టెక్నిక్ లేని కథ రాయడం కంటే మానుకోవడం బెటర్ అంటారు విమర్శకులు. మౌఖిక కథా సాహిత్యంలో ఉన్నన్ని టెక్నిక్స్ నేడు వస్తున్న లిఖితకథల్లో లేదన్నది వాస్తవం. మౌఖికానికి, లిఖితానికి మధ్య ఉన్న తేడాను తెంచేయడం అంత సులభం ఏమీ కాదు. మౌఖిక సాహిత్యంలో శ్రోతలు ఎదురుగా ఉంటారు. లిఖిత సాహిత్యంలో కథకుడికి శ్రోతలు ఎవరో కచ్చితంగా తెలియదు. అందువల్లే భాష, కథనం, పాత్రల గురించి చెప్పే తీరు… అన్నింటిలో లిఖిత కథకు, మౌఖిక కథకు చాలా తేడాలు ఉంటాయి. లఖిత కథలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రల మధ్య సంభాషణ రాయడం వేరు. కథంతా మౌఖికంగా ఎదురుగా శ్రోత ఉన్నారని ఊహించుకొని కథ సాగించడం వేరు. నిజానికి మౌఖిక సాహిత్య మౌలిక భావనను నేటి లిఖిత కథా సాహిత్యం పూర్తిగా కాకపోయినా, చాలా వరకు వదిలేసిందనే చెప్పాలి.
కథను దృశ్యం చేయడం, సంభాషణలతో నడిపించడం, కథ మొత్తాన్ని సన్నివేశం లేదా సంఘటన చేయడం, ఒక పాత్రనే కథగా మలచడం, పూర్తి వర్ణనాత్మకంగా కథను చెప్పడం, కవిత్వంతో కథను అల్లడం, ప్రతీకాత్మకంగా కథా వస్తువును వివరించడం… ఇలా ఎన్నో కథనరీతులతో నేటి రచయితలు కథలు రాస్తున్నారు. వాళ్లలో కొట్టం రామకృష్ణారెడ్డిది బలమైన ముద్ర. “తీర్పు”, “నూనెసుక్క”, “ఇగురం గల్లోడు” వంటి కథలు 15కు పైగా రాశాడు. అనుబంధాల ఆయువుపట్టును గట్టిగా పట్టుకొని, కథలను కొత్త కొత్త టెక్నిక్స్ తో బిగిసడలని నడకతో పరుగులు పెట్టిస్తాడు. పచ్చివాసనల తెలంగాణ భాషలో కథను పరిమళింపజేస్తున్నాడు.
కథను రచయితలు ప్రథమ పురుష, ఉత్తమ పురుష, నాటకీయ, పాత్రల దృష్టికోణాలతో నడుపుతారు. సంవిధానాన్ని తర్కబద్దంగా పోషిస్తారు. “ఇగురం గల్లోడు” కథలో రామకృష్ణారెడ్డి మూడు కారెక్టర్లతో మరో కారెక్టర్ గురించి చెప్పించాడు. ఈ మూడు పాత్రలు తమతమ దృష్టికోణాల నుంచి నాలుగో పాత్ర గురించి చెప్తాయి. ఎలా అంటే… వక్త, శ్రోత పద్ధతితో సాగే మౌఖిక కథా పద్ధతిలో. ప్రధాన పాత్ర స్వభావాన్ని ఇలా మిగిలిన పాత్రలతో చెప్పించే టెక్నిక్ లో కథకుడు విజయం ఎలా సాధించాడు? అందుకు కథను లోచూపుతో ఎలా మలిచాడు? వస్తురూప సమన్వయంలోని కథకుడి సామర్థ్యం ఎలా ప్రతిఫలించింది? అచ్ఛమైన, స్వచ్ఛమైన తెలంగాణ భాషలో కథను నడిపించడానికి పాత్రల స్వభావం, నేపథ్యం, కథా వస్తువు… ఏది కారణం? మౌఖిక భాషణమే కారణమా? ఈ ప్రశ్నలన్నింటికి రామకృష్ణారెడ్డికి సమాధానాలు తెలుసు. మనమూ తెలుసుకోవాలంటే నిగూఢమైన అంతర్ దృష్టితో కథలోకి అడుగుపెట్టాలి.
ఈ కథలో పాత్రలు అల్లుడు, కోడలు, పెండ్లాం. ఈ ముగ్గురు మరో పాత్ర గురించి విమర్శిస్తాయి. తర్కిస్తాయి. లోతుపాతులను వివరిస్తాయి. కార్యకారణ సంబంధాలతో ఆ పాత్ర గుణగణాలను అంచనావేస్తాయి. అయితే ఎవరి దృష్టి వాళ్లదే. ఆ చూపు కూడా వాళ్ల స్వలాభం, మానసిక స్థితి, అర్థం చేసుకునే స్థాయిని బట్టే ఉంటుంది. ఈ పాత్రలను సృష్టించడంలో రచయిత చక్కనైన నిపుణత ప్రదర్శించాడు. వాటికి పరిధులు, పరిమితులు కూడా నిర్దేశించుకున్నాడు. కథలో పాత్రలు వాటితో అవి మాట్లాడుకోవు. పాఠకులతో నేరుగా మాట్లాడతాయి. చక్కగా, చిక్కగా తెలంగాణ పలుకుబడుల సోయగంతో మనల్ని పలకరిస్తాయి.
అల్లుడి దృష్టిలో మామ ఎందుకు పనికిరానివాడు. అలాగని ఖాళీగా ఉండడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. తెల్లారగట్ట బాయిదక్కరకుపోయి, పొద్దు గూకిన తర్వాత వస్తాడు. ఇంటిపని, బయటపని అత్తే చూసుకుంటుంది. పెండ్లయి చాలా ఏళ్లైనా ఒక్కసారి కూడా తన ఇంటికి రాడు. నీసు ముట్టడు. మద్యం గిద్యం పోయించి తనకు మర్యాద చెయ్యడు. కట్నం లేకుండా కూతుర్ని పెళ్లి చేసుకున్నా, స్థలం కొనుక్కోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బు అవసరమై బిచ్చపోడి లెక్క అడిగినా పైసా ఇవ్వడు. కూడబెట్టేదంతా కొడుక్కే. ఇలా అల్లుడి పాత్ర ద్వారా మామ లోకజ్ఞానం, లౌక్యం తెలియని మనిషిని చెప్తాడు కథకుడు. ఇతరులతో మెలగడం రాని వ్యక్తి. స్త్రీచాటు పురుషుడని అల్లుడితో వివరంగా చెప్పిస్తాడు రచయిత. పైగా తనను బాగా చూసుకోవడం లేదన్న నింద కూడా వేయిస్తాడు. పైగా “ఆయన నోట్లో నుంచే తన భార్య ఊడిపండిద”ని, ఆమె స్వభావాన్ని చెప్పి… మామను ఇంకో మెట్టు దిగజార్చుతాడు. దాంతో పాఠకులకు ఆ పాత్రమీద కొంత తక్కువ అభిప్రాయం కలుగుతుంది. కథలోని వస్తువు, నేపథ్యం మనసుల్లోకి ఇంకేలా చేస్తుంది. ఆ పాత్ర ఎందుకలా ఉంది? నిజంగా అతని వ్యక్తిత్వం అంతేనా? అనే ప్రశ్నలతో ముందుకు వెళ్తారు పాఠకులు.
కథలో మరో పాత్ర కోడలు. ఈమె కూడా మామమీద బోలెడు చాడీలు చెప్తుంది. ఆయన వల్ల తను పడుతున్న కష్టనష్టాలను ఏకరవు పెడుతుంది. సహజంగా ఇళ్లల్లో అత్తాకోడళ్లకు పడదు. కాననీ ఆ యింట్లో మామ కోడలకు పడదు అంటుంది. నాతో అసలు ఒక్కమాట కూడా మాట్లాడడు. పరాయిదాని లెక్క చూస్తాడు. ఒక్కసారి కూడా తమ ఇంటికి రాడు. పండగలకు పుట్టింటికి పోనీడు. కానీ తన కూతురు, అల్లుడు మాత్రం వారంవారం వచ్చిపోతా ఉంటారు. కూతురు అల్లుడికే సాయం చేస్తుంటాడు. తమ గురించి పట్టించుకోడు అని మామను విమర్శిస్తుంది. తన భర్త సైతం ఊరికి వస్తే తండ్రి వెనక లేగదూడలా తిరుగుతాడు. ముసలాళ్లైతే తామే చూసుకోవాలన్న ఒక విసురు కూడా విసురుతుంది కోడలు. తను ఏమీ చేయలేక ఊరుకున్నానని వాపోతుంది. ఈ పాత్ర ద్వారా కథకుడు మామ పాత్ర స్వభావాన్ని పూర్తిగా కిందకు దించుతాడు. ఆ పాత్రలోని మంచి ఎక్కడన్నా దొరుకుతుందా? లేదా? అనుకునే వాళ్లకు మరికొంత నిరాశనే మిగులుస్తాడు. మామను చివరకు ఏం చేస్తాడు? ఆ పాత్ర స్వభావం అంతేనా? ఆ ప్రవర్తన వెనుక నిగాఢార్థం ఏ మైనా ఉందా? ఉంటే ఏంటి? అల్లుడు, కోడలు పట్ల అలా ప్రవర్తించే మామ భార్యతో ఎలా ఉంటాడు? అనే ఉత్సుకత రేపి కథ వెంటనడిపిస్తాడు వెంకటరామిరెడ్డి.
ఇక పెండ్లాం మొగుడి గురించి చెప్పడం మొదలవుతుంది. ఈమె కూడా “ప్రేమ లేని మొగనితోటి కాపురం కంటే కనికరంలేని మొగనితోటి కాపురం మోచేతి మీద దెబ్బ” అంటూ తన బాధ వెల్లగక్కుతుంది. కాపురానికి వచ్చింది మొదలు వంచిన నడుము ఎత్తకుండా పని చేస్తున్నాను. తన బిడ్డలూ మొగుడి లెక్క మొండోళ్లు… అంటూ ఆ పాత్ర స్వభావాన్ని తన కోణం నుంచి చెప్తుంది. సరిగ్గా అప్పటి నుంచే నేలచూపులు చూసిన పాత్రను క్రమక్రమంగా ఆకాశంలోని వెన్నెల్లా చూడడం మొదలుపెడతాం. కూతురు తమ తక్కువకులం అతడ్ని ప్రేమించి పెళ్లిచేసుకుంటానని ఇంటికి తీసుకొస్తే… వాళ్లిద్దరూ ముచ్చటపడ్డారు. మనమెవ్వరం కాదనడానికి అని పెళ్లిచేసాడు. ఏ సుఖాన్ని కోరుకోడు. వ్యవసాయం అంటే ప్రాణం. “యవుసం మీద ప్రేమ ఒగనాడు ఇడిసిపెట్టేది కాదు.. ఒగునాడు ఒడిసిపొయ్యేది కాదు” అన్నట్లు అదే జీవితంగా చేసుకున్నాడు. ఎకరం బావు పొలాన్ని, పదెకరాలకు పెంచాడు. ఆ పొలాన్ని కూడా తన పేరు మీద కాకుండా కొడుకు, భార్య పేరు మీద రాశాడు. అందుకు కారణాలు వివరింగా చెప్పాడు. నాలోని గుణాన్ని గుర్తించి పెత్తనాన్ని నాకే అప్పగించాడు. అయినా ఆయనకు లెక్కలన్నీ నోటికి వచ్చు. కోడలకు తల్లిలేదు కాబట్టి, తామే బాగా చూసుకోవాలని పుట్టింటికి పంపడు. అత్తాకోడళ్లు తన గురించి చర్చించుకొనే అవకాశం ఇవ్వడానికే, కోడలితో మాట్లాడడు. “తిట్టుకుంట పెట్టే బుక్కెడు బువ్వకంటే… ప్రేమతోటి పెట్టే నాలుగు మెతుకులే కమ్మగుంటయి… నాలుగు దినాలు సత్తువిస్తయ్యి” అంటాడు.
ఇలా అల్లుడు, కోడలు మామ గురించి వేసిన చిక్కుముళ్లన్నీ భార్యపాత్ర ద్వారా ఒక్కొక్కటి విప్పుతాడు కథకుడు. ఆ పాత్రను అర్థం చేసుకోవాలంటే మిగిలిన మూడు పాత్రలూ ఆ స్థాయికి ఎదగాలన్నట్లు కథను ముగిస్తాడు. భార్యతో “అర్తమయితడు అన్న ఆశా లేదు… అర్తం కాలేదన్న బాధా లేదు” అని ఆ పాత్ర గురించి నిర్ధారణ చేయించేస్తాడు. రచయితకు ఓ మంచి పాత్రను అందిస్తున్నానని ముందే తెలుసు… అందుకే కొన్ని లింకులు పాఠకులకు వదిలేశాడు. వాటిని పట్టుకోవాలి. అల్లుడు చెప్పే మాటల్లో “కోడిపుంజునో, కుందేలు పిల్లనో, బుర్కపిట్టెనో, కంజు పిట్టెనో యాదో ఒకటి పట్టుకొస్తడు గని ఆయన మాత్రం నీసు ముట్టడు”, డబ్బులు అడిగినప్పుడు “నా తానేడున్నయి… ఉన్న నాడు మీకియ్యకుంటె ఇంకెవలికిస్త” ఈ మాటల్లో అతనిలోని మంచితనం బయటపుతుంది. కోడలు చెప్పే మాటల్లో “మా మామకు నాకు నడిమద్దిల ఎసోంటి దుష్మని లేదు గని…”, “ఒక్కనాడు పన్నెత్తి ఒక్క మాట గూడ మాట్లాడలే” కొంత చెప్పీచెప్పని ఆ కారెక్టర్ వ్యక్తిత్వం ఇక్కడా అర్థమవుతుంది. కొడుకు తండ్రితో అంత బాగా ఉంటున్నాడంటే ఆయనలో ఏదో గొప్పతనం ఉందన్న అనుమానం పాఠకులకు కలగక మానదు. కథ అంటేనే నిడివి తక్కువ. ఆ తక్కువలోనే అల్లుడు, కోడలు, భార్యల ద్వారా ప్రధాన పాత్ర స్వభావాన్ని చెప్పిస్తూనే ఆ పాత్రల స్వభావాన్నీ, ఆ పాత్రల మాటల ద్వారానే చెప్పించడం కథకుడు పాటించిన టెక్నిక్.
కథకుడు మౌఖిక సంప్రదాయాన్ని ఎన్నుకోవడం ఈ కథలో మరో గొప్ప గుణం. పాత్రలు నేరుగా శ్రోతలతో సంభాషిస్తాయి. ప్రతి పాత్ర మన ఎదురుగా కూర్చొని తన అభిప్రాయాన్ని చెప్తుంది. నుడికారాలు వాడతాయి. సామెతలు, జాతీయాలతో మాట్లాడతాయి. ప్రజల జీవన విధానం, మానవీయకోణాల్లో దాగి వారసత్వంగా వస్తున్న వివిధ సందర్భాలకు సరిపోయే పలుకుబళ్లు కథంతా నిండి పూల వర్షంలా పాఠకులపై కురుస్తూనే ఉంటుంది. ఇదే జీవద్భాషే కథకు జీవగర్ర. అందుకే ఈ కథ తెలంగాణ సాంస్కృతిక జీవన వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ శైలితో కథ మొత్తాన్ని నడిపిన తీరు అద్భుతమనే చెప్పాలి.
“ఇంట్ల ఇగురం ఇంటామె చెయ్యాలే … బయట పెత్తనం మొగోడు చెయ్యాలంటారు”. “ఎన్నాకులు రాల్తే ఈతాకు రాల్తది?”. “ఒడ్డించేటోడు మనోడైతే… బంతిల యాడ గూసున్నా మంచి తున్కలే ఏస్తడు”. “గొంగడి నాది కాదు చెప్పులు నావి కావు అనే రకం”. “పెయిల సత్తువ, మూటల ఇత్తులు ఉన్నన్ని నాళ్లే ఎవడైనా కానేది”. “ఈ కట్టె కాలిందాంక ఒడుస్తయన్న నమ్మికం చీమ తలకాయంత గూడ లేదు నాకు”… ఇలాంటి ఎన్నో భాషా సౌందర్యంతో నిండిన అసలైన ప్రజల నుడికారాలతో కట్టిపడేలా చేస్తాడు రచయిత. మానన సంబంధాలు, ఒరిజనల్ డిక్షన్ లోని మూలాలపై రామకృష్ణారెడ్డికి మంచి పట్టు ఉందని చెప్పడానికి ఈ కథలోని కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవి. మిగిలినవెన్నో కథలో దాగి ఉన్నాయి.
కుటుంబ బంధాల మధ్య ఉన్న ఆప్యాయతానురాగలను ఇతివృత్తంగా ఎంచుకున్న రచయిత చేసిన మ్యాజిక్ ఏంటంటే… ఏ పాత్రకు పేరు పెట్టలేదు. మామ, అత్త, కొడుకు, కోడలతో కథను చెప్పించాడు. ఈ కథలోని పాత్రలు తమ మధ్య ఉంటే ప్రేమల్ని మాటలతో చెప్పరు. చేతలద్వారా చూపిస్తారు. అందుకు మామ పాత్రే గొప్ప ఉదాహరణ. ఒక మనిషిని మరో మనిషి అర్థం చేసుకోవడానికి లోతైన చూపు ఉండాలి. ఆ చూపుతో ఎదుటివాళ్ల అంతరంగాన్ని గమనించాలి. లోతుపాతులను తార్కికంగా అంచనా వేయాలి. ముఖ్యంగా కుటుంబ బంధాల్లోని ఆత్మీయతల గుట్టు విప్పడం, అభిమానాలను తూచడం అంత తేలిక కాదు అని కథకుడు వెంకటరామిరెడ్డి అద్భుతంగా ఈ కథలో చెప్పాడు. మనిషన్న వాడే మాయమైపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి కథల అవసరం ఎంతైనా ఉంది.
ఇగురం గల్లోడు
-కొట్టం రామకృష్ణారెడ్డి
అల్లుడు:
‘అజ్ఞానానికి మించిన ఆనందం లేదు – ఆనందానికి మించిన ఆయుర్దాయం లేదు’… అననీకె నిలువెత్తు ఆనవాలు మా మామ. ఆయన ఘడియంత సేపు ఊకె గూసునుడు, చిటికెనేలంత చింత చేసుడు ఇదివొరకటి దాంక సూశింది లేదు. తెట్టుగ తెల్లారకముందే బాయి మొకానబడి పోతే మల్ల పొద్దుమూకింతల సూర్యుడు పడమటి మొకాన మునిగినంకనే ఈన ఆకిట్లకు అడుగుపెడతడు.
మా మామ సంగతి ఇయ్యాల నేను చెప్పుడు ఎందుకంటే… గీనసొంటి మొండి మనిషిని ఇప్పటిదాంక ఈ దునియల సూడలే. రాజు గొప్పోడా లేకుంటే మొండోడు గొప్పోడా అనంటే నేనైతే గింత గూడ సొంచాయించకుండ జప్పున జెప్త మా మామనే గొప్పోడని. ఇప్పటిదాంక ఎవడేంచెప్పినా ఆయన చెవ్వు మీద పేను వారుడు సూడనే సూడలే. అందరు చెప్పింది ఇంటడు గని ఆయనకి అనిపించింది సేస్తడు. ఆ సేసేది గూడ ఎవర్కి గింత ఆయమియ్యడు.
ఇంత ఇగురం ఉన్నోడు ఎంత తెలివిమంతుడో అనుకుంటరు ఎవ్వరన్నా…కానీ…ఆయన తెలివి ఏ యవ్వారమైన సేస్తేనే గద తెల్సేది? ఇంట్ల పనీ బయట పనీ…అన్నీ మా అత్తమ్మనే సూస్కుంటది. ఇంట్లకి ఉప్పు మిరపకాయ కాడికెల్లి మామ తొడుగుకునే పంచె కమీజు దాంక గామెనే కొనుకొస్తది గని ఈన గదిగూడ తెచ్చుకోడు. పాలను పాల బూత్ ల పోసుడు కాడికెల్లి ఒచ్చిన పంటను అమ్ముకొచ్చేదాంక అన్నీ అత్తమ్మనే సూసుకుంటది. ఇంట్ల ఇగురం ఇంటామె చెయ్యాలె…బయట పెత్తనం మొగోడు చెయ్యాలంటరు గని మా అత్తగారింట్ల అన్ని జరుగుబాట్లు మా అత్తమ్మనే సేస్తది.
ఈనకు ఇల్లు, పొలం, బర్రె, పెండ శేను, పురుగు తప్ప ఇంకేం తెల్వనే తెలవది. ఒక సుట్టము తెల్వది ఒక పక్కము తెల్వది. ఎవ్వని తావలకు బోడు. ఎవ్వరైనా ఆయన తానికే రావాలె. ఒక పెండ్లికీ బోడు ఒక సావుకూ బోడు. పెండ్లికీ సావుకీ పొయ్యిండంటే అది ఉండూర్ల ఉంటనే పోతడు…గంతే.
అసలాయ్న ఊరిడిసి పోంగ సూశిన్నంటే అది కొడుకు పెండ్లిల్లనే. పెండ్లిళ్ళు ఆడివిల్లల ఇండ్ల కాడ అయితయని, అందుకనే ఇగ తప్పదని కొడుకు అత్తగారింటికి పోవాల్సోచ్చింది. అరె! నా పెండ్లయ్యి ఇన్నేండ్లయ్యింది ఒక్క సారంటే ఒక్క సారి గూడ మా ఊరు మొకం సూశ్న పాపాన పోలేదు!
యాడాదికొక్కసారొచ్చే పండ్గలకు బిడ్డెను తోల్కపోనీకె గూడ బామ్మర్దినో లేకుంటే అత్తమ్మనో ఒస్తది గని మా మామ మాత్రం మా ఇంటికి ఇయ్యాల్టి దాంక రానే రాలే. ఇగ నాకైతే తప్పదాయె. పెండ్లాం ఎన్క పోవుడు ఎవర్కి తప్పుతదిగని.
ఇగ మర్యాదలకేం తక్వలేదు అత్తగారింట్ల. బాయికాడికెల్లి ఒచ్చేటప్పుడు ఏదో ఒకటి పట్టుకొస్తడు. కోడిపుంజునో, కుందేలు పిల్లనో, బుర్కపిట్టెనో, కంజుపిట్టెనో యాదో ఒకటి పట్టుకొస్తడు గని ఆయన మాత్రం నీసు ముట్టడు. ఆఖర్కి గుడ్డు కూడదినడు. అదే సాలు నా పెండ్లానికొచ్చింది, నాకు నోరు సచ్చింది. అత్తగారింట్ల నేనొక్కన్నే రాచ్చసుడిలెక్క సియ్యలు దినాలంటే సిగ్గయితది. ఇగ నీసు ముట్టనోల్లు నాకు సీసలేడికెల్లి తెస్తరు? మనమేమన్న రోజు గొంతుల్దాంక తాగి గంతులేస్తమా గని…అరె, ఎన్నడన్న ఇంటికి సుట్టమొస్తెనో, పండుగొస్తెనో గింత క్వార్టరో, గింత బీరు సీసనో తాగితే మనసు నిమ్మలమయితది. నెగీ బాపనోల్లింట్లోచ్చి పడ్డట్టయ్యింది. ఇగ ఏం జేస్తం గని. ఎవ్వరి తోవలు ఆల్లవి. మన తోవలకు ఆళ్ళు రారు. ఆళ్ళ తోవలకు మనం బోము.
అల్లుడన్నంక అత్తగారింటి నుంచి ఒచ్చే సొమ్ము మీద గింతనన్న ఆశ పెట్టుకుంటడు. నాకైతే ఆ ఆశ గూడ లేనే లేదు. పెండ్లినాడు పుస్తె మెట్టెలు, కట్టు బట్టలు తప్ప నాకు అత్తగారింటి నుండి ముట్టింది ముత్తెమంత గూడ లేదు. దేనికైన నోసుకుని పుట్టాలె.
మూడేండ్ల కింద ఓ నాడు మండలంల పాలకేంద్రం ఎన్కనే ఒక ప్లాటున్నదని, కొనుక్కుందామని ఆలుమగలం అనుకున్నం. అందుకు జరన్నిపైసలు తక్వయినయి. ఎవర్నో అడుగుతే ఎందుకిస్తరు. మంది ముందల చెయ్యి సాపుడెందుకని మా మామను అడుగుదామనుకున్న. గాయన్ను నోరు దెర్సి నేనెట్లడుగుత? గందుకని ఈమెను అడగమన్న…ఈమేమన్నతక్వదా…ఆయన నోట్లకెళ్ళే కద ఊడివడ్డది. ‘మా నాయన నాకిదివొరకటి దాంక ఏం తక్వజెయ్యలె…ఎప్పుడు నేను నోరు దెర్సి అడగకముందే అన్ని ఇచ్చిండు…ఇప్పుడు గూడ నేనడగను…అంత తిప్పలైతే నువ్వే అడుక్కో,’ అని పుసుక్కున నన్ను బిచ్చపోన్ని చేసేసింది.
పెండ్లాం గంత మాటన్నంక ఇంకేం చేస్తమని శెరం దప్పి మా మామ ముంగల బిచ్చపోన్నయిన. ఇంటల్లుడు నోరు దెరిసి అడిగిండని గూడ లేకుండ, ‘నా తానేడున్నయి… ఉన్న నాడు మీకియ్యకుంటె ఇంకెవలికిస్త,’ అని చేద బాయిలేసిన చాంతాడు పుటుక్కున తెంపిండు. ‘ఎన్నాకులు రాల్తే ఈతాకు రాల్తది?’ అనుకుంట కింద మీద వడి అందిన కాడికి బదలు తీస్కొచ్చి ఆ ప్లాటు కొనుకున్నం.
ఇగ గిన్నేండ్లయినంక జరన్ని పైసలు చేతుల తన్లాడుతుంటే…ఆ ప్లాటు జాగల నాలుగర్రలన్న ఎసుకుందామని ఈమె నా చెవుకాడ జోరీగలెక్క దినాం గున్సుడు షురూజేసింది. గంత ప్రేమగ పెండ్లాం అడిగితె కాదనెట్లంటమని…అంతే ప్రేమగ, ‘మీ నాయనను గింత ఆసరయితడేమో అడగరాదు’ అనన్న…గంతే, మూతిని ముప్పై ఆరొంకల తిప్పి, ‘నీకు చాత గాకపోతే నువ్వే అడుక్కో,’ మని మల్ల నన్ను బిచ్చపోన్ని చేద్దామనుకున్నది.
త్యాపకోసారి బిచ్చపోన్ని గావుడు నాకేం ఫరక్ పడ్తది గని, మా మామ మల్ల గవ్వే చిల్క పల్కులు పల్కుతడేమో నని నాకు ఫికరు పట్టుకున్నది. ఎట్లనన్నఉపాయం జేసి రేగ్గంప మీదారేసిన బట్టను సుతారంగ తీయాలె నని సొంచాయిస్తున్న.
ఏం జేస్తుండో మల్ల…మస్తుగా పంట దీసి కూడబెడుతున్నదంత కొడుకు కొరకేనని నాకు తెలుసు గని, గింత వాసన రానిస్తలేడు బయటకు.
కోడలు:
అత్తలకు కోడండ్లకు పడ్తలేదంటే అర్ధముంది…కని, మామకు కోడలుకు పడకపోవుడు నేనైతే ఏడ సూడలె!
మా మామకు నాకు నడిమద్దెల ఎసోంటి దుష్మని లేదు గని నేనంటే ఆయ్న గింత గూడ సైసనే సైసడు. ఎసోంటి యాల మొకం జూసుకున్నమో ఏమో?
ఈడ ఇంగో ఇచ్చంత్రం ఏందంటే నాకు మా అత్తకు మంచి సోపతే జతయింది. మా అత్తగారింట్ల నాకు అత్త మా మామనే! పసుపు బట్టలతోని అత్తగారింట్ల అడుగువెట్టినప్పటి సంది అంతనే…నన్ను పరాయిదాన్ని సేశేశిండు. ఎన్నడు నన్ను ఇంట్ల మనిషి లెక్క సూడనే సూడలె. ఒక్కనాడు పన్నెత్తి ఒక్క మాట గూడ మాట్లాడలే.
అంతో ఇంతో మా అత్తనే నయ్యం. గియ్యాల్టి దాంక నన్నెన్నడు ఒక్క మాట ఆనలె. ఎన్నడన్న పండ్గకో పబ్బానికో ఒస్తే ఏమన్న పని జెప్పనీకె గూడ ఎన్క ముందు అయితుండె. అన్ని పనులూ ఆమెనే చేస్కుంటుండే. నాకే…ఊకుండబుద్ధి గాక ఆ పని ఈ పని చేస్తుంటి. ఆడికి మా అత్త మొత్తుకుంటనే ఉంటది. ‘ఆడ ఎట్లా తప్పది… ఈడికి ఒచ్చిన నాల్గు దినాలన్న కుదార్తంగ గూసోని తినక గివ్వేం తిప్ప’లని గుల్గుతనే ఉంటది.
ఊర్ల సుట్టుపక్కలున్న అత్తలు కొడండ్లయితే చేతులన్ని తిప్పుకుంట ‘అత్త కొంగు పట్క తిరిగే కోడలును యేడ సూడకపోతిమమ్మా, మీరు గాక అత్తలు కోడండ్లయితిరి ,’ అనుకుంట ముక్కుల మీద ఏల్లేసుకునేటోళ్ళు.
ఇగ ఈననైతే ఆళ్ళ నాయన మీద ఈగను కూడ వాలనీయకపోతుండె. ఊరోల్లందరి తోవ ఒకటైతే ఊసు గన్లోంది ఇంకో తోవని ఊకనే అనలేదు. ఊళ్ళెకు అడుగువెట్టిన సంది నాయన గోచివట్టుకునే తిరుగుతడు. పొద్దుగాల నాయనెంట బాయికాడికి తయారయి…ఆవెనక ల్యాగ దూడె లెక్క పోతడు. ఓ జతగాడు లేకపాయె! ఓ సోపతి గాడు లేకపాయె! ఇంటికాడుంటె అమ్మెనక … బాయికాడికి నాయనెంక…చిన్న పోరని తీర్గనే సేస్తడు. అరె! ఇద్దరు పిల్లలయ్యిండ్రు … ఇంకా సంటిపోరని లెక్కనే అమ్మయ్య తాన గార్వాల పడ్తడు.
పట్నంల ఉన్నన్ని రోజులు బాగనే ఉంటడు, బాగనే ఇంటడు…గీడికి మా మామ తానికి రాంగానే ఏమయితదో ఏమో, గింత చిన్న మాట గూడ చెవినేసుకోడు. అన్ని అయ్య బుద్ధులే ఈనకు.
ఇగ మా మామ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా అంతో ఇంతో మిలిగే ఉంటది. అదేమన్న ఒడ్సే ముచ్చటనా గని. పెండ్లయ్యి నాలుగొద్దులు అయినంక గాడ పట్నంల కొత్తగ కాపురం బెట్నమా? గాయల్లటి సంది నువ్వొద్దె ఇయ్యాల్టి దాంక మా ఇంటి గడప తొక్కలే మా మామ. మంచికో చెడుకో పిల్లలకు సుస్తైందని చెప్పి పంపినా ఎన్నడు మా తాన్కి రాకపాయె. ఎన్నడొచ్చినా కిందా మీద వడి మా అత్తనే రావాలె గని ఆయన మటుకు ఊరిడిసి పెట్టి రాలే.
బతుకమ్మ పండ్గకో, బోనాలకో అమ్మగారింటికి యాడాది కొక్కసారి పోతనంటే ఒద్దంటే ఒద్దనేది మా అత్త. నేను పోతనంటే పోతనని మొండిగ కూసుంటే, ‘ఒద్దె…మామ ఒద్దన్నడు.. మల్ల కోపమైతడు,’ అని బుగులు పట్టిస్తుండేటిది.
యాడాదికొక్క పాలొచ్చే పెద్ద పండ్గకు గూడ అమ్మగారింటికి పోనియ్యకపోయ్యేది మా మామ. ఏమనాలె ఈ మనిషిని? ఎట్లర్తం చేస్కోవాలె? మల్ల చిన్న పండ్గకూ…పెద్ద పండ్గకూ బిడ్డెను తోలుకొచ్చుకుంటడు. బిడ్డెకో న్యాయం కోడలుకో న్యాయమా?
ఇగ మా ఆడబిడ్డయితే ఎప్పుడు అమ్మ గారింటికాడనే కానొస్తుండె. అయితారం..అయితారం మొగుడ్ని ఎంటబెట్టుకొని అమ్మ గారింటికాడ వాలిపోతుండె. ఉండేది మండలంలనే నాయె…గంట తోవ. శనివారం ఒస్తే మల్ల సోమారం పొద్గాల దాంక అమ్మగారింటిమీద పడి పెండ్లాం మొగడు పిల్లలతోని పడి తిని పొయ్యేది. ఇంగ పండ్గలకైతే ఆరం పద్దినాల సంది ఈడనే మకాం పెట్టేటోల్లు.
ఆళ్ళ నని ఏం సింగారం గని…మన బంగారం మంచిదయితే కద? ఒడ్డించేటోడు మనోడైతే…బంతిల యాడ గూసున్నా మంచి తున్కలే ఏస్తడు. మా మామ చేశ్న కష్టం అంత ఆళ్ళకే దోసిపెడ్తున్నరు. ఉప్పు మిరపకాయ కాడికెల్లి అంత ఈడికెల్లే కొండవోతరు.
మొన్ననే మా ఆడబబిడ్డోల్లు మండలంల ప్లాటు కొనుక్కున్నరు. దానికెంత సదిరిచ్చిండో మా మామ. ఇగ ఇల్లు కడ్తరంట దానికెన్ని సుదరాయిస్తాడో ఏమో? ఉన్నదంతా ఆళ్ళకే సదిరిస్తే మల్ల నా చేతిల నా పిల్లల చేతులల్ల చిప్పనే పెడ్తడు. కాలు జేతులు మంచిగ పంజేసినన్ని దినాలు గిట్లనే జేత్తరు. ఎప్పటికిట్లనే ఉంటారా గని? రేపు మూలకు పడ్డంకనో…రోగమో రొష్టో ఒచ్చినంక ఎవలు జేత్తరు?…ఎవలు పెడతరు?. ఎవరికి దోసి పెట్టిండ్రో ఆళ్ళు సేత్తరా? గడ్డకెక్కినంక ఎవ్వలైన సేతులు దులుపుకుంటరు. పెట్టనీకె బిడ్డె గావాలె…సేయ్యనీకె కోడలు గావాలె. ఇంకా ఏ జమానలున్నరు. బిడ్డైతేంది కోడలయితేంది…అందర్నీ ఒక్క తీర్గ సూడాలెనని మతిలకుండదా ఈళ్లకి.
గిసొంటి చిన్న చిన్నయిటికే దిక్కులేక పాయె…ఇగ ఆస్తుల కాడికి ఒచ్చేట్యాలకు ఎన్ని తాకట్లో, ఎన్ని పంచాదులో.
గియన్ని ఈనకేమన్న పట్టి ఉంటయా అంటే అదీ లేదు. గొంగడి నాది కాదు చెప్పులు నావి కావు అనే రకమే. అమ్మ లెక్క తెలివీ లేకపాయె…అయ్య లెక్క ఇగురమూ లేకపాయె. గిసొంటి ఇంట్ల పడ్డంక నేనేం బావుకున్న గని…ఎట్లనో అట్ల పిల్లలను ఒడ్డుకు చేరిస్తే గదే పున్నెం.
మనసుల మెసుల్తున్నది ఎవల్కి చెప్పుకుంటం? మొగనికి చెప్పుకునే సింగారమే లేకపాయె. ఇగ నేనెట్ల చేతురా భగవంతుడా అని మొగులు దిక్కు సూస్కుంట దండం పెట్టుకునుడు తప్ప. నా మొగనికి…నా పిల్లలకు నేను గాక ఇంకెవరు దిక్కు. నేనుగిట్ల లేకుంటే …నువొద్దె ఆగమయిపోతరు. గదైతే పక్కా. కట్టుకున్నంక…కన్నంక నాకు తప్పదాయె.
పెండ్లాం:
ప్రేమ లేని మొగనితోటి కాపురం కంటే కనికరంలేని మొగనితోటి కాపురం మోచేతి మీద దెబ్బ తీర్గనే ఉంటది. కడుపు చూడనోడే కడుపు చేసేటోడైతే ఆడదెన్నడు కుదార్తంగ ఉండది…దినాం పోయ్యిమీది అన్నం కుండలెక్క కుతకుత మంటనే ఉంటది.
సముర్తైన యాడాదికి ఈ ఇంట్ల కాలువెట్టిన సంది చాకిరి చేసుడు మొదాలుపెడితే…ఇయ్యాల్టి దాంక…మనుమలూ మనుమరాండ్లూ పెద్దగయితున్నరుగని…నేను చేసే చేత ఆగనే ఆగలె. కూలికొయ్యి కలుపు తీసే ఆడిది టయానికి బొయ్యి టయానికి ఒస్తది గని…నాకు ఏ టైమూ లేకపాయె. పొద్దున్నే కోడి కుయ్యక ముందే ఒంచిన నడుము ఒంచినట్లే ఉంటది…మల్ల పొద్దుమీకి ఇంత ముద్దతిని పక్కల పండుకునే దాంక ఒంగిన నడుము ఎదురుబద్ద లెక్క ఒంగిన తీర్గనే ఉంటది.
ఇప్పుడు చాతనయితుంది సేస్తున్న…రేపురేపు ఒంట్ల నెత్తురు సచ్చినంక మూలకువడ్డనాడు ఎవలు జేత్తరో…ఎవలు పెడ్తరో? పెయిల సత్తువు, మూటల ఇత్తులు ఉన్నన్ని నాళ్ళే ఎవడైనా కానేది…పెట్టేది. ఆ రెండూ లేనోడు ఎంగిలిస్తారాకే.
పుణ్యం కొద్ది పురుషుడు…దానం కొద్దీ బిడ్డలన్నరు, పుణ్యం చేసే ఒయుసు రాకముందే లగ్గమాయె… ఇగ దానం ముచ్చట సంగతి, నా దగ్గేరేమున్నది దానం జేయ్యనీకె…నేనేమన్నా షావుకార్నా చాటల కమానం దానం జెయ్యనీకెగని… నా పిల్లలు…నువ్వొద్దె రతనాలే. ఏనాడు ఇది గావాలెనని గున్సలే. పెట్టింది తిన్నరు ఇచ్చింది కట్టిన్రు. అడ్డమైన తిరుగుళ్ళు తిరగలే… గలీజు సోపతులు పట్టలె.
నా పిల్లలని చెప్పుకునుడు కాదు గని సదువుమీద గింతగనం ప్రేమ గళ్ళ పిల్లలను నేనేడ సూడలే. ఒగ దానిమీద మనసు పడ్డరంటే అది దక్కిందాంక ఇడిసి పెట్టనే ఇడిసి పెట్టరు. నా కొడుకంతే…నా బిడ్డంతే. అచ్చం అయ్య సాలె ఒచ్చింది. మొండోల్లు. ఎవ్వరి మాట ఇనరు. ఈన నైతే బిడ్డె చెప్పినట్టే ఇంటడు. టీచరు టెయినింగు అయ్యేటప్పుడే ఒగ పోరన్ని తీసుకొచ్చి ఈ పిలగాడ్నే సేసుక్కుంట అనంటే…కుయ్యనలే…కయ్యనలే…బిడ్డె జెప్పిందానికి సైయ్యన్నడు, తలకాయూపిండు. ‘మనకంటే తక్వ కులపోళ్ళు… గట్లెట్ల,’అనంటే, ‘ఆళ్ళు ఒక్క తాన సదువుకున్నరు. ముచ్చటవడ్డరు. నడిమిద్దెల మనమెవ్వరం ఒద్దననీకె. చేస్కోనీ. ఆళ్ళ బత్కు…ఆళ్ళు బత్కనీ. ఇద్దరు ఖుషీగుంటే గంతే సాలు’. అన్నడు. లగ్గమైన యాడాదికే బిడ్డెకు సర్కారు నౌఖరీ తలిగింది. అల్లునికి కూడ మల్ల రెండేండ్లకు నౌఖరీ ఒచ్చింది. పిలగాడు మంచోడే. మంచిగనే బతుకుతున్నరు.
ఈనను సూడబోతే గదే బాపతు. నచ్చింది చేస్తడు. యవుసం తప్ప ఇంగే పనీ రాదు. రాదు అనుడు కంటే చెయ్యడు అనుడు సరిపోతది. ఇంకో పనేమన్న చేస్తే కద? రానీకె. యవుసం మీద ప్రేమ ఒగనాడు ఇడిసిపెట్టేదీ కాదు…ఒగనాడు ఒడిసిపోయ్యేదీ గాదు. దినాం ఇంత ఎక్వనే అయితుంది గని తక్వయ్యే జాడలు కన్లవడలే. దాని మీద పెట్టిన పానంల ఆవగింజంత నా మీద సూపెట్టినా మురుసిపోదును.
ఏం సుఖమున్నదీ మనిసితోటి. ఇక ముద్దూ లేకపాయె ఒక మురిపెమూ లేకపాయె. ఎన్నడన్న అయిన సీరకట్టిన్నా…అయిన సొమ్ము ఎసుకున్ననా? లగ్గమయ్యి ఇన్నేండ్లాయె నా పెయ్యి మీదికి పావులెత్తు బంగారం బెట్టి పుస్తెలకు కట్టుకున్న పగడాల నడుమ ఇటో నాలుగు అటో నాలుగు గుండ్లగ్గూడ నోచుకోనైతిని. ఇసొంటాయన్ను నోరు దెరిసి అడిగితెనే గతిలేకపాయె. ఇంక అడగనిదానికి ఎట్లెదురు సూద్దు. బాయికాడ శేన్ల నడుమ యాప సెట్టు మీద సూపెట్టినంత ప్రేమ గూడ ఎన్నడూ కానకపోతిని.
అమ్మగారింటికాడికెల్లి తెచ్చుకున్న బంగారం గూడ బిడ్డెకే పెట్టిచ్చే. ‘మల్ల నాకయ్యా బంగారం,’ అనంటే, ‘సీ… ఏం జేసుకుంటం బంగారం, కడక్క తాగుతమా,’ అనే. ఇంగేం మాట్లాడుతం. పోనీ పైసలేమన్న ఆగం చేత్తడా అంటే అదీ కాదు…పుట్టి బుద్దెరిగినప్పటి సంది ఇంత నీసూ ముట్టకపాయె…ఇంత సుక్కా తాగకపాయె. ఒక సుట్టా లేదు, ఒక పోక చెక్కా లేదు. ఇంగేం ఖర్సున్నది… పెట్టనీకె. యాలకింత కడుపుల పడితే ఇంగేం అడుగడు.
మల్ల జరంత సేపు గూడ ఊకె గూసోడు. ఏదో ఒక పని ముందలేసుకొని సేస్తనే ఉంటడు. ఆనకాలం లేకపాయె … ఎండకాలం లేకపాయె. ఆ శేన్ల నడిమిట్లనే తన్లాడుతుంటడు. మడికట్ల మద్దెల పొర్లాడుతుంటడు. సిన్న కష్టం సేస్తడా? గంత గానం సేశినంక గూడ ఎన్నడు కాలునొచ్చే కడుపునొచ్చే ఆనలే…గొడ్డులెక్క పనిచేస్తడు.
ఎన్నడో నా పెండ్లయిన కొత్తల అన్నదమ్ములు పాలు పంచుకుంటే…ఈనకొచ్చింది ఎకరం బావు. పాలుకొచ్చిన దాంట్లనే తిన్నడు పండిండు. జానెడు జాగ ఉట్టిగుండనియ్యలె. మంచి పంటలు పండించిండు. పండించిందంతా ఇంటికే తోలిండు. బేరమాడుడు రాదని అన్ని నాతోటే అమ్మిపిచ్చిండు. ఆడోళ్ళయితే గీసి గీసి బెరమాడుతరంటడు. మల్ల ఒచ్చిన పైసలు నా దగ్గర్నేదాస్తడు. ఆడోళ్ళయితే అడ్డగోలు కర్సులు పెట్టరంటడు. ఏమమ్మితే ఎంతొచ్చింది. మొత్తమెన్ని పైసలు కూడినయ్యి…గిసొంటి లెక్కలన్నీ నోటికే ఉంటయి. ఒక్క బుడ్డపైస అటుఇటు కానియ్యడు. పేరుకు పెత్తనం నాది. మల్ల ఆయననుకున్నట్లే సాగిపిచ్చుకుంటడు.
పైసపైస సీమలెక్క కూడబెడ్తడు. జరన్ని పైసలు జమయ్యినంక పక్కపోంటున్న భూమి కొంటడు. ఇన్నెండ్లల్ల ఎకరం బావుని పదెకరాలు చేశిండు. ఐదెకరాలు కొడుకు పేరు మీద…ఐదు నా పేరు మీద రిజిస్టరు చేపిచ్చిండు. పిల్లలిద్దరికీ చెప్పొద్దని ఒట్టుపెట్టిచ్చుకుండు. మల్ల నా పేర జేశ్న భూమి కాయితాలు…కొడుకు పేరు మీద చేశ్న కాయితాలు యేడవెట్టిండో ఇయ్యాల్టి దాంక తెల్వనే తెల్వది. అందరి నడుమ తాకట్లు పెట్టనీకె, ఈళ్ల కాయితాలు ఆళ్ళకు…ఆళ్ళ కాయితాలు ఈళ్ళకు ఇచ్చిండనంగ ఇన్న. పిల్లలు గూడ నాకు ఇంత ఆయమియ్యరు.
ఎందుకయ్యా నా పేర జేశ్నవు అని బుల్గరిచ్చి అడిగితె, ‘కొడుకు పేరు మీద చేపిచ్చినంక, బిడ్డె పేర చెయ్యకపోతే…ఆల్లిద్దరి నడుమ కయ్యం బెట్టినట్టయితది…అందుకనే చెప్పొద్దంటున్న,’ అన్నడు.
‘మల్ల బిడ్డె పేర చెయ్యక…నా పేర ఎందుకు జేశ్నవు,’ అనడిగిన. నన్ను దగ్గరికి పిల్సి, కూసోబెట్టుకొని చెవుల జెప్పిండు. ’ రేపెమయితదో ఎవర్కి ఎర్కలే. మంచాయె చెడాయె. నీ పేరు మీద ఇంత ఆస్తి ఉంటే, మనిషి మూలకు పడ్డంక ఆశకన్న బుక్కెడు బువ్వ పెడ్తరు…ఆఖర్కి బిడ్డెకె ఇయ్యి భూమి గని. ఇద్దరి నడుమ పోటీ పెట్టాలె గప్పుడు నీకన్న యాలకింత పెడ్తరు.’ అంటడు.
‘కన్న పిల్లల మీద ఆశలు పెంచుకోవద్దు…ప్రేమలు పెంచుకోవాలె,’ అనన్న.
‘ప్రేమలు ఎల్లకాలం ఉండయి. కడుపులు నింపయి. బతికినన్ని దినాలు ఇవి తప్పయి.’
ఇగో గిసోంటి తాకట్లు పెడ్తడు పిల్లల నడుమ. ఏదన్న అడిగి చేస్తే…గిట్ల కాదు గిట్ల అని చెప్పొస్తది. అన్ని చేశ్నంక…ఊల్లె అందర్కి తెల్సినంక…ఆఖర్కి నాకు తెలుస్తది. ఏం జెయ్యాలె. నెత్తంత తెల్లగయ్యింది గని బుద్ధి మాత్రం రాలే.
చేశేటివన్ని చేస్కుంట పోతనే ఉంటడుగని…గా పన్లెంక ఏందో మతలబు ఉంటదనిపిస్తది. చేసేదానికి…చెప్పేదానికి నడుమ ఏదో సాపెత్యమున్నదనిపిస్తది.
పిల్లల మీద గింతగనం ప్రేమలుంటయా, మల్ల కోడలు పిల్ల తోటి మాట్లాడంగ ఇయ్యాల్టి దాంక సూడకపోతిని. మల్ల దాని మీద ప్రేముండదా అంటే…మస్తు పానం ఎల్లగొట్టుకుంటడు.
తల్లిలేని పిల్ల యాడికోతదని పట్టుబట్టి ప్రతి పండుగకూ ఈడికొచ్చిందాంక ఇడిసిపెట్టనే ఇడిసిపెట్టడు. నాకెప్పుడనిపిస్తనే ఉంటది…ఈనకు బిడ్డె మీద కంటే కోడలు పిల్ల మీదనే ఎక్వ పాయిరమున్నదని. ఓ నాడు ఎవ్వరు లేనిది సూషి అడిగిన, ‘ కోడలు మీద గంత ప్రేముంటది గద…మల్ల దానితోటి నోరుదెరిసి మాట్లాడితె…నోట్ల ముత్యాలు రాల్తయా?’ అని.
గప్పుడు గూడ ఏందో అర్తమయ్యి అర్తం కానట్టు చెప్పిండు. ‘గా పిల్ల ఈడికొచ్చినంక పొద్దుందాంక మీరిద్దరూ ఇంట్లనే కలిసుంటరు. ఒక్క తానుంటే పీకులాటలుంటయ్యి. నేను పలకరియ్యకపోతే…మాట్లాడకుంటె మీరిద్దరూ నా మీద పడి జెప్పుకుంటరు. మనకు దినాం ఎవని మీదనో ఒగని మీద పడి ఆడిపోసుకునుడు గావాలె. నేనే అందుకు దొరికిన్ననుకో మీరిద్దరు ఒక్కటైతరు. రేపు నువ్వు ముసలిగయినంక బిడ్డె తాన్నో…కోడలు తాన్నో కాలం ఎల్లదీయక తప్పది. గిప్పటి సంది మంచి గుంటె ఇద్దరి నడుమ ఇంగా మంచి సోపతైతది. తిట్టుకుంట పెట్టె బుక్కెడు బువ్వకంటే…ప్రేమ తోటి పెట్టె నాలుగు మెతుకులే కమ్మగుంటయ్యి…నాలుగు దినాలు సత్తువిస్తయ్యి.’ అంటడు. నాకేం అర్తం కాదు.
పెండ్లయ్యి ఇన్నేండ్లాయె, పిల్లలాయె ఆళ్ళ పెండ్లిల్లాయె, ఆళ్ళకు గూడ పిల్లలైరి. ఇగ రేపో మాపో మనుమరాలు పెండ్లి గూడ అయితది. అందరు అంతో ఇంతో అర్తమయితరు గని ఈన ఇంగేం అర్తమయితడు? అర్తమయితడు అన్న ఆశా లేదు…అర్తం కాలేదన్న బాధా లేదు. ఏం జేస్తం. ఎవరి ఖర్మ ఎట్ల రాసుంటే అట్లయితది. సంసారమన్నంక నాకు తప్పది. ఇంకెన్ని దినాలు పడాల్నో ఈ బాధలు. ఈ కట్టె కాలిందాంక ఒడుస్తయన్న నమ్మికం చీమ తలకాయంతగూడ లేదు నాకు.
*
నాకు బాగా నచ్చిన కథ. కథా రచయితలకు ఉపయోగపడగల చక్కటి విశ్లేషణ. ధన్యవాదాలు.
చాలా బాగారాసారు
సునిశితంగా పరిశీలించి, ఉన్నాడున్నట్టుగా చెప్పాలంటే… పరిశోధించి రాసినట్లు ఉంది. అద్భుతమైన విశ్లేషణ.
ఒక కథ చదివిన తర్వత చెంపలు తడుముకుంటే కంటి చెమ్మ చేతులకు తగిలితే అది మంచి కథ అంటారు యండమూరి వీరేంద్రనాథ్. సరిగ్గా ఈ మాటల్ని నిజం చేస్తాయి కొట్టం రాసిన కొన్నికథలు. అందులో ఇగరం గల్లోడొకటి. ఈ కథ నేను చదివినప్పుడే యండమూరి చెప్పిన అనుభూతికి లోనయ్యాను . కాకపోతె ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రికలో నిడివి ఆంక్షల వల్ల కొంత భాగం తగ్గించక తప్పలేదు . మాండలీకం రాయడం గొప్ప కాదు . మాండలీకం మధురంగ మధురంగా రాయడం గొప్ప. అది కొట్టానికి కొట్టిన పిండి . మంచి కథను ఎన్నుకోవడం ఒక ఎత్తు .. దాన్ని వివరణాత్మకంగా విశ్లేషించడం మరొక ఎత్తు . నీ రివ్యూ చాలా బాగుంది రవింద్రా. ధన్యవాదాలు.
ధన్యోస్మి.