ఇక్బాల్ చంద్ కవితలు మూడు

ముప్పొద్దులా వొర్షంలో ఈ బెంగళూరు రాత్రి
మూడు రోజులనీంచి ఇంటికి రాని భర్తకోసం
నిరీక్షీస్తోన్న పిల్లల తల్లిలా వుంది-

1

రాత్రి బెంగళూరు

1.
వెలుగు జిలుగుల వొర్షం రాత్రి బెంగళూరు –
సిగరెట్టు ముట్టించడానికి మోడ్రెన్ ఉమెన్
లైటర్ని అడుగుతున్నట్లుగా వుంది-
2.
రామ్మూర్తి నగర్ ఫ్లైఒవెర్ కింద తడుస్తూ
దొంగచాటుగా మోటు గాంజా అమ్ముకొంటూన్న
అర్థనారీస్వరులకు విటులు దొరకడంలేదు-
అన్న సాంబారుకు కాసులు ఇల్లప్పా!

3.
చలి వొణికిస్తోంది
వెచ్చబరచలేని ఖాలీ ఓల్డ్మంక్ సీసా నిర్దయగా వెక్కిరిస్తోంది-

4.
ముప్పొద్దులా వొర్షంలో ఈ బెంగళూరు రాత్రి
మూడు రోజులనీంచి ఇంటికి రాని భర్తకోసం
నిరీక్షీస్తోన్న పిల్లల తల్లిలా వుంది-

5.
ఈ వొర్షం రాత్రి బెంగళూరు
సిగరెట్టు ముట్టించడానికి
సిగర్ లైటర్ లేదు అన్నందుకు
ముద్దుగా మత్తులో తిట్టుకొంటూ
కనుగీటి వెల్తున్న నాగరీకపు వానజల్లు-

 

2

బెంగళూరులో వొకానొక సాయంత్రం

వొళ్ళు విరిచి కనుమీటుతూ
మాయమయ్యే కావ్యనాయిక లాటి మబ్బులు-

రెండు చప్టీల మత్తుదనపు వీకెండ్,
బహుకాలానికి పలకరిస్తొన్న శైశవపు పీడకలలు-

బలాదూర్ ప్రయాణాన్ని చెరిచి
ఆత్మహత్యించుకొమ్మని బెదిరొస్తూ ….

వొర్షించని ఆకాశంలోంచి
డబ్బాలో రాళ్ళ కరకు శబ్దాలు –

దాహం పై కనికరించని
నిష్ఫల ఋతువు

తప్పకుండా రమ్మని వొట్టేయించుకొన్న మిత్రుని
ఇంటిముందు తలుపు కి
వెక్కిరిస్తున్న
అపనమ్మకపు రంగు తాళపుకప్ప-

*

3

కాఫ్కా : ఇన్ ద పీనల్ కాలని

1.
హత్యలు పలు రకాలు
పలు రూపలు
పలు నామాలు

నేరానికి మరణశిక్ష
కాని, అమలు చేసే మంత్ర యంత్రానికి
హత్యా పాపం అంటుకోదు-
నేరగాడీకి నేరమేమిటో తెలీదు,పోనీ చెప్పరు-
ఇది రాచవ్రణం

2.
నేనో పరదేశ పరిశీలకుణ్ణి
రేపటి ఉదయానికి శెలవు తీసుకొనేవాణ్ణి
మిత్రమా!
నిన్ను రక్షించలేని నా రిక్త హస్తాలకు నీ రక్తపు చుక్కలు-
ఎవరికీ జవాబుదారి కాకపోయినా ఏ సాక్షమూ చెప్పలేవు-
కాని,
హత్యోదాంతాన్ని మాత్రం అంగీకరించలేను-

*

ఇక్బాల్ చంద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు