ఇడ్లిల మాణిక్యం….

జ్వరమొస్తే బాగుండు ఇడ్లిలు తినొచ్చు అనుకునే వాళ్ళు కూడా మా స్నేహితుల్లో ఉండేవారు!

దేశ ప్రాంత మత కుల భాష హోదా కీర్తి అంతస్తులుకు అసలే         మాత్రమూ సంబంధము లేకుండా ఉండేవి లోకంలో ఏమైనా ఉన్నాయి అంటే లేదా ఉంటాయి అంటే అది బాల్యమే. బాల్యం లోపల అమర్చబడిన తీపి జ్ఞాపకాలే. బాల్యంఒక పాలగిన్నె. పసి పన్నుల అమాయకపు స్వచ్ఛ జీవితానికి అదో కొండ గుర్తు.నా బాల్యం మీద ఇడ్లిల సువాసన్ని వెదజల్లిన మాణిక్యమ్మ నాకో తనివి తీరని బోరు కొట్టని జ్ఞాపకం.ఎండకు బాగా నడిచి బావి నీరు తాగితే కలిగే హాయి దనం కలుగుతుంది మాణిక్యమ్మ పేరు వింటే.

అచ్చంగా చందమామలాంటి ఇడ్లిలు వొండేది.అమ్మ పాలలాంటి సువాసన కలిగిన ఇడ్లిలు అందరికి వడ్డించేది.
నువ్వెంత నిజం చెప్పావో నీ అబద్ధం తెలియజేస్తుంది.నువ్వెంత ప్రేమించావో నీ ద్వేషం చెబుతుంది.నువ్వు ఎలా బతకాలో కాదు చెప్పాల్చింది ఎలా బతుకుతున్నావో తెలియజేయాలి.ఎలా బతకాలో కాదు ఎలా బతకకూడదో నేర్పించాలి..అనేది ఇడ్లిల మాణిక్యం.మాణిక్యానిది మా ఊరే. మామునూరు.భర్తని పోగొట్టుకున్న ఒంటరి మహిళ.చిన్నతనం నుండి మాణిక్యానికి అన్ని కష్టాలే అని ఉరోళ్ళందరూ మాట్లాడుకునేవారు.ఎన్ని కష్టాలు పడినా ఎంతటి వేదన తన మనసుని నిర్వీర్యం చేస్తున్నా తొనకని కుండలాంటి ఆత్మ విశ్వాసం తనది.భర్తని కోల్పోయిన స్ర్తి కి ,తండ్రిలేని పిల్లలున్న స్త్రీకి ఎటువంటి కష్టాలుంటాయో అవన్నీ ఉన్నా ఏనాడు తన కష్టాలగురించి కలత చెందేది కాదు.

ఇడ్లిలోయ్…అంటూ బజార్లకి ఎక్కే మొదటి స్త్రీ మాణిక్యమే.పశువులకు గడ్డి కోసుకురావడానికి వెళ్లే రైతుల్లానే, పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లే నీరుకట్టు మనుషుల్లానో..వాకిట్లో కలేపు చల్లి ముగ్గులు వేసే ఇల్లాళ్లనొ, తను తెల్లవారేసరికి ఇడ్లిల గిన్నె నెత్తిన పెట్టుకొని ఉరిలోకి వొచ్చేది. అప్పట్లో ఇడ్లిల తినటం ఒక చిన్నపాటి హోదాకి గుర్తు..జ్వరమొస్తే బాగుండు ఇడ్లిలు తినొచ్చు అనుకునే వాళ్ళు కూడా మా స్నేహితుల్లో ఉండేవారు.కేవలం ఇడ్లిలు అమ్ముతూ..ఇద్దరి బిడ్డల్ని పెంచి పెద్ద చేసింది.బాగా పై చదువులు చదివించి అమెరికా లాంటి సంపన్న దేశానికి కొడుకును పంపించింది.కూతురికి కూడా పెళ్లి చేసి ఒకదారికి తెచ్చింది.మంచి పేరు సంపాదించుకుంది.ఆర్ధిక పరమైన ఇబ్బందుల్లో  అప్పు చేసిందే కానీ ఎక్కడా దారితప్పుదు మాణిక్యం అని అందరూ చెప్పుకుంటారు.మాణిక్యం అనే పేరుకి ఉన్నత మైన మర్యాద ,అత్యుత్తమమైన గౌరవం రావడానికి కారణం మాణిక్యానికి తనపట్ల తన జీవితంపట్ల ఉన్న కాంక్ష మాత్రమే.పోయిన యాడదే..మాణిక్యం మరణించింది.

అమెరికా కొడుకు చాలా ప్రయత్నించాకా దహన సంస్కారాలు కూతురు నిర్వర్తించిన మరుసటి రోజు ఇల్లు చేరుకున్నాడు.తల్లి మరణాన్ని చూడలేని కొడుకులు ఎందరో చెప్పలేం..ఏ జీవితం ఎందుకు ఎలా ఏ విధంగా ఉర్కుష్టమో నికృష్టమో అవుతుందో ఎవరు మాత్రం చెప్పగలరు?మాణిక్యం కి మరణం లేదు.తన ఇడ్లిలకి వాటి కమ్మని సువాసనకి మరణం లేదు.ఇప్పుడు ఎప్పుడు ఇడ్లిలు తిన్నా మాణిక్యమే గుర్తొస్తుంది.మాణిక్యమ్మ ఇడ్లిల లా ఈ ఇడ్లిలు ఎందుకు ఉండవో అనిపిస్తుంది.జీవితపు రుచిని అరచేతుల్లో నింపుకున్న మాణిక్యమ్మ కంటే రుచికరమైన ఇడ్లిలు ఎవరు వండగలరు…ఒక్క మాణిక్యం తప్ప.

*

 

పెద్దన్న

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Chinna nati gnapakalanu marrokkasari gurthu chesaru peddanna sir….Kani chivari paragraphs gundenu pindesayi ….chalaa baga rasaru sir …hats off to ur story 🙏🙏👏👏👏

  • ఇది కథ కాదు రోజానా గారు..ఒక స్త్రీ యొక్క.వీరోచిత గాథ….tq madam…

  • తిరిగిరాని బాల్యంలోకి మరొక్కసారి తీసుకెళ్లిన పెద్దన్నయ్య కి కృతజ్ఞతలు..నాకు ఇప్పటికి గుర్తు, చిన్న నాటి ఇడ్లీల రుచి, మళ్ళీ అటువంటి రుచి దొరకదు అనడంలో అతిశయోక్తి లేదేమో….ఆ రుచి రాదు,పోయిన మణిక్యమ్మ కూడా రాదు, బహుశా ఆమెతోనే ఆ ఇడ్లిల రుచిని కూడా పట్టుకెళ్లిందేమో…

    • అన్నీ అంతరించిపోతున్న కాలంలో మనం జీవిస్తున్నాం…తమ్ముడు.ఒకప్పటి జీవితం ఇప్పటి జీవితం కంటే..చాలా హాయిగా ఉందేమో అనిపిస్తుంది…నువ్వు capture చేసిన ఫోటో మానిక్యాన్ని తలంపుకు తెచ్చింది…అందుకు thanks…..

  • హాయిగా ఉంది. మాణిక్యమ్మ చేతి ఇడ్లీ తిన్నంత బాగుంది. మా ఊర్లో

    పుల్లయ్య పెసరట్టు ఫేమస్. వీళ్ల చేతి మహిమ అంతే. పెద్దన్న రాత

    మహిమ ఇంతే.

    ముక్కామల చక్రధర్

    • థాంక్యూ… గురువు గారు…ప్రతి ఊరులో ఇడ్లిల మాణిక్యం,పెసరట్టు ఫుల్లయ్యలు… ఎందరో…ప్రపంచీకరణ నేపధ్యంలో.. వీళ్లంతా..కనుమరుగవుతున్నారు…..కనీసం సాహిత్యంలో నన్నా… వీళ్ళు జీవించాలి…

  • అవును మీరు చేపెంది నిజం . ఇడ్లీ తినాలి అంటే జ్వరం రావాలి అనే కోరిక ఉండేది. కానీ ఇడ్లీ కొనుకోవలి అంటే దాని వెనకాల పేదరికము ఉండేది.ఒక ఇడ్లీ అయినా ఉచితం గా ఇస్తే బాగందనిపించేది. మరల నను బాల్యం లో నికి తొంగి చేసేలా చేసింది మీ రచన. బాగుంది నా బాల్యం.

    • థాంక్ యూ ..శామ్యూల్ రాజ్ గారు…మీది విలువైన కామెంట్…

  • మాణిక్యమ్మ చేసిన ఇడ్లీల రుచి ఇప్పుడెలా వస్తుంది, రుచే కాదు చిన్ననాటి ఆనందం కూడా ఇప్పుడు రాదు, ఎందుకంటే ఆ రుచి ఆ అనందం బాల్యానికి చెందినది. మరొక్కసారి బాల్యాన్ని చూపించిన రచయిత పెద్దన్నకు ధన్యవాదాలు.

  • మణిక్యమ్మ ఇడ్లిలా రుచిని చూపించినవు అన్న…
    మళ్ళీ మళ్ళీ ఆప్రేమలు తాకే వాక్యాల మధ్య మెదిలినంత ఆనందమేసింది…thankyou అన్నయ్య.💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు