడమ్‌ వుండేవారు. ఆవిడ చాలా ఫైన్‌ పర్సన్‌. సామాజిక పరమైన నా ఆలోచనలకు ఆవిడ సపోర్టివ్‌ గా వుండేవారు. అక్కడే, అంబేద్కర్‌ రాసిన ‘అనిహిలేషన్‌ ఆఫ్‌ కాస్ట్‌’ చదివాను. బాలగోపాల్‌ రచనలు పరిచయమయ్యాయి. వీటివల్ల నా ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది. భవిష్యత్తులో నేను ఎటువైపు ఉండాలనే దానిమీద స్పష్టత వచ్చింది.  కొంతమంది ఫ్రెండ్స్‌ అయ్యారు. అక్కడే మేమందరం కలిసి ‘గ్రాస్‌రూట్స్‌’ అని ఒక చిన్న గ్రూప్‌ మొదలుపెట్టాం. అసలు ప్రైవేటు కాలేజీల్లో ఆ రకమైన వ్యక్తీకరణకు అవకాశం వుండదు. మేము ఫస్టియర్‌లో వున్నప్పుడు ఎబివిపి వాళ్లు మమ్మల్ని కన్యాకుమారిలో జరిగిన ఒక వివేకానంద శిబిర్‌కి తీసుకెళ్లారు. దాదాపు నెలరోజులు. అప్పటికి నాకు వాళ్ల రాజకీయాలు తెలియదు కానీ, ఆ ఆలోచనలు సరైనవిగా అనిపించలేదు. సామాజిక న్యాయం అనే స్ఫూర్తి నాకు వాళ్లల్లో కనిపించలేదు. ఆ తర్వాత వాళ్లని ఫాలో చేయలేదు. అవి అర్థవంతమైన రాజకీయాలు అని కూడా అనిపించలేదు.

మా కాలేజీ ఎదురుగా ఒక పెద్ద చెత్త డంపింగ్‌ యార్డు చెత్తలోనే తిండి ఏరుకుంటూ తినేవాళ్ళు కనిపించేవాళ్ళు. మా ఎదురుగానే మనుషుల పరిస్థితి ఇలా వుంటే, మేము వాటిని రోజూ చూస్తూ క్లాసురూముల్లో చట్టాల  గురించి, రాజ్యాంగం గురించి, సమానత్వం గురించి చదువుకుంటూ వుండేవాళ్లం. ఇదంతా నాకు చాలా వైరుధ్యంగా అనిపించేది. అక్కడంతా అనారోగ్యకరమైన పరిస్థితులే. మనుషులు అలాంటి చోట బతకాల్సిన పరిస్థితి ఏమిటని  బాధనిపించేది. చిన్న చిన్న పిల్లలుండేవారు. వారికోసం దగ్గర్లో ఒక అంగన్‌వాడీ సెంటర్‌ కూడా లేదు. నా తొలియవ్వనకాలంలో నా చుట్టూవున్న ఈ పరిస్థితి నన్ను బాగా కుదిపేసింది. ఒకపక్క నా లోపలి అస్థిత్వం మీదవుండే అలజడి, మరోపక్క బయట ఇటువంటి పరిస్థితులు. స్పష్టత లేకపోయినా గానీ, వీటి మధ్య ఏదో సంబంధం వున్నట్టు అనిపించేది. అక్కడ పారేసిన చెత్తలోంచే వాళ్లు తమ ఆహారాన్ని కూడా వెతుక్కోవసి రావటం అంటే ఎంత దారుణమైన స్థితి, మనసు ఇంకా అల్లకల్లోమయిపోయేది. వారికోసం ఏమైనా చేయాలనుకున్నాం. నెమ్మదిగా వారితో పరిచయాలు  పెంచుకున్నాం. వాళ్లతో కూర్చుని మాట్లాడటం, వారి గురించి తెలుసుకోవటం, దాదాపు ఒక సంవత్సరం పాటు అలా వెళ్లాం. కొంచం దూరంలో వున్న అంగన్‌వాడీ సెంటర్‌కు పిల్లల్ని పంపించే ఏర్పాటు చేయటం, ఇలా మాకు తోచిన పనులు చేస్తూ వుండేవాళ్లం. సామాజిక విషయాల మీద ఆసక్తి మరింత పెరగటానికి కారణం మా కాలేజీ మేడమ్‌ అయితే ఆ తర్వాత పరోక్షంగా బాలగోపాల్‌. ఆయన రాసిన కొన్ని బుక్స్‌, పాంప్లెట్స్‌ మా చదువులో భాగంగా చదివాం. హెచ్‌ఆర్‌ఎల్‌ఎన్‌ (హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్)లో పనిచేసిన అడ్వొకేట్‌ వనజక్క ద్వారా సిటీలో చాలామందికి పరిచయమయ్యాం. కొత్తగా వస్తున్న లాయర్లకి వాళ్లు కొన్ని ట్రైనింగులు నిర్వహించారు. అలా మేము మీఅందరికీ పరిచయం అయ్యాం. హెచ్‌ఆర్‌ఎల్‌ఎన్‌ లో రెండేళ్లపాటు వాంటీర్‌గా కూడా చేశాను. వాళ్లు ఇచ్చిన ట్రైనింగుల వల్ల నేను చట్టపరమైన ఎన్నో ముఖ్యమైన అంశాలు నేర్చుకున్నాను. యాక్టివిస్టుగా నా మొదటిరోజుల్లో వనజక్క నన్ను బాగా ప్రభావితం చేసింది. తను చాలా కమిట్‌మెంట్‌తో పనిచేసేది. తన పనివిధానంతో నేను చాలా ప్రభావితం అయ్యాను. మీకు గుర్తుందో లేదో అక్కా, తను పంపిస్తే ఫైనల్‌ ఇయర్‌లో వున్నప్పుడు మీదగ్గరికి కూడా వచ్చాం! రైతు ఆత్మహత్యలపై జరిగిన మీటింగుకి మీతో కలిసి అనంతపురం కూడా వచ్చాను. హెచ్‌ఆర్‌ఎఫ్‌ వాళ్లతో కూడా పరిచయమయింది. వాళ్లతో కలిసి కొన్ని ఫాక్ట్ ఫైండింగ్‌లకు వెళ్లాను. బాల గోపాల్‌ సార్‌తో ఒకటి రెండుసార్లే వెళ్లాను, కానీ జీవన్‌సార్‌తో ఎక్కువ అసోసియేట్‌ అయ్యాను. నివాస హక్కులకు సంబంధించి జరిగిన ఒక సభలో జీవన్‌సార్‌ ద్వారానే మేథాపాట్కర్‌ పరిచయం అయ్యారు. అలా నర్మదా వాలీ ఆందోళన్‌తో కనెక్ట్‌ అయి అక్కడ మధ్యప్రదేశ్‌లో పనిచేయటానికి వెళ్లిపోయాను. ఏ విషయం నన్ను అలా డ్రైవ్‌ చేసింది అని ఇప్పుడు ఆలోచిస్తే బహుశా నా లోలోపలి తపనకు అక్కడ సమాధానం దొరుకుతుందని అనిపించిందేమో! నేను వెళ్లటం మాత్రం అవసరం అని ఎంతో బలంగా భావించాను. నాకు అప్పుడు ఇరవైరెండేళ్లు నిండాయి. నేను అక్కడ ఉన్నప్పుడే ఆకస్మికంగా అనారోగ్యంతో బాలగోపాల్ చనిపోవటం, ఆ తర్వాత  వనజక్క కూడా అనారోగ్యం తో చనిపోయిందని తెలిసినప్పుడు తట్టుకోలేని బాధనిపించింది. హైదరాబాద్ వచ్చేయాలని చాలా బలంగా అనిపించింది. కానీ, అప్పటికే నేను నర్మదా పోరాట ప్రవాహంలో మునిగిపోయివున్నాను. వెంటనే అది వదిలేసి రావటం సాధ్యం కాలేదు. ఆ తర్వాత తొమ్మిదేళ్లపాటు అక్కడే వుండిపోయాను. ఇన్ని సంవత్సరాలలో అక్కడి ఆదివాసీ, మత్స్యకార, దళిత మహిళా రైతులు, ఇతర ప్రజా సమూహాలతో పెనవేసుకున్న అనుబంధం, మా మధ్యవున్న ప్రేమ, స్నేహాం నా జీవితంలో చాలా ముఖ్యమైనవి. నా బంధువులంటే వాళ్లే. నా అస్థిత్వాన్ని అమ్మానాన్న వైపు నుంచి వచ్చిన కులంతో ముడిపెట్టి నేనెప్పుడూ చూసుకోలేదు. చూసుకోను కూడా”.

నర్మదా బచావో ఆందోళనలో మీరా సంఘమిత్ర ప్రయాణం వచ్చే సంచికలో…

*

 

 

 

సజయ. కె

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Breath taking !
    Thanks for bringing this journey of a Indian Transwoman activist!
    It is important to all of us, to know the ordeals of our fellow sisters!
    Great contribution Sajaya. Heartiest congrats for all your good works.

  • మీరా మనస్ఫూర్తిగా అభినందనలు.. అక్కా మీకు ధన్యవాదాలు.

  • సజయ అక్కా!

    ఆకలితో వున్న చిన్నపిల్లల్ని చూసినా, అడుక్కుతినే వృద్ధుల్ని చూసినా, బాలకార్మికులను చూసినా మనసు బాధగా అయిపోయేది. ఆ పరిస్థితుల మీద కోపం వచ్చేది అంటున్న సంఘమిత్ర . . . భారతీయ బాలల హక్కుల ఉద్యమకారుడు మరియు 2014 నోబెల్‌ శాంతి బహుమతిని పాకిస్తాన్ బాలిక మలాలా యూసుఫ్ తో సంయుక్తంగా అందుకున్న కైలాష్ సత్యార్థి తో కూడా కలిసి పని చేస్తున్నారనుకుంటున్నా.

    బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ హక్కులు, అనాథ చిన్నారుల సంక్షేమం కోసం పాటుపడుతూ కైలాష్ సత్యార్థి ఇంత వరకు 80వేలమంది చిన్నారులకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించారు. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఇతర సాంఘిక సమస్యలను బాలకార్మిక వ్యవస్థ శాశ్వతంగా కొనసాగేలా చేస్తుందని వారి వాదన.

    In Bengaluru to attend a corporate meeting with the Confederation of Indian Industry , Nobel laureate Kailash Satyarthi said on Friday Nov 7, 2015 that moral leadership, a culture of working together and respecting every faith, religion and community are in the DNA of all Indians.

    Participating in a meet-the press Satyarthi said : “Children haven’t created any hatred, war or insurgency . In fact, they are the worst sufferers. We elders pollute their mind and force on them divisive knowledge. We teach them you are Hindu or a Dalit. We need to learn civility , humanity , transparency; we should have a quest to learn from them, rather than enforce our own ideas on their mind. If they are engaged in substantial idealistic efforts, they can connect with others on levels of compassion and love. Then hatred will go. They must know why communal divide is happening. If they are taught to get rid of these things, I’m sure our children will create a better world for us.”

  • మరెన్నో విలువయిన విషయాలు తెలిసాయి మిరా గారి గురించి.థాంక్స్.

  • Moved very much. Good narration of a conflicting tale of the heart of a perfect human. Feeling great to know about you madam meera!

  • హాయ్ మీరా,వనజని గుర్తు తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఎన్నెన్ని జ్ఞాపకాలు ఒక రీల్ లా తిరుగుతున్నాయి. వనజ లాగే మీరూ మాకెంతో ఆప్తులైపోయారు!మీ ప్రయాణం ఎంతో బాగుంది! వచ్చే సంచిక కోసం ఎదురు చూస్తుంటాం.
    Thank U Sajaya for your great contribution!

  • hurdayaanni kadilichindi transgender mida naakunna abhiprayanni marchukunnanu mitaurvaata rachana kosam educhustu..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు