ఇదంతా ఎక్కడ మొదలైందంటే….

స్వాతంత్య్రానికి పూర్వం నుంచి 2000 వరకూ ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు, కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అద్దం పట్టే ఆత్మ కథ.

రచయిత పరిచయం 
అరిగపూడి ప్రేమ్ చంద్ అంతర్జాతీయ ఆర్థికవేత్త.  ఆయన సుప్రసిద్ధులు కారు. కాని ఆంధ్రా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా మొదలయ్యి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి, తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ లోను, అటుపైన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో  అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన జీవితం ఆయనది. పదిహేను పుస్తకాలు రాసిన ఆయన మరో పాతిక పుస్తకాలకు ఎడిటర్, కనీసం 70 పత్రాల సమర్పకుడు కూడా. రిటైరయిన తర్వాత ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ గా వ్యవహరించారు. ప్రస్తుతానికి భార్య రమతో కలిసి హైదరాబాద్ లోని విష్పర్ వ్యాలీలో ప్రశాంత జీవనం సాగిస్తున్నారు.
ప్రస్తుత పుస్తకం On The Fringes of Government – A personal Journey.
తెలుగు అనువాదం  ఇది.  ఇందులో వ్యక్తిగత విషయాలతో పాటు ఆయా ప్రాంతాలు, దేశకాల పరిస్థితులు చిత్రించారా ప్రేమ్ చంద్.
మరీ ముఖ్యంగా స్వాతంత్య్రానికి పూర్వం నుంచి 2000 వరకూ ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు, కాలానుగుణంగా వచ్చిన మార్పులకు ఈ ఆత్మకథ అద్దం పడుతుంది.
అంతకుమించి ప్రభుత్వ వ్యవస్థలు, బ్యూరాక్రసీ పనితీరుకు, అంతర్జాతీయ సంస్థల ఆలోచనాశైలిని తెలియజేసే విలువైన ఈ రచనకు ప్రముఖ రచయిత్రి అరుణ పప్పు అనువాదం.   
1

నేను పుట్టింది ‘కడవకొల్లు’ అనే ఊళ్లో. అది రెండు గ్రామాల మధ్య ఉండే ఓ కుగ్రామమని చెప్పుకోవచ్చు. దానికంటూ ఓ పేరుంది అంతే. ప్రఖ్యాతి ఏమీ లేదు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవాళ్లు కూడా మాట్లాడుకునేటప్పుడు ‘వీరవల్లి – కడవకొల్లు – పొట్లపాడు’ అంటూ కలిపి మాట్లాడతారు తప్ప, దానికంటూ ఓ స్వయంప్రతిపత్తినివ్వరు.

నేను పుట్టేనాటికి అంతా కలిపి అక్కడున్నది పాతిక కుటుంబాలు అనుకుంటాను. వీరవల్లికీ కడవకొల్లుకూ సరిహద్దు ఓ పంట కాలువ. మంచి వానాకాలంలో అది పదడుగుల వెడల్పుండేది, లేనప్పుడు మూడు అడుగులుంటే ఎక్కువ. ఇక పొట్లపాడు ఆరు ఫర్లాంగుల దూరంలో ఉండేది. ఓ మట్టి రోడ్డు మమ్మల్ని ఆ ఊరితో కలిపేది. పొడి వాతావరణం ఉన్నప్పుడు పరవాలేకపోయేదిగాని, వర్షాకాలంలోనైతే నా సామిరంగా, ఆ రోడ్డు మీద కాలేస్తే జర్రున జారేవాళ్లం. లేదంటే అడుగులోతు బురదలో కాళ్లు కూరుకుపోయేవి. అందువల్ల జనాలు ఎక్కువగా కాలవ గట్ల మీద నుంచే రాకపోకలు సాగించేవాళ్లు. ఆ గట్ల మీద గడ్డి దుబ్బుగా మొలిచేది, పాములు తిరుగుతూ ఉండేవి!

ఈ లెక్కన కడవకొల్లుకు రాకపోకలు సాగించడమంటే కత్తి మీద సామే. మాకు దగ్గర్లోని పట్టణమంటే విజయవాడే. అప్పట్లో దానికాపేరు ఉండేది కాదు. మేమంతా బెజవాడ అనే అనేవాళ్లం. అక్కడనుంచి వస్తే, ఇరవై మైళ్లు రోడ్డు ప్రయాణం చేసి ఉయ్యూరు దాకా రావాలి. ఆ తర్వాత ప్రయాణసాధనాలేం ఉండేవి కాదు. ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకోవలసిందే. కుటుంబమైతే ఎద్దులబండి, ఒకొక్కరూ అయితే సైకిళ్లు – ఇంతే. అవికూడా, ముందు చెప్పినట్టు పొడి వాతావరణం ఉన్నప్పుడే.

ఓ రెండు ఎడ్లబళ్లు సవారీకి సిద్ధంగా ఉండేవి. వాటి యజమానులకు చుట్టుపక్కల నాలుగైదు ఊళ్లలోని కుటుంబాలు, మనుషులు వాళ్ల రాకపోకలు అన్నీ తెలిసే ఉండేవి. ఎవ్వరి దగ్గరా ఏమీ బేరమాడే ప్రసక్తి ఉండేది కాదు. ఉయ్యూరులో బస్సు దిగినవాళ్లను వీళ్లే చూసి పలకరించడం, చేతిలో ఉన్న సంచులను అందుకోవడం, బండి ఎక్కించుకోవడం. ఆడవాళ్లను, పిల్లలను ఎక్కించడానికి ఓ చిన్న బల్లవంటిది ఉండేది. దాదాపు అందరూ, అందరికీ తెలిసినవారే కావడంతో ఆ రెండు మైళ్ల దూరపు ప్రయాణంలో బండివాణ్ణి అడిగితే ఊరు విశేషాలన్నీ ఏకరువు పెట్టేసేవాడు. ఒకవేళ అప్పటివరకూ తెలియని మనిషి అయితే ‘ఎవరింటికొచ్చారు బాబూ, ఏం పని, ఎన్నాళ్లుంటారు’ అన్నీ వాళ్లే తెలుసుకునేవారు. వార్తలు, విశేషాలు వినవలసినవన్నీ విని, చెప్పవలసినవుంటే చెప్పేసి, చేరవలసిన ఇంటి వరకూ చేరాక, ప్రయాణికులు ఏమిస్తే అది బండివాళ్లు పుచ్చుకునేవారు. అదిగాక బండిలాగిన ఎద్దులకూ, బండి మనిషికీ కాస్త మంచినీళ్లు, ఇంట్లో పండిన కూరానారా ఇవ్వడం ఉండేది. అవి లేనప్పుడు ఊరగాయలిస్తే బ్రహ్మానందభరితులై తిరుగుప్రయాణం కట్టేవాడు. చిన్న పిల్లలు, ఆడవాళ్లు, సామాను ఉంటేనే బండి సవారీ. లేదంటే అందరి రాకపోకలు కాలినడకనే జరిగేవి.

బండి వీరవల్లి దాకా వచ్చిందంటే, ఆ వీధుల్లోంచి అయినా, లేదంటే కాస్త చుట్టుతిరిగి అయినా కడవకొల్లు రావొచ్చు. వీరవల్లి మలుపులో నిల్చున్నారంటే మా ఇంటి పెరట్లోని రెండు పెద్ద కొబ్బరిచెట్లు ఇట్టే కనపడేవి. మా ఇంటికి కాస్త దూరంలో ఉన్న హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు చుట్టూ ఉన్న సరుగుడు చెట్లు కూడా అక్కణ్నుంచే కనపడేవి. మా ఇంటి ముందు రెండు ఉసిరి చెట్లు కూడా ఉండేవి.

కాటూరు, కలవపాముల వెళ్లేవాళ్లు ఇంకా ముందుకు వెళ్లాలి. వాళ్లు మా కడవకొల్లు స్కూలు దగ్గర ఆగి, ఆ ఆవరణలో ఉన్న తియ్యని నూతి నీళ్లు కాసిని తాగి, మొహాలు కడుక్కుని, నూతి చప్టా మీద కూర్చుని, సరుగుడు చెట్ల గాలిని ఆస్వాదించి, సేదదీరి మళ్లీ ప్రయాణం సాగించేవారు. ఈలోపే కాస్త మాటామంతీ, ఊరి వార్తలు, విశేషాలు తెలుసుకోవడం కూడా పనిలోపనిగా జరుగుతూ ఉండేది. ఇప్పట్లాగా ఫోన్లు, రేడియోలు, టీవీలు, వార్తాపత్రికలు ఏవీ లేని ఆ కాలంలో ఇటువంటి పాదచారులవల్లే ఒక ఊరి విశేషాలు మరొకరికి తెలుస్తూ ఉండేవి.

ఎక్కువమందికి చదవడం, రాయడం రాదుగనక, ఉత్తరాలు కూడా తక్కువే. ఊరికంటూ ఏదైనా ఉత్తరం వస్తే, దాన్ని బడిలోని ఉపాధ్యాయుడి దగ్గరకు తీసుకెళ్లి చదివించుకునేవారు. అందులో మంచి వార్తలుంటే సరే. ఏదైనా దుర్వార్తలుంటే, అవి వారు నొచ్చుకోకుండా చెప్పడం, ఆ తర్వాత వారిని ఊరడించడం – అన్నీ ఆ ఉపాధ్యాయుడి బాధ్యతలే. ఆ రకంగా స్కూలు టీచరంటే వాళ్లకు ఊళ్లోని అందరి వార్తలూ తెలిసుండేవి. వాళ్ల దగ్గర రహస్యం అన్నదెవరికీ ఉండేది కాదు. అలాగే అందరి ఉత్తరాలూ రాయవలసిందీ అతనే గనక, ఊరందరి కుటుంబాల్లో తాను కూడా ఒక సభ్యుడు అన్నట్టే మసలుకునేవారు. ఊళ్లోవారు కూడా ఆయనను అలాగే చూసుకునేవారు.

ఊరికి పోస్ట్ మేన్ రావడమే ఒక పెద్ద వేడుకలాగా ఉండేది. అతను వీపు మీద కాన్వాసు సంచీ తగిలించుకుని చేతిలో ఓ కర్ర పట్టుకుని నడిచేవాడు. ఆ కర్రకు చిరుగంటలు, చిరుకత్తి ఉండేవి. గంటల శబ్దంతోనే అతను వస్తున్నాడని తెలిసిపోయేది. ఆ కర్ర పాములను అదిలించడానికి, కత్తి అతన్నెవరైనా దోచుకోవడానికి వస్తే తిరగబడటానికీ ఉపయోగపడేది. ఈరోజుల్లో వినడానికి విడ్డూరంగా ఉంటుందేమోగాని, మన దేశంలో పోస్టల్ వ్యవస్థను నెలకొల్పిన కొత్తలో పోస్టుమ్యాన్ లను దోపిడీదొంగలు దారికాచి దోచుకోవడం సాధారణంగా జరిగేది. మావైపు అటువంటి అకృత్యాలు జరిగినట్టు మేమెప్పుడూ వినలేదుగాని, పోస్టుజవాను ఆహార్యం మాత్రం అదే.

వీరవల్లి, కడవకొల్లు రెండింటిలోనూ ఊరి మధ్యన ఒక చెరువుండేది. ఇళ్లన్నీ దాని చుట్టూ ఉండేవి. ఏవో కొన్ని మాత్రమే ఇటుకలతో కట్టినవి. మిగిలినవన్నీ మట్టిగోడలు, రెల్లుకప్పుల ఇళ్లే. తాటాకుల కప్పులు ఎక్కువ కనిపించేవి. ఎందుకంటే గ్రామాల్లో అన్ని రకాల అవసరాలకూ ఆదుకునే కల్పవృక్షం వంటిది తాటి చెట్టే. తాడి దూలాన్ని ఇంట్లో నిట్రాడిగా, ఆకులను కప్పుగా వాడేవారు. మరీ ఎండుటాకులు పొయ్యిలోకి పనికొచ్చేవి. ఇక తాటి కల్లు సంగతి చెప్పనే అక్కర్లేదు. పగలంతా కాయకష్టం చేసిన కూలీలు కొందరు రాత్రి ఇళ్లకు వెళ్లేముందు కాస్త పుచ్చుకుని పోయేవారు. తాటి చెట్లు పొలాల సరిహద్దులు తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడేవి. తాటికాయలు, ముంజెలు వేసవిలో అందరికీ దాహాన్ని తీర్చే ఆదరువుగా ఉండేవి.

వీరవల్లిలో అన్ని కులాల వాళ్లుండేవారుగాని, యాదవ కుటుంబాల సంఖ్య ఎక్కువ. వాళ్లకు గొర్రెలు, మేకల పెంపకం ప్రధాన వ్యాపకం. అస్పృశ్యులు పందులను పెంచుకునేవారు. ఊళ్లో కొన్ని బ్రాహ్మణుల, మరికొన్ని కమ్మవారి ఇళ్లుండేవి. చాలా కొద్దిమంది చాకళ్లు, మంగళ్లు ఉండేవారు. వ్యక్తిగతంగా రేజర్ ఉండటం అప్పట్లో మాకు తెలియదు. వారు గ్రామంలో కొన్ని ఇళ్లను పంచుకునేవారు. ఆ అనుబంధం తరాల తరబడి సాగుతూ ఉండేది. తమకు పండినదాన్నుంచి, ఏడాదికి ఇన్నని తిండిగింజలను వాళ్లకు ఇచ్చేవి రైతుకుటుంబాలు. ఇళ్లల్లో పెళ్లిళ్లయినా, పురుళ్లయినా, శుభాశుభ కార్యక్రమాలన్నింటికీ వాళ్లుండటం, సేవలు తప్పనిసరి.

కడవకొల్లుకు సమాంతరంగా కాస్త మెయిన్ రోడ్డు మీద (అది ఉయ్యూరు – ఇందుపల్లి మధ్య ప్రధాన రహదారి) దగ్గరగా దళితవాడ ఉండేది. ఇప్పుడలా అంటున్నారుగాని, నా చిన్నప్పుడు, ఇంకా మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించనప్పుడు వారిని మాలమాదిగలని పిలిచేవారు, అంటరానితనం పాటించేవారు. మహాత్మా గాంధీజీ పూనుకున్నాక వారిని హరిజనులని సంబోధించడం పరిపాటి అయ్యింది. అయినా నిత్యజీవితంలో వారిని అస్పృశ్యులుగానే చూసేది సమాజం.

కడవకొల్లులో కమ్మవారి కుటుంబాలు ఎక్కువ. భూవసతి బాగా ఉన్న బ్రాహ్మణుల కుటుంబం ఒకటి ఉండేది, అలాగే ఊళ్లో ఉన్న కోమట్ల కుటుంబం నిత్యావసరాలు అమ్మే దుకాణం నిర్వహించేది. కమ్మరి, కుమ్మరి కుటుంబాలు రెండు మూడు ఉండేవి. కడవకొల్లులో ఆంజనేయస్వామి ఆలయం ఉంటే, వీరవల్లిలో రాముడి కోవెల ఉండేది. మా నాన్న పుట్టినప్పుడు మా నాయనమ్మకు కాన్పు కష్టమయ్యిందట. అప్పుడు ఆమె ప్రాణాలతో బయటపడినందుకు కృతజ్ఞతగా మా తాత ఆ దేవాలయానికి చాలా సొమ్ములిచ్చారని చెప్పుకునేవారు.

పొట్లపాడులో అన్నీ కమ్మకుటుంబాలే. తరాల తరబడి పిల్లలను ఇచ్చిపుచ్చుకోవడాలతో (వివాహ సంబంధాల్లో) అందరూ అందరికీ బంధువులే. అందరికీ మట్టిగోడల ఇళ్లే. ఆ ఊళ్లో ఓ మూలగా ఉన్న చర్చి మాత్రం ఇటుకలతో కట్టినది ఉండేది. ఆదివారం నాడు రంగురంగుల బట్టలు వేసుకుని ఆడామగా, పిల్లాపెద్దా అక్కడికి ప్రార్థనల కోసం చేరిన దృశ్యం ఇప్పటికీ నా కళ్లకు కట్టినట్టుగా ఉంది. స్కూల్లో పనిచేసే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు, దుకాణం నడిపే వైశ్యులు తప్ప, మిగిలిన అందరికీ వ్యవసాయమే జీవనాధారం. అందువల్ల అందరిళ్లలోనూ పాడి పశువులు తప్పనిసరి. ఎవరింటి వెనక వారి పశువులకు శాలలుండేవి.

వీరవల్లి, కడవకొల్లులో అందరిళ్లలోనూ పెరళ్లలో రెండోమూడో కొబ్బరిచెట్లు తప్పనిసరిగా ఉండేవి. మరే కారణం వల్లో తెలియదుగాని పొట్లపాడులో మాత్రం ఎవ్వరింట్లోనూ కొబ్బరిచెట్టుండేది కాదు. అక్కడ పొడుగ్గా కనిపించే బుల్బుల్ (అకేషియా) చెట్లుండేవి. వాటిని ఎక్కువగా వంటచెరుకుగా వాడేవారు. పెరళ్లలో నూతులుండటం ప్రతి ఇంటికీ సామాన్యమే. ఎవరికైనా లేకపోతే ఇరుగుపొరుగులది వాడుకునేవారు. డెల్టా ప్రాంతం కావడంతో పెద్ద లోతు తవ్వనసరం లేకుండానే జల పడేది నూతుల్లో. వర్షాకాలంలోనైతే ఆమాత్రం తాడూచేదా అవసరం కూడా లేకుండా కాస్త వంగి బకెట్లతో తోడేసుకునేవాళ్లం! నూతుల్లో చిన్న తాబేళ్లు సర్వసాధారణం. నూతులకు కాస్త దూరంగా ప్రతి ఇంట్లోనూ అరటి చెట్లుండేవి, ఇళ్లలో వాడిన నీటిని వాటివైపు మళ్లించేవారు.

శీతకాలాల్లో అందరూ తమ పెరళ్లలో కూరగాయలు పండించుకునేవారు. బీన్స్, కాకరకాయలు, పొట్లకాయలు, బెండ, వంకాయ.. ఇవన్నీ. ఒకరింట్లోవి మరొక ఇంటికి ఇచ్చిపుచ్చుకునేవారు. పాలు ఎవరింట్లోవి వాళ్లు వాడుకునేవారు. పండగలప్పుడు కోడి, గొర్రె మాంసాలు ఒకచోట ఎక్కడో కోసి బ్రాహ్మలు తప్ప మిగిలిన అందరూ పంచుకునేవారు. పందులను చంపే దృశ్యం భయంకరంగా ఉండేది. ఊళ్లోని చెరువు, పంటకాలువల్లో చేపలు, రొయ్యలు దొరికేవి.

సారాంశం చెప్పాలంటే గ్రామాలన్నీ వేటికవి స్వయంసమృద్ధంగా ఉండేవి, అలాగే కుటుంబాలు కూడా. ఆనాడు వాళ్లు చేసే వ్యవసాయం ఆ కుటుంబాలకు సరిపోయేది.

%%%%%%%%%%

ఈ మూడు ఊళ్లూ ఎలా ఏర్పడ్డాయో, వాటికా పేర్లెలా వచ్చాయో తెలిసే చరిత్ర ఏదీ మనకు అందుబాటులో లేదు.

ఒకనాడు ఇవి ఇంగ్లిష్ వారు దీన్ని ‘కిష్ట్ నా’ అని పిలిచే కృష్ణా జిల్లాలో భాగాలు. వారి పలుకుబడిలో ‘ఆర్’ ఒదిగేది కాదు. అప్పటి కృష్ణా జిల్లా చాలా పేదది. ఎప్పుడూ వరదలు వచ్చి పంటలు పోయేవి. పశ్చిమ కృష్ణాలో అయితే ఏటేటా వచ్చే వరదలకు పంటలు పోవడమే కాక, బురద పేరుకునేది. ఫలితంగా మలేరియా దోమలకు నిలయంగా మారేది. అప్పట్లో మలేరియాకు మందు లేదు! దీనికి బలయ్యేది స్థానికులు మాత్రమే కాదు, పద్దెనిమిదో శతాబ్దం రెండో భాగంలో ఆ ప్రాంతంగుండా రాకపోకలు సాగించే ఇంగ్లిష్, ఫ్రెంచ్ పటాలాలు, సైనికులు – మలేరియా వాతన పడేవారు. అప్పటికల్లా ఈ ప్రాంతాల మీద నిజామ్ ఆధిపత్యం తగ్గిపోయి, వీరి పోరాటాలు అధికమయ్యాయి. దక్షిణాదిన ఆర్కాట్ మొదలుకొని తూర్పు తీరాన బొబ్బిలి వరకూ ఈ రెండు వర్గాల మధ్య చిన్నచిన్న యుద్ధాలు నడుస్తూ ఉండేవి.

బ్రిటిష్ వారు తమ సైనిక పటాలాలను దింపడానికి మసులిపట్నం (ఇదే తర్వాత మచిలీపట్నం – బందరు అయింది) సముద్ర రేవు పట్నాన్ని ఉపయోగించుకునేవారు. నౌకల్లో అక్కడికి వచ్చిన బ్రిటిష్ సైనికులను హైదరాబాద్ పంపేవారు. ఎందుకంటే అప్పటికి మరాఠా దాడులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ నిజామ్ కు బ్రిటిష్ వారు అండగా నిలిచేవారు. కాని ఈ సైనికుల్లో చాలామంది రాగానే అంటువ్యాధుల బారిన పడి, గమ్యం (హైదరాబాద్) చేరకముందే చనిపోయేవారు. ఆరోజుల్లో ఎక్కువ మరణాలకు కారణమైన మహమ్మారి మలేరియానే!

యుద్ధాల్లో కాకుండా, ఇంకా యుద్ధం మొదలవక ముందే ఉట్టి బురద నేలల పైత్యాలకు తమ సైనికులు పిట్టల్లా రాలిపోవడం అనేది అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీకి మింగుడుపడేది కాదు. ఏ చర్యలు చేపట్టినా ఫలితం లేక, మధ్యేమార్గంగా స్థానికులను సైన్యంలోకి తీసుకోవడాన్ని మొదలుపెట్టింది. ఆనాడు ఆర్కాటులో క్లైవ్ దొర నాయకత్వాన పోరాడిన సైనికుల్లో ఎక్కువమంది ఆంధ్రా తీర ప్రాంతాలకు చెందినవాళ్లేనని రికార్డులు తెలియజేస్తున్నాయి. క్లైవ్ రాసిందేగనక నిజమైతే, ఈ ప్రాంత సైనికులు దృఢమైనవాళ్లు, గట్టి అభిప్రాయాలున్నవాళ్లు, జీతాలు ఎక్కువ అడిగేవాళ్లు. కాని వాళ్లు వీరులు, తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన అనేక ప్రాంతాలను తమ భుజబలంతో ఈస్టిండియా కంపెనీకి సంపాదించి పెట్టినవాళ్లు. వీళ్లు ఎవరంటే – అప్పటిదాకా మొఘలులు, కాకతీయుల పరిపాలనలో సైనిక దళాల్లో పనిచేసిన స్థానిక సైనికుల్లో చిన్నచిన్న దళాలవారు.

కాకతీయ రాజులకు అండగా నిలబడిన నాయక్, సుబేదార్లలో ఎక్కువమంది వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. కాకతీయ సామ్రాజ్యం పతనమైపోతున్న చివరిరోజుల్లో వాళ్లు చిన్నచిన్న భూభాగాలను సొంతం చేసుకుని, తమనుతాము నాయకులుగా ప్రకటించుకున్నారు. బ్రిటిష్ వారి శాశ్వత రెవెన్యూ సెటిల్ మెంట్ సమయంలో వీళ్లే జమీందారులుగా మారి, వారికి పన్ను కట్టేవారు. కృష్ణా జిల్లా జమీందారులు చాలామంది ఈ నేలకు దూరంగా నివసిస్తూ, తమను తాము మలేరియా వంటి రోగాల నుంచి కాపాడుకునేవారు, కాని తమ భూభాగాలున్న ఎస్టేట్లను అప్పుడప్పుడు వచ్చి పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఇలాంటివారు ఎక్కువగా నూజివీడులో స్థిరపడేవారు. తర్వాత తమ పిల్లలను చదువుల పేరుతో మద్రాసుకు, తర్వాత కాలంలో హైదరాబాద్ కూ పంపించేవారు. ఇప్పటికీ నూజివీడు ప్రాంతాల్లో అలనాటి జమీందారుల వారసుల కుటుంబాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ పద్ధతికి కమ్మ జమీందారులు కొంచెం అతీతమనే చెప్పుకోవాలి. సంఖ్యాపరంగా వాళ్లు తక్కువమందే అయినా వాళ్లు నూజివీడుకు, మద్రాసుకు వెళ్లేవారు కాదు. తమ భూములున్నచోటే నివాసం ఉండేవారు.

సాధారణంగా జమీందారల్లకు మంచి పేరుండేది కాదు. వాళ్లు అహంభావులని, పొగరుబోతులని, ధనమదంతో విర్రవీగుతారని జనంలో అభిప్రాయంగా ఉండేది. కాని మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో సర్ థామస్ మన్రో ప్రవేశపెట్టిన రైత్వారీ పద్ధతి వల్ల కృష్ణా, మరికొన్ని జిల్లాల్లో కొన్ని మంచి మార్పులు వచ్చాయి. వ్యవసాయదారులకు లబ్ధి కలిగింది. ఆ పద్ధతి కింద భూములను సర్వే చేశారు, రకాల వారీగా విభజించారు, దానిలో వచ్చే పంట, సాలీనా ఆదాయాన్ని అనుసరించి పన్ను కట్టే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అందువల్ల వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోయినప్పుడు కూడా పన్ను కట్టాల్సిన అగత్యం తప్పింది. అది కొంత ఊరటనిచ్చినప్పటికీ, పంట తక్కువ పండటం, మరే ఇతర వృత్తివ్యాపారాలూ లేకపోవడం వల్ల ప్రజలు పేదగానే ఉండేవారు.

ఈ పరిస్థితులే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంజినీరు సర్ ఆర్థర్ కాటన్ ను ఆలోచనలో పడేశాయి. ఆయన ఇంగ్లండ్ లో చదువుకుని వచ్చినవాడు. గోదావరి మీద ఆనకట్ట కట్టి ఆ పనిలో సఫలమైనవాడు. ఆ అనుభవంతో కృష్ణా నది మీద కూడా అదే తరహాలో ఆనకట్ట నిర్మాణానికి పూనుకున్నాడు. బెజవాడ దగ్గర, రెండు నల్లరాతి కొండల మధ్యన ఒదిగి ప్రవహిస్తున్న కృష్ణమ్మను చూసినప్పుడు ఆయనకు ఆనకట్ట నిర్మించడానికి అదే సరైన ప్రదేశం అనిపించింది. పెద్ద గేట్లు, వాటికి లాకులు, ఇరువైపులా వ్యవసాయ కాలువలతో భారీ ప్రతిపాదనలు సిద్ధం చేశాడు. కాని ఆ నిర్మాణానికి ఉన్నతాధికారులు అంత సుముఖత చూపించలేదు. కాని ఈలోగా ఆధిపత్యం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి, రాణి పాలనలోకి మారింది. దాంతో కాటన్ దొర ప్రతిపాదనకు అంగీకారం లభించింది.

ఆయన స్వయంగా వచ్చి కూర్చుని కట్టించలేదుగాని, బెజవాడ దగ్గర కృష్ణానది ఆనకట్ట పూర్తిగా కాటన్ దొర ప్రణాళిక, ఇంజినీరింగ్ డిజైన్, దార్శనికతలకు అనుగుణంగా నిర్మాణమయ్యింది. అది పూర్తయ్యాక, ఏటా వచ్చే వరదలను నియంత్రించగలిగారు. ఆనకట్టకు రెండువైపులా నిర్మించిన భారీ కాలువలు పంటలకు అవసరమైన నీళ్లివ్వడంలో సఫలమయ్యాయి. క్రమంగా అభివృద్ధి బాట పడుతోందనుకున్నప్పుడు మెట్ట ప్రాంతమైన గుంటూరు నుంచి కూడా కృష్ణాకు వలసలు మొదలయ్యాయి. పాలెగార్ల వంశాల్లో మిగిలినవాళ్లు (వాళ్లే అసలైన కమ్మవారని అంటారు) అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తూ, స్థిరపడుతూ వ్యవసాయం పనుల్లో నిమగ్నం కావడం మొదలుపెట్టారు.

ఆనకట్టలు, వ్యవసాయ కాలువల తర్వాత బ్రిటిష్ హయాంలో అత్యధికంగా డబ్బు వెచ్చించినది భారతీయ రైల్వేల నిర్మాణం కోసమే. ఆ సమయంలో మొదట గ్రాండ్ ట్రంక్ రైల్వే లైను ప్రారంభమయ్యింది. తర్వాత దానికి సమాంతరంగా గ్రాండ్ ట్రంక్ రహదారినీ నిర్మించారు. అప్పటికి ఈస్ట్ ఇండియా కంపెనీ దృష్టితో దేశ రాజధాని కలకత్తా. అక్కణ్ణుంచి, రెండో రాజధాని అనదగిన మద్రాసును కలుపుతూ ఇవి నిర్మితమయ్యాయి. తర్వాత తూర్పు తీరాన్ని, పశ్చిమ తీరంతో కలిపే ఆలోచనతో మసులిపట్నం నుంచి గోవాకు రైల్వే లైను వేశారు. (గోవా అప్పటికి పోర్చుగీసు పాలనలో ఉండేది. అప్పుడే కాదు, 1961 వరకూ అలాగే ఉండేది. సైనిక చర్య జరిపిన తర్వాత అది కేంద్ర పాలనలోకి వచ్చింది.) మా నాన్న 1890ల చివర్లో పుట్టారు, తాను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మచిలీపట్నం మీటరు గేజ్ లైను నిర్మాణాన్ని చూసేవాళ్లమని చెబుతుండేవారు మాకు. మరోవైపు నిజామ్ కూడా తన భూభాగంలో రైల్వే లైన్ల నిర్మాణానికి ఆసక్తిగా ముందుకొచ్చి మొదలుపెట్టాడు.

దాంతో ప్రభుత్వ ఖజానాల మీద భారం పడటం మొదలైంది. అప్పుడు నిధుల సమీకరణకు ప్రత్యేక రైల్వే బాండ్లు జారీ చేసేవారు. అలాగే జిల్లా బోర్డులను పెట్టుబడి పెట్టి కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం అడిగేది. ఆ రకంగా మసులీపట్నం – బెజవాడ రైల్వే లైను మీద వచ్చే ఆదాయం కృష్ణా జిల్లా బోర్డుకు, గుంటూరు – రేపల్లె విభాగంలోని ఆదాయం గుంటూరు జిల్లా బోర్డుకూ వచ్చేవి. స్వాతంత్ర్యం వచ్చిన కొన్నేళ్ల వరకూ కూడా ఈ పద్ధతి నడిచేది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో ఇది రద్దయిపోయింది అనుకుంటాను.

కళ్లకు కనిపించే భౌతిక అభివృద్ధి మాత్రమేగాకుండా, ఈ దేశంలో ‘ఆధ్యాత్మిక అభివృద్ధి’కీ బాటలు వెయ్యాలని బ్రిటిష్ వారు అప్పుడే నిర్ణయించుకున్నారు. ఇటలీ నుంచి వచ్చిన జెస్యూట్ మిషన్లు (క్రైస్తవ మిషనరీలు) బెజవాడ కొండల వాలుల్లో తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం మొదలైంది. వాళ్లకవి తమ దేశంలోని దక్షిణ భాగపు కొండల్లాగా కనిపించి ఉండాలి. క్రైస్తవంలోకి మత మార్పిడులు అప్పుడే మొదలయ్యాయి. భయపెట్టో, డబ్బు ఆశ చూపించో చేస్తూ ఉండేవారు. జెస్యూట్ ఫాదర్లు హరిజనవాడల్లోకి పెద్ద కర్రలు పట్టుకుని వెళుతూ ఉండేవారు. కొంతమందికి అస్పృశ్యత లేని జీవితం పట్ల ఆశ కలిగిస్తూ ఉండేవారు. అలాగే అప్పుడే బైబిల్ తెలుగు అనువాదం అచ్చయివచ్చింది. కొత్తగా మతం మారినవాళ్లలో ఎక్కువమందికి చదువు రాకపోయినా, దాన్ని పట్టుకుని ఉండేవారు.

వాణిజ్యం కోసం వచ్చిన తెల్లవారు నెమ్మదిగా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుని, తర్వాత ప్రభువు యొక్క మంచిమాటలను విస్తరింపచెయ్యడానికి మిషనరీ కార్యకలాపాలుగా మారుమూలలకు సైతం వ్యాపించారు.

%%%%%%%%%%

ఇదిగో, ఈ నేపథ్యంలో మా తాత- నాయనమ్మల పెళ్లి జరిగింది.

‘అటు ఏడు తరాలు, ఇడు ఏడు తరాలు చూడాల’న్న సామెత విన్నప్పటి నుంచి నాకు మా పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలని కుతూహలంగా ఉండేది. కాని నా దురదృష్టం ఏమంటే నా తల్లిదండ్రులకే వారి తాతతండ్రుల గురించి తెలిసింది తక్కువ. అందువల్ల నా కోరిక నెరవేరలేదు. అందువల్ల మా కుటుంబచరిత్ర అంటే కేవలం తాత నుంచే తెలుసును నాకు.

మా నాయనమ్మ పేరు నాగరత్నమ్మ. ఊరు వీరవల్లి. మా నాన్న చెప్పినదాన్ని బట్టి, ఆమె చాలా ప్రేమాస్పదురాలు. నేర్పు గల ఆడమనిషి. తాను నోరెత్తకుండానే, తలపెట్టిన పనులు జరిపించుకోగల తెలివి కలిగినది.

స్నేహితులు, బంధువులు తెచ్చిన సంబంధం మా తాతది. వీరవల్లికి 12 మైళ్ల దూరంలోనున్న పెద్ద పల్లెటూరు – అంగలూరులో పుట్టి పెరిగారు మా తాత. పేరు అరిగపూడి రామస్వామి. పెళ్లి తర్వాత మా తాత వీరవల్లిలో స్థిరపడాలని నాయనమ్మ కోరుకున్నదట. ఆయన కూడా భార్య కోరికను మన్నించి వీరవల్లిలోనే కొంత పొలాలు కొనుక్కున్నారు. ఆమె భాగం పొలాలూ అక్కడే ఉండేవట. కాలక్రమేణా వాళ్లు ఇటుకల గోడలతో, పెంకుల పైకప్పుతో మంచి ఇల్లు కట్టుకున్నారు. కుటుంబమూ పెద్దగా విస్తరించింది. ఐదుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు కలిగారు. అందులో ఒక్క కూతురికి తప్ప, మిగిలిన అందరికీ అంగలూరులో మా తాతకు తెలిసినవాళ్లో, బంధువులతోనో పెళ్లిళ్లు జరిపించారు.

మగపిల్లల్లో చివరివాడు మా నాన్న. మా నాన్నను కనడానికి మా నాయనమ్మకు చాలా కష్టమయ్యిందట. పురుటినొప్పులు ఒకరోజంతా భరించిందట. ఆ గండం గడిచి ఆమె ప్రాణాలతో బయటపడితే వీరవల్లిలో రాముడికి గుడి కట్టిస్తానని, పుట్టే బిడ్డకు రాముడు, తిరుపతి వేంకటేశ్వరస్వాముల పేర్లు కలిసొచ్చేలా పెడతానని మా తాత మొక్కుకున్నారట. అందువల్ల మా నాన్న పేరు వేంకట్రామయ్య అయింది. మా నాన్న తర్వాత మరో ఆడపిల్ల పుట్టింది, తర్వాత కొన్నాళ్లకు మా నాయనమ్మ నాగరత్నమ్మ మరణించింది. అది మా తాతకు పెద్ద లోటు. దాన్ని తట్టుకోలేక, ఆయనా త్వరగా మరణించారు.

మా తాత గురించిన విషయాలు మా నాన్నకు బోలెడు గుర్తున్నాయి. మా నాన్న తన తండ్రిని ‘అయ్యా’ అని పిలిచేవారు. అందరిలోకీ చిన్నవాడవటం వల్ల, చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకోవడం వల్ల మా నాన్నను ఆయన పెద్దన్నయ్యలు, అక్కయ్యలు ఎక్కువగా పెంచారు. మా నాన్న, ఆయన అన్నదమ్ములంతా భారీ మనుషులే. ఆరడుగులకు మించిన పొడుగు, 200 పౌండ్లకు (తొంభై కేజీలకు అటూఇటూగా) మించిన బరువుతో ఆజానుబాహువులుగా ఉండేవారు. వాళ్లెక్కడున్నా అందరి దృష్టినీ ఆకర్షించేవారు. అటువంటి వాళ్లు మా నాన్ననూ, ఆయన పొలాలనూ సంరక్షించేవారు.

అందరు అన్నదమ్ములు, వాళ్ల కుటుంబాలు కలిసే ఉండటంతో వాళ్లిల్లు పిల్లాపాపలతో ఎప్పుడూ సందడిగా ఉండేది. వాళ్ల కాలానికి వచ్చేసరికి కాటన్ దొర కట్టిన ఆనకట్ట ధర్మమా అని పొలాలకు సకాలంలో నీళ్లందేవి, వరదల భయం పోయింది, బురద మేటలు వేసి ఎందుకూ పనికిరాని నేలలు కాస్తా బంగారాన్ని పండించే సస్యభూములయ్యాయి. అప్పట్లో అందరూ కేవలం వరి ఒక్కటే పండించేవారు. నవంబరు, డిసెంబరు మధ్యన కోతలయ్యాక, పప్పు ధాన్యాలు వేసేవారు. బియ్యం, పప్పులూ అన్నీ ఇంటి అవసరాలకు సరిపోయేవి అంతే. పైన అమ్మకాలకు మిగిలేదేం ఉండేది కాదు. ఈ పరిస్థితి వల్ల, అప్పట్లో కుటుంబాలకు ఆహార కొరత ఉండేదికాదు గాని, మరే ఇతర ఆడంబరాలకు ఆస్కారం ఉండేది కాదు.

నాకు ఊహ తెలిశాక కూడా, మా పెదనాన్నలెవ్వరూ దైనందిన జీవితంలో ఒంటిమీద చొక్కా వేసుకోవడం ఎరుగరు. ఉన్న ఒకటో రెండో చొక్కాలను వాళ్లు ముఖ్యమైన సందర్భాలప్పుడో, పెళ్లిళ్లకో వేసుకునేవారు. సాధారణంగా పైన కండువా ఉండేది. అది అవసరాన్ని బట్టి రకరకాలుగా ఉపయోగపడేది. అంటే పైమీద కండువా ఉంటే, ఎండగా ఉన్నప్పుడో, బరువులు ఎత్తవలసి వచ్చినప్పుడో దాన్ని తలకు పాగాలాగా చుట్టుకునేవారు. మామూలుగా చెమట తుడుచుకోవడానికి ఉపయోగపడే వస్త్ర విశేషం అది.

ఇక ఆడవాళ్లకు కూడా ఉండే చీరలు అతి తక్కువ. నాకు ఊహ తెలిసినప్పటికి మా ఇంట్లో ఎవరికీ పట్టు లేదా సిల్కు చీరలు లేనేలేవు. తర్వాత కాలంలో జాతీయోద్యమం ఊపందుకున్నాక, ఆడవారు దారం వడికేవారు, అప్పుడు పరిస్థితిలో కొంత మార్పు రావడం మొదలైంది. మొత్తమ్మీద ఒక్కమాటలో చెప్పాలంటే, తల దాచుకోవడానికింత గూడు, కడుపుకింత కూడు, శరీరం కప్పుకోవడానికింత గుడ్డ… అన్న సాధారణత్వంతోనే గడిచిన జీవితాలు ఆనాటివి.

ఈలోగా మా నాన్న పెరుగుతూ ఉన్నప్పుడు, ఆయనలోని అసంతృప్తి కూడా పెరగడం మొదలైంది. పొలం పనుల్లో అన్నదమ్ములకు సాయం చేస్తూ ఉన్నప్పటికీ ఆయన అదే తన జీవనోపాధి అనుకోలేకపోయారు. ఆయనకు బాగా చదువుకోవాలని ఉండేది. కాని చుట్టుపక్కల పది మైళ్ల చుట్టుకొలతలో చూస్తే ఎక్కడా పాఠశాల అన్నది లేకపోవడంతో ఆయన చదువుకోలేకపోయారు. ఊళ్లో ఉన్న రెండు బ్రాహ్మణ కుటుంబాలనూ ఆశ్రయిద్దామంటే, వాళ్లదైన చదువు వాళ్లదేగాని, ఇతరులకు నేర్పడం అన్న పద్ధతే లేదు. అదీగాక, అప్పటికి, బ్రాహ్మణులకు తప్ప, మిగిలిన కులాల వారికి చదువెందుకు అన్న ఆలోచనలోనే ఉండేది సమాజం. మా నాన్నకు ఈ పద్ధతి నచ్చేది కాదు, అలాగని ఏం చెయ్యాలో తెలిసేది కాదు.

ఈలోగా, ఆయనకు పెళ్లి చేస్తే ఈ వితండమైన ఆలోచనలన్నీ పక్కకు పోయి వ్యవసాయంలో స్థిరపడతాడని ఆయన అన్నదమ్ములు అనుకున్నారు. పొరుగునున్న పొట్లపాడులో సంబంధం చూశారు. ఆ ఊళ్లో కోడూరు అప్పారావు, సీతమ్మ దంపతులకు వ్యవయసాయం చిన్నది, కుటుంబం పెద్దది. ఐదుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. వాళ్లలో మొదటి ఆడపిల్ల మాణిక్యమ్మ. ఆమే మా అమ్మ. పెళ్లినాటికి మా అమ్మ వయసు పదకొండేళ్లు. ఆడపిల్లలకు ఎనిమిది, తొమ్మిదేళ్లకే పెళ్లి చేసెయ్యడం అప్పట్లో సర్వసాధారణం.

కాని మా నాన్న అన్నదమ్ములు అనుకున్నట్టుగా మా నాన్నలో పెళ్లి వల్ల పెద్ద మార్పేమీ రాలేదు. నిజానికి పెళ్లి తర్వాత ఆయన ఆ రోజుల్లో విప్లవాత్మకమనదగిన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, భార్యను, కుటుంబాన్ని వదిలి ఏలూరు వెళ్లిపోయారు. అక్కడ ఆయన తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్నారు. అంతకుమించి, భూముల్ని సర్వే చెయ్యడం అన్న కొత్త విద్యనొకదాన్ని నేర్చుకున్నారు. భూమి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దస్తావేజులను, ప్రామిసరీ నోట్లను రాయడంలో నైపుణ్యం సంపాదించారు. అప్పటివరకూ ఈ తరహా విద్యలన్నీ బ్రాహ్మణుల్లో ఒక శాఖ అయిన నియోగులు (కరణాలు) చేసేవారు. బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ లో వాళ్లే కీలకంగా ఉండేవారు.

తాను విద్యావ్యాప్తికి గట్టిగా కృషి చెయ్యాలని, దానికి మొదటి మెట్టుగా తమ ప్రాంతంలో ఎలాగైనా కనీసం ప్రాథమిక పాఠశాలనైనా ప్రారంభించాలన్న కల మా నాన్న కళ్లలో అప్పుడే గూడుకట్టుకుంది. కాని దానికి అనేక అవాంతరాలు. మొదటిది, ఆయన బ్రాహ్మణుడు కాదు. పాఠాలు చెప్పే అర్హత ఆయనకు లేదు. రెండోది, పాఠశాల పెట్టడానికి తగిన భవనమేదీ లేదు. మూడోది, నిజానికి ఇదే పెద్ద అవరోధం – అదేమంటే, స్థానికంగా ఉంటున్న కుటుంబాల్లో తమ పిల్లలను పాఠశాలకు పంపాలన్న ఆలోచనే ఉండేది కాదు! అదీగాక, ఊళ్లో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకు ఈ ‘అబ్రాహ్మడు’ చేస్తున్న ప్రయత్నాలు పెద్ద రుచించలేదు.

అయితే ఈ అభ్యంతరాలు, అవాంతరాలు అన్నీ మా నాన్న సంకల్పాన్ని నీరుగార్చలేకపోయాయి. సరికదా దృఢం చేశాయేమో కూడా. ముందొక పశువుల పాకను శుభ్రం చేయించి ఆయన బడి మొదలుపెట్టారు! తన అన్నదమ్ముల కుటుంబాల్లోని పిల్లలు, వీరవల్లిలోని యాదవుల కుటుంబాల్లోని పిల్లలు ఆ బడిలో మా నాన్నకు విద్యార్థులు. నెమ్మదిగా వాళ్లలో పెరుగుతున్న ఆసక్తి ఆయనలో పట్టుదలను పెంచింది. ఎలాగైనా పాఠశాలను సొంత భవనంలో పెట్టాలన్నదే జీవిత లక్ష్యమైపోయింది ఆయనకు. ఇదంతా 1920ల్లోని మాట.

ఊళ్లోవాళ్లంతా మా నాన్నను ‘పంతులు’ అనడం మొదలెట్టారు. పంతులు అనే మాటకు అర్థం ఉపాధ్యాయుడు అని. ఆ మాట ఎలా వచ్చిందంటే మహారాష్ట్ర వాసులైన ‘పంత్’ లు అప్పటికే ఆంధ్ర దేశపు కోస్తాలోని కొన్ని పట్టణాలకు వలస వచ్చి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. వారి ఇంటిపేరు ‘పంత్’ కు మనవాళ్లు గౌరవ సూచకంగా ‘లు’ తగిలించారు. దాంతో పంతులు అనేమాట ఉపాధ్యాయులందరికీ సర్వనామంగా మారిపోయింది. కొందరికి అది ఇంటిపేరుగా మారిపోయింది. మన దగ్గర, కర్ణాటకలో కూడా పంతులు అన్న ఇంటి పేరున్నవారు ఇప్పటికీ బోల్డుమంది ఉన్నారు.

మా నాన్నకు పాలడుగు శేషయ్య అనే వ్యక్తి చాలా దగ్గరి స్నేహితుడు. (తర్వాత ఆయన తన పేరు శేషాచార్యగా మార్చుకున్నారు) ఆయన స్వయంగా విద్య నేర్చుకున్నారు, తర్వాత బోలెడు పుస్తకాలు రాశారు. విద్య పట్ల మా నాన్న దృక్పథం అంత గట్టిగా ఉండటానికి ఆయన ప్రభావమే కారణం. శేషయ్యగారిది మాకు దగ్గర్లోని కుందేరు అనే గ్రామం. రైవస్ కాలువకు కాస్త ఎగువన ఉండే ఊరది. ఆయనకు ఇద్దరమ్మాయిలు పుట్టిన తర్వాత, చాలా చిన్నవయసులోనే ఆయన భార్య చనిపోయింది. దాంతో ఆయనకు గృహస్థ ధర్మాల పట్ల ఆసక్తి పోయి, కడవకల్లుకు, కుందేరుకు మధ్య రైవస్ కాలువ గట్టు మీద ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆయనకు హిందీ వచ్చేది. దాంతో జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. ఈ నేపథ్యంలో ఆయన ఒకసారి ఉత్తర భారత యాత్ర చేసి రావాలని సంకల్పించారు. ఆ యాత్రలో మా నాన్న కూడా ఆయనతో జతకలిశారు.

ఉత్తర భారత యాత్ర మా నాన్న జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఆ యాత్రలో వాళ్లు హరిద్వార్ వెళ్లారు. అక్కడ ఆర్య సమాజం వాళ్లు అప్పుడే నెలకొల్పిన ‘గురుకుల్ కాంగ్రి’ని సందర్శించారు. అది ఆనాటి అవిభక్త పంజాబు, వాయువ్య ప్రాంతాల్లో ఒక సామాజిక శక్తిగా ఆవిర్భవిస్తున్న రోజులవి. ఆ సంస్థ హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్నది. చిన్న వయసులో విద్యార్థులను చేర్చుకుని, అన్ని ఖర్చులూ భరించి మరీ చదువు చెప్పి, వాళ్లను యుక్త వయసు వచ్చాక బయటకు పంపేది. ఆ పద్ధతి మా నాన్నకెంతో నచ్చింది. దాంతో తన పెద్ద కుమారుణ్ణి అక్కడ చేర్పించాలని నిర్ణయించేసుకున్నారు. అప్పటికి మా తల్లిదండ్రలకు తొలిసంతానంగా మా అక్కయ్య, తర్వాత అన్నయ్య పుట్టారు. నేనింకా పుట్టలేదు. మా నాన్న తన కొడుకును చేర్పిస్తానని చెబితే ఆ గురుకులం వాళ్లు చాలా సంతోషించారు. ఎందుకంటే దక్షిణాది నుంచి ఒక విద్యార్థి రావడం వాళ్లకు గొప్ప విషయంగా అనిపించింది. మా నాన్నకూ, శేషాచార్యగారికీ హిందీ భాష, అందులోని సాహిత్య సంప్రదాయాలూ చాలా గొప్పగా అనిపించాయి. వేసవి శెలవుల్లో పాఠశాల నడిపి సొంతూళ్లో హిందీ ప్రచారం చెయ్యాలని మా నాన్న అనుకున్నారు. అప్పటికది ఎంత కొత్త , పెద్ద విషయమో నేను వేరే చెప్పనవసరం లేదు. అనుకున్నట్టుగానే బీహార్ చెందిన ‘ప్రసాద్’ ఒకరిని పట్టుకొని కడవకొల్లుకు తీసుకొచ్చారు!

హరిద్వార్ నుంచి తిరుగు ప్రయాణంలో మా నాన్న, శేషాచార్య వార్ధాలో ఆగి మహాత్మా గాంధీని కలుసుకున్నారు. తామేం చెయ్యాలో దిశానిర్దేశం చెయ్యమని ఆయన్ని అడిగారు. ఆయన ‘జాతీయోద్యమంలో చేరండి, ఖాదీ వడకండి, జీవితాంతం శాకాహారులుగా ఉండండి’ అంటూ చెప్పారు. ఆ మూడు మాటలూ మా నాన్నకు శిరోధార్యాలయ్యాయి.

అప్పటికి కోస్తాంధ్రలో రెండు పెద్ద రాజకీయ పార్టీలుండేవి. ఒకటి నేషనల్ కాంగ్రెస్ ఉద్యమం. బ్రిటిష్ వారి పాలన నుంచి దేశాన్ని విముక్తం చెయ్యడమే దాని లక్ష్యం. రెండోది జస్టిస్ పార్టీ. అది బ్రిటిష్ పాలనను సమర్థించేది.

సాధారణంగా స్థానిక జమీందారులు, భూస్వాముల మొగ్గు జస్టిస్ పార్టీ వైపే ఉండేది. బ్రిటిష్ పాలనను సమర్థిస్తే తమ మనుగడకేం ఢోకా ఉండదని వాళ్లు అనుకునేవారు.

మా నాన్న పూర్తి కాంగ్రెస్ వాదిగా మారిపోయారు. ఖాదీ ధరించేవారు, రోజూ దారం వడికేవారు. ఇంకొన్ని రాట్నాలను కొని తెలిసినవాళ్లకు ఇచ్చారు కూడా. అలా మా అమ్మమ్మకూ ఒకటిచ్చారు! క్రమంగా నూలు వడకడం అనేది దైనందిన కార్యక్రమంలో భాగమైపోయింది. ఉదయం తెల్లవారక మునుపే ఆముదపు బుడ్డీల కాంతిలో దాదాపు అందరూ నూలు వడికేవారు. నేను పసివాడిగా ఉన్నప్పుడు రాట్నం చప్పుళ్లు గమ్మత్తుగా అనిపించేవి. ఆ దృశ్యం కూడా నాకెందుకో మనోహరంగా అనిపించేది. అందువల్ల చాలాసార్లు ఇంకా నిద్ర వస్తూన్నా కూడా లేచిపోయి ఉదయాన్నే మా తల్లిదండ్రులు రాట్నాలు తిప్పే చిత్రాన్ని చూస్తూ ఉండేవాణ్ని. తొందరగానే, మా కుటుంబసభ్యులేగాక, ఆ మూడు ఊళ్లలో చాలామంది కూడా ఖాదీ ధరించడం పరిపాటి అయ్యింది. అది మహాత్మా గాంధీ ప్రభావమేనని వేరే చెప్పనవసరం లేదు.

మా నాన్న పూర్తిగా శాకాహారానికి మారిపోవడమే కుటుంబానికి అంతగా మింగుడుపడలేదు. కమ్మకులంలో పుట్టామంటే దానర్థం మాంసాహారిగా పుట్టామనే. పైగా మా నాన్నకు కోడి గుడ్లంటే అపరిమితమైన ఇష్టం. ఆయన యుక్తవయస్సులో చెరో బుగ్గనా రెండు గుడ్లు పెట్టుకుని మరీ తినేసేవారట. అలాంటి వ్యక్తి శాకాహారిగా మారిపోవడమే? మా అమ్మ దీనికేమాత్రం సమ్మతించలేదు. అయినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇంట్లో గుడ్డు, చేప, మాంసం ఏవీ వండే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు. అది అంతే స్ట్రిక్టుగా మా ఇంట్లో అమలయ్యింది కూడా. అయితే మా అమ్మకు మాత్రం ఆ నియమం ఏమీ లేదుగనక, తోడికోడళ్లో, పుట్టింటివారో వండినప్పుడు ఆమెకు వాటిని పంపేవారు. అప్పుడు కూడా నాన్న ముందు కాకుండా కాస్త చాటుగానే తినేది. సాధారణంగా ఆరోజుల్లో భార్య – భర్త కలిసి కూర్చుని తినడం అనేది ఉండేది కాదు. భర్త భోజనం చేసిన తర్వాత, అదే పళ్లెంలో భార్య తినేది. అందువల్ల మా అమ్మ మాంసాహారం తినడం అనేది పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు. మా నాన్నకు చూచాయగా తెలిసినా, వాదన ఎందుకనే ఉద్దేశంతో కాబోలు, పెద్దగా ఏమీ అనేవారు కాదు. ఒకవేళ వాదనంటూ వస్తే మా అమ్మే గెలిచేదని మాకు తెలుసనుకోండి. వాళ్ల సంతానంలో నేను మాత్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ పూర్తి శాకాహారిగా ఉన్నాను. (గుడ్డు తింటాను, అది లేకపోతే ఆరోజుల్లో విదేశాల్లో తిండి లేక మాడవలసిందే)

ఖాదీ, శాకాహారం కన్నా పెద్దది, ముందు చెప్పుకోవలసింది – బడికి సొంత భవనాల పట్ల మా నాన్నలో ఉన్న దృఢ సంకల్పం గురించే. తనలో ఉన్న పట్టుదలనే తన ఇతర స్నేహితులు, బంధువుల్లోనూ రగిలించడానికి ఆయన చెయ్యని ప్రయత్నమంటూ ఉండేది కాదు. వాళ్లలో చాలామందికి ఈయన ధోరణి అర్థమయ్యేది, మర్యాద ఉండేది, అయినా విరాళాలు పెద్దగా వచ్చేవి కాదు. అప్పుడు ఆయన చాలా పెద్ద నిర్ణయం ఒకటి తీసుకున్నారు. దాని పర్యవసానాలు చాలా తీవ్రమైనవి.

వీరవల్లిలోని పెద్ద కుటుంబం నుంచి విడిపోవడం అనేది ఆ నిర్ణయంలో మొదటి మెట్టు. అన్నదమ్ములు విడిపోవడం అనేది ఆరోజుల్లో చాలా పెద్ద విషయం, చాలా అసాధారణం.

కడవకొల్లులో పాఠశాల భవనాల నిర్మాణానికి పూనుకోవడం రెండోది. బడికంటూ ఓ గూడు కట్టాలంటే మాటలా? అయినా ఆ రోజుల్లో కాంగ్రెస్ వాదులంటే ఏ త్యాగానికైనా సిద్ధపడేవారే అన్నట్టుండేది. ఆ కోవలోనే, మా నాన్న తన భాగానికొచ్చిన కొద్ది పొలాన్ని అమ్మేశారు. ఉయ్యూరు – కాటూరు రోడ్డుకు ఆనుకొని కొంత జాగాను కొన్నారు. హరిజన వీధి వెనుకవైపు, చెరువుకు దగ్గర్లో ఆ జాగా ఉండేది. మరోవైపు పంటపొలాలు ఉండేవి. ఎప్పుడైనా స్కూలును విస్తరించవలసి వస్తే, ఆ పొలాలు ఉపయోగపడతాయని ఆయన ఆలోచన. బడికి కనుచూపు దూరంలో మరో జాగా కొని అందులో మట్టిగోడలు, రెల్లుగడ్డి కప్పుతో రెండిళ్లు కట్టారు. భార్య, పిల్లలను ఆ ఇంటిలోకి మార్చాక, 1925లో ఆయన స్కూలు భవనాలకు శంకుస్థాపన చేశారు. ఇంగ్లిష్ టి అక్షరం ఆకారంలో వచ్చేలా స్కూలు భవనం ఉండాలనుకున్నారు. అలాగే పదికాలాల పాటు నిలిచేలా ఇటుకల గోడలు, పెంకులతో పైకప్పు ఉండాలనుకున్నారు.

పనులు ప్రారంభమయ్యాక తనకు తెలిసిన వారందరినీ చందాలిమ్మని అడిగేవారు. చుట్టుపక్కల ఊళ్లలోని జమీందారులు, ధనవంతులు అందరినీ అడిగేవారు. అనుకున్నట్టుగా విరాళాలు పోగవక బడి నిర్మాణం నత్తనడకన సాగేది. ఆయన డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. విరాళాలు వచ్చేదాకా ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అది ధారాళంగా ఉండగ ఆయనలో తరచూ నిరాశ, నిస్పృహలు చోటుచేసుకునేవి.

ఇక ఇంట్లో ముందు భాగం దాదాపు 20 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో రోడ్డు పక్కనే ఉండేది. దానికి వెనుకగా నిలువునా మరో గది ఉండేది. అది వంటకు, సామాను నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడేది. మరో మూలన మాకున్న ఒక్క గేదెకూ ఓ శాల ఉండేది. రాత్రయితే మేమంతా ముందు ఇంటిలో పడుకునేవాళ్లం. పడకగదులు విడిగా ఉండటం ఆ రోజుల్లో ధనవంతులకే సాధ్యం. కాస్త ఉన్నవాళ్లు గదిలో వరుసగా మంచాలు వాల్చుకుని పడుకునేవాళ్లం, ఉదయం లేచాక ఎవరి మంచం, దుప్పటి వాళ్లు ఎత్తేసి, ఆ గదిలో ఓ మూలకు పెట్టేసేవాళ్లం. పరుపులు తెలియని రోజులవి. మా అక్కయ్య అమ్మకు వంటలోనూ, ఇంటిపనుల్లోనూ సాయం చేసేది.

%%%%%%%%%%%

అప్పట్లో గ్రామీణ జీవనం దైనందిన అవసరాల కోసం వెతుకులాట అన్నట్టుగానే గడిచిపోయేది. పొయ్యి కిందకూ, పొయ్యి మీదకూ వెతుకులాటే జీవితంగా ఉండేది. దాదాపు అందరూ వేకువజాము నాలుగ్గంటలకే నిద్ర లేచేవారు. ఆడవాళ్ల మొదటిపని వంటింట్లో నిప్పు రాజెయ్యడమే. చలికాలాలయితే, ఆరుబయట వేణ్నీళ్లు కాచుకునేందుకు మరో పొయ్యి రాజేసేవారు. వేసవి కాలమంతా వర్షాకాలానికి కావలసిన వంటచెరుకు సమకూర్చుకోవడానికి సరిపోయేది. వానాకాలంలో అవి తడిసిపోకుండా ఉండేందుకు వాటిని వంటగదిలోనో, పశువుల శాలలోనో భద్రంగా ఉంచడం మరొకెత్తు.

ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడం ఒక పెద్ద పని. అప్పట్లో ఇళ్లలో మరుగుదొడ్లు ఉండేవి కాదు. దాంతో ఇంకా చీకటుండగానే ఆడవాళ్లంతా మొదట సమీపంలోని కాలవ గట్టుకో, పొలాల దగ్గరకో వెళ్లిపోయేవారు. కాని ఆ చీకట్లో పాములు, ఇతర విషజంతువులు ఉండేవి, ముళ్లుండేవి. కాని వాటికారణంగా ఏ ప్రమాదాలూ జరిగినట్టు వినేవాళ్లం కాదు, ఆ దేవుడే ఈ ఆడవాళ్లందరినీ రక్షించేవాడేమో మరి! వానాకాలంలో వాళ్ల పాట్లేమిటో ఆలోచించండి. ఊళ్లో ఆడవాళ్లు తిరిగివచ్చాక, మగవాళ్లు కాలవగట్టుకు వెళ్లేవాళ్లు. వెళుతూ ఓ వేపపుల్లను నోట్లో పెట్టుకుని నములుకుంటూ వెళ్లేవాళ్లు. ఇప్పట్లాగా రెండు నిమిషాల్లో బ్రష్ చెయ్యడం, మరో ఐదు నిమిషాల్లో స్నానం చెయ్యడం కుదరని పని అప్పట్లో. కాలకృత్యాల తర్వాత కాలవలో స్నానం చేసి మరీ వచ్చేవారు మగాళ్లు. ఆడవారు మాత్రం ఇళ్ల వెనుక దడులు కట్టిన చిన్నజాగాలో స్నానాలు చేసేవారు. దానికి ముందు పొయ్యిలోని బూడిదతో పళ్లు తోముకునేవారు. ఇప్పట్లాగా టూత్ పేస్టులు, పొడులు, బ్రష్ లు ఏమీ ఉండేవి కాదు. అందువల్లేనేమో దంతక్షయం అప్పట్లో ఎక్కువగానే ఉండేది, 50 -60ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో చాలామందికి పళ్లు ఊడిపోవడం మామూలుగా ఉండేది. దంత వైద్యం అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం.

సరే, దీని తర్వాత మగవారు పొలం పనులకు వెళ్లేవారు. వేసవిలో చెయ్యడానికి పెద్ద పనేం ఉండేది కాదు. వ్యవసాయ పనిముట్లను, బళ్లను బాగుచేసుకోవడం వంటివి. కాని వర్షాకాలానికి ముందు దుక్కి దున్నింది మొదలు, సంక్రాంతికి పంట ఇంటికొచ్చేవరకూ మాత్రం పొలం పనులుండేవి. తొలకరి జల్లులు పడగానే నారుమళ్లు సిద్ధం చేసుకోవడం, నాట్లు ఇవన్నీ. ఆ తర్వాత కొన్ని రోజులు ఖాళీ. కలుపు తియ్యడానికి ఎక్కువమంది మనుషుల అవసరం ఉండేది కాదు, ఎవరింటి మనుషులు వాళ్ల పొలంలో చేసుకుంటే చాలన్నట్లు ఉండేది. మళ్లీ కోతల సమయానికల్లా బోలెడుమంది కూలీల అవసరం పడేది. కోతలు, కుప్ప నూర్పిళ్లు, ఎండబెట్టడం, తర్వాత ధాన్యాన్ని గింజకొట్టడం, తప్పాతాలూ వేరుచెయ్యడం, ధాన్యాన్ని ఇంటికి చేర్చడం – ఇదంతా అయ్యేవరకూ ప్రతి రైతు కుటుంబంలోనూ ఒకటే హడావుడి. ఇదంతా ఎక్కువగా మగవారి బాధ్యతే.

ఇళ్లలో ఆడవారి పనులు దీంతో ముడిపడే ఉండేవి. ఉదయాన్నే లేచి పిల్లలకు, పొలం వెళ్లే మగవాళ్లకు తినడానికి ఏదోకటి తయారుచెయ్యాలి. అప్పట్లో ఎవ్వరికీ టిఫిన్లు తెలియవు. అందరూ చద్దన్నాలే తినేవారు. ఆవులు, గేదెలకు పాలు తియ్యడం, వాటికి మేత వెయ్యడం, గొడ్లను కాసేవాళ్లొస్తే వాళ్లకు వాటిని అప్పగించడం అయ్యేవి. దానితర్వాత చాకలామె వచ్చి నూతి దగ్గర బట్టలుతకడమో, కాలువకు లేదా చెరువుకు పట్టుకుపోవడమో చేస్తుంది. తర్వాత ఇల్లు ఊడ్చుకోవడం, అవసరమైతే పేడతో అలుక్కొని ముగ్గులు పెట్టుకోవడం చెయ్యాలి. ఆ తర్వాత ధాన్యం దంచుకోవడం పని ఉండేది. నేను పుట్టినప్పుడు ఉయ్యూరులో ధాన్యం మిల్లు పెట్టారు. అక్కడ పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొని మర పట్టించి బియ్యాన్ని నగరవాసులకు అమ్మేవారు. గ్రామీణులకు మాత్రం వాళ్ల చేతులే ధాన్యం మిల్లులు. దంచడం, విసరడం, చెరగడం – ఇవన్నీ అయితేనే ఎసట్లోకి బియ్యం వచ్చేది.

అప్పటికల్లా మధ్యాహ్న భోజనాలు తయారుచేసే వేళయ్యేది. వండాలి, ఇంట్లో ఉన్న పిల్లలకు పెట్టాలి, పొలం పనులు ముమ్మరంగా ఉంటే ఇంటి మగవారికి పొలం దగ్గరకే భోజనాలు తీసుకెళ్లాలి. ఇదంతా అయ్యాక ఆడవాళ్లు భోజనాలు చేసే వేళకల్లా, మేతకెళ్లిన పశువులు ఇంటికొచ్చేసేవి. చాకలామె ఉతికిన బట్టలు తీసుకొచ్చేసేది. సాయంత్రం పశువుల పాలు తియ్యాలి, ఏ ఉలవల వంటివో ఉడికించి పెట్టాలి. మళ్లీ కుటుంబం రాత్రి తినడానికి ఏదోకటి వండాలి. ఇవన్నీ చీకటి పడే లోపు చేసెయ్యాలి. ఎందుకంటే అప్పట్లో విద్యుత్ సదుపాయం లేదు. ఉన్నదంతా ఆముదం దీపాలే. వాటి వెలుగు తక్కువ, రెండోది గాలి ఎక్కువ ఉంటే, పూరిళ్లు గనక వాటివల్ల అగ్నిప్రమాదాలు జరగొచ్చు. అందువల్ల ఎక్కువ చీకటి పడకముందే అందరూ రాత్రి అన్నాలు కూడా తినేసేవారు. వేసవిలో ఎప్పుడైనా గుడి దగ్గర హరికథలు చెబితే అదొక్కటే రాత్రి కాలక్షేపం. లేదంటే చీకటి పడుతూనే ఊరుఊరంతా మాటుమణిగేది.

ఎక్కువ ఇళ్లలో అత్యవసరమైన వస్తువులు తప్ప అలంకారాలేం ఉండేవి కాదు. తర్వాత కొంత కాలానికి ప్రతివారి ఇంట్లోనూ తిరుపతి వేంకటేశ్వరస్వామి చిత్రపటాలో, కేలెండర్లో కనిపించేవి. కాని మా చిన్నప్పుడు అవేమీ ఉండేవి కాదు. నాకు గుర్తున్నంతవరకూ ఉంటే మహాత్మాగాంధీజీ చిత్రం కనిపించేది. లేదంటే సినిమా తార కాంచనమాల ఒక టీ కప్పును పట్టుకొని చిరునవ్వులు చిందించే చిత్రం ఉండేది. బేబీ సరోజ కూడా ఆ బొమ్మలో కనిపించేది. మరీ కలిగినవాళ్లు కట్టుకునే మండువా లోగిలి ఇళ్లలో కూడా గోడలకేం ఉండేవి కాదు. పందిరి మంచమూ, దానికి చెక్కిన నగిషీలే అలంకారాలంటే. లోపల నాలుగు వైపులా వరండాలుండేవి, వాటి నిండా వ్యవసాయ పనిముట్లో, ధాన్యం బస్తాలో, కొబ్బరికాయలో, ఇతర ఉత్పత్తులో ఉండేవి. మండువా ఇళ్లలో మూడు తరాల వాళ్లు నివసించేవాళ్లు. కాని నేను పెరిగిన వీరవల్లి – కడవకొల్లు – పొట్లపాడుల్లో అటువంటి ఒక్క ఇల్లూ లేదంటే అవెంత సామాన్య గ్రామాలో అర్థమవుతుంది.

అప్పట్లో అక్షరాస్యత తక్కువ. అందువల్లే ఏ ఇంట్లోనూ పుస్తకాలుండేవి కాదు. పురాణాలు తప్ప, అచ్చులో వచ్చే సాహిత్యం చాలా తక్కువ. రచయితలు జమీందారులనో, ధనవంతులనో ఆశ్రయించి తమ పుస్తకాలను అచ్చు వేయించుకోగలిగేవారు. అందువల్లే ఆ పుస్తకాల్లో మొదటి కొన్ని పేజీలు, అచ్చుకు సహకరించిన వాళ్ల పేర్ల జాబితా ఉండేది. మా నాన్న చదవడం, రాయడం నేర్చుకున్న తర్వాత తెలుగు, హిందీ పుస్తకాలను సేకరించడం మొదలుపెట్టారు. మొదట మహాభారతం, భాగవతం, రామాయణం వంటివి కొన్నారు. తర్వాత కందుకూరి వీరేశలింగం రచనల సంపుటం ఒకటి మా ఇంటికి వచ్చింది. అలాగే చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు. మా ఊళ్లో అక్షరాస్యులైన బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా ఆ పుస్తకాలు అప్పటికి లేవు. పంచాంగాలే వాళ్లకు తెలిసిన పుస్తకాలు. వాళ్ల జీవికకు ఆధారం అవే మరి.

పాఠశాలలు లేవుగనక అక్షరాస్యత లేదు, అక్షరాస్యత లేదుగనక బడి విలువ ఎవ్వరికీ తెలియదు. ఈ విషవలయానికి అంతెక్కడ? అప్పట్లో కృష్ణా జిల్లా మొత్తమ్మీద పది ఉన్నత పాఠశాలలు కూడా లేవంటే చదువుకు ఇచ్చే విలువెంతో అర్థమవుతుంది. వ్యవసాయాధారిత కుటుంబాల్లోని పిల్లలు పొలం పనులు నేర్చుకోకుండా, ఎక్కడికో వెళ్లి అక్షరాలు నేర్చుకుని వచ్చి ఏం చేస్తారు, అన్న ప్రశ్నే ఎక్కువగా ఉండేది. వర్ణవ్యవస్థ గట్టిగా ఉండే ఆనాటి రోజుల్లో కులవృత్తుల్లో ప్రావీణ్యం ఉంటే చాలు, అక్షరాలకు విలువేముంది అనేవారు. కింది కులాలవారు పైకులాల వారి ఇళ్లలోకి వెళ్లడానికి లేదు. ఊళ్లలో అస్పృశ్యత ఎక్కువగా ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్లనే చదువు పట్ల ఆసక్తి లేకుండా ఉండేది.

ఒక్క చదువే కాదు, ఆరోగ్యం పట్ల కూడా సృహ, వైద్య వసతులూ అంతంతమాత్రంగానే ఉండేవి. నా చిన్నప్పుడు సైతం పాముకాటుతో ఎంతోమంది మరణించేవారు. అలాగే మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతోనూ ఎక్కువగా మరణించేవారు. వాటికి మందులన్నవి అప్పట్లో ఉండేవి కాదు. ఏ జ్వరం వచ్చినా 21 రోజుల పాటు తినడానికి ఏమీ ఇవ్వకుండా లంకణాలు చేయించేవారు. జ్వరంతో చనిపోయేవారో, లేక ఏ ఆహారమూ లేక నీరసించి చనిపోయేవారో తెలియదు. అలాగే ప్రసవ సమయంలో ఆడవారు చనిపోవడం సర్వసాధారణంగా ఉండేది. పరిస్థితులు ఇలాగున్నప్పుడు ఎవరైనా చదువు గురించి ఎందుకు ఆలోచిస్తారు?

మరోవైపు ఆర్థిక పరిస్థితులూ అంతంతమాత్రంగా ఉండేవి. ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం చాలా దేశాల మీద తన ప్రభావాన్ని చూపెట్టేది. ఎంతలా అంటే, ఆరోజుల్లో ఒక బస్తా బియ్యం ధర రెండు రూపాయలుండేదట, కాని ఆ మాత్రం డబ్బు కూడా చాలామంది దగ్గర ఉండేది కాదట. అంతగా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిపోయి ఉండేదని మా నాన్న చెబుతుండేవారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంకా తీసికట్టుగా ఉండేది. దాదాపు అందరూ తమ కుటుంబ అవసరాలకు వరి పండించేవారు, దానికి మార్కెట్ ఏమీ ఉండేది కాదు.

అప్పటికి పదేళ్ల ముందు అంటే 1920లో మా కడవకొల్లుకు రెండు మైళ్ల దూరంలోని ఉయ్యూరులో పంచదార మిల్లు (షుగర్ ఫ్యాక్టరీ) నెలకొల్పే ప్రయత్నాలు జరిగాయి. మా చుట్టుపక్కల నేల చెరుకు పండేందుకు అనువైనది. కాని చెరుకు వేసేందుకు రైతులు ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే వాళ్లకు అలవాటైన వరితో పోలిస్తే, చెరుకు పంట వెయ్యాలంటే విత్తనాలు, ఎరువుకు పెట్టాల్సిన పెట్టుబడి ఎక్కువ, అలాగే మనుషుల (కూలీల) అవసరం ఎక్కువ, అదీగాక పంట కోశాక నెత్తికెత్తుకుని ఇంటికి తెచ్చేది కాదాయె. దాన్ని బళ్లకెత్తాలి, ఫ్యాక్టరీకి తీసుకుపోవాలి. అక్కడెన్ని రోజులుండాలో ఎవరికీ తెలియదు. ఈ కష్టమంతా ఎవడు పడతాడనుకుని రైతులు చెరుకు పట్ల ఉత్సాహం చూపించేవారు కాదు. పంచదార మిల్లు యాజమాన్యం రైతులకు షేర్లివ్వజూపింది, అయినా సరే రైతులు ముందుకు రాలేదు. వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు ఒక పంటగా మా ప్రాంతాల్లో విస్తరించడానికి దాదాపు దశాబ్దం పైనే పట్టింది.

గ్రామీణ ప్రాంతాల్లో అప్పుల కుప్పలు తెగ ఉండేవి. చాలా కుటుంబాలు వాటి భారం మొయ్యలేక నలిగిపోయేవి. వ్యవసాయంలో, వ్యాపారంలో అభివృద్ధి సాధించడానికి అప్పులు చేస్తే బాగానే ఉండేదేమో. కాని ఎక్కువసార్లు కుటుంబాలు అప్పులు చేసేవి కేవలం సామాజిక కారణాలకే. వాటిలో చాలాభాగం వృధా అయిపోయేదే. ఉదాహరణకు ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్లు అంటే ఆర్థికంగా కుటుంబానికి భారంగా ఉండేవి. దీనికి బ్రాహ్మణులు, కమ్మవారు, ఇతరులు – ఎవ్వరూ అతీతం కాదు. అందరి పరిస్థితీ అంతే.

బ్రాహ్మణుల్లో ఐదు రోజుల పెళ్లిళ్లు ఒక సంప్రదాయంగా ఉండేవి. దూరాభారాలకోర్చి ఎక్కడెక్కణ్నుంచో వచ్చిన బంధుగణమంతా పెళ్లికి కొన్ని రోజులు ముందు, కొన్ని రోజులు వెనుక – ఉండిపోయేవారు. బ్రాహ్మణుల్లో కట్నకానుకల భారం అంతగా లేకున్నా, ఈ బంధువులందరినీ వారాల కొద్దీ భోజనాలు పెట్టడం, వసతి కల్పించడం, వాళ్లు వెళుతున్నప్పుడు ఏవైనా బహుమతులివ్వడం, బట్టలు పెట్టడం వంటి సంప్రదాయాలకు తెలియకుండానే బోలెడు ఖర్చయ్యేది. దానికోసం కుటుంబపెద్దలు అప్పులు చెయ్యాల్సి వచ్చేది. వడ్డీ ఎక్కువైనా, పొలాలు తాకట్టు పెట్టి అయినా డబ్బు తీసుకొచ్చేవారు. అనంతర కాలంలో వాటిని తీర్చలేకపోతే గనక పొలాల్ని వదులుకుని దగ్గర్లోని పట్టణాలకు వలసపోయేవారు. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ఈ ఐదు రోజుల పెళ్లిళ్లనే ఆచారం చాలా బ్రాహ్మణ కుటుంబాలను భూమిలేనివారిగా మార్చేసింది. పట్టణాల్లో, ఇరుకు ఇళ్లలో అంతమందికి ఆతిథ్యం ఇవ్వలేక, క్రమంగా 1950 – 60ల మధ్య ఆ ఆచారం అంతరించిపోయింది.

ఇక కమ్మవారిలో పెళ్లి తంతు ఎక్కువ ఉండేది కాదుగాని కట్నాలు భారీగా ఉండేవి. ఇరుపక్షాల మధ్య భూములు, బంగారం మార్పిడి భారీగా జరిగేది. వరుడికున్న ఆస్తిపాస్తులు, చదువును బట్టి ఈ రేట్లు మారుతూ ఉండేవి. ఒకప్పుడు ఊరిపొలిమేరలు దాటకుండా, తర్వాత్తర్వాత బాగా తెలిసున్న కుటుంబాల మధ్య ఉండే పెళ్లి సంబంధాలు ఇప్పుడు కంప్యూటర్లు, ఇంటర్నెట్ల పుణ్యమాని ఖండాంతరాల్లో కూడా కలుస్తున్నాయి. పూర్వం తెలిసినవారొక మాట చెబితే కుదిరిపోయే సంబంధాలకు ఇప్పుడు బ్రోకరేజీ తీసుకుని మరీ చూసిపెట్టే సంస్థలు శాఖోపశాఖలుగా వెలుస్తున్నాయి! కాలం ఇంత మారిపోయిందనుకున్నా, కట్నాల తీవ్రత మాత్రం అంతగా మారిపోలేదు, మాసిపోలేదు!

ఈ కుటుంబాల్లో పెళ్లి తంతు క్లుప్తంగా ఉండేది. మహా అయితే ఒక పూట వ్యవహారం. వచ్చినవాళ్లంతా వెంటనే వెనక్కి మళ్లేవాళ్లు. ఎవరి ఎడ్లబళ్లలో వాళ్లు వచ్చేవారు, గ్రామంలో ఆ బళ్లన్నటికీ రోజుల తరబడి ‘పార్కింగు’, ఇతర వసతులు చూపడం కష్టం కనుక ఈ కుటుంబాల్లో రోజుల తరబడి తిష్టవేసే బంధువులెవరూ ఉండేవారు కాదు.

కాని ఈ కుటుంబాల్లో బంగారానికున్న విలువ, ఆడంబరం అంతాఇంతా అని చెప్పలేం. ఇరుపక్షాలూ బంగారం మీద బాగా ఖర్చుపెట్టేవారు. తర్వాత ఖర్చు చీరెలది. వీటికోసం వారు కూడా అప్పులు చెయ్యకతప్పేదికాదు. అవసరాన్ని బట్టి ఎక్కువ పొలాలను తాకట్టు పెట్టడమో, లేదా ఎక్కువ వడ్డీకి అప్పులు తేవడమో తప్పదు. అప్పులు చెయ్యడం, వాటిని తీర్చడం కోసం తర్వాత పంట చేతికెప్పుడొస్తుందని చూడటం – ఆరోజుల్లో సర్వసాధారణం. ఈ వెతలన్నింటినీ ప్రఖ్యాత సంపాదకులు నార్ల వేంకటేశ్వరరావు తన ‘పై పంట’ నాటకంలో కళ్లకు కట్టినట్టు రాశారు. అప్పులు తీర్చడానికే కాదు, అప్పటికే రోజూ వాడుతున్న రెండు జతల చీరలు, ధోవతులకు మారుగా కొత్తవి కొనుక్కోవాలన్నా, కొత్తగా పుట్టిన మనవడికో మనవరాలికో ఏదైనా బహుమతి ఇవ్వాలన్నా, కాలం చేసిన పెద్దల పేరు మీద ఏ కార్యమో చెయ్యాలన్నా – అన్నిటికీ తర్వాత పంట మీదే ఆధారపడేవారు. ఆ కాలంలో ఆ తరహా ఆశావహ దృక్పథం తప్పనిసరి. ఆరోజుల్లో వాళ్ల చేతికొచ్చేది పూట గడవడానికే తప్ప పెద్ద అవసరాలు తీర్చగలిగే సంపాదన కాదు. అందువల్ల పై పంట బ్రహ్మాండంగా ఉంటుందని ఊహిస్తూ కలలు కనడం తప్పేం కాదేమో.

విచిత్రం ఏమంటే – సాధారణంగా అప్పు కూడా తెలిసినవారు, బంధువుల దగ్గరే చేసేవారు. కాని బంధుత్వమో, స్నేహమో అనేవి ఈ వ్యవహారంలో మొహమాటాలకు తావిచ్చేవి కాదు. ఒకవేళ తిరిగి తీర్చలేనప్పుడు పొలం రుణదాతల పరమైపోవడానికి కూడా ఇవేవీ అడ్డొచ్చేవి కాదు. అందువల్ల అప్పు తీర్చలేక, పొలం గనక రుణదాతలకు దఖలు చేయవలసివస్తే, దాని అర్థం – ఉన్న ఊళ్లో ఉపాధి మాత్రమే కాదు, తరాల తరబడి ఉన్న పేరుప్రతిష్టలు సైతం పోయినట్టే. దాంతో ఆ కుటుంబం తలెత్తుకోలేకపోయేది. అలా అయినప్పుడు ఆ కుటుంబం ఇతరులకు మొహం చూపగలిగేది కాదు. ఏళ్ల తరబడి వేధించే అవమానం, కుంగుబాటుల వల్ల చిన్నవయసులో చనిపోవడమూ జరిగేది.

ఇదంతా స్వాతంత్య్రానికి పూర్వం సంగతి.

అప్పటికి మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉండేది. అయితే గ్రామాల్లో దాని ప్రభావం ఏమీ కనిపించేది కాదు. నిజానికి నా చిన్నతనంలో నేనెప్పుడూ ప్రభుత్వ అధికారులనుగాని, కనీసం పోలీసునైనా చూడలేదు. ఆ రోజుల్లో దొంగతనాలు, నేరాలు అంతగా ఉండేవి కాదు కూడా. గ్రామాల్లో పెద్ద దొంగతనం అంటే ఎవరి కోడినైనా ఎత్తుకుపోవడం, తమది కాని చోట పశువులను మేతకు వదలడం, ఏ రుసుమూ కట్టకుండా చెరువులో చేపలు పట్టుకోవడం వంటివి. అవి చేసినట్టు రుజువైతే గ్రామంలోనే వాళ్లకు తగిన శిక్షలు పడేవి.

ఇక భూమి పన్నుల వంటివి ఏటా జరిగే జమాబందీ సమయంలో కట్టేసేవారు. ఈ జమాబందీ అనేది అరబిక్ పదం, నిజానికి మన రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన అనేక పదాలు మొఘలుల పుణ్యమా అని అరబిక్ భాషకు చెందినవే ఉండేవి. ఇప్పటికీ చాలా పదాలు అంతే. పల్లెటూళ్లలో బ్రిటిష్ వారి ఉనికి, వారి అణచివేత అనేది ఎవ్వరికీ తెలియనప్పటికీ, కాంగ్రెస్ పార్టీ జాతీయోద్యమానికి పిలుపు ఇచ్చినప్పుడు భారతీయ గ్రామాలు దానికి చాలా బాగా స్పందించాయి. గాంధీగారు చెప్పినట్టు మిల్లు వస్త్రాలు కట్టుకోవడం మానెయ్యడం, సత్యాగ్రహం వంటివి గ్రామీణులు అందిపుచ్చుకున్నారు. ఎక్కువమంది ఖాదీ వడకడం మొదలుపెట్టారు. దాదాపు ప్రతి కుటుంబం జాతీయోద్యమంలో భాగమయ్యిందంటే అతిశయోక్తేం కాదు. పార్టీ చెబుతున్న సామాజిక, ఆర్థిక మార్పు ఎక్కువమందిని ఆకట్టుకునేది. గాంధీజీ రాజకీయ వ్యూహం కన్నా, గ్రామీణుల్లో నిద్రాణమై ఉన్న ఆత్మను తట్టిలేపడమే పెద్ద విజయం అనిపిస్తుంది. ఆ కాలంలోనే వారు తమ గురించి తాము ఆలోచించడం, దేశ స్థితిగతులేమిటని పట్టించుకోవడం, విద్య పట్ల దృక్పథాన్ని మార్చుకోవడం కనిపిస్తుంది.

%%%%%%%%%%

మా నాన్న వీరవల్లి నుంచి వెళ్లిపోవడం, కడవకొల్లులో ఇల్లూ బడీ కట్టాలనుకోవడం అనేవి ఆయన సోదరులకు, ఇతర కుటుంబసభ్యులకు అంతగా రుచించలేదు. అప్పటివరకూ అంతా కలిసి ఒక కుటుంబంగా ఒక కప్పు కింద ఉండేవారు. ఆనాడు గ్రామాల్లో అది సర్వసామాన్యం. అలాగని, తమ్ముడి పట్ల అన్నలకున్న ఆపేక్ష వల్ల వాళ్లు ఆయన దారికి అడ్డు చెప్పలేదు కూడా. కేవలం అందరికన్నా చిన్నవాడనే కాదు, అందరికన్నా చదువుకున్నవాడనే గౌరవం కొద్దీ! తాను చేస్తున్నది మంచోచెడో నిర్ణయించుకోగలిగే వివేకం ఆయనకున్నదనే వాళ్లు నమ్మారు. ఆయన నిర్ణయాన్ని గౌరవించారు. ఆయన వంతు పొలం పనులను వాళ్లే చూసి ఫలసాయాన్ని పంపించేవారు. అందువల్ల మా నాన్న బడి నిర్మాణ పనుల్లో తలమునకలయ్యారు.

మరోవైపు కుటుంబం కూడా పెరగడం మొదలైంది. మొదట పుట్టిన మా పెద్దక్కయ్య పేరు నాగరత్నమ్మ అని మా నాయనమ్మ పేరే. తర్వాత మగపిల్లల్లో పెద్దవాడుగా మా అన్న అరిగపూడి రమేశ్ చౌదరి పుట్టాడు. మా తల్లిదండ్రులకు మూడో సంతానంగా మా రెండో అక్కయ్య కృష్ణకుమారి 1929లో పుట్టింది. తర్వాత మా రెండో అన్నయ్య మధుర ప్రసాద్ పుట్టాడు.

మా నాన్నకు తన పెద్ద కొడుకంటే ప్రాణం. మా నాన్నవైపు, మా అమ్మవైపు వారందరికీ కూడా మా పెద్దన్నంటే ఎంత ముద్దో చెప్పలేం. ప్రతి ఏడూ ఒక ఫోటో తీయించి వాడి పెరుగుదలను రికార్డు చేసి ఉంచారు మా నాన్న. ఆ రోజుల్లోనే, కృష్ణుడిలాగా పంచెకట్టి, తలకు నెమలి పింఛం పెట్టి మరీ తీయించారు! తన ప్రాణమంతా ఆ బిడ్డపైనే పెట్టినప్పటికీ, మా నాన్న తన తొలిసంతానాన్ని హరిద్వార్ లోని గురుకులానికి పంపించే ఆలోచనలో ఉన్నారు. హరిద్వార్ అంటే ఎంత దూరమో ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా, అక్కడకు చేరడానికి రైల్లో మూడు నాలుగు రోజులు పడుతుందనే ఒక్క విషయమే. రైలు అనేది కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియదు.

మా అన్నను అక్కడకు పంపిస్తున్నట్టు ఆయన చెప్పగానే, మా కుటుంబంలో ఏడుపులు మొదలయ్యాయి. అస్సలు ఏడవకుండా ఉన్నది ఎవడయ్యా అంటే ఎవడైతే హరిద్వార్ వెళుతున్నాడో అతనొక్కడే! ఎందుకంటే ఆ పసివాడికి ఏమీ తెలియదు మరి. మా అమ్మ ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. మూడూళ్లలో ఊరేగింపులాగా తీసుకొని వెళ్లి మా నాన్న మా అన్నను హరిద్వార్ లోని గురుకులంలో చేర్చేశారు. అక్కడికి వెళ్లేక, అప్పుడు అర్థమయ్యింది మా అన్నకు ఇంటికి, అమ్మకు దూరంగా ఉండాలని. అదీగాక అప్పటిదాకా తెలుగు తప్ప మరో భాష తెలియని పసివాడు. అక్కడంతా మాట్లాడేది అర్థం కాక, తండ్రి కూడా వెళ్లిపోతుంటే ఏం చెయ్యాలో తెలియక బాగా ఏడ్చాడట మా అన్న. అదేమీ మా నాన్న నిర్ణయాన్ని మార్చలేకపోయింది. నాన్న ఒక్కరే ఇంటికి వచ్చేశారు, వచ్చే దారంతా ఏడుస్తూనే ఉన్నారట. అయినా తనకేమీ బెంగ లేనట్టు నిబ్బరంగా కనిపించేవారు. భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి త్యాగాలు చెయ్యవలసిందేనని ఆయన మనసులో గట్టిగా నాటుకుంది మరి.

ఆ తర్వాత నాన్న తన దృష్టినంతా స్కూలు నిర్మాణం మీదే పెట్టారు. అనుకున్నట్టుగానే పూర్తి చేశారు కూడా. బడి చుట్టూ ఒక అందమైన తోట ఉండాలని ఆయన అనుకున్నారు. దానికోసం ఏకంగా మద్రాసు వెళ్లి, అక్కడి సుందర్ నర్సరీ నుంచి మొక్కలను తీసుకొచ్చారు. క్రమంగా బడి అందరి దృష్టినీ ఆకర్షించడం మొదలయ్యింది. సమీప గ్రామాలే కాక, కాస్త దూరంలో ఉన్న గ్రామాలవారు కూడా తమ బిడ్డలను అక్కడ చేర్పించాలనుకోవడం ప్రారంభమయ్యింది. ఎందుకంటే బడిలో చేరిన మొదటి తరం విద్యార్థులు థర్డ్ ఫారమ్ పూర్తి చేసి బయటికెళ్లి, శిక్షణ పొంది ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. దాంతో విద్య ప్రయోజనాలు గ్రామీణుల కళ్లకు కట్టినట్టయ్యింది. చదువుకుంటే తమ బిడ్డలకు ఉద్యోగం వస్తుందని, నెలకింతని జీతం వస్తుందని వాళ్లకో నమ్మకం మొదలయ్యింది. నిజానికి ఆ మొదటి తరం విద్యార్థులు ఎక్కువమంది మా పెదనాన్నల పిల్లలు, బంధువుల పిల్లలే. కొంతమంది స్థానిక యాదవుల పిల్లలు. మా కజిన్ ఒకరు మాత్రం బడి చదువు తర్వాత మచిలీపట్నం కాలేజీకి వెళ్లాడు, పట్టా పొందాడు. మా కుటుంబంలో డిగ్రీ పొందిన తొలి వ్యక్తి అతనే. తర్వాత ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు.

బడి చదువు అంటే పర్లేదుగాని, పిల్లలను కాలేజీలకు పంపాలంటే అది తలకు మించిన భారమే అయ్యేది. మా పెదనాన్నల పిల్లలను పై చదువులకు పంపడానికి మా నాన్న చాలా ఇబ్బందులు పడేవారు. ప్రతిసారీ ఏదో ఒక పరిష్కారం దొరికేదనుకోండి. అప్పట్లో ప్రభుత్వ సాయం చాలా తక్కువ. కాని కులవ్యవస్థ దానికి సమాంతరంగా సాయం అందించేది. అంటే బంధువుల్లో కాస్త కలిగినవారు పేదింటి విద్యార్థుల ఫీజులకు, పుస్తకాలకు, ఇతర అవసరాలకు సాయం చేసేవారు, తలదాచుకోవడానికింత వసతి కల్పించేవారు, అలాగే రోజుకొకరు చొప్పున భోజనమూ పెట్టేవారు. ఇది కమ్మవారిలోనూ, బ్రాహ్మణుల్లోనూ కూడా ఉండేది. ఈ పద్ధతే కనుక లేకపోతే, ఆ రోజుల్లో ఎంతమంది మంచి విద్యార్థులు కాలేజీ చదువులు గట్టెక్కేవో ఊహించడం కష్టం. నిజానికి అటువంటి కుటుంబాలు ఏమీ ఆశించకుండా, తమకు కలిగినంత చేసిన ఆ సాయాల వల్లనే తర్వాత ఒక కొత్త తరం – విద్యావంతమైన తరం ప్రభవించిందని అర్థం చేసుకోవాలి.

మా నాన్న వంటి వారు ఆ ‘నెట్ వర్క్’ తీరుతెన్నులను బాగానే అర్థం చేసుకున్నారు. పట్టణంలో ఓ కుర్రాడిని కాలేజీలో చేర్పించడం, వాడికి అవసరమైనవి సమకూర్చే కుటుంబాలను కలుసుకోవడం, వాళ్లందరికీ ఈ కుర్రాణ్ని అప్పజెప్పడం – ఇదే పనిగా ఉండేది ఆయనకు. దాదాపు జిల్లా అంతా ఆయన ఈ పని మీదే తిరిగేవారు. అటువంటి వ్యవహారాలేం లేనప్పుడు ఊళ్లోనే ఉండి, బడి పనులు చూసుకునేవారు. ఒక మంచి ఉపాధ్యాయుణ్ణి ఆయన స్కూలు హెడ్ మాస్టరుగా నియమించారు. అతను క్రమశిక్షణ కలిగిన బ్రాహ్మణుడు, మంచి ఉపాధ్యాయుడు, మా నాన్నకు ప్రతి కార్యంలోనూ చేదోడువాదోడుగా ఉండేవారు. ముఖ్యంగా ఇంగ్లిష్ లో రాతకోతలు జరపడంలో ఆయనకు ఆయనే సాటని నాన్న అనేవారు. చక్కటి చేతివ్రాత, మంచి భాషతో ఆయన వ్యవహారం బాగుండేది. ఆయనదీ మా నాన్నదీ స్నేహం చాలా ఏళ్ల పాటు కొనసాగింది. మా నాన్న చనిపోయిన తర్వాత కూడా ఆయన బడిని చక్కగా నిర్వహించేవారు.

ఈ పనులన్నిటికీ తోడు మా అక్కయ్య నాగరత్నమ్మకు పెళ్లి చెయ్యాలనే ఆలోచన మా అమ్మానాన్నల్లో కలిగింది. మా రెండో మేనత్త కొడుక్కే మా అక్కనివ్వాలనే ప్రతిపాదన ముందునుంచీ ఉండేది కనుక వరుణ్ణి వెతకడానికి వాళ్లెక్కువ కష్టపడాల్సిన పనేం లేకపోయింది. మా బావ పేరు తిపిర్నేని సుబ్రమణ్యం. అప్పటికే మా నాన్న మచిలీపట్నం దగ్గర్లోని చిట్టిగూడూరులో సంస్కృతభాషా పాఠశాలకు పంపి చదివించారు. దాంతో ఆయన విద్వాన్, ఉభయభాషాప్రవీణ పట్టాలు అందుకోగలిగాడు. సంస్కృతమూ, తెలుగూ రెండింటిలోనూ ప్రావీణ్యం ఉన్నవాడు కనుక, ఎక్కడైనా ఉపాధ్యాయుడిగా పనిచెయ్యగలిగే అర్హతను సంపాదించుకున్నాడు. ఇది కుటుంబంలోని సంబంధమే గనక కట్నకానుకల ప్రసక్తేమీ లేదు.

మా కుటుంబంలో మొదటి గ్రాడ్యుయేట్ అయిన మా పెదనాన్నగారబ్బాయికి మా ఇంకో మేనత్త కూతురినివ్వడానికి నిర్ణయించారు. ఆ మేనత్తకు మా నాయనమ్మ తరపు సంబంధమే చేశారుగాని, వాళ్ల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండేది. దానికితోడు ముగ్గురు మగపిల్లలు, ఈ ఆడపిల్ల వెంటవెంటనే పుట్టారు. అందువల్ల ఈ పిల్లను మా పెద్ద మేనత్త దత్తత చేసుకుని చెల్లెలి భారం కాస్త తగ్గించింది. అప్పట్లో కుటుంబ బంధాలు అలా ఉండేవి.

అప్పట్లో మేనరికాలు తప్పేం కాదు. తెలుగువారిళ్లలో తరచుగా జరిగేవి. అయితే, ఈ రెండు పెళ్లిళ్ల సందర్భంగా మా నాన్న ఒక కొత్త పోకడకు నాంది పలికారు. అప్పటివరకూ పెళ్లి ముహూర్తాలు బ్రాహ్మణులను అడిగి పెట్టించుకునేవారు. అవి ఏ అర్థరాత్రో, తెల్లవారు ఝామునో ఉండేవి. అలాగే పెళ్లిమండపంలో వాళ్లు చదివే మంత్రాలకు అర్థం ఎవ్వరికీ తెలిసేది కాదు. కాలక్రమంలో పెళ్లి తంతులో పురోహితుల దాష్టీకం ఎక్కువైపోయేది. మా నాన్న వీటన్నిటికీ చుక్క పెట్టేశారు. క్రిస్టియన్ పద్ధతిలో ఎలాగైతే వధూవరులు చక్కగా అర్థమయ్యేలా పెళ్లి ప్రమాణాలు చేస్తారో, అలాగే హిందూ సంప్రదాయంలో కూడా జరగాలని పట్టుపట్టారు. ఎవ్వరికీ అర్థం కాని శ్లోకాలకు బదులు, వాళ్లిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటామని చెప్పే ప్రమాణాలు ముఖ్యమనుకున్నారు. అలాగే, పెళ్లి తంతు అర్థం కాని పూజలతో ఉండకుండా ఒక గంటలోపే అయిపోయేట్టు నిర్ణయించారు. దీనికి ముందు మా అమ్మతో సహా కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యపోయారు, సణిగారుగాని, చివరకు నాన్న మాటలకే కట్టుబడ్డారు. ఈ కొత్త పద్ధతికి అందరి సమ్మతినీ సంపాదించేందుకు మా నాన్న త్రిపురనేని రామస్వామి చౌదరిగారి సహకారం తీసుకున్నారు.

త్రిపురనేని రామస్వామి చౌదరిగారు లండన్ లో బారిస్టర్ ఎట్ లా శిక్షణ పొందిన గొప్ప వ్యక్తి. అభ్యుదయభావాలున్నవాడు. మంచి రచయిత. మా నాన్న పెళ్లి ప్రమాణాలను ఆయనతో చక్కటి తెలుగులో రాయించుకుని, వాటిని ఒక కాగితమ్మీద అచ్చు వేసి తీసుకొచ్చారు. మా అక్క పెళ్లికి బాండుమేళం కూడా పెట్టలేదు. పురోహితుడు లేడు, మంత్రాల్లేవు, పూజల్లేవు. ఆ రకంగా ఆమె పెళ్లి ఒక కొత్త సంప్రదాయానికి తెర తీసింది. ఆ తంతు తప్పించారుగాని, మిగిలిన ఆచారాలను పాటించారు. అంటే కొత్త పెళ్లికూతురి కాపురానికి అవసరమైన వస్తువులన్నింటినీ కొనివ్వడం వంటివి. ఆరోజుల్లో నాన్న తన కూతురికి గ్రామఫోన్ రికార్డు కొనివ్వడం మా బంధువుల్లో పెద్ద విడ్డూరంగా చెప్పుకొనేవారు. అప్పటికది అత్యాధునిక వస్తువు కింద లెక్క, మరి.

అదిగో, ఆ సమయంలో నేను మా అమ్మ కడుపున పడ్డాను. మా మేనత్త వచ్చి మా అమ్మకు ప్రసవ సమయంలోనూ, తర్వాత కూడా సాయంగా ఉన్నది. నిజానికి మా అమ్మగాని, నాన్నగాని అప్పుడు తమకు మరో బిడ్డ కావాలని కోరుకోలేదు. మా అక్క పెళ్లితోనూ, బడి నిర్మాణంతోనూ అంతంతగా ఉండేది వాళ్ల ఆర్థిక పరిస్థితి. వాటన్నిటితోనూ సంబంధం లేకుండా, తనకెవరు సంతోష స్వాగతం పలుకుతున్నారో లేదో తెలియకుండా కడుపున పడిన నలుసు 1933 ఆగస్టు 22న భూమ్మీద పుట్టేశాడు! ఆ రోజు సూర్యోదయ సమయంలో, చిరుజల్లులు కురుస్తూ ఉండగా, స్కూలు దగ్గరున్న మా నాన్నకు మా రెండో అక్క వెళ్లి నేను పుట్టినట్టుగా తెలియజేసిందని ఆయన తన డైరీలో రాసుకున్నారు. మొత్తానికి నేను మగపిల్లలో మూడోవాణ్ని, మొత్తం సంతానంలో ఐదోవాణ్ని. నా బరువు వల్ల మా అమ్మకు కాన్పు కష్టమయ్యిందట. తర్వాత ఆమెను ఉయ్యూరులోని కెనెడియన్ బాప్టిస్ట్ మిషన్ హాస్పిటల్లో చేర్పించారు. బొద్దుగా, ముద్దుగా ఉన్న నన్ను అక్కడి నర్సులు, మా బంధువులు బాగా చూసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత మా అమ్మ కోలుకున్నాక ఇంటికొచ్చేశాం.

నా పేరేం పెట్టాలని మా నాన్న తన స్నేహితుడు శేషాచార్యను అడిగారట. అప్పటికి వాళ్లిద్దరికీ హిందీ సాహిత్యమంటే తెగని పిచ్చి. బనారస్ కేంద్రంగా మున్షీ ప్రేమ్ చంద్ నడుపుతున్న మాధురి పత్రికను తెప్పించుకుని చదివేవారు. ఆయన రాసిన కథలు, నవలలంటే వాళ్లు చెవి కోసుకునేవారు. అప్పటికవి తెలుగులోకి కూడా అనువాదమవుతూ తెలుగువారిని ఉర్రూతలూగిస్తూ ఉండేవి. ఆ అభిమానంతో నా పేరు ‘ప్రేమ్ చంద్’ అని పెట్టాలని శేషాచార్య మా నాన్నకు సలహానిచ్చారు. నేను పెరిగి పెద్దయ్యాక కేంద్ర ప్రభుత్వ అధికారిగా ఢిల్లీలో పనిచెయ్యడానికి వెళ్లినప్పుడు నా పేరు ఉత్తరాది స్నేహితులను తికమకపెట్టేది. వాళ్లేమో నేను ఉత్తరప్రదేశ్ లో పుట్టిపెరిగినవాణ్ణని అనుకునేవారు, తెలుగువాణ్నని తెలుసుకున్నాక, ‘మీ పేరెందుకు అలా పెట్టారు’ అని అడిగి ఈ కథంతా తెలుసుకునేవారు.

నాకు నాలుగేళ్లొచ్చేవరకూ మేం కడవకొల్లులోనే ఉండేవాళ్లం. ఆ కాలంలో పెద్ద చెప్పుకునే సంఘటనలేం లేవు. ఉదయం నుంచి సాయంత్రమయ్యేదాకా ఊళ్లోని ఎవరో ఒకరింట్లో ఉండేవాణ్నని, నన్నందరూ బాగా ముద్దుచేసేవారనీ గుర్తుంది. ఎవరింట్లో ఉంటే అక్కడే నా భోజనం, స్నానం, ఆటపాటలు. చీకటి పడే సమయానికి ఎవరో ఒకరు తీసుకొచ్చి మా అమ్మకిచ్చేసేవారు. ఈ పద్ధతి వల్ల నన్ను పెంచడానికి మా అమ్మ అంత కష్టపడాల్సిన అవసరమేం లేకపోయింది.

మా అమ్మానాన్నల దైనందిన జీవితాన్ని నేను ఆశ్చర్యంగా చూసేవాణ్ని. వాళ్లు తెల్లవారక ముందే నిద్ర లేచేవారు. మా అమ్మ చమురు దీపం వెలిగించి రెండో ఇంట్లోకి (వంటిల్లు) వెళ్లేది. కాలకృత్యాల తర్వాత కట్టెల పొయ్యి వెలిగించేది. పెరుగును మజ్జిగగా చిలికేది. తర్వాత కొద్దిసేపు ఖాదీ వడికి ఆ తర్వాత వంట పనిలో పడేది. నాన్న లేచాక మంచం మీదే ఉండి, కంఠస్థమయి ఉన్న పోతన భాగవత పద్యాలను నెమ్మదైన స్వరంతో నెమరేసుకునేవారు. ముఖ్యంగా గజేంద్ర మోక్షం పద్యాలు నాకు కళ్లకు కట్టినట్టు ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే అది ఆనాడు మా నాన్న ఉన్న పరిస్థితి కూడానేమో.

తెల్లవారిన తర్వాత కాలకృత్యాలు, స్నానం తర్వాత మా నాన్న వైష్ణవుల్లాగా తిరుచూర్ణం, నామాలు పెట్టుకునేవారు. ఒక చిన్న పెట్టెలో ఆ చూర్ణాలు, వెండి పుల్ల ఉండేవి. నేను గనక అక్కడే ఉంటే, నాక్కూడా అవి పెట్టేవారు. ఆయనకు ప్రత్యేకంగా ఒక దువ్వెన, టాటా వారు తయారుచేసిన ‘టోమ్కో హెయిర్ ఆయిల్’ సీసా ఉండేవి. వాటినెవ్వరూ ముట్టుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు అందరూ షేవింగ్ కిట్లు తీసుకెళుతున్నట్టుగా అప్పట్లో ఆయన వాటిని తీసుకెళుతూ ఉండేవారు. అప్పటికి ఎవరికి వారికి షేవింగ్ కిట్లుండటం తెలియదు. రోజువిడిచి రోజు మంగలాయన వచ్చి మా నాన్నకు ఉదయాన్నే గడ్డం చేసి వెళ్లేవాడు. తర్వాత మేం స్కూలుకు వెళ్లేవాళ్లం. అక్కడ మా నాన్నకు ఓ సిమెంటు బెంచీ ఉండేది. అక్కడ కూర్చుని గ్రామస్తులతో మాట్లాడటం, ఆ రోజు ఏయే పనులున్నాయో ఆలోచించుకోవడం చేసేవారు మా నాన్న.

అప్పుడు నేను పారిజాతాలు, మల్లెపువ్వులు కోసుకుని ఇంటి ముఖం పట్టేవాణ్ని. అప్పట్లో వాసన సబ్బులు, నూనెలు, సెంట్లు వంటివి అందరికీ అందుబాటులో ఉండేవి కాదు. సువాసన అంటే కేవలం పువ్వులదే. ఇంటికొచ్చాక మా అమ్మ ఏమైనా పెడితే తిని, గేదెను మేతకు పంపడంలో ఆమెకు సాయం చేసేవాణ్ని. అలాగే కట్టివిడిచిన బట్టలన్నింటినీ ఒకచోట చేర్చేవాణ్ని. ఇంకా ఏమైనా చిన్నచిన్న పనులు చెబితే చేసేవాణ్ని. ఈలోగా ‘పోతడు’ అనే పేరున్న హరిజన యువకుడు వచ్చేవాడు. అతను మా నాన్నకు అసిస్టెంటులాగా అన్ని పనులూ చేసేవాడు. ఇంట్లోనూ పనులు చేసేవాడు. కట్టెలు కొట్టడం వంటివి. ఆ తర్వాత కొంత సమయానికి అతని భార్య వచ్చి మా అమ్మకు బియ్యం విసరడం వంటి పనుల్లో సాయం చేసేది. పోతడు చెప్పులు కుట్టేవాడు, గొప్ప అందంగా ఉండేవాడు, ఎప్పుడు చూసినా నిండుగా నవ్వుతూ ఉండేవాడు. మా ఇంట్లో పని ముగిసిన తర్వాత దగ్గర్లోనే చెట్టు కింద గోనెసంచీ పరిచి తన పనిముట్లన్నీ పేర్చుకుని కూర్చునేవాడు. అప్పట్లో చెప్పులు వేసుకునేవాళ్లే తక్కువ. దాంతో పోతడుకు తగినంత పనేం ఉండేది కాదు. అతనెక్కడికి వెళ్లినా నన్ను తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లేవాడు. నాకూ వేరే ఏ పనీ ఉండేది కాదుగనక మేమిద్దరం షికార్లు కొడుతూ ఉండేవాళ్లం. అప్పుడప్పుడూ మా పెదనాన్న ఇంటికి వెళ్లేవాణ్ని. ఆయన కుటుంబం పెద్దదే అయినా, నన్ను అమితంగా ప్రేమించేవాడాయన. ఏదో పండోఫలమో నాకోసం విడిగా దాచి ఉంచేవాడు. నేను వెళ్లేపాటికి ఆయన భోజనం చేస్తుంటేగనక, నన్నూ తనతోపాటు కూర్చోబెట్టుకునేవాడు. నేను ఆటకు సావాసగాళ్లెవరు దొరుకుతారని ఇల్లిల్లూ తిరగడంలో భాగంగా ఎక్కువ కాలం పనివారితో గడిపేవారిని. వాళ్లు మాట్లాడే భాషంత, వాళ్ల బూతుపురాణాలు, తిట్లతో సహా నా తలకెక్కాయి. కాని ఇంట్లో ఆ భాష బయటకు రాకుండా జాగ్రత్త పడేవాణ్ని. ఎందుకంటే మా నాన్న మేం మంచి తెలుగు స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడాలని పట్టుబట్టేవారు. ఆయన బ్రాహ్మణులకు సాటిగా మాట్లాడేవారు కూడాను. అందువల్ల నేను బయట ఒకలా, ఇంట్లో ఒకలా మాట్లాడేవాణ్ని, చిన్నతనంలో.

నా బాల్యజ్ఞాపకాల్లో చెప్పుకోవలసింది ఒకటుంది. అదేమంటే ఎన్నో ఏళ్ల తర్వాత హరిద్వార్ నుంచి తిరిగి ఇంటికొస్తున్న మా పెద్దన్నయ్యకు స్వాగతం పలకడానికి మేం బెజవాడ రైల్వేస్టేషన్కు వెళ్లడం. తొలిబిడ్డ రాకకోసం మా అమ్మానాన్నలిద్దరూ ఎదురుచూడటం నాకు బాగా గుర్తుంది. మా అన్నకు నేను పుట్టినట్టే తెలియదు, నేనెలా ఉంటానో తెలియదు! బెజవాడ స్టేషన్ కు పొలోమంటూ చాలామందిమి వెళ్లాం. కాని ఎవరికీ మా అన్న ఎలా ఉంటాడో తెలియదు. ఎలా పోల్చుకోవాలో తెలియదు. పసివాడిగా వెళ్లిపోయిన వాడు, ఇప్పుడు టీనేజర్గా వస్తున్నాడు మరి. రైలు నెమ్మదిగా ఆగగానే నాన్నతో సహా మగవాళ్లంతా ప్రతి పెట్టె దగ్గరకూ వెళ్లి వెతకడం మొదలుపెట్టారు. నేను రైల్వే స్టేషన్ను, రైలునూ చూడటం అదే మొదటిసారి. ఆ ఆశ్చర్యంతోనూ, అంత జనాభాలోనూ ఎక్కడ తప్పిపోతానో అని మా అమ్మ నా చెయ్యి వదలకుండా పట్టుకుని నిల్చుంది. అలా నిల్చునే మా అన్న రాక కోసం నలువైపులా చూపులతో వెతికేది. ఆమె కళ్ల నిండా నీళ్లే. ఎంతమంది వెతికినా, చివరికి మా అన్నే మా నాన్నను పోల్చుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు. నెత్తిన పిలక, కమీజు, ధోవతితో విచిత్రంగా కనిపించాడు. విచిత్రం ఏమంటే ఆ క్షణానికి మా అన్న హిందీ మాత్రమే మాట్లాడగలిగేవాడు, తెలుగు పూర్తిగా మర్చిపోయాడు! మావాళ్లెవ్వరికీ హిందీ రాదు, వాడు మాట్లాడేది కాస్తోకూస్తో మా నాన్నకే అర్థమయ్యేది. ఒకరి భాష మరొకరికి అర్థం కాకుండా, కళ్ల నిండా నీళ్లతో మా అమ్మ , అన్నయ్య నిలబడిన దృశ్యం నేనెప్పటికీ మరిచిపోలేను.

ఇంట్లో కొన్నాళ్లు గడిపిన తర్వాత అన్నయ్య మళ్లీ హరిద్వార్ తన చదువు కొనసాగించడానికి వెళ్లిపోయాడు. కాని తన చదువు అతనికి సంతోషాన్నివ్వలేదు. ఎందుకంటే అది పూర్తిగా సంస్కృతం, వేదక్రతువులను బోధించే చదువు. దాంతో పౌరోహిత్యం తప్ప మరేమీ చెయ్యలేనని అన్నకు అర్థమయ్యింది. అప్పటికి మా నాన్న కూడా తాను తప్పు చేసినట్టు అర్థం చేసుకున్నారు. ఉన్న ఊళ్లో చదువంటే తెలియకపోవడంతో, దూరప్రాంతంలో ఉచిత విద్య లభిస్తోందన్న ఉత్సాహంలో పెద్ద కొడుకును అక్కడ పెట్టేశారు తప్ప గురుకుల విద్య ఆ బాలుణ్ణి ఎటువైపు నడిపిస్తోందో ఆయన ముందు తెలుసుకోలేదు.

కాని మా అన్న ధైర్యమైన వ్యక్తి. మళ్లీసారి ఇంటికి వచ్చినప్పుడు అతను మరిక హరిద్వార్ వెళ్లలేదు. ఎలాగైనా ఇంగ్లిష్ నేర్చుకోవాలని పట్టుదల పట్టాడు. ఎలా సాధించాడో తెలియదుగాని, తర్వాత రెండు దశాబ్దాల పాటు మా అన్న ఇంగ్లిష్ వార్తాపత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేశాడు! మద్రాసు నుంచి ప్రచురితమయ్యే ‘ఇండియన్ రిపబ్లిక్’ అనే దినపత్రికకు ఎడిటరయ్యాడు. సంపాదకీయాలేగాక, తనకంటూ విడిగా ఒక కాలమ్ నిర్వహించేవాడు. దానిలో అతని పేరు ‘ఎ.ఆర్. సి.’ అని వచ్చేది. ‘అరిగపూడి రమేశ్ చౌదరి’ అంటూ వచ్చే ఆ కాలమ్ కటింగ్ లను అన్న మా నాన్నకు పంపించేవాడు. అవి చదివి అర్థం చేసుకునేంత ఇంగ్లిష్ మా నాన్నకు రాదు. అందువల్ల ఆ సమయంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న నన్ను తన దగ్గర కూర్చోబెట్టుకుని వాటిని చదివి వినిపించమనేవారాయన. నేను నాకొచ్చినంతమేరకు చదివి చెప్పేవాడిని. స్వయంకృషితో తనకు కావలసిన దాన్ని సాధించుకున్నాడని, ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానానికి చేరాడని మా నాన్నకు అన్నయ్య పట్ల గర్వంగా ఉండేది.

కాని పత్రిక యాజమాన్యంతో అభిప్రాయ భేధాల వల్ల మా అన్న ఆ ఉద్యోగానికి రాజీనామా చెయ్యవలసివచ్చింది. కొంతకాలం ఢిల్లీలో వివిధ పత్రికలకు కరెస్పాండెంట్ గా పనిచేశాడు. అది సంతృప్తినివ్వక, హిందీ రచయితగా మారాడు. దాదాపు 25 పుస్తకాలు రాశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులనందుకున్నాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా మా అన్నకు డి.లిట్. పట్టానిచ్చి గౌరవించింది. పట్టుపట్టి నేర్చుకున్న భాష కాకుండా, అనుకోకుండా నేర్చుకున్న హిందీ భాషే మా అన్నకు గౌరవాదరాలను తెచ్చిపెట్టింది.

మా నాన్న ఆర్థిక సమస్యలు సముద్రంలో అల్పపీడనంలాగా అంతకంతకూ పుంజుకున్నాయే తప్ప తగ్గలేదు. నా తర్వాత మరో చెల్లి సుశీల పుట్టింది. మొత్తం ఆరుగురు బిడ్డలు, స్కూలు నిర్వహణ వీటితో మా నాన్న మీద అప్పుల భారం పెరుగుతూ పోయింది. దాన్ని గమనిస్తూ వస్తున్న స్నేహితులు, బంధువులు ‘స్కూలును జిల్లా బోర్డుకు ఇచ్చెయ్యి…’ అని సలహా చెప్పేవారు. మొదట్లో ఆయనకది అస్సలు నచ్చేది కాదు. కాని పెరుగుతున్న రుణభారం వల్ల అయిష్టంగానే అయినా అంగీకరించక తప్పలేదు. మచిలీపట్నంలో ఉన్న జిల్లా బోర్డుతో సంప్రదించి, స్కూలు వారి నిర్వహణలో నడిచేట్టు మాట్లాడారు.

ఉయ్యూరులో మొదలైన పంచదార కర్మాగారం వల్ల చుట్టుపక్కల ఊళ్లలో పంటల తీరు మారింది. పల్లెటూళ్లలో ఆదాయం పెరగడం మొదలయ్యింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం అంతమయ్యే రోజులవి. దాంతో కూడా కష్టాలు తీరినట్టే ఉండేది. కాని అవేవీ మా నాన్నకు సహాయపడే అంశాలు కాదు. మా రెండో అక్కయ్య ఇక్కడ చదువు పూర్తిచేసి, హైస్కూలులో చేరాలి. అదేమో ఐదు మైళ్ల దూరం. రోజూ వెళ్లి రావడం కష్టం. దాంతో ఆమెను మా పెద్దక్క ఇంట్లో పెట్టారు. అప్పటికే మా బావ హైస్కూలు టీచరుగనక ఆయన చూసుకునేవాడు.

బొంబాయిలోని ఓరియెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా మారారు మా నాన్న. దాన్నుంచి వచ్చే కమిషన్లు ఆయనకు ఉపయోగపడ్డాయి కాని, ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్లు తక్కువయిపోయారు. నెలనెలా ప్రీమియమ్ కట్టే గ్రామీణులు ఎవరుంటారు? దాంతో పట్టణానికి మకాం మార్చాలన్న ఆలోచన అంకురించింది.

1937లో జిల్లా బోర్డు స్కూలు ఆస్తులను, మేనేజ్ మెంటునూ తన వశం చేసుకుంది. ఓ సభ పెట్టి జిల్లా బోర్డు ఛైర్మన్ – అప్పటికా పదవిలో ఉన్నది మీర్జాపూర్ రాజా – ఆయన స్వయంగా వచ్చారు. ఆయన జస్టిస్ పార్టీ నాయకుడిగా ఉండేవారు, ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసును ఢీకొన్నారు. కాని మొత్తం మద్రాసు లెజిస్లేటివ్ అసెంబ్లీ మొత్తం మీద జస్టిస్ పార్టీకి వచ్చిన సీట్లే అతి తక్కువ. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంతో మద్రాసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా మీర్జాపూర్ రాజా కడవకొల్లు స్కూలును జిల్లా బోర్డులోకి తీసుకున్నారు. తర్వాత దాన్ని జిల్లా బోర్డు హయ్యర్ ఎలిమెంటరీ స్కూలుగా పిలిచేవారు. ఆనాటి సభలో స్కూలు కోసం మా నాన్న పడిన కష్టాన్ని వక్తలందరూ కొనియాడారు. కాని ఎంతయినా ఆయనకు ఆ స్కూలు పట్ల ఉన్న నిబద్ధత మాటల్లోకి ఒదిగేది కాదు. దానితో అనుబంధం ఆయన వదులుకోగలిగేది కూడా కాదు.

వాస్తవానికి స్కూలు బాధ్యతలను జిల్లా బోర్డు తీసుకోవడం మా నాన్న భుజాల మీద పెద్ద భారాన్ని తప్పించినట్టయింది. దాంతో ఆయన కుటుంబాన్ని బెజవాడకు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇంటిని పెదనాన్నకు అప్పజెప్పారు. ఇంటి సామాన్లనూ, మమ్మల్నీ చేరవెయ్యడానికి పడవనొకదాన్ని మాట్లాడారు, ఆయన రైల్లో మాకన్నా ముందుగా అక్కడికి చేరుకున్నారు.

తాను పుట్టిపెరిగిన వీరవల్లి – కడవకొల్లు గ్రామాలతో అనుబంధం ఆయనకో తరగని జ్ఞాపకంగా మారిపోయింది. అక్కడి మనుషులు ఆయన దైనందిన జీవితంలో భాగాలు. అందువల్లేనేమో, తర్వాత 10 – 11 ఏళ్ల పాటు సంపాదన కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం కృష్ణ, గుంటూరు జిల్లాలంతా తిరిగినా మా నాన్న, చివరి నాలుగేళ్లు మాత్రం మళ్లీ కడవకొల్లులోని మా ఇంట్లోనే గడిపారు. అప్పుడు డబ్బుంది కాని ఆరోగ్యం దెబ్బతింటూ వచ్చింది. కాని చిన్నప్పుడు తనకు అందని చదువును భవిష్యత్ తరాలకు అందేలా చేశానన్న సంతృప్తి మాత్రం ఆయనలో అణువణువునా నిండి ఉండేది. గ్రామాల నుంచి మనుషులు బయటకు వెళ్లవచ్చునేమోగాని, వారి అంతరాత్మ నుంచి గ్రామాలు బయటకు పోవు అన్నదే సత్యం.

(సశేషం)

 

అరిగపూడి ప్రేమ్ చంద్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అభినందనలు! ఆనాటి తెలుగు సమాజాన్ని కళ్లకుకట్టారు.

  • అద్బుతమైన కథనం… ఎక్కడో క్రిష్నా జిల్లా లో వున్న మీ సామాజిక పరిస్తితులే చిత్తూరు జిల్లా లో అది కూడా దాదాపు తమిళనాడు సరిహద్దులో అనగా అప్పటి ఉత్తర ఆర్కాట్ జిల్లా లో పుట్టి పెరిగిన బల్లా వెంకట సుబ్బయ్య నాయుడు అరే మా ముత్తాత, బల్ల రంగయ్య నాయుడు అనే మా తాత జీవితాల్లా మా నాన్న చిన్నప్పటి కథల్లా వున్నాయి,కానీ 1935 నాటికే మా వూల్లో స్కూలు వుంది… మా తాత కూడా అక్కడే చదువుకున్నాడు… వారి తొలి ఉపాధ్యాయిడు … సుబ్రమణ్యం పిల్ల్లై అనే కరణం, అప్పట్లో మా ప్రాంతం లో చదువుకున్న కులం అంటే కరణాలు అనే కులం మాత్రమే….. క్రిష్నా జిల్లా కమ్మ వారి కి చిత్తూరు జిల్లా కమ్మవారైన మాకూ సాంఘిక పరిస్తితులు ఒక్కలాగే వున్నాయి మా ముత్తాత చిన్నవయసులొ చనిపోతే.తన ఇద్దరు అన్నలే తనని పెంచి పెద్ద చేసారట.. వారి ప్రేమాభి మానాల్ని తలుచుకొని మా తాత అప్పుడప్పుడు కన్నీల్లు పెట్టుకొనే వాడు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు