“ఇంటర్” రమణ – ఆర్ద్రతకి చిరునామా!

“కవిత్వం ద్వారా సమాజం మారాలని కోరుకుంటున్నాను. తెలుగు భాష బాగుపడాలని కోరుకుంటున్నాను.”

ఎం. వెంకటరమణ- ఈ ఏడాదే ఇంటర్ మొదటి సంవత్సరం శ్రీకాళహస్తి ప్రభుత్వ కళాశాలలో పూర్తిచేశాడు. పుట్టింది- మతకాముడి గ్రామం- నెల్లూరు జిల్లా. పదవ తరగతి వరకూ చదవిన పాఠశాల- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దామనెల్లూరు. వెంకటరమణ గురువు అతని తెలుగు టీచర్ సుంకర గోపాలయ్య. నాన్నలేని ఇంటిని అతని అమ్మే వీధుల్లో నేరేడుపల్లు అమ్మి వచ్చిన సంపాదనతో నెట్టుకొస్తుంది. బతుకు కన్నీళ్లను స్వీయానుభవంలోంచి గ్రహిస్తున్నాడు కాబట్టి వెంకటరమణ కవిత్వం ఆర్థ్రతని పొదిగివుంది.‌ సౌకుమార్యమైన లాలనని అతనికి అతనే కవిత్వం ద్వారా అందించుకుంటున్నాడా అని అతని కవిత్వం చదివితే అన్పిస్తుంది. హైస్కూల్ దశలో వెంకటరమణ భుజం మీద చెయ్యేసి రెండేళ్లపాటు నడిపించిన అప్పటి అతని తెలుగు గురువు- ఇప్పటి కాకినాడ పి.ఆర్. డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధిపతి సుంకర గోపాల్ గారు ఎంతైనా అభినందనీయులు.

°

ఎం. వెంకటరమణ కవిత్వం

 

కవిత : 1
ఏం నాన్నా వెళ్లిపోయావ్
°

ఏం నాన్న వెళ్లిపోయావ్
నేనేం చేశానని
నన్ను మోసం చేసి వెళ్లిపోయావ్
నా మనసుకు జోల పాడకుండానే
కళ్లకు గంతలు కట్టి
శాశ్వతంగా దాక్కున్నావా
జీవితం అంటే ఏంటో చెప్పకుండానే
కన్నీటి సంద్రంలో వదిలేస్తావా
నీ దారిన
నువ్వు వెళ్లి
నన్ను ఒంటరి మొక్కలా చేసావెందుకు
ఈ బాధకు తాళం వేసేది ఎవరు
నా హృదయమే నువ్వు
నీవు లేని బాధ
గుండెల్లో సూది దిగినట్టుంది
నీ జ్ఞాపకాలు తొలుస్తున్నాయి
నా జీవిత ప్రయాణంలో
నువ్వు లేని కాలం
అశ్రువుల కడలిలా ఉంది
ఏం నాన్నా వెళ్లిపోయావ్

కవిత : 2
ప్రేమ
°

ప్రేమ
సంద్రంలో ఉండే ముత్యపుచిప్ప
మనసుని పట్టుకు వేలాడే నెలవంక
ప్రేమ
రెండు హృదయాల భావం
ఎడారిలో
వాన కురిపించగల బలం ప్రేమ
ఎండమావిని
సెలయేరు చేసే శక్తి ప్రేమ
అనుమానం, అపార్థం, స్వార్థం లేని
చక్కటి తావు ప్రేమ

°

విద్యార్థి కవి అంతరంగం:

1. నీ మొదటి కవిత ఏది ? ఎందుకు రాయాలనిపించింది?
జవాబు: నా మొదటి కవిత సైకిల్ మీద రాశాను. మా సారు తరగతిగదిలో కవితలు వినిపించేవారు. పుస్తకాలు ఇచ్చి చదివించేవారు. ఆ ప్రేరణతో రాయాలి అనిపించింది

2. కవిత్వం మీద అభిరుచి ఎలా కలిగింది ? జవాబులు: కవిత్వం విన్నప్పుడు ఒక రకమైన అనుభూతి కలిగేది. అదే అభిరుచికి దారి తీసింది.

3. కవిత్వం ద్వారా ఏమిటి ఆశిస్తున్నావు ?
జవాబు: కవిత్వం ద్వారా సమాజం మారాలని కోరుకుంటున్నాను. తెలుగు భాష బాగుపడాలని కోరుకుంటున్నాను.

4. కవిత్వం నీకెలా ఉపయోగపడుతుంది ?
జవాబు: కవిత్వం నాకు ఆనందం ఇస్తుంది.

*

బాలసుధాకర్ మౌళి

జూన్ 22, 1987 లో పోరాం గ్రామం, మెంటాడ మండలం, విజయనగరం జిల్లాలో పుట్టాను. ఎనిమిదిన్నరేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సమాజం తరగతిగదిలో సకల అంశాలతో ప్రతిబింబిస్తుందని నా నమ్మకం. కవిత్వమంటే ఇష్టం. 2014 లో 'ఎగరాల్సిన సమయం', 2016 లో 'ఆకు కదలని చోట' కవితా సంపుటాలను తీసుకుని వచ్చాను. కథంటే అభిమానం. మొదటి కథ 'థింసా దారిలో' 2011లో రాశాను. మొత్తం ఐదు కథలు. ఇన్నాళ్ల నా పాఠశాల అనుభవాలను విద్యార్థుల కోణంలోంచి రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలను చర్చిస్తూ కథలుగా రాయాలని ఆకాంక్ష. గొప్ప శిల్పమున్న కథలు రాస్తానో లేదో గాని - ఇవి రాయకపోతే వూపిరాడని స్థితి.

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వెంకట రమణ ను మంచిగా పరిచయడమే కాక అత్ని రెండు కవితలను పరిచయం చేసినందుకు ముందుగా మీకు థాంక్స్ .
    ఇక అంత బాగా రాసిన వెంకట రమణకు అభినందనలు

  • మా విద్యార్థి వెంకటరమణ ఎంతో చక్కగా కవితని రాయగలడని తెలుసు కానీ గుండె లోతులలో వున్న ఆర్ద్రత నీ కళ్ళకు కట్టినట్లుగా భావాన్ని పలికిస్తుంటే, నా హృదయం ఆర్ద్రత తో తడిసిపోతుంది, దీనికి కారకులు మా మిత్రుడు శ్రీ. గోపాల్ సార్ గారికి అభినందనలు,, ఎంతో మంది విద్యార్థుల ను కవులుగా తీర్చిదిద్దడంలో మీకు సాటి రారు మిత్రమా, ఈ నీ పరిశ్రమ ఆగకూడదు థాంక్యూ

  • సుంకర గోపాలుని గురుత్వం
    వెంకటరమణుని కవిత్వం
    పద పదమునా పటుత్వం
    మధుర మనోహర మృదుత్వం

  • నిజమైన గురువులు మీరే మాస్టర్. పిల్లల చేత అంతటి చక్కని కవిత రాయించి నందుకు మీకు అభినందనలు.

  • “నీ దారిన
    నువ్వు వెళ్లి
    నన్ను ఒంటరి మొక్కలా చేసావెందుకు”

    “మనసుని పట్టుకు వేలాడే నెలవంక”

    బుజ్జికవి వెంకటరమణ ఇంకెన్నో మంచి కవితలు తెలుగులో రాయాలి. తెలుగు మీద, కవిత మీద ఇష్టం కలిగించిన గురువు సుంకర గోపాల్‌గారికి శుభాభినందనలు. పరిచయం చేస్తున్న బాలసుధాకర్ మౌళిగారికి ధన్యవాదాలు. మంచి శీర్షిక, సారంగా టీం!

  • స్పందించిన అందరికీ ధన్యవాదములు..

  • మంచి పరిచయం. వెంకటరమణకు మీకు అభినందనలు. మరిన్ని కవితలు రాయాలని ఆశిస్తున్నా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు