మళ్ళీ ఎర్ర చొక్కా వేసుకున్నాను
ఎప్పుడో ఇంటి దగ్గర అమ్మ ఉతికాక
తేలిగ్గా తొడుక్కునే వాణ్ణి
ఇప్పుడు ఇక్కడ తొడుక్కుంటే
నాన్న నెరపిన మిరపకాయల కళ్లంలో
కాళ్ళు చాపి పడుకున్నట్టు, లేకపోతే
కళ్ళమే లతలు లతలుగా నన్ను పెనవేసుకున్నట్లు
నేనే ఒక కళ్ళమై పోయినట్టు
ఎర్రగా మారినట్టు ఉంది
ఈ మార్చురీ నగరంలో చూద్దామంటే ఎరుపే లేదు.
కనీసం మనిషి నెత్తురైనా కానరాదు.
అదెప్పుడో చల్లబడి నల్లగా గడ్డకట్టుకు పోయింది.
ఇక్కడ ఎరుపు లేదు.
తెల్లటి ఎండ, ఎలుక పీలికలు చేసిన దూది గుబ్బలా కాయటం తప్పా
మరో వెలుగు లేదు.
చిలక ముక్కు నక్షత్రాలు రాత్రికి వస్తాయి, రాత్రిలోనే కలిసిపోతాయి.
ఒక్కటైనా దయగా చనువుగా ఈ నగరం గుండెల మీద వాలదు.
ఇక్కడ ఎరుపుకి ఆనవాళ్ళే లేవు.
అది వాహనాల పొగగొట్టాల్లో ఎప్పుడో చెదిరిపోయింది
ఎరుపంటే తెలియని నగరంలో
మనిషి ఏడుపు కూడా ఒక మురికి కాలువే.
నా ఈ ఎర్రని చొక్కా
నల్లగా మారుతుందేమోనని భయంగా వుంది ఈ నగరంలో
మమ్మ ఉంటే ఉతికి మళ్ళీ ఎర్రగా చేసేది.
*
ఎఱ్ఱ చొక్కా!! మాయని ఎరుపే మల్ల
Chalaa bavundi tammudu..
చివరి మూడు వాక్యాలు ప్రాణం కవితకు తమ్ముడు
బావుంది♥️