వృత్తం లోపల వృత్తం ఉన్నట్టు
ఇంటిలోపల ఇల్లును చూసారా ఎప్పుడైనా
స్టీలు దుకాణం వాడు
పాత్రలో పాత్రలో పాత్రను పెట్టినట్టు
ఇంటిలోపల ఇల్లును ఎప్పుడైనా చూసారా!
నడుస్తున్న నత్త నడకకు ఏ అడ్డం వచ్చినా
అది తన ఇల్లును తన కళ్ళారా చూసుకోలేదు.
నేను నిన్న ఒక ఇల్లులోపలి
ఇల్లును చూసాను.
ఎవరు మాట్లాడినా
మేం అంతా ఆ ఇంట్లోనే ఉన్నట్టుండి అన్నారు
మేము అన్నవారి అందరి ఇళ్ళల్లోను
ఇక కాలంలో వున్నాం!
మాట్లాడిన వారందరి మాటల్లోనూ
ఇల్లు భౌతికం కాదు ఆత్మికం అనే భావనే ధ్వనించింది.
అదే ఇంటిలోపలి ఇల్లు
నువ్వు దర్శించాలేగానీ
లోపలి ఇల్లు
ఒక లుంబిని
నువ్వు ధైర్యం చెయ్యాలేగానీ
లోపలి ఇల్లు
ఒక అనుభవ మంటపం-
నువ్వు దర్శించాలేగాని
లోపలి ఇల్లు
ఒక సబర్మతి
నువ్వు గుండె దిటవు చేసుకోవాలేగానీ
లోపలి ఇల్లు ఒక రాజగృహం-
ఒక్కసారి
నువ్వు లోపలి ఇంట్లోకి వెళ్లి వచ్చావంటే
వేసవి గడుపు
మలయ సమీరమై వీవనలు వీస్తుంది.
నువ్వొకసారి ఇంటిలోపలికి వెళ్లి వచ్చావంటే
గజగజ వణికించే చలి
నిప్పుల కుంపటియై నిను వెచ్చచేస్తుంది.
ఒకసారి నువ్వలా లోపలి
వెళ్ళొ చ్చావంటే చాలు
జలజలమని కురిసే జడివాన
నీ శిరసు మీద కవిత్వపు గొడుగై విచ్చుకుంటుంది.
ఇప్పుడు నువ్వూ నేనూ మనందరం చేయాల్సిందల్లా
ఇంటిలోపలి ఇంటికి వెళ్లడమే.
బహుశా
ఆ లోపలి ఇంటిపేరు కవిత్వం అనుకుంటాను –
(డా|| ఎస్వీ సత్యనారాయణగారి ఇంట్లో జరిగిన పరుచూరి రాజారాం పురస్కార ప్రధాన సభను చూసి
దాట్ల దేవదానం రాజుగారు అన్న మేమూ మీ ఇంట్లో వున్నాం అన్న మాట విన్నాక)
నీ శిరస్సు మీద కవిత్వం గొడుగై
ఒక అనుభవాన్నే అనుభూతిగా సంభావించుకోవడమే కవిత్వం అన్నమాట నిజమైంది. జూమ్ వేదికలు ఎన్నో ఇళ్ళను ఒకే ఇల్లుగా మార్చింది. కరోనా సమయం ఎన్నో ఇల్లను పరిచయం చేసింది. ఎందరో మనుషుల్ని దగ్గరగా చూపెట్టింది. యధాలాపంగా అన్న మాట ఒక కవిత పుట్టుకకు కారణమవ్వడం అదీ మంచి కవితగా రూపుదిద్దుకోవడం అద్భుతం. అభినందనలు, శిఖామణి గారూ
బావుంది..ఎప్పటిలానే…
స్టీలు దుకాణం వాడు
పాత్రలో పాత్రను పెట్టినట్టు/ఇంటిలోపల ఇల్లును అద్భుతంగా చూపించారు.మనిషి పట్లా ఎంతో ప్రేమ కలిగిన లోపలి ఇల్లు ఎస్వీ సత్యనారాయణ గారికి, మంచి కవితనందించిన శిఖామణి గారికి ప్రచురించిన సారంగ సంపాదకులకు నా అభినందనలు
స్టీలు దుకాణం వాడు పాత్రలో పాత్రను పెట్టినట్టు/ఇంటిలోపల ఇల్లును అద్భుతంగా చూపించారు.మనిషి పట్లా ఎంతో ప్రేమ కలిగిన లోపలి ఇల్లు ఎస్వీ సత్యనారాయణ గారికి, మంచి కవితనందించిన శిఖామణి గారికి నా అభినందనలు
బుద్ధుని లుంబిని
బసవని అనుభవ మంటపం
గాంధీ సబర్మతి
అంబేద్కరుని రాజగృహం
ఎక్కడనుంచి ఎక్కడకు లింకు చేసుకొంటూ వచ్చారు సర్. గ్రేట్ పొయెం.
అందరం చేయాల్సింది ఇంటిలోపలి ఇంటికి వెళ్ళడమే.
అంతే కదా… గ్రేట్ సర్.
ఇంటి లోపల ఇల్లు తరచూ వెళ్లాల్సిన ఇల్లు… బావుంది శిఖామణి మార్క్ స్వచ్ఛ కవితా సుగంధం.