ఇది కేవలం చంద్రన్న కథ మాత్రమే కాదు!

 జూన్ నెలను “Pride Month” అని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మన తెలుగులో Queer సాహిత్యంలో ఏమైనా నవల ఉందా తెలుసుకొనే ప్రయత్నంలో వెంకట సిద్ధారెడ్డి గారు తాను ముందు మాట రాసిన బండి నారాయణ స్వామి గారి “అర్ధనారి”  గురించి చెప్పారు. ఆలా ఈ పుస్తకాన్ని చదివే అవకాశం దొరికింది.  

జీవితం ద్వంద్వాల మీద నడుస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం. మంచి-చెడు, నలుపు-తెలుపు,చీకటి-వెలుగు,ఆడ-మగ , ఇలా ప్రతిదీ కేవలం రెండు రకాలు మాత్రమే ఉన్నాయి అనే భ్రమలో ఉంటాం. కానీ జీవితాన్ని అర్ధం చేసుకొనే కొద్దీ.. ద్వంద్వాలుగా కాకుండా ఇంకా ఎన్నో అందమైనవి, అర్థంకానివి కూడా ఉన్నాయి అని తెలుసుకుంటాం. మనుషుల్లో మంచి, చెడు రెండూ  ఉంటాయని, వెలుగు చీకటి అని కాకుండా సూర్యోదయం వెలుగుకి, మిట్టమధ్యాహ్నం ఉండే వెలుగుకి చాలా వ్యత్యాసం ఉంది అని తెలుసుకుంటాం. అలానే శారీరకంగా ఆడ-మగ అనే బేధం ఉన్నా, మానసికంగా, లైంగికంగా ఎన్నో బేధాలు ఉన్నాయి. వాటినే LGBTQ+ గా సంబోధిస్తున్నారు. ఈ LGBTQ+ అనేది కేవలం ఈ రోజు వినిపిస్తున్న మాటే కానీ మన దేశంలో  హిజ్రా, కొజ్జా, ఆడంగుడు అని ఇలా రకరకాల పేర్లతో అవమానించబడుతూ, మన మధ్యనే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి సమాజం అంగీకరించని, దిగువ మధ్యతరగతికి చెందిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అంటే ఈ “అర్ధనారీ” పుస్తకం చదవాల్సిందే. 

దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన చంద్రన్న అనే యువకుడు, రమణిగా పరిణమించిన క్రమంలో కుటుంబం నుంచి,సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి నిరాదరణకు గురై అవమానాల్ని, హింసను, వివక్షను ఈ కథ ద్వారా మనకి రచయిత పరిచయం చేశారు.  

 ఇది కేవలం చంద్రన్న కథ మాత్రమే కాదు. మన దేశంలో పది లక్షలకు పైగా ఉన్న ట్రాన్స్ జెండర్ ల కథ ఇది. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి, ఇంట్లో నుంచి పారిపోయి, సరైన జీవన ఉపాధి లభించక చివరికి బిక్షాటన మీద బ్రతుకుతున్న అందరి జీవితాలకు ఈ నవల తమ అస్తిత్వాన్ని తెలియపరుస్తుంది. 

 ఈ నవల చదివిన తర్వాత నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి..ముఖ్యంగా హిజ్రాల  జీవన విధానం, జమాత్ వ్యవస్థ, వైవిధ్యంగా ఉండే కుటుంబ వ్యవస్థ, ఇష్టం లేకపోయినా యాచనలోకి దిగడం..,  వాళ్ళ ఆహార వ్యవహారాలు, తమిళనాడులో జరిగే అతిపెద్ద ట్రాన్స్ జెండర్ ల  జాతరైనా కురువం పండగ లాంటి  ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నాను. 

ఇలా Queer గురించి అర్ధం చేసుకొనే  పుస్తకంలా మొదలుపెట్టిన ఈ నవలలో , రామలక్ష్మి అనే పాత్ర ద్వారా దిగువ మధ్యతరగతి ఒంటరి మహిళా ఎలా వ్యభిచారంలోకి దించపడుతుంది, ఇలాంటి మహిళలకు సమాజం, ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు, అవమానాలు పెడుతుంది అని తెలుసుకోవడం నాకు చాలా ఆశ్చర్యపరిచింది. 

ఈ నవలలో నాకు బాగా నచ్చిన విషయం, బండి నారాయణ స్వామి గారి తాత్వికత కల్గిన మాటలు. అవి రచయత తనకు తాను చెప్పినవైనా, లేదా పాత్రలు ద్వారా చెప్పించినా, ఆ మాటలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ముఖ్యంగా జీవితం గురించి, కళ గురించి, మానవ సంబంధాల గురించి చెప్పే మాటలు మనల్ని వెంటాడుతాయి. 

ఈ పుస్తకం చదివిన తర్వాత జీవితం పట్ల మన దృకోణం తప్పకుండా మారుతుంది. ముఖ్యంగా నాకు ఈ పాత్రలతో ఒక రెండు వారాల ప్రయాణం తర్వాత ఈ నవల కూడా ఒక ప్రేమకథ లాగ అనిపించింది. పాత్రల మధ్య నుంచి  కాకుండా వేరే కోణం నుంచి చూస్తే పాత్రల మధ్య ప్రేమ మనకు అర్ధం అవుతుంది. అదే ఈ సమాజాన్ని ఇంకా నడిపిస్తుంది అనే నమ్మకం కూడా కలిగింది. ముఖ్యంగా చంద్రన్న, రామలక్ష్మి మధ్య ఉండే అక్కా-తమ్ముళ్ల ప్రేమ మనతోనే చాలా కాలం పాటు ఉంటాయి. 

ఈ కథ ద్వారా ఎన్నో జీవితాలు , విషయాలను స్పృశించిన రచయత.. ఈ Over Information వల్ల నేను చాలా చోట్ల ఇబ్బంది పడ్డాను.. ముఖ్యంగా పిట్ బాషా, మణిమాల ల వృత్తాంతం వల్ల కొంచెం కథ పక్కదారి పట్టినట్లు అనిపించింది. 

ఈ కథను హిజ్రాల వృత్తాంతం మరింత బాగా అర్ధం చేసుకోవడానికి వెంకట్ సిద్దారెడ్డి  గారు రాసిన ముందుమాట చాలా బాగా ఉపయోగపడుతుంది..

భారతదేశ మధ్యతరగతికి చెందిన Queer మనుషుల జీవితాల గురించి తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాల్సిందే. ఈ LGBTQ+  వర్గంకి సంబందించిన పుస్తకాల్లో ఈ పుస్తకం తప్పకుండా ముందు వరసలో ఉంటుంది.. ఇలాంటి పుస్తకం మన తెలుగులో రావడం మనం అదృష్టం. 

ఈ పుస్తకం  అమెజాన్ లో దొరుకుతుంది.  పుస్తక ధర : ₹320/-

దయచేసి పుస్తకాలను కొని చదవండి..!

అమెజాన్ లింక్ : https://amzn.to/3pWV4lJ

*

 

ఆదిత్య అన్నావఝల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు