ఏదో చెప్పాలి
కానీ
అదేమిటో అర్థం కావటం లేదు
అక్షరాల్ని కూర్చుకుంటూ
పదాలకు పదాలను అతుకులు పెడుతూ
గొంతులో చేరి గురగురలాడుతూనే ఉంది.
ముత్యాల చేరు పుటుక్కున తెగినట్లు
అంతలోనే బిందువులుగా మారి
కనుకొలకుల్లో చేరుతుందే కానీ
ఎంత ప్రయత్నించినా మాటలుగా మారటం లేదు
ఏదో చెప్పాలి
కానీ
అదేమిటో అర్థం కావటం లేదు
గుండెల్లో కణాలు సూదులుగా మారాయేమో
ఉండుండి గుచ్చుతున్నాయి
ఊపిరి తిత్తులను మృదంగం లా
లబ్ డబ్ అంటూ తారాస్థాయిలో
వాయిస్తూ ఆలోచనలను కట్టిపడేస్తుందే కానీ
అసావేరిలో ఆవేదనని ఆలపించనీయటం లేదు.
ఏదో చెప్పాలి
కానీ
అదేమిటో అర్థం కావటం లేదు
వేళ్ళసందుల్లోంచి జారిన క్షణాల్నిపట్టి
మాటలుగా మార్చుకోవాలని
పిడికిలి బిగించాను
తెరిచి చూస్తే శూన్యం
ముసిముసి నవ్వులతో వెక్కిరించిందేకానీ
పెదాలమధ్యా మాటలుగా మారలేదు.
ఏదో చెప్పాలనే ఉంది
కానీ
అదేమిటో అర్థం కావటం లేదు
చూపులు అడుగుల్ని లెక్కపెడుతూ
పాదముద్రలు వెతుకుతున్నాయి
పాదాలకింద పడి నలిగి
పద్యపాదాలుగా మారిన జ్ణాపకాల కోసం
కనిపించినంత మేరా
ఎంతగా చూపుల్ని సారించినా
ఒక్క జ్ణాపకం మాటలుగా అనువాదం కాలేదు
ఏదో ఏదో చెప్పాలనే ఉంది
కానీ
మెదడు ముడతలఅలల మధ్య
ఏర్పడిన వాయుగుండాలలో
గింగిరాలు తిరుగుతున్న అనుభవాల్ని
మాటలుగానో,పాటలుగానో కాకపోయినా
అక్షరాల్ని పదాలుగా కూర్చి
పేపరు మీద కాకపోయినా
మనసుని మీ ముందు ఆకాశంలా పరిచి
ఇక కవితలా ప్రవహించక తప్పదు.
*
ఏదో చెప్పాలని
మరే గుట్టో విప్పాలని
ఎన్నిసార్లు అనుకున్నా
కవితలా ప్రవహించడం వినా
మాటలుగా పెగలడం లేదు
మౌనం కన్నీటిని అయినా బహూకరించడం లేదు
అమ్మా
మీకు నమస్సులు
అద్భుత కవితగా ప్రవహించినందుకు
ధన్యవాదాలు సుధామురళిగారూ
చెప్పాలనుకున్నదంతా చెప్పకనే చాలా శక్తివంతంగా చెప్పేసారు.
అభినందనలు ఆంటీ💐🙏
Thank you very much Kavita