ఇదిగో ఇక్కడ వుంది యువ సాహిత్యం!

నా సావు నేను సస్తా నీకెందుకు అనే యూత్ ఫుల్ నవల రాస్తున్నా అంటే అవతల వ్యక్తి  అనుమానంగా చూస్తాడు . నిజానికి అతనా పుస్త్కం రాసినా రాయకపోయినా ముందు అసలు యువత కి ఏమైనా సాహిత్య వాసనలు ఉన్నయా అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది . నిన్న మొన్నటి దాకా తెలుగు సాహిత్య రంగంలో అకాడెమి పెట్టిన “యువ” కిరీటం ఎంత చర్చకి దారి తీసిందో చూశాం,నవ్వుకున్నాం, బాధ పడ్డాం. కాని వీటన్నిటికీ  అతీతంగా కొంతమంది సమాజాన్ని తమ వయసుకు మించిన పరిజ్ఞానంతో వివిధ రంగాల్లో పని చేస్తున్నారు , అలాంటి యువ రచయితల్లో మక్తల్ కి చెందిన సుష్మ ఒకరు. రచయిత్రిగా ఉండడమే గొప్ప అనుకుంటే ఈమె అభిరుచులు , ఆసక్తులు చూస్తే మనకి ఆశ్చర్యం కలగక మానదు , వివిధ అంశాలతో  బొమ్మలు వేయడం , ఫొటొగ్రఫి , కార్టూన్ లు వేయడం వంటి ఇతర కళల్లో కూడా ఈమెకి అభినివేశం ఉంది , ఆయా రంగాల పట్ల మక్కువ ఉంది , వాటిల్లో నిలదొక్కుకునే నైపుణ్యం కూడ ఉంది .

Let me know

రిక్తహస్తాలతో రాజ్యాలన్నీ రక్త చరిత్ర లిఖించుకున్నాకా

కత్తుల వెనక కథలు ఎన్ని విన్నా

కలేబారపు కపాళం మీద కాకి మాత్రమే వాలిందని తెలిసి కూడా

కపోతాల  రెక్కల కింద తుపాకుల తూటా లెందుకు ?

 మనం అందరం ప్రశాంత జీవితాన్ని కలగంటాం, కల్లోల సమయాల్లో మాత్రం , కారణాలని అన్వేషించకుండా ఎవరిని పల్లెత్తు మాట అనకుండా ఉంటాం. కాని , ఫలితాల మీద మాత్రం పాసింగ్ కామెంట్స్ చేస్తాం. రాజ్యమూ దాని దమనకాండలు తెల్సి కూడా మౌనంగా నిర్లిప్తంగా ఉన్న మనుషులకి ఒక సూటి ప్రస్న వేస్తుంది ఈ కవయిత్రి. పై నాలుగు వాక్యాల్లో యావత్ ప్రపంచానికి అవసరమయ్యే మాటల్లా కనిపిస్తాయి. శాంతి పేరుతో మాయ కౌగిళ్ళ లో నలిగిపోతున్న దొంగలని నేరుగా మాట్లాడతారు .

విలాప గీతాన్ని నింపుకున్న యుద్ధభూమిలో

నీ మౌనం మనిషితనానికి నిర్వచనం ?

 మేలుకొలుపు ఎప్పుడూ వేకువ గీతమే

కూలగొట్టి కుతంత్ర మంత్రం అవ్వకూడదు.

యుద్ధాలు అశాశ్వితం అని అంటూనే చర్తిత్ర నిండా రక్తాన్ని పారించిన రాజుల చరిత్రలు మనం చదువుకున్నాం. వాటి వెనక ఉన్నదంతా కుట్ర కుతంత్రం , అవన్ని నిజం కాదని తెల్సిన తర్వాత కూడ నువ్వు మౌనంగా ఉన్నావంటే ఎ మనిషితనానికి నిన్ను నిర్వచనంగా చెప్పాలి, అసలు నువ్వు మనిషివేనా నీ కళ్ళముందు ఇన్ని దుర్మార్గాలు నడుస్తుంటే మేలుకొలుపు లేకుండా ఎలా ఉండగలవని ఈ యువ స్వరం విల్లుని ఎక్కుపెడుతుంది.

వార్ ఫర్ పీస్ అనే ఒక్క వాక్యాన్ని బతికించడానికై నేను బ్రతికే ఉంటాను. అనగలిగే సత్తా ఉన్న కవయిత్రి ఈమె. ఇకపై ఏ యుద్దమూ జరగకుండా ఒకే ఒక ఆఖరి యుద్దాని చేస్తానంటుంది , ఇదొక విరొదాబాస యుద్దం లేకుండా చెయడం కోసం మళ్ళి యుద్దం చేయడం  ఏంటనే ఒక ఆలోచన  చుట్టుముట్టినప్పుడు ఆ తర్వాత ఈ యువతి రాసిన వాక్యాలు గొప్ప ఉత్తెజాన్నిస్తాయి , ఇక్కడే కవిత్వంలో కవి ఊహని మనం అంచనా వేయగలం , బలమైన నిర్మాణం కలిగిన ఏ కవిత అయినా అందులో కొన్ని వాక్యలు చదివే ముందు కాస్త గందరగోళంలో పడేస్తాయి , కాని కవి భావన మనం సరిగ్గా అంచనా వేయగలిగితే మనం ఆ వాక్యం వెనక ఉన్న భావాన్ని పొదువుకోగలం. కొన్ని సందర్భాల్లో కవితా మౌలిక సూత్రాలని దాటి కూడా వాక్యాన్ని రాయవలసి వస్తుంది, అక్కడ ఏ రచయితా తనని తాను కట్టిపడేసుకోకుండా వాక్యాన్ని విసరగలిగినప్పుడే  కవిత్వానికి కొంత రమణీయత వస్తుంది .

 యుద్ధానికి నేను సిద్ధంగా లేకున్నా 

ఆఖరి యుద్ధాన్నైతే ఆరంభిస్తాను

యుద్ధంలో  దేశాల జాబితాలుండవు 

 ప్రభుత్వాల పతనాలుండవు 

 రక్తపు రంగుల మరకలుండవు 

 దేశ పొలిమేర మీద పాతిన జెండాలుండవు 

సరిహద్దులన్ని ఏకమైన సరళరేఖ మీద 

నిరాయుధరాలినై శాంతి గీతం ఆలపిస్తూ 

పావురాన్ని ఎగురవేస్తూ ప్రపంచమంతా తిరుగుతాను 

సరిహద్దుల సంకెళ్ళన్ని తెంచేసి 

సమైక్యతమయ్యి ఐకమత్యంతో

హృదయాలను హత్తుకోమని ప్రకటిస్తాను.

పై వాక్యాలు యుద్దపు లోతుల్ని కొలుస్తున్నట్టుగా లేవూ..” పద్మవ్యూహాలు , తీరని దాహాల ” వాక్యాల్ని  సరిగ్గా వాడుకుని రాసినట్టుగా లేదూ.. అక్కడక్కడా కొన్ని అన్వయాలు కుదరకపోవచ్చు గాక..! అయినప్పటికి మనం ఇలాంటి ఒక నిజాయితీ ఉన్న కవిత్వ కపోతాలని ఆహ్వానించాలి . ఈమె ఊహాశక్తి ని మాత్రమే అంచనా వేసి మాత్రమే మాట్లాడ్డం లేదు వస్తువుని , రూపాన్ని , సారాన్ని కూడ అక్కడక్కడా పట్టి చూశాను. నిలబడే వాక్యాన్ని రాయగలిగిన లక్షణం ఉంది.

నాగరికత పేరుతో అనాగరికమైన

నగరాల నడిబొడ్డున యంత్రమై తిరుగుతున్నాడు

ఆవాసము, నివాసము తెలీదు

ప్రవాసమొక్కటే ఊపిరి

ఊరు తెలీదు వాడ తెలియదు

వారసత్వపు వలస జీవనాన్ని అతను వసంతం ఎట్లా అనుకున్నాడో

దెబ్బతీస్తున్న ప్రతిసారి బాధితుడయ్యాడు

దివాలా తీస్తున్న ప్రతిసారి బాధ్యతయ్యాడు

పిచ్చివాడు

ఇది సామాన్యుడి గుండె కోత నిలువుపటం , ప్రతీ సారి మోసపోతున్న సగటు వ్యక్తిని ఆవాహనం చేసుకుని రాసుకున్న కవిత ,కొత్తవాళ్ళు  ఇలాంటి వస్తువు  రాసే సమయంలో పదాలు అలవోకగా వస్తాయి , చాల వరకు నిలకడ లేని వాక్యాల ప్రవాహం ఆపలేక రాజీ పడిపోయి పేలవమైన కవితలుగా మిగిలిపోతాయి , కాని సుష్మ గారికి ఎక్కడ వాక్యాన్ని ఆపి రాయాలో అనే విషయం మీద శ్రద్ద ఉంది . బహుశా ఆమె రాబోయే  తన మొదటి కవితా సంపుటిలో  నేను చెప్పిన లక్షణాలు కనబడతాయి.

వర్తమాన సమాజం పట్ల నిబద్దత , రాజకీయ పరిజ్ఞానం , ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం ఇలా కవిత్వం రాయడానికి సరిపడా సరంజామా అంతా ఈమె దగ్గర సిద్దంగా ఉంది , వస్తు ఎంపిక , నిర్వహణ బాగుంది, ఇంకాస్త ఎక్కడో అస్పష్టత కనబడుతుంది,దాన్లోనుంచి కూడ అతి త్వరలో బయటకి వస్తారు.ఇప్పటికే చాల ప్రధాన పత్రికల్లో సుష్మ గారి కవితలు అచ్చయ్యాయి, విజయవాడ సాహితీ మిత్రులు  ఏటా తెస్తున్న  కవితా వార్షికలో ఈమె కవిత చోటు దక్కించుకుంది. కవిసంగమం లో తగుళ్ళ గోపాల్, నాగిళ్ల రమేష్  లేఖా సాహిత్యం లో ఈమె కవిత్వాన్ని పరామర్శించారు.

సుష్మ గారు పుట్టింది పెరిగింది సోమేశ్వర బండ ,మక్తల్ మండలం నారాయణపేట జిల్లా, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి టీచర్  గా పని చేస్తున్న ఈ కవయిత్రి తన గురిచి తాని ఇలా చెప్పుకున్నారు

“సూక్ష్మంగా పరిశీలిస్తే సమాధానం లేని ప్రశ్నలు సవాలక్ష సమాజం నిండా ఉన్నాయి. తరానికి తరానికి మధ్య అభివృద్ధి అపోహలో బ్రతుకుతున్నాం. ఆకలిచావులు ఆగలేదు, అంటరానితనం పోలేదు.

ప్రపంచాన్ని మార్చే శక్తి కలానికి, గళానికి ఉంది అని నేను నమ్ముతాను. అందుకే అభ్యుదయ కవిత్వాన్ని  రాయడానికి ఎక్కువ ఇష్టపడతాను. అణచివేతను, నియంతృత్వాన్ని, ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలను ఏ ప్రభుత్వాలు ,సామ్రాజ్యాల వల్ల మార్పు జరగలేదు. అవన్నీ అన్ని కలాలు కలిసి గళం విప్పి గర్జస్తేనే మార్పులు వచ్చాయి.

సాహిత్యానికి, అక్షరానికి అంత శక్తి ఉంది కాబట్టే నేను రాయడానికి అమితంగా ఇష్టపడతాను. సాహిత్యం ద్వారా సమాజంలో పూర్తి మార్పు తేలేకపోయినా కనీసం ఆలోచన దోరణి మార్చాలనే ముఖ్య ఉద్దేశంతో నేను కవితలు రాస్తున్నాను. ”

త్వరలో ఈమెనుంచి పుస్తకం రావాలని , ఆమె కవితా రచన మరింత మెరుగవ్వాలని కోరుకుందాం .

*

అనిల్ డ్యాని

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సుష్మా గారి ఆలోచనా తీరుని, రచనా వైవిధ్యాన్ని అర్థవంతంగా విశ్లేషించారు సార్! సామజిక రాజకీయ కోణాన్ని ఎపుడూ కొత్తగా ప్రభావంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు సుష్మా గారు. ఇద్దరికీ Congratulations💐

    వెంకటేష్ పువ్వాడ

  • అభ్యుదయ భావాలు, వస్తువు ఎంపికలో నవ్యత, స్పష్టత, చెప్పే భాషలో సూటితనమ్ బావున్నాయి. ప్రోత్సాహకంగా ఉంది రివ్యూ. గుడ్ జాబ్ అనిల్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు