ఇట్లు, ప్రేమతో మీ నాన్న!

హాయ్ రా కన్నా! నేను మీ నాన్నని. మీ అమ్మా నువ్వు ఇంచక్కగా రోజూ మాట్లాడేసుకుంటున్నారట. నువ్వు వచ్చే దాకా మరొక ఆరు నెలలు ఆగలేను రా. మన పురాణాలలో, ద్వాపరయుగంలో అర్జునుడు గర్భస్థ శిశువైన అభిమన్యుడితో మాట్లాడినట్టు దాఖలాలు ఉన్నాయి. అలనాడు అర్జునుడు చక్రవ్యూహం వివరిస్తే ఈనాడు మీ నాన్న నీతో కొంత పిచ్చాపాటి, కొన్ని కలలు, కొన్నిజీవితసత్యాలు చెప్తాడురా.

ఆమ్మో ! నాన్న అప్పుడేనా అనకురా. మరీ జీడిపాకంలా సాగదియ్యనులే. ఎదో వారానికి ఒక నాలుగైదు నిమిషాలు మాత్రమే. సరేనా! ఇప్పటికే మూడునెలల పాటు నిన్ను మిస్ చేసానురా? తల్లి పొట్టలో శిశువుకు మూడునెలల తరవాత చిన్నగా చెవులు వస్తాయట. నేను చెప్పేది సాంతం వినవచ్చులే. ఒక వేళ అమ్మ పొట్టలోపల సిగ్నల్ బాగాలేకపోయినా ఫరవాలేదు నేను నీకోసం ఇదంతా వ్రాసి అట్టేపెడతా.

నువ్వు మా మొదటి సంతానంరా. నీ పుణ్యమా అని భార్యాభర్తల నుండి మొదటిసారిగా అమ్మానాన్న హోదా రాబోతోంది మాకు. బహుశా నీ జననం దుబాయిలో అవుతుంది. వృత్తిరీత్యా గత రెండేళ్లుగా మీ అమ్మ నేను ఇక్కడ ఉంటున్నాము. పెళ్ళైన తరువాత మొదట కాపురం పెట్టింది ఇక్కడే. బట్టల క్లిప్ నించి కలర్ టీవీ దాకా అన్నీ ఇక్కడకొచ్చాకనే కొన్నాం. ఇంటి అద్దె, కరంటుబిల్లు, లాండ్రీ బిల్లు, ఆదాయం మొదలగు జంఝాటాలతో పూర్తి గృహస్తునయ్యాను

ఈ దేశంలో మాల్స్ అన్నీ చాలా పెద్దగానూ ఏ/సివల్ల చచ్చే చల్లగానూ ఉంటాయి. నడచీ నడచీ ఆయాసం వచ్చి కాళ్లు వాచిపోతాయి. నువ్వు పుట్టాకా సౌకర్యంగా ఉండే ఒక మంచి స్ట్రోలర్ కొందాం. నోట్లో వేలువేసుకొని ప్రపంచమంతా చూద్దువుగాని. ఇక్కడ శుక్ర శనివారాలు సెలవురోయ్. ఆదివారం కాదు. భలే కొత్తగా ఉండేది మొదట్లో.

అక్టోబర్ 20, 2013 :

ఇవాళ నీ మొదటి స్కాన్ ప్రింట్స్ ఇచ్చింది డాక్టరమ్మ. అందులో ఒక చిన్న చుక్క చూపించి అదే నువ్వు అంది. మా ఆనందానికి అవధుల్లేవు. అది బ్లాక్ అండ్ వైట్లో ఉన్నా మా గుండెల్లో ఆ రోజంతా హరివిల్లే నింపింది. ఇవాళ్టి నించి ప్రతి పక్షంరోజులకోసారి వెళ్ళాలి స్కానింగుకి.

నవంబర్ 30, 2013 :

మొదటి సారి నిన్ను 4D స్కానింగులో చూపించారు. నీ గుండెసవ్వడి విని అమ్మ కళ్ళంట ఆనందంతో ఏకధాటిగా నీళ్లు కారాయి. నా అరచేతిని గట్టిగా వత్తింది. నువ్వు అందులో రెండు చేతులూ జోడించి తలక్రిందలుగా తపస్సు చేసుకుంటున్నావ్ మునిలాగా. భలే ముచ్చటేసింది. ఆలా ఇంకొంచెంసేపు చూడాలనిపించింది. డాక్టరమ్మతో ధ్యానభంగం చెయ్యొద్దన్నాను.

పెద్దతల బిడ్డడిఁ అన్నది డాక్టరమ్మ. ఇవాళ్టి నుండి నీ నామకరణం దాకా నీకో ప్రొడక్షన్ టైటిల్ ఇద్దామని నిశ్చయించుకొన్నాం. మీ అమ్మ ఁడిప్పమ్ఁ అని పిలుద్దామన్నది. ఁఅంతేగా అంతేగాఁ అన్నాను విధేయంగా.

డిసెంబర్ 15, 2013 :

నీకు రోజూ అర్థరాత్రి ఆకలి వేస్తుంది. యెడపెడా తన్నేస్తున్నావ్ అమ్మని. అల్లరి కృష్ణయ్య! నేను వేడి పాలు కలిపి ఇచ్చి అమ్మ త్రాగినవెంటనే నీ బుజ్జిబొజ్జ కూడా నిండింది.

నాకు ఈ రొజు సరిగా నిద్రపట్టట్లేదురా. ఇవాళ ఆఫీస్ టీంలో ఒకరిమీద కసురుకున్నాను. పాపం చిన్నబుచ్చుకున్నాడు. కన్నా! నువ్వు చిన్నపట్నుంచి కోపం అదుపులో పెట్టుకో. సరేనా..మన ఇంట్లో అందరికి ముక్కు మీద కోపం. అది సర్వత్రా మంచిది కాదు. చూడు!నా నిద్రే దెబ్బతిన్నది.

జనవరి 1, 2014:

నూతన సంవత్సర శుభాకాంక్షలురా. ఇది మన ఉగాది కాదులే. కానీ వాడుకలో ఇది బాగా ప్రసిద్ధి. రాత్రి ఢాంఢాం టపాకాయల చప్పుడికి బాగా భయపడ్డావా. అవి సంబరాలు. అన్నట్టు తెలుగు లెక్కల ప్రకారం నీది మీ తాతగారిదీ ఒకే జన్మ సంవత్సరం-జయ. అయన చాలా ఆనందపడ్డారు. మీ తాతగారు జోకులు బాగా వేస్తారురోయ్. ఆ పోలిక నీకొస్తుందేమో. నాకు బాగాస్ఫూర్తినిచ్చిన మనిషి.

కెరటం ఆదర్శం అనేవారు..లేచి పడుతుందని కాదు..పడి లేస్తుందని. అదో పెద్ద కథలే నువ్వు బయటకొచ్చిన తరవాత చెప్తా. సూక్తి అంటే గుర్తొచ్చింది.. మా స్కూల్ గోడ మీద ఁమంచివాని మైత్రి మలయమారుత వీచిఁ అని రాసి ఉండేది. చాలా రోజులు దాని అర్థం తెలియలేదు కానీ వాక్యం బాగుందని కంఠస్తం చేశాను.

జనవరి 31, 2014 :

ఈ నెలనించి డాక్టర్ మీ అమ్మని కుడిప్రక్కకు ఎక్కువ సేపు పడుకోవద్దని చెప్పారు. పాపం చాల అవస్థ పడుతోంది. నువ్వా ఒకటే తన్నుడు. బుళ్ళకు-బుళ్ళకు మని అటుఇటు దొర్లుపుచ్చకాయలాగా అమ్మ పొట్టలో దొర్లటం. అందుకనే ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదంటారు (ఈ సూక్తి కాదనుకుంటా ఇక్కడ చెప్పాల్సింది! ఎదో ఫ్లోలో వచ్చేసింది! సవరణ: అందుకనే తల్లి ఋణంఎన్నడూ తీర్చుకోలేము అంటారు)

మీ అమ్మకి నా పాటలంటే చాలా ఇష్టం. నడుము నెప్పినించి ఉపశమనం కోసం నన్ను ఒక పాట పాడమంటే మీ ఇద్దరికోసం నేను..ఁచందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివేబీ నీ కన్న వారింట కష్టముల నీడ కరిగిపోయేనులేఁ అని పాడాను. వినిపించిందా? నచ్చిందా నాన్న గొంతు?

రేపు లాలి లాలి వటపత్ర సాయికి పడతాను. ఎలా ఉందో చెప్పు.

ఫిబ్రవరి 15, 2014 :

రాత్రి, పగలు, భూమి, ఆకాశము వంటి భేదాలేవీ లేని యోగివి. ఆ నైసర్గిక స్థితి నుండి ఈ వస్తురూప ప్రపంచంలోకి వస్తున్నావు. భూమిమీద పనేమిటో ఆ పరమేశ్వరుడు మీ చెవిలో చేబుతాడట. బాగా గుర్తు పెట్టుకో. లేకపోతే మాలాగే ఈ అందమైన మాయలో పడి వచ్చిన పని మరచిపోతావురా డిప్పమ్.

మార్చి 15, 2014

అమ్మ బాగా ఆపసోపాలు పడుతోంది. నడుము నొప్పి ఎక్కువైంది. కడుపులో మంట. ఏడవనెలలో ఇది సామాన్యమట. నీకు జుట్టు వస్తున్న కారణంగా అమ్మకి ఆ ఎసిడిటీ. ఁపోనీలెండి మంచి జుట్టోస్తే అదే చాలుఁ అన్నది మీ అమ్మ! నాది పల్చ జుట్టు. మీ బాబాయిది, మావయ్యది చాలా వత్తైన జుట్టు. తాతగారికైతే ఏకంగా ఉంగరాల జుట్టే!

అన్నట్టు చెప్పడం మరిచాను, ముందు దుబాయిలో ప్రసవం అనుకున్నాం కదా. ప్లాన్లో చిన్న చేంజ్. నాకు ఆఫ్రికాఖండంలో కెన్యాకి బదిలీ అయ్యే అవకాశం ఉందిరా డిప్పమ్. దేశం కాని దేశం కాబట్టి మన ఇండియాకి వెళ్లి తాతా అమ్మమ్మల సంరక్షణలో అమ్మ ప్రసవించడమే మేలు. నేను ప్రసవం సమయానికి ఇండియా వస్తాను. ఈ నెలాఖరుకి అమ్మనీ నిన్ను భాగ్యనగరంలో మీతాతగారి దగ్గర దిగపెట్టి వస్తాను.

ఏప్రిల్ 30, 2014

ఇదిగోరా ఇది మీ తాతగారిల్లు. బాగా విశాలంగా ఉంటుంది. అమ్మమ్మవల్ల మీ అమ్మకి ఎంతో చేయూత ఉంటుంది. దుబాయిలో అయితే నేను మీ అమ్మే అన్నీ చేసుకొనే వారం. ఇక్కడ చిక్కేమిటంటే దోమలు బాగా ఎక్కువ. అమ్మని జాగ్రతపడమన్నాను జ్వరం రాకుండా. వచ్చేవారం మా కృష్ణమావయ్య వచ్చి నీ కోసం భాగవత సప్తాహం చేస్తున్నాడు. గర్భస్థ శిశువుకు, తల్లికి మేలుచేస్తుందిట. జాగ్రత్తగా విను. అభిమన్యుడికి అర్జునోక్కడే. నీకు నేను, మా మావయ్య కూడా వేస్తున్నాం జ్ఞాన వైరాగ్య గుళికలు.   మావయ్యకి నేనంటే మిక్కిలి మక్కువ. అయనతో పాటు మా అమ్మా, నాన్నా కూడా వస్తున్నారు. మా తాతగారు నేను పుట్టినప్పుడు మల్లేశ్వరం జమీందార్ పుట్టేడన్నారట. (మల్లేశ్వరం మన పూర్వీకుల ఊరు). మా నాన్నగారు కూడా నీ గురుంచి అదేఅంటూ పొంగిపోతున్నారు.

జూన్ 30, 2014 :

అమ్మకి నెప్పులు ఎక్కువౌతున్నాయిరా. నేను కూర్చొని సంకోచాల(జశీఅ్‌తీaష్‌ఱశీఅం) వ్యవధి(సబతీa్‌ఱశీఅ) మరియు తరచుదనం(టతీవనబవఅషవ) సెల్ఫోనులో నోట్ చేస్తున్నాను. కెన్యానించి డైరెక్టుగా హైదరాబాద్ వచ్చేసాను. ఇవాళ తెల్లారుగట్ట హాస్పిటల్లో భర్తీచేశాము. బహుశా నీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇవతలికి వచ్చినా తరువాత బోలెడు కబుర్లుచెప్పుకొందాం. నేను తెల్ల చొక్కా వేసుకొన్నా పోల్చుకోరా డిప్పమ్. హ్యాపీ జర్నీ. ఉమ్మనీరు తాగకు. జాగ్రత్త పిల్ల జమీందారు!

2013లో నేను ఆఫ్రికా శిఖరంలోనే ఉన్నతమైన మౌంట్ కిలిమంజారోని అధిరోహించి ఎంతో కష్టసాధ్యమనుకొన్నా. కానీ మీ అమ్మ ప్రసవవేదన చూసాక..కిలిమంజారో ఒక వాహ్యాళిలా అనిపించింది.

ఇట్లు,

నీ శీర్షోదయంకొరకు ప్రొద్దుతిరుగుడుపువ్వల్లే ఆతృతగా ఎదురుచూస్తున్న మీ నాన్న!

*

Painting: Pathan Mastan Khan

రాజశేఖర్ తటవర్తి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Stream of consciousness (చైతన్య స్రవంతి) పద్ధతిలో రాసిన ఈ కథ మనసుకి హత్తుకునేలా ఉంది. అతి సహజంగా భావించే విషయాన్ని వేరే కోణంలో చూడగలగడం కథకుడి లక్షణం. అది ఇక్కడ కనిపిస్తుంది.
    స్త్రీ ప్రసవవేదన గురించి చివర్లో ఇచ్చిన ముక్తాయింపు అద్భుతం. మరిన్ని మంచి అంశాలను స్పృశిస్తూ రచనలు చెయ్యాలని కోరుతూ….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు