ఇతిః కథా ప్రారంభః

కథాలజీ | ఎపిసోడ్ 2

  • చంద్రుడు  ఏ నక్షత్రంతో సరసమాడుతున్నాడో తెలియకుండా మబ్బుల దుప్పటి కప్పుకున్నాడు. మబ్బుల చాటున ఏం జరుగుతోందో తెలిసిన మిగిలిన నక్షత్రాల కళ్లు మిలమిల మెరుస్తున్నాయి.
  • మా ఊరి మధ్యలో చలివేంద్రంలా ఉంటుందొక బావి. ఆ బావిలోంచి నీళ్లు తోడుకునేందుకు వచ్చే ఆడవాళ్ల గాజుల చప్పుడు, బావి గిలక చప్పుడు కలిసి యుగళగీతం పాడుతున్నట్లు ఉంటుంది.
  • ఆ రాత్రి చీకటి మరీ ఎక్కువగా ఉంది. అడవిలో కౄరమృగం దాడి చేస్తుందని తెలుసుకోలేక అల్పప్రాణులు బలైపోయే చీకటి అది. అలాంటి చీకటిలో ఒంటరిగా నడుస్తున్నాడు రాకేష్.
  • ఆ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ చాలా పెద్దది. దూరం నుంచి ఒంటి స్థంభం మేడలా కనిపిస్తుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఒంటరిగా ఉంటుంది.
  • ఎప్పుడో నవాబుల కాలంలో కట్టిన కట్టడం అది. చాలా కాలం ఖాళీగా ఉండేది. జిల్లా కోర్టును అక్కడికి మార్చారు కాబట్టి జనం సంచారం పెరిగింది. లాయర్ల హడావిడి పెరిగిన తరువాత అప్పటిదాకా అక్కడ ఉన్న అరుదైన జలగలు మాయం అయ్యాయని అంటారు.

గత పక్షం మొదలైన ఈ శీర్షిక చివర్లో ఇచ్చిన కథా ప్రారంభాలు ఇవి. ఈ కథా ప్రారంభాలు చదివి ఆ కథ దేని గురించి అయ్యుంటుందో చెప్పమని అడిగాను. ఆ విషయం తప్ప వేరే చాలా విషయాలు కామెంట్ చేశారు. కొంత అభినందనలు, ఒకటి రెండు ప్రశ్నలు. అందరికీ ధన్యవాదాలు. ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

సరే మనం విషయంలోకి వద్దాం.

  • ఎప్పుడో నవాబుల కాలంలో కట్టిన కట్టడం అది. చాలా కాలం ఖాళీగా ఉండేది. జిల్లా కోర్టును అక్కడికి మార్చారు కాబట్టి జనం సంచారం పెరిగింది. లాయర్ల హడావిడి పెరిగిన తరువాత అప్పటిదాకా అక్కడ ఉన్న అరుదైన జలగలు మాయం అయ్యాయని అంటారు.

లాయర్లు వస్తే జలగలు మాయమయ్యాయి (లాయర్లందరికీ క్షమాపణలు). చాలా మంచి ప్రారంభం ఇది. దాదాపు కథ తెలిసిపోయింది కానీ ఏమీ తెలియదు. ఎవరో అమాయకుడు ధనదాహం ఉన్న లాయర్ కారణంగా డబ్బు లేదా ఆస్తులు నష్టపోవడం గురించి రచయిత చెప్పబోతున్నాడు అని పాఠకుడికి అర్థం అయ్యే అవకాశం ఉంది.

  • ఆ రాత్రి చీకటి మరీ ఎక్కువగా ఉంది. అడవిలో కౄరమృగం దాడి చేస్తుందని తెలుసుకోలేక అల్పప్రాణులు బలైపోయే చీకటి అది. అలాంటి చీకటిలో ఒంటరిగా నడుస్తున్నాడు రాకేష్.

ఇది కూడా అలాంటి ప్రారంభమే. దాదాపుగా ఈ రెండు కథలు ఒకటే రకమైన అంశాన్ని చెప్తున్నాయి.

చీకటిలో ఒంటరిగా నడుస్తున్న రాకేష్ తెల్లవారే సరికి జిల్లా కోర్టు ముందు నిలబడి ఉన్నాడు. ఎప్పుడో నవాబుల కాలంలో కట్టిన కట్టడం అది… అరుదైన జలగలు మాయమయ్యాయి.

ఇలా రాస్తే మొదటి వాక్యాలలో చెప్పిన అల్పప్రాణి రాకేష్ అనీ, కౄరమృగాలు జలగల్లాంటి లాయర్లని అర్థమౌతుంది.

కానీ ఈ రెండిటికీ ఉన్న తేడా ఏమిటి? చీకట్లో నడుస్తున్న రాకేష్ కథలో మొదటి వాక్యాలు ఉత్కంఠతని  కలిగిస్తున్నాయి. చూచాయగా కథ వెళ్లబోయేది ఎక్కడికో తెలుసుకానీ ఆ దారి తెలియదు. లాయర్ల గురించిన కథా ప్రారంభంలో కథ చేరేబోయే గమ్యం దాదాపుగా ఖరారైంది, దారి కూడా చూచాయగా తెలుస్తోంది.

  • చంద్రుడు ఏ నక్షత్రంతో సరసమాడుతున్నాడో తెలియకుండా మబ్బుల దుప్పటి కప్పుకున్నాడు. మబ్బుల చాటున ఏం జరుగుతోందో తెలిసిన మిగిలిన నక్షత్రాల కళ్లు మిలమిల మెరుస్తున్నాయి.

ఇది ఏదో సరసమైన కథ కావచ్చు, అక్రమ సంబంధం గురించిన కథ కావచ్చు, ఏదో ఒక చెయ్యకూడని తప్పు గురించి చర్చించే కథ కావచ్చు. ఇవి నాకనిపించినవి. ఒక్కో పాఠకుడికి ఒకోలా అర్థం అయ్యే అవకాశం ఉంది. మరొకటి చూద్దాం.

  • మా ఊరి మధ్యలో చలివేంద్రంలా ఉంటుందొక బావి. ఆ బావిలోంచి నీళ్లు తోడుకునేందుకు వచ్చే ఆడవాళ్ల గాజుల చప్పుడు, బావి గిలక చప్పుడు కలిసి యుగళగీతం పాడుతున్నట్లు ఉంటుంది.

ఇది బావి గురించిన కథ అని తెలుస్తొంది. బావి చుట్టూ జరిగే అమ్మలక్కల సంభాషణల నుంచి జరిగే కథేమో (రావిశాస్త్రి కథైతే ఖచ్చితంగా అదే). నీటి చుట్టూ జరిగే రాజకీయాలు కూడా కావచ్చు. బావిని తాకనివ్వని అగ్రకులాల దాష్టీకం గురించి కథ కూడా కావచ్చు.

ఈ నాలుగు కథల ప్రారంభాలని కలిపి ఒకసారి చూద్దాం. కథ దేని గురించో ఊహించుకునే అవకాశం మాత్రమే ఇచ్చేవి కొన్ని, ముగింపు ఎక్కడో చెప్పినా దారి తెలియనివ్వని ప్రారంభాలు కొన్ని, దేని గురించిన కథో చెప్తూనే చూచాయగా దారి కూడా చూపించేవి కొన్ని, దేని గురించో ఏ మాత్రం తెలియనివ్వకుండా మొదలయ్యే ప్రారంభాలు కొన్ని. వీటిల్లో ఏది మంచిది? అన్నీ మంచివే. మీరు రాయబోయే కథా వస్తువు మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది. కానీ వీటన్నింటిలో ఉన్న ఒక్క విషయం ముఖ్యమైంది. టోన్.

లాయర్ల కథా ప్రారంభం మళ్లీ ఒకసారి చదవండి. రచయిత మీ ముందు నిలబడి మాట్లాడుతున్నట్లు  ఊహించుకోండి. అతను లేదా ఆమె ముఖంలోకి చూసి చెప్పండి – చెప్తున్నప్పుడు రచయిత ముఖంలో ఏం కనపడింది? లాయర్లు రాగానే జలగలు మాయమయ్యాయా? చదువుతున్న పాఠకుడి ముఖంలోకి చూస్తే ఏం కనపడుతుంది? చిరునవ్వు? కొంటెదనం? చిలిపిదనం? – ఇది బహుశా కామెడీ కథ కావచ్చు, సెటైర్ లేదా బ్లాక్ కామెడీ కథ కావచ్చు. ఇదీ టోన్ అంటే. కథా ప్రారంభంలో కథ ఏమిటో చెప్పకపోవడమే ఉత్తమం. కానీ ఒకవేళ కథని చూచాయగా చెప్పాలనుకున్నా, దారి చూపించాలనుకున్నా అది తప్పేమీ కాదు. కానీ టోన్ చెప్పకపోవడం కథకి అంతగా మేలు చెయ్యదు. దాని కన్నా ఘోరం ఇంకొకటి ఉంది – ఒక టోన్‌లో కథ మొదలుపెట్టి కథని వేరే టోన్‌లోకి తీసుకెళ్లడం. ఈ సూత్రం అర్థం చేసుకున్న చెయ్యి తిరిగిన రచయిత (సరే కొత్త రచయిత అయినా సరే) ప్రయోగం కోసమో, వైవిధ్యం కోసమో చేస్తే తప్పు కాకపోవచ్చు. శాస్త్రం తెలియకుండా ఉల్లంఘన చెయ్యడం అంత మంచిది కాదు.

రామాయాణం ఎలా మొదలౌందో తెలుసు కదా? వేటగాడిగా ఉన్న వాల్మీకి క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షిని వధిస్తే, రెండో పక్షి కన్నీటితో కథ మొదలౌతుంది. జంట మధ్య ఎడబాటు కలిగించే దుఖం గురించిన కథ చెప్పబోతున్నాను అని మొదలుపెట్టాడాయన. మహాభారతంలో ఈ పని రెండుసార్లు చేస్తాడు రచయిత. వినత, కద్రువ అనే సవతులు, వారి వారి పిల్లల మధ్య ఈర్షాద్వేషాల కథ ఒకటి, శర్మిష్ట, దేవయాని అనే మరో సవతుల కథ చెప్పిన తరువాత దాయాదుల ఈర్షాద్వేషాల అసలు కథ మొదలుతుంది. రామాయణం టోన్ చెప్పి కథలోకి వెళ్తే, మహాభారతం కథని pre-emptive గా టోన్‌తో సహా చెప్పి మరీ కథలోకి తీసుకువెళ్తుంది.

స్టోరీస్ ఎట్ వర్క్ అనే ఒక పుస్తకం రాశాడు ఇంద్రనీల్ చక్రబొర్తి. అందులో మొదటి ఛాప్టర్ గురించి చెప్పాలి మీకు. కథలు మనుషుల మీద చూపించే ప్రభావం గురించి చాలా చోట్ల చాలా మంది శాస్త్రీయంగా నిరూపించిన విషయాలను అన్నింటినీ ఒక చోట చేర్చి రాసిన ఛాప్టర్ అది. అందులో నాకు బాగా నచ్చిన విషయం ఒకటి చెప్తాను. అందరూ మొబైల్ ఫోన్‌లోకి చూస్తూ ఉన్న మీటింగ్‌లో కథ చెప్పబోతున్నట్లు ఒక సూచన ఇచ్చి ఏం జరుగుతుందో చూడమన్నాడు. నేను ప్రయత్నించి చూశాను. అతను చెప్పిన మాటని మళ్లీ నిరూపించాను. అందరి తలలు ఒక్కసారి మొబైల్‌లో నుంచి పైకి లేస్తాయి. మీరూ ప్రయత్నించి చూడండి.

కాకపోతే ఎలా మొదలుపెడతారు? మన కథలు ఎలా మొదలౌతాయి? పత్రికలలో మనం రాసే, చదివే కథలు కాదు. మీరు ఎవరితోనైనా చెప్పే కథలు, పిల్లల్ని నిద్రపుచ్చడానికి చెప్పే కథలు, ఆఫీస్ పార్టీలో మందు తాగి తప్పలేదని సంజాయిషీ ఇచ్చేటప్పుడు  చెప్పే కథలు, బాస్ దగ్గర అప్రెయిజల్ టైమ్‌లో చెప్పే కథలు – ఎలా మొదలౌతాయి?

“అనగనగా…”

“ఒక సారి ఏమైందంటే…”

“1995లోనో, 1994లోనో. నేనింకా కాలేజీలో ఉన్నాన్నప్పుడు…”

“నీకో విషయం చెప్పనా?”

“ఇప్పుడూ, ఆ సుబ్బారావు ఉన్నాడు కదా…”

“డిల్లీలో ఏం జరిగిందో తెలుసా?”

“మమ్మీ, ఈ రోజు స్కూల్లో..”

“ఒక ఊర్లో…”

“కాకులు దూరని కారడవి”

రాస్తూ వెళ్తే వందకి పైనే రాయచ్చేమో. కానీ వీటన్నింటిలో చాలా సహజమైన లక్షణం ఏమిటో గమనించారా? నేను నీకు ఒక ఆసక్తికరమైన కథ చెప్తాను విను అనే ప్రకటన. అది చెయ్యకుండా కథ మొదలు కాదు. కనీసం పాఠకుడి మనసులో కథ మొదలవ్వదు. పైన చెప్పిన ఉదాహరణలన్నీ సహజంగా మనకి అబ్బిన “కథ చెప్పే లక్షణం.” ఎలా చెప్తే పాఠకులు/శ్రోతలు మన కథ వింటారో తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, మార్చుకుంటూ తయారు చేసుకున్న ఫార్మాట్లు అవి. మనకి వచ్చిన, నచ్చిన, అలవాటైన ఒక పద్ధతిని మార్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ప్రతి రచయితకి ఒక రకంగా రాసే విధానం ఉంటుంది. అది సహజమైనది, మార్చుకోవడం సాధ్యం కాదు అనేస్తే ఎలా?

కావచ్చు. మొదటిసారి natural flowలో రాసినప్పుడు సహజమైన శైలిలోనే రాయచ్చు. కానీ ఆ వాక్యాలని మళ్లీ మళ్లీ మళ్లీ చదివినప్పుడు ఆ మొదట రాసిన మొదటి వాక్యాలు కథకి ఉపయోగపడట్లేదనీ, కొండకచో నష్టం కలిగిస్తున్నాయని అర్థం చేసుకున్నప్పుడైనా వాటిని మార్చుకోవాలి కదా? రచయిత తనకి అలవాటైన శైలిలో తప్ప మరో రకంగా రాయలేడు అనడం కరెక్ట్ కాదు. మార్పు సహజం. కావాలంటే వేరే రకంగా రాయలేను అనే రచయితలు ఎవరైనా సరే వాళ్ల మొదటి కథ ఒకటి, ఈ మధ్య రాసిన కథ ఒకటి  తీసుకుని ఆ రెండింటినీ ఒకదాని తరువాత ఇంకొకటి వెంట వెంటనే చదివి చూసుకోండి. మార్పు అనివార్యం. ఒకోసారి మార్పు అవసరం.

ఈ రోజుకి ఇక్కడ ఆగుదాం. వచ్చే పక్షం మళ్లీ మాట్లాదుకునేందుకు వీలుగా మీకు ఒక కథా ప్రారంభం ఇస్తున్నాను. చదివండి. మీకేమనిపించిందో కామెంట్‌లో రాయండి.

హిమాలయమంత ప్రేమ

అది మానవ హృదయాంతరాళాలలో నిబిడీకృతమైన మహోత్తర భావనలా, విశాల గగనాంతరాళాలలోకి విస్తృతమైన చూపు విసిరే హిమాలయా పర్వతాలు. సాక్షాత్తు త్రిలోక శంకరుడు జగజ్జేయమానంగా వెలుగొందుతూ, అసురసంధ్యవేళ అత్యంతవైభొవోపేతంగా నర్తించే నాట్యరంగం – ఈ హిమనగం. దేవామృత సదృశ్యమైన పవిత్ర గంగానదీ పరివాహకమైన మహాత్భుత పర్వతశ్రేణి. ఆ సాయంసంధ్యవేళ, యావత్భారతానికీ ప్రచండుడై ప్రభవించిన దినకరుడు, ఈ శీతల పర్వతాలపైన సౌమ్యుడై తన మయూఖ రేఖలను అలవోకగా జారవిడుస్తున్న సందర్భం.

పీయుష్ ప్రకృతి కలిగిస్తున్న పారవర్శ్యాన్ని మనసారా అనుభవిస్తున్నాడు. పక్కనే వున్న నైమిష చాలాసేపటి నుంచి మాట్లాడలేదని గ్రహించి ఆమె వైపు చూశాడు.

“హే.. వాట్సప్ బడ్డీ? ఏంటి పొద్దున నుంచి డల్ గా వున్నావ్?” అడిగాడు

“నథింగ్… జస్ట్ ఫీలింగ్ చిల్డ్” సమాధానం చెప్పింది నైమిష.

“కమాన్ యార్ లెట్స్ హావ్ సమ్ ఫన్!! ఇంత దూరం వచ్చి ఇలా డిప్రెస్డ్‍గా వుంటే మజా ఏముంటుంది. సీ ద బ్యూటీ మై డియర్ బ్యూటీ” కాస్త చిలిపిగా మాట్లాడితేనన్నా ఆమె పలుకుతుందేమోనని అతని ప్రయత్నం.

“కొండలని చూస్తే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తుకొస్తాడు. నీకు తెలుసుగా బెంగుళూరు దగ్గర రామ్‍ఘడ్ కొండలని ట్రెక్కింగ్ చేస్తూ ఏక్సిడెంటల్‍గా చనిపోయాడు” చెప్పిందామె. ఆమె గొంతులో విషాదం పీయుష్ ని నిరుత్తరుడిని చేసింది. మౌనంగా వుండిపోయాడు.

పీయుష్, నైమిష బొంబాయిలో ఒక పబ్‍లో కలిసారు. పీయుష్ ప్రియురాలు జో అతన్ని వదిలేసిన వారం తరువాత. అప్పటికి నైమిష లవర్ చనిపోయి నెల దాటింది. ఇద్దరూ ప్రేమకు దూరమై వున్న కారణం వల్లేమో వెంటనే కలిసిపోయారు. “ఎక్కడికైనా దూరంగా వెళ్దాం” అని నైమిష అడిగితే హిమాలయాలకి సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేశాడు పీయుష్.

నైమిషకి ఈ మంచు కొండల మధ్యనే  ప్రొపోజ్ చేయాలని అతని ఆలోచన. కానీ ఇప్పుడు నైమిష వున్న మూడ్ చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించటంలేదు.

***

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు