ఇనుప రెక్కల విషపు కాలం

న్నీళ్లు రావడం లేదని కాదు
కానీ ఒత్తుకుని ఒత్తుకుని
కండ్లు రెండూ
పగిలిన గాజుపెంకులైనాయి

వెక్కిళ్లు ఆగిపోయాయని కాదు కానీ
కొట్టిన చోటనే మళ్ళీ మళ్ళీ కొట్టే దెబ్బలతో
దుఃఖం పొక్కిలై పోయి
రాత్రిళ్ళు నిద్రలేమి కుంపట్లయినవి

పొద్దు పొడవట్లేదని కాదు కానీ
మెలకువ వస్తే ఏ వార్త వినాల్సి
వస్తదో అని ఉదయాలు
ముడుచుకున్న గాయాలైనయి

ఎందరెందరో
హితులు సన్నిహితులు
ఇప్పుడు ముఖపుస్తక గోడలమీద
ఎండిన పూలయి రాలిపోతుంటే
ఎవరికీ వేయలేని దండలై
ముకుళిత హస్తాలు వాలిపోతున్నాయి

విషపు ఇనుపరెక్కల గద్దకు చిక్కి
చీలికలు పీలికలైన వేనవేల ఊపిర్లు
బూడిదరంగు ఆకాశంలో
నిర్జీవ మేఘాలై  వేలాడుతున్నాయి

చావు కమురు వ్యాపించిన వీధుల్లో
చివరి చూపు కోసం
శవాలైన ఆప్తులు
పడిగాపులు కాస్తున్నారు

ఊళ్లకు ఊళ్లు ఆసుపత్రులై
గుక్కెడు ఆక్సిజన్ కోసం
బిగపట్టిన కొనఊపిరులై
ఆంబులెన్సుల అంపశయ్యలపైన
శరీరాల కట్టెలు
కొనప్రాణాలను వదిలేస్తున్నాయి

దోసిళ్ళలోకి ఆర్తితో నీరువంపి
దాహం తీర్చే నదులే  శవవాహికలై
భూమి వొంటి మీద
మృత్యుచారికల్లా
ఎండిపోయినాయి

అహంకారమో, అధికారదాహమో,
ద్వేషాల్ని రెచ్చగొట్టే ఉన్మాదమో,
బహుముఖాలతో, బహురూపాలతో
‘కరోనాలు’
కాలాన్ని కాటేస్తున్నాయి.

శవాల కుప్పలా మారిపోయిన
దేశం నడిబొడ్డున
జెండా ఒకటి
దేశభక్తి ముళ్లకంచెలకు చిక్కి
పీలికలై విలవిల్లాడుతున్నది.

*

 

నారాయణ స్వామి వెంకట యోగి

31 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా కాలం తర్వాత మళ్లీ నీ నుండి ఓ పద్యం చూస్తున్న. బాగుంది స్వామీ. ఆర్తి గీతం. తడిమింది. తడిపింది.

  • చాలా గాఢతగా …నిగూఢంగా వాస్తవ పరిస్థితిని చిత్రీకరించారు సార్

  • రిలేవెన్స్ వున్న దుఃఖం కవితంతా ఆవరించుకోంది.
    ఇలాంటి స్థితిలో మరణ పరివేదన కవిత అయ్యింది.

  • చాలా ఆర్తితో హృసాయాన్ని కదిలించేలా రాశారు మిత్రమా . నిజమే “శవాల కుప్పలా మారిపోయిన
    దేశం నడిబొడ్డున
    జెండా ఒకటి
    దేశభక్తి ముళ్లకంచెలకు చిక్కి
    పీలికలై విలవిల్లాడుతున్నది.”

    • The euphoria that is spread in the name of patriotism is of absolutely no use in saving human lives Guroojee. The situation is pathetic.
      Thank you for liking the poem.

  • Good morning sir
    Poet will make other persons in a deep heart touching feeling thats is a real poetry . By reading your poetry i felt i a deep feeling and touched my heart

  • చాలా కదిలించేలా రాశారు మిత్రమా . నిజమే “శవాల కుప్పలా మారిపోయిన
    దేశం నడిబొడ్డున
    జెండా ఒకటి
    దేశభక్తి ముళ్లకంచెలకు చిక్కి
    పీలికలై విలవిల్లాడుతున్నది.”

  • బిగపట్టిన కొనఊపిరులై
    ఆంబులెన్సుల అంపశయ్యలపైన
    శరీరాల కట్టెలు
    కొనప్రాణాలను వదిలేస్తున్నాయి
    🙏🙏

  • శవాల కుప్పలా మారిపోయిన
    దేశం నడిబొడ్డున
    జెండా ఒకటి
    దేశభక్తి ముళ్లకంచెలకు చిక్కి
    పీలికలై విలవిల్లాడుతున్నది.

    👏👏👏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు