ఇదంతా ఒక కలలాగ ఉంది!

ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ పేరుతో సాహిత్య అకాడమీ ఆరు రోజుల కార్యక్రమాలు చేస్తుంది ఢిల్లీ లో, ఇదే సందర్భంలో 2022 కి గాను అకాడెమీ అవార్డులు గెలుచుకున్న వాళ్ళకి అవార్డ్ ప్రదానం , కొత్త కన్వీనర్ల ఎంపిక వంటి కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా యువ కవుల కవితా పఠనం ఏర్పాటు చేశారు, అందుకు తెలుగు నుంచి నన్ను ఎంపిక చేసి పిలిచారు. వెళ్ళాను.
నా సెషన్ మొదటి రోజు సాయంత్రం , అదృష్టం కొద్దీ నా సెషన్ లో ఉన్నా వాళ్ళంతా ఒకే హోటల్ లో ఉన్నాం, ఒకరోజు ముందే వెళ్ళాం, అందరూ  దాదాపు  మొదటి రోజు సెషన్ కోసం ఉన్నారు , పదో తేదీ రాత్రి డిన్నర్ సమయంలో  ఒక్కొక్కళ్ళం డిన్నర్ జరిగే ప్రదేశానికి చేరుకున్నాం. ఎవరికి ఎవరూ తెలియదు , అందరిదీ ఒకటే మౌనం , ఎక్కడో ఒకచోట ఈ మౌనాన్ని తెంపేయగలిగే  మాట ఒకటి వినబడుతుందా అని ఎవరికి వాళ్ళు ఎదురుచూశారు , నేను హర్మన్ అనే పంజాబీ కవి ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం, నాకేమో హింది అంతగా రాదు , తాను అడుగుతున్నది అర్ధం అవుతుంది ,ఏదేదో మాట్లాడుకున్నాం పరిచయాలు అయ్యాయి . బయట కూర్చుని రేపేం చదవాలాని  కాసేపు మాట్లాడుకునే సమయంలోనే , భట్ ఆరీఫ్ అనే కష్మీరి  కవయిత్రి కలుపుగోలుగా  అందరితో మాట్లాడుతూ ఉంది . మమ్మల్ని పిలిచారు  వెళ్ళాం. వాళ్ళ ప్రాంతపు కవులకు మిత్రులకి మమ్మల్ని అందరిని పరిచయం చేసారు.
అకాడెమి  కార్యక్రమం కన్నా ముందు రోజు ఒక సభ చేసేసాం . బెంగాలి , మైథిలి , ఇంగ్లిష్, కన్నడ , ఒడియా , గుజరాతి , పంజాబీ , చత్తీస్ఘడ్ , మణిపురి  ఇలా కవులంతా ఒకేచోట చేరాం , భాష అస్సలు అడ్డంకి కాలేదు , కాస్త  హింది , ఇంకాస్త ఇంగ్లిష్  ఇలా సంభాషణలన్ని  కలిసిపోయి అక్కడ వాతావరణం అంతా కవిత్వం అయిపోయింది. ఎర్వరి మాతృభాషలో వాళ్ల వాళ్ల కవిత్వం చదివాం , కాష్మీరి  కవయిత్రి  అందరిని ఒకే ప్రశ్న వేసింది. ” మనం  కవిత్వం ఎందుకు రాస్తున్నాం ” అని , అందరి  అభిప్రయాలు దాదాపు ఒకటే , లోపల బయట ఉన్న ఉక్కపోతల  నుంచి ఉపశమనం కోసం అలాగే మన కళ్ళముందు జరుగుతున్న అనేకానేక అంశాల ని మిగతా ప్రపంచం ముందుకు తీసుకురావడం కోసం కవిత్వం రాస్తున్నాం అని చెప్పుకున్నాం . భాష చదవడం రాకపోయినా ఒకళ్ళ కవిత్వం పుస్తకాలు ఇంకోకళ్ళం
మార్చుకున్నాం . ఇంగ్లిష్ లో కవిత్వం రాస్తున్న నికిత పరెఖ్ అనే కవయిత్రి  ఒక మంచి మెటఫర్ ని తన కవితా సంపుటికి శీర్షికగా  పెట్టింది ,(My city is murder of crows)  నిజానికి నన్ను అ టైటిల్ బాగా వెంటాడింది.
కాబట్టి, ఆ రోజు రాత్రి డిన్నర్ సమయంలో అందరం కలిసి మాట్లాడుకున్నాం. వివిధ భాషలు, వివిధ యాసలు, ప్రాంతాలు, వచ్చీ రాని సంభాషణల మధ్య పరిచయాలు జరిగాయి, అందరూ అద్భుతంగా కవిత్వం రాస్తున్నారు, అందరికీ సామాజిక అంశాల పట్ల బాధ్యత ఉంది. దేశ గమనాన్ని నిశీతంగా పరిశీలన చేస్తూ , వాళ్ళ ఆలోచనల్ని కాగితం మీద పెడుతున్నారు.  మా సెషన్ లో , బెంగాలీ, ఇంగ్లీష్, తెలుగు, ఒడియా,గుజరాతి, పంజాబీ, రాజస్థాని, హిందీ ఇలా పలు ప్రాంతాల కవులం ఉన్నాం, షాయరీలు, గజల్, కవిత్వం , ఇలా వివిధ రకాల అంశాల కవిత్వాన్ని విన్నాం, “అర్జున్ డియో చరణ్” అనే పెద్దాయన మాకు మెంటార్ గా ఉన్నారు. కవిత రాయడం బాగుంది కానీ చదవడం మీద దృష్టి పెట్టమని ఆయన ఇచ్చిన సలహా బాగుంది. ఆ ముందు రోజు సభలో అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే..అందరూ మిగతావాళ్ళ కవిత్వం కూడా వినాలి అని. అలాగే మా సెషన్ జరుగుతూ ఉన్నంత సేపు మిగతా కవి మిత్రులు ఉండి విన్నారు, ఆయా కవితల నేపద్యాలని తెలుసుకున్నాం.
ప్రయాణ అలసట చాలా బలహీన పరుస్తుంది. అందరం కలిసి రాత్రి కి బయటకి వెల్దామని ప్లాన్ చేశాం. ఒకళ్ళిద్దరు బడలిక వల్ల రాలేకపోయారు. ఒక ఆరు మందిమి  వెళ్ళాం.
ఇండియా గేట్ దగ్గర అందరం నిలబడి ఫోటో దిగడం చాలా ఉద్వేగానికి లోనయ్యాము అందరం. ఒక ప్రాంతం కాదు, ఒక భాష కాదు, ఒక జాతి కాదు, ఒక కులం కాదు, అంతకు ముందు రోజు వరకు ఒకళ్ళకి ఒకళ్ళం తెలీదు, కానీ మమ్మల్ని కవిత్వం కలిపింది. అందరం శ్వాస ఒకటే కవిత్వం. ఆటోలో మాటలు, తెల్సిన రచయితల పేర్లు చెప్పుకోవడం, ఆటో డబ్బులు షేర్ చేసుకోవడం ఇలా ఎప్పుడో బాల్యంలో తప్పిపోయిన మిత్రులం మళ్ళీ కలిసిన ఫీలింగ్ . చాందిని చౌక్ లో రాత్రి 11 గంటలకి తిరగడం, పంజాబీ కవికోసం గురునానక్ టెంపుల్ బయట ఎదురుచూసి , అందరం కలిసి భోజనం చేసి , రాత్రి 12 వరకు  జుమ్మా మసీదు సెంటర్ గల్లీల్లో అద్భుతమైన ముస్లీమ్స్ సంస్కృతి , ఇలా ఆ రెండు రోజులు స్నేహంలో భాగం అయిపోయాయి. ఎందుకు జరిగింది ఇదంతా అంటే కేవలం కవిత్వం వల్లనే.
అందరం ఆయా ప్రాంతపు కవులతో ఫోటోలు దిగాం. అందరం కలిసి ఒక whatsapp సమూహాన్ని ఏర్పాటు చేసుకుని ,కవిత్వాన్ని , ఆయా కవుల సభాల్ని, సమావేశాల్ని షేర్ చేసుకుంటున్నాం . అందరం మళ్ళీ విడిపోతామని తెల్సు ,కానీ ఆ బాధ ఎవరికి లేదు ఎందుకంటే అందరం మళ్ళీ కలుస్తామని తప్పక నమ్మకం ఉంది. కవిత్వానికి అంత శక్తి ఉందని నమ్మకం ఉంది.
తెలుగు నుంచి కవిత్వం చదవడానికి నేను కథలు చదవడానికి శ్రీ ఊహ వెళ్ళాం. వీళ్ళు కలవడానికి ముందు మేం హుమాయూన్ సమాధి చూడడానికి వెళ్ళాం. చారిత్రాత్మక అంశాల పట్ల ఇద్దరికి ఆసక్తి ఉంది,.పైగా చారిత్రక రచయితల కార్యశాలకి వెళ్లిన సభ్యులం కాబట్టి వెళ్ళాం, ఆ నిర్మాణ నైపుణ్యం అబ్బురపరిచింది. ఢిల్లీ వెళితే మాత్రం మెట్రో మిస్ అవ్వొద్దు. చివరి రోజు కలసిన తెలుగు వారే అయినా ఆంగ్లం లో కథలు రాస్తున్న అన్నపూర్ణ గారిని కలవడం , ఆవిడ విజయవాడ వాసి కావడం ఇంకో ట్విస్ట్ మాకు…
మళ్ళీ సభలోకి వస్తే వివిధ భాషల్లో వస్తున్న కవిత్వం చాలా వేదికల మీద విన్నాం. ఎప్పుడో కవిసంగమం వేదిక మీద కలసిన కవి సుబోధ్ సర్కార్ ని మళ్ళీ కలిశాను, చంద్ర శేఖర్ కంబారా గారిని చూశాను, అలాగే రాబోయే కాలంలో తెలుగు భాషకు అకాడెమీ కన్వీనర్ గా ఉండబోయే మృణాళిని గారిని, సభ్యులు గా ఉన్న మందలపర్తి కిశోర్ గారిని, ఆచార్య ఎస్వీ  సత్యనారాయణ గారిని, మా ప్రసేన్ గారిని అక్కడ కల్సి నేరుగా అభినందనలు తెలిపడం మరిచిపోలేని అనుభూతి. అన్నిటికన్నా ముఖ్యంగా అదే రోజున 2022 కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న ” మధురాంతకం నరేంద్ర ” గారి కటౌట్ చూడ్డం, ఆయనకు నేరుగా శుభాకాంక్షలు చెప్పడం ఇంకో గొప్ప అనుభూతి. అలాగే నిత్య సంచారి దాసరి అమరేంద్ర గారిని కలవడం , సభలో దేవరకొండ సుబ్రమణ్యం గారిని  ఆఖర్లో  బీబీసీ తెలుగు వింగ్ లో పని చేస్తున్న సౌమ్య ఆలమూరి ని కలవడం తో  ఢిల్లీ యాత్ర సంపూర్ణంగా ముగిసింది. అకాడెమీ సభలు నిర్వహించిన తీరు బాగుంది. తెలుగు కవిత్వం చదివి వినిపించిన కృష్ణుడు గారు, అలాగే విప్పగుంట రామ్ మనోహర్ గారు కవిత్వాన్ని మిగతా భాషల మిత్రులతో కలిసి వింటూ మా భాష కవి అని చెప్పడం ఒకింత గర్వంగా అనిపించింది.
ఇదంతా ఒక కలలాగ ఉంది.  కానీ నమ్మలేని నిజం. సాహిత్యం నాకు ఇచ్చిన గొప్ప బహుమతి ఈ రెండు రోజుల ఢిల్లీ యాత్ర… అన్నట్టు మరో విశేషం ఏంటి అంటే.. నేను మొదటిసారి విమానం ఎక్కింది కూడా ఇప్పుడే. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి నాకు ఈ యాత్ర జీవితకాలపు జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
*

అనిల్ డ్యాని

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు