ఇక అతన్ని నేను కలవలేను!

I need you, the reader, to imagine us, for we don’t really exist if you don’t.

  • Vladimir Nabokov

 

వాళ నేను కోల్పోయిన వొక ఉత్తమ చదువరికీ, మానవ ప్రేమికుడికీ తుది వీడ్కోలు చెప్పడానికి ఈ నాలుగు మాటలు రాస్తున్నాను. ఇప్పుడైనా అతన్ని కలిసి పలకరించకపోతే అతని విషయంలో నేను చేసిన పొరపాట్ల నించి నాకు విముక్తి లేదు. నేను హైదరాబాద్ లో వున్నప్పుడు తను నాకు రెండు మూడు ఈ-లేఖలు పెట్టాడు. తప్పక కలుద్దామని నేనూ అనుకున్నాను. కాని, కలవకుండానే వచ్చేశాను. ఎందుకంటే, అతన్ని మళ్ళీ ఏ ఎండా కాలంలోనో వచ్చినప్పుడు తప్పక కలుస్తానన్న ఆశా, నమ్మకం వున్నాయి కాబట్టి. అది ఎంత పొరపాటో ఇప్పుడు అర్థమవుతోంది. ఇక అతన్ని నేను కలవలేను.

పారిజాత శరత్ చంద్ర ఇక లేడు. నలభై అయిదు కూడా నిండా నిండని అతన్ని మృత్యువు ఎందుకు అంత తొందరపడి లాక్కు వెళ్లిందో అర్థం కాదు. అదీ- వొక రోడ్డు ప్రమాదం రూపంలో!

పారిజాత శరత్ చంద్రగా ముఖపుస్తకంలో అతనికి ఎక్కువమంది స్నేహితులు లేకపోవచ్చు. అతని ప్రపంచం చాలా చిన్నది. కాని, గత అయిదారేళ్ళుగా అతను నాకు రాస్తూ వచ్చిన ఈ-లేఖల్లోనూ, అతని ముఖ పుస్తకం గోడ మీది మెరుపు రచనల్లోనూ అతనిది చాలా పెద్ద ప్రపంచం. ఆలోచనల ప్రపంచం. అనుభూతుల ప్రపంచం. పుస్తకాల ప్రపంచం. ఇవాళ ముఖ పుస్తకంలో అతను నాకు రాసిన ఉద్వేగభరితమైన ఈ-లేఖల్ని చదువుకుంటూ వుంటే, ఇలాంటి చదువరులు, ప్రేమజీవులు ఇంకా ఈ లోకంలో వున్నారా అని కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది.

కొన్నాళ్ళ కిందట పారిజాత శరత్ చంద్ర ముఖపుస్తకంలో నాకు స్నేహ హస్తం అందించినప్పుడు దాన్ని నేను అందుకోలేదు. కేవలం శరత్ చంద్ర అయితే అందుకునే వాణ్ణేమో! కాని, అటు పక్కని పారిజాతం చేరేసరికి అది నకిలీ ముఖం అనుకున్నా. చాలా కాలం పాటు అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ అట్లా వుండిపోయింది. ఇప్పటికీ దాదాపు రెండు వేల అలాంటి రిక్వెస్టులు మిగిలివున్నాయి. కాని, కొన్ని రోజుల తరవాత శరత్ చంద్ర నాకొక ఫోటో పంపించాడు. అప్పటికే అతని కామెంట్స్ చూస్తూ వున్నాను. ఫోటో పంపించిన తరవాత, ఆ కామెంట్స్ చదువుతూ ఇతను నకిలీ కాదని అర్థమవ్వడానికి చాలా సమయం పట్టింది.

పారిజాత శరత్ చంద్ర అసలు పేరు జొన్నలగడ్డ లక్ష్మీపతి రావు. స్నేహితులు అతన్ని వాసూ అని పిలుస్తారు. రావులపాలెం జీవిత భీమా ఆఫీస్ లో ఉద్యోగి. అసలు వూరు తణుకు. గోదావరి అంటే ప్రాణం. ఆ గోదావరి మీది వెన్నెల అంటే మరీ ప్రాణం. అది వదులుకోవడం ఇష్టం లేక ఉద్యోగంలో పెద్ద అవకాశాలు వచ్చినా రావులపాలెం విడిచి ఎక్కడికీ వెళ్ళలేదు. ఇద్దరు చిన్న పిల్లలు. నిన్న తణుకు నించి రావులపాలెం రాయల్ ఎన్ ఫీల్డ్ మీద వస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వేగంగా వస్తున్న లారీ కొట్టిందని అంటున్నారు.

శరత్ చంద్రకి సొంతూరు అంటే యెంత ఇష్టమో, ప్రయాణాలూ అంతే ఇష్టం. అయినా, తొలి ప్రేమ సాహిత్యమే! అటు తెలుగు ఇటు ఇంగ్లీషు సాహిత్యాలని సమానంగా చదువుకున్న తనకి పుస్తకం చదవడం కూడా వొక గొప్ప ప్రయాణమే! పుస్తకం అంటే వొకసారి చదివి, అవతల పెట్టేది కాదని, వొకటికి పదిసార్లు చదివేదని అనేవాడు. చలం ప్రేమలేఖల్లో ఏ పేజీలో ఏముందో యిట్టే చేప్పేయగలడు. నా కవిత్వం “ఇంటి వైపు” వెలువడినప్పుడు ముఖపుస్తకం మీద అతని ప్రతిస్పందన రాస్తూ, శరత్ చంద్ర అంటాడు:

తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ ట్యూషన్ కి వెళ్ళేవాడిని. ఒక రోజు ఆ పక్కన ఉన్న ఒక ఇల్లు కూలగొట్టారు. ఎవరో కొనుక్కున్న వాళ్ళు పాత ఇంటిని కూల్చి కొత్తగా కట్టుకుంటున్నారు. ఇంట్లొ అవసరం లేని వస్తువుల్ని… పుస్తకాల్ని.. బయట పడేసారు. చిన్నప్పటినుంచీ చదివిన చందమామ కథల పుస్తకం వల్ల కలిగిన అభిమానం తో మంచి పుస్తకం కోసం వెతికాను ఆ పారేసిన దృక్కుల్లో.. అప్పుడు ఒక పుస్తకం దొరికింది. అది “మహా ప్రస్థానం” , అదొక జీవన వేదం.

డిగ్రీ చదువుతున్నప్పుడు “ప్రేమలేఖల” పరిచయమూ ఇలాంటి ఊహించని సందర్భాలలోనే కలిగింది. వెతుక్కొని ఏదీ సాధించలేదు నా జీవితంలో ఇప్పటిదాకా. “డెస్టినీ” అంటామే అలా .. 
సముద్రం దగ్గరకి వెళ్ళాలనే తపన ఉంటే చాలు.. ఎప్పుడు అల నీ పాదాలు తాకి గిలిగింతలు పెడుతుందో.. ఎప్పుడు నువ్వు నిలువెల్లా అదే సముద్రమయిపోతావో అది అప్రస్తుతం… నీకు తెలియకుండా నిన్ను నడిపించే తపన ఉంది చూడూ.. అదే నీ డెస్టినీ..”

వొక పుస్తకం చేతికి అందడంలో మన డెస్టినీ వుందంటాడు శరత్. అదే మనల్ని వెతుక్కుంటూ వచ్చి తీరుతుందని అతని గాఢమైన నమ్మకం. ఇవాళ అతని గోడని కన్నీళ్ళతో తడుముతూ వెళ్తే, మొదట శ్రీశ్రీ “మహాప్రస్థానం”, తరవాత మార్క్వేజ్ one hundred years of solitude, రూమీ కవిత్వం, ఖలీల్ జిబ్రాన్ Prophet, టాగోర్ గీతాంజలి ఇంకా అనేకం! నా కవిత్వం పట్ల అతనికి ప్రత్యేకమైన ప్రేమ. “అన్నయ్యా, ఇది soul connection!” అనే వాడు.

శరత్ చంద్రకి రాయడం మీద ఆసక్తి లేదు. చదవడం మాత్రమే తన పని అనుకునే వాడు. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిన్న కవితలు రాసినా అవి కేవలం స్నేహితుల ప్రోద్బలం వల్ల, వత్తిడి వల్లా రాసినవే.

కచ్చితంగా రెండు నెలల కిందట ఇలా రాశాడు:

ఇంకా తడి కోల్పోని ఈ ఆకు తొడిమని చూసినప్పుడల్లా.. కొన ఊపిరితో ఉన్న ఆశని తట్టి లేపుతున్న నీ జ్ఞాపకాల స్పర్శ తగిలిన అనుభూతి.
నిన్ను ధ్యానించడం.. నువ్వు జీవించే ప్రతీ క్షణాన్నీ నేను అనుభవించడం.. ఇవేగా నా జీవన వేదం
ఇదిగో.. అప్పుడప్పుడూ ఇలా కురిసే వేసవి చినుకు చల్లదనముందే, అది నా నుంచి నీదాకా చేరి మట్టి పూల పరిమళమవుతుంది చూడూ.. అదే నన్ను బ్రతికిస్తున్న ఊపిరి.
ఇలా ఈ దూరం ఇంకా ఎన్నాళ్ళూ.. అని నిన్ను బతిమాలుకుంటాను.
నువ్వు ఆడుకుంటున్న ఆ సముద్రంలో ఊయల లాంటి అలనై నిన్ను చేరుకోవాలని ఆశ పడుతుంటాను.
ఇదిగో ఇలా నిన్ను చేరాక.. నా ఉనికినే చెరిపేసే ఏ పాదాల కరుకుదనమైనా ఎంతలే.. నీలో కలిసిపోయి ఫనా అవడమే కదా ఈ చిన్ని ప్రాణం కోరుకునేది. (ఏప్రిల్ 26)

నీకు తెలుస్తూనే ఉంటుంది.
రాబోయే రోజులు మరింత గొప్పగా ఎమీ ఉండవని.
అయినా ఎదురు చూస్తావ్. నొప్పి తీవ్రత తెలిసినా.. మరో అనుభవం కోసం మనసు తలుపులు తీసి చూస్తూనే ఉంటావ్. కిటికీ అవతల బుజ్జి పక్షి నీ వేపే చూస్తుంటుంది. పరధ్యానం లో పడి, నువ్వు వేయడం మర్చిపోయిన గింజల కోసం మూగగా ఎదురు చూస్తుంది. 
కనీసం.. ఈ నిట్టూర్పు తర్వాత అయినా చుట్టూ పరికించి చూడు. అన్నీ బాగానే ఉన్నాయ్. కాంక్రీటు కట్టడాలు.. రోడ్డు మీదెళ్తున్న వాహనాలూ.. అన్నీ…
ఇదిగో.. ఈ పారిజాతం, రావి చెట్టూ.. అక్కడ పొదుగుతున్న బుజ్జి పక్షి.. నెమ్మదించిన సముద్రం.. ఇవే మన కోసం ఎదురు చూస్తున్నాయి.
ఏం కావాలి మనసుకి. 
తెలుస్తోంది కదూ… ఏప్రిల్ 21

శరత్ చంద్ర చివరి లిఖిత వాక్యాలు  ఇవి :

ఫనా.. ! ప్రతీ క్షణం నీ నడకల సవ్వడి వింటున్నా కాలు కదపలేని అశక్తత నాది.. నీ గొంతు గలగలలనూ .. గాలి తిమ్మెరలు మోసుకొచ్చే నీ కమ్మని ఊసులనూ వింటూ ఎపుడెపుడు నిన్ను కలుస్తానా అని కలలు కంటూ ఉంటాను.. బంగారూ .. నా కన్నీళ్ళు కన్నావా.. నా మొర విన్నావా.. అందుకే నన్ను నీలో ఐక్యం చేసుకోవడానికి ఉరుకులుపరుగులతో వచ్చావా.. రా మరి.. నేనిక్కడ తప్పస్సే చేస్తున్నా… నీలో ఫనా అయిపోయి నా ఉనికిని కోల్పోవటానికి..

 శరత్ చంద్రది రాసే చెయ్యి కాదు, పుస్తకాల్ని దగ్గిరకి హత్తుకొని గుండెలో దాచుకునే చెయ్యి. అతనిలాంటి చదువరులు మనకి తక్కువ. కేవలం ఆ చదువులోంచి అతను అంత జీవన తపనని ఎలా వెలిగించుకున్నాడా అన్నది నాకు ఆశ్చర్యం!

“ఇంటి వైపు” ఆవిష్కరణ రోజు అతను వచ్చాడట. నా చుట్టూ చాలా మంది వుండడం వల్ల  కనీసం కరచాలనం ఇవ్వలేకపోయాడు అంత దూరం రావుల పాలెం నించి వచ్చి- అతను అక్కడే వున్నాడని కనీసం నాకు తెలీదు, మర్నాడు అతను ఈ-లేఖ రాసేదాకా-

“అన్నయ్యా, చూశాను అంతే చాలు. విన్నాను అంతే చాలు. పైగా ఇప్పుడు మీరు ఎప్పుడూ నా గుండెల మీదే వున్నారు “ఇంటివైపు” పుస్తక రూపంలో”

అవి నాతో అతని చివరి మాటలు!

ఇవాళ అతనే నాతో ఇలా అంటున్నాడు తనకెంతో ఇష్టమైన రూమీ వాక్యాన్ని గుర్తు చేస్తూ, అతని పేరులో చంద్రుణ్ణి పొదువుకున్నాడు  కాబట్టి.

“I am like the moon, you see me everyday with a new face.”

*

అఫ్సర్

26 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనసున్న మహా పాఠకుడు.
    ఆత్మ శాంతించు గాక.

  • …ఓహ్, లోలోపల మెలిపెట్టే విషాదమ్…శరత్ వారికి ఆత్మీయ నివాళి…

  • ఎ గ్రేట్ ఎలిజి.
    కలవని దూరాలే బహు దగ్గర.

  • అద్భుతమైన కోట్ తో మొదలుపెడితే…చివరకు మిగిలింది విషాదం.
    కలవాలి, వీలైనంతమందిని పలకరించాలి. వాళ్ళు పోయిన తరువాత చేసేదేమి లేదు!

    • చాలా బాగా చెప్పారు—-

      సూరంపూడి కామేష్

  • ఓ గొప్ప చదువరి.మీరన్నది నిజమే.అందుకే అందరికన్నా ముందుగా ఆత్రుతగా చదివేస్తూ చివరాఖరి పేజీకి చేరుకున్నారు.

  • ఏంటో జీవితం మరీ దుఖఃమయమై పోతోంది , నివాళుల పాడు కాలం దాపురించి ఎప్పుడు ఎవరి పేరు కనబడుతుందోనని భయం భయం గా ఉంది .

  • Heartbreaking అండి. అంత గొప్ప భావుకుడు, పుస్తకప్రేమి, సాహిత్యారాధకుడు అంతలో మాయమయిపోవడం.

  • RIP for a reader and spirit.కొన్నంతే కోల్పోతేనే కానీ అర్ధం కావుspiritual connection wonderful bond which breaks the physical and gender limit.only some blessed people can understand meaning of this bond.you bring vasu to our heart sir

  • ఇలాంటి ఒక్క పాఠకుడున్నా అక్షరం “అక్షరం” అవుతుంది . అలాటి ఒక్క పాఠకునికోసమే వ్రాయాలనిపిస్తుంది … ఎంత ఆర్ద్రత నింపారో …. ఆయన స్ఫూర్తిశేషుడు . మీరు ధన్యజీవులు … ఆ బుజ్జి ఆత్మను ఇక అనుక్షణం అనుభూతించగల సూక్ష్మ రూపం లోకి మారారన్నమాట ….

  • చాలా బాధాకరం సర్, ఆయన మీకు చాలా పెద్ద అభిమాని అని అర్థం అవుతోంది. మరణం ఎప్పుడూ భయానకమే, అందులోనూ అకాల మరణమంటే… అంతకుమించిన విషాదం మరింకేదీ లేదు.

  • ఇంత అద్భుతమైన , అర్థవంతమైన ప్రయాణం ఇలా అర్థాంతరంగా ఆగిపోయినందుకు చాలా దుఃఖంగా ఉంది న్నా…

  • మాటలు రావటం లేదు….. మంచి స్నేహితుడు ని కోల్పోయినాము. Hard to lose and impossible to forget.

  • అవును జీవితములో దుఃఖము ఏదైన వుందంటే ఇదిగో ఇలానే వుంటుంది. మనము దేన్నైతే వదిలేస్తామో ..దానికోసము పరుగులుతీస్తు వెళ్ళెసరికి అంతా అయిపొయివుంటుంది– ఆ బాధ నిరాశ అనుభవమే కాని—-

  • వాసూ… నువ్వెంతగానో ప్రేమించే మీ అఫ్సర్ అన్నయ్య చూడు.. నీ గురించి ఎంత గొప్పగా రాసారో. నువ్వు పెద్ద మోసగాడివి. మా అందరికీ చేసిన ప్రామిస్ లు అన్నీ మట్టిలో కలిపేసావ్. ఎలా బతకాలి మేమంతా.

  • కన్నీళ్లు జల జలా కారుతున్నాయి అఫ్సర్ జీ.. అతను మళ్లీ వస్తే బాగుండనిపిస్తోంది కదా..? మీరూ గుండెతడిలో ముంచి రాశారు ప్రతి అక్షరం.. మీ మది అలజడులూ అక్షరాల్ని తాకినట్టున్నాయి.. అవి మాలోనూ అలజడలు కలిగించాయి.. మంచివాళ్లంతా ఇలా అర్ధాంతరంగా ఎందుకు వెళ్లిపోతారో.. మీరన్నట్లు చంద్రుడున్నంతకాలం శరత్ చంద్రను మర్చిపోలేం.. ఆకుల్ని చూసినంతకాలం అగుపిస్తూనే ఉంటాడు.. పూలున్నంతకాలం అతని అక్షరాలు మనందరిలో పరిమళిస్తూనే ఉంటాయి.. శరత్ చంద్రకు అశ్రునివాళులు..

    మీ సున్నిత మనసు మరోసారి ఆవిష్కరించారు..మీకు సలామ్..

  • అతని ముఖ చిత్రంలో కొన్ని భావవ్యక్తీకరణలు చదివాను. అతనిలో వున్న భావోద్వేగం నేనెరుగుదును. పారిజాత శరత్ చంద్ర ని నాతో సహా చాలా మంది మిత్రులకు తెలియదు. మంచి మిత్రుడు ని మ్రృత్యువు దూరం చేసింది. అంత కర్కశంగా తీసుకెళ్ళకుండా(శరీరాన్ని)ఉండాల్శింది.

  • అఫ్సర్ గారు, శరత్ చంద్ర గారికి కలుసుకోలేకపోయినా అర్థం చేసుకున్నారు, మీ భావాలని మాతో పంచుకున్నారు. అదే గొప్ప నివాళి!

  • నాకు బాగా గుర్తు ఉంది అఫ్సర్ సార్ … పారిజాత గారి నుంచి మెస్సెంజర్ లో చాట్ చేయడానికి రిక్వెస్ట్ వచ్చింది …వర్క్ టెన్షన్ లో ఉంది ఏదో నకిలీ అక్కౌంట్ అని డిలీట్ చేశాను .. ఫేస్ బుక్ లో వస్తే కనీసం ప్రొఫైల్ చూసేవాడిని .. ఇప్పుడు తన వాల్ చూస్తుంటే తాను మంచి రీడర్ అని అర్థం అవుతుంది … తాను నాతొ సంభాషించాలనుకున్నాడు .. నాకు ఎదో చెప్పుదామనుకున్నాడు .. ఇప్పుడు కొంచెం సిగ్గుగా ఉంది అతని పరిచయం కోల్పోయినందుకు . ఒక మంచి రీడర్ తో ముచ్చట పెట్టె అవకాశం కోల్పోయాను … లోకం ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది 🙁

  • హృదయాన్ని హత్తుకుని, వెంటాడే జ్ణాపకం.
    తాజ్ మహల్ గురించి ‘కాలం చెక్కిలిపై కన్నీటి చుక్క’ రవీంద్రనాథ్ టాగోర్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
    మళ్ళీ మళ్ళీ చదువుతుంటే, పారిస్ వీధుల్లో ఎర్నెస్ట్ హెమింగ్వేని జీవితంలో ఒకే ఒక్కసారి చూసి మాట్లాడాలా, అభిమానాన్ని తెలపాలా అన్న వూగిసలాటలో పడిపోయిన సన్నివేశాన్ని అక్షరబధ్ధం చేసిన మార్క్వెజ్ మాటలు గుర్తుకు వచ్చాయి.
    శరత్ చంద్ర గారి స్మృతికి జోహార్లు.

  • పారిజాత శరత్ చంద్ర అనే వాసు నాకు అత్యంత ఆప్తుడు.
    ప్రాణస్నేహితుడు వాసు ఇక లేదు
    చిన్నతనం నుండి చివరి యాత్ర వరకు………
    మాటలు లేవు అశ్రుధారలు తప్ప……..
    అప్పుడే ఈ రోజు 10 వ రోజు…. నిజం గా దేవుడు దయలేని వాడు….
    సూరంపూడి కామేష్
    న్యాయవాది
    తణుకు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు