ఒక సంస్కృతిని వికసింప చేసెయ్యాలన్నా, విధ్వంసం చేయాలన్నా భాష ఒక బలమైన సాధనం.
****
భారతీయులమైన మనం ముఖ్యంగా ప్రతీకల్లో బతికేస్తుంటాం. నువ్విది అని చెప్పటానికి ఎదుటివాడిలో ఒక ప్రతీక (సింబల్)ని వెతుక్కుంటుంటాం. నేనిది అని చెప్పటానిక్కూడా ప్రతీకల్ని ప్రదర్శిస్తుంటాం. వ్యక్తిత్వాలకి ప్రతీకలక్కర్లేదు. స్టేటస్ కి మాత్రం ప్రతీకలు అవసరం. మనకి వ్యక్తిత్వం కంటే స్టేటస్ ముఖ్యం. మనకి ప్రవర్తన కంటే ప్రదర్శన ముఖ్యం. జీవించటం కంటే జీవిస్తున్నామన్నదానికి నిదర్శనం ముఖ్యం. అందుకే మనకి ఇంగ్లీష్ చాలా ముఖ్యం అయిపొయింది.
మనం విద్యావంతులమని చెప్పుకోటానికి, నాగరీకులమని నిరూపించుకోటానికి మనకి ఆంగ్లభాషా ప్రావీణ్యం కాదు, ఆంగ్ల భాష ప్రదర్శన చాలా ముఖ్యం. నీ కంటే నేను ఎంతో విజ్ఞానవంతుడినని చెప్పుకొవాలంటే నేను ఇంగ్లీషులో నా నోటిని తిరగమరగలాడించాలి. నా కంటే నువ్వు గొప్పోడివని చెప్పుకోవాలంటే నీ నాలికని ఇంగ్లీషులో రఫ్ఫాడించాలి. ఇద్దరు చదువుకున్నోళ్ళు రైల్లో సీటు కోసం పోట్లాడుకుంటుంటే ఆధిపత్యం కోసం వారు అసంకల్పితంగా ఆశ్రయించే సాధనం ఇంగ్లీషే. ఆఫీసులో వాదులాడుకోవాలంటే నాలుగు ఇంగ్లీషు మాటలు తెలిసుండకపోతే నీది కింది చేయే అవుతుంది. పదిమంది గుమిగూడే చోట చూడండి. అవే నాలుగు ఇంగ్లీషు ముక్కలతో మిగతా వారి మీద ఆధిక్యం సాధించాలనే తపన కనబడుతుంది. “అతనికి మంచి తెలుగు వచ్చు” అంటే ఎవరూ పెద్ద పట్టించుకోరు. “అబ్బ. అతడు ఇంగ్లీషులో వాయించేస్తాడు” అంటే మాత్రం ఆరాధనగా చూస్తారు. నిజానికి ఇంగ్లీష్ రావటం కాదు, వచ్చనిపించుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంగ్లీష్ రావటం కంటే మాట్లాడగలగటం ఒక స్టేటస్ సింబల్. ఇంగ్లీషులో ప్రావీణ్యం కంటే పని కానివ్వగలగటం పుడుంగితనానికి తిరుగులేని నిదర్శనం. గడగడా మాట్లాడగలగటం ముఖ్యం. “ఇఫ్ యు కమ్, ఐ టు విల్ కమ్. ఇఫ్ యు డు నాట్ కమ్, ఐ టు విల్ నాట్ కమ్. ఈవెనిఫ్యు డు నాట్ కమ్, ఐ షుడ్ కమ్మా?” అంటూ కబడ్డీ కూతలా ధారాళంగా ఏదో ఒకటి అనేయగలిగితే చాలు. అవతలివారు దిక్కు లేకుండా నోరెళ్లపెట్టి చూడాల్సిందే. ఎందుకంటే మనకు చదివె సంస్కృతి కన్నా మాట్లాడే సంస్కృతి ఎక్కువ.
****
“నాకు తెలుగు అంత డీప్ గా రాదండీ” అంటూ ఒకింత సగర్వంగా సిగ్గు ఒలకపోసే వారందరిలో ఇంగ్లిష్ వచ్చనే నిబిడీకృత అహంకారం కనబడుతుంది. మరీ “ఈనాడు” పత్రికలో వాడేంత గగనసఖి, బాహ్యవలయ రహదారి వంటి తెలుగు పదాలు కాకపోయినా ఒక మోస్తరు ‘ప్రాముఖ్యత”, “సమగ్రత” వంటి పదాలు వాడినా మిమ్మల్ని శంకర శాస్త్రిని చూసినట్లు చూస్తారు. ఇంగ్లీష్ రావటమే కాదు, తెలుగు రాకపోవటం కూడా ఒక అర్హతే అవుతున్నది. పిల్లలు తెలుగులో మాట్లాడితే చిన్నబుచ్చుకునే తల్లుల్ని చూసాను. “రాహుల్! హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యు నాట్ టు స్పిక్ ఇన్ తెలుగు?” అంటూ గయ్యిమనే మామ్ లకి, డాడీలకి కొరత లేదు. ఇంగ్లీష్ ఇంట్లో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత బాగా ఆ భాష వస్తుందనే పెద్దల ఆశ. భవిష్యత్తంతా ఇంగ్లీషొచ్చినవాళ్లకే అన్నట్లుంటుంది వాళ్ళ ధోరణి. ఇంగ్లిష్ రాకపోతే పిల్లలు ఏమైపోతారో అన్నఅపార్ధపు బెంగ కంటే తెలుగు రాకపోవటం ఒక అర్హతగా వాళ్ళు భావిస్తారన్నది నిజం.
ఇంక ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళ సంగతి చెప్పే పని లేదు. పిల్లలు తెలుగులో మాట్లాడితే పనిషమెంట్లిచ్చేస్తారు. పిల్లల్తోనే స్క్వాడ్లని ఏర్పాటు చేసి మరి తెలుగు మాట్లాడే “బాల నేరస్తుల్ని” పట్టుకుంటారు. ఇంగ్లిష్ మీడియం అంటే తెలుగు వినిపించక పోవటమే కానీ నిజమైన ఇంగ్లిష్ నేర్పించటం వారి ఉద్దేశ్యం కాదని మనం గమనించాలి. “లైక్, యు నో, యా” వంటి పదాల్ని విరివిగా ఉపయోగించటంతో పాటు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నింటికీ గంపగుత్తగా “విల్ బి” అనే ఛిద్ర వ్యాకరణ వినియోగం పట్ల కూడా వారికి అభ్యంతరమేమీ ఉండదు. “డోంట్ వీప్ ఫర్ స్మాల్ స్మాల్ థింగ్స్” వంటి తెలుగు నుండి ఇంగ్లిష్ లోకి సులువుగా అనువాదం చేసుకొని పిల్లలతో మాట్లాడే టీచర్లున్న ప్రయివేటు విద్యా వ్యవస్థలో పిల్లలకి ఇంగ్లిష్ రాకపోవటమనేది ఒక ఆత్మన్యూనతా కారకంగా పరిణమించటం విద్దూరంగా లేదూ? దానికి తోడు దిన పత్రికలు ఇంగ్లిష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం ఒక దారుణమైన విషయంగా చిత్రిస్తుంటాయి.
****
నిజానికి నేను ఇంగ్లిష్ భాషకి వ్యతిరేకం కాదు. ఇంగ్లిష్ మీడియం చదువులకి కూడా వ్యతిరేకం కాదు. మాతృభాష సెంటిమెంట్ కూడా బొత్తిగా లేదు. కానీ ఇంగ్లిష్ చుట్టు అల్లుకున్న మిధ్యల్నిచూస్తే మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంగ్లిష్ వల్ల తెచ్చిపెట్టుకున్న బడాయిని గమనిస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. తమ పిల్లలకి తెలుగు నేర్పకుండా ఎలాగైనా సరే ఇంగ్లిష్ మాత్రమే వచ్చి తీరాలనుకునే తల్లిదండ్రుల అతిశయం చికాకు తెప్పిస్తుంది. నాణ్యత కంటే ప్రదర్శన ముఖ్యమైన ధోరణి పట్ల అసహనంగా ఉంటుంది. “నేష్నల్లెవెల్లో హిందీ రావాలి. ఇంటర్నేషనల్లో లెవెల్లో ఇంగ్లీషోచ్చుండాలండి రేపు పిల్లలు సక్సెస్ అవ్వాలంటే” అని తమ అతి వాస్తవిక దృక్పథానికి, పిల్లల కోసం తమ రోడ్ ప్లాన్ కి మురిసిపోతూ స్వీయ భుజాలను చరుచుకొనే తండ్రుల్ని చూస్తే జాలి కూడా వేస్తుంది. పిల్లలకి ఇంగ్లిష్ ని ఒక భాషగా బోధించటం కంటే నాలుగు మాటలు నేర్పిస్తే చాలని చూసే పాఠశాలల యాజమాన్యాల పట్ల కోపం వస్తుంది.
***
అనేక ప్రపంచ భాషల్లాగే ఇంగ్లిష్ కూడా గొప్ప విదేశీ భాషే. అద్భుతమైన సారస్వతాన్నందించిన భాష ఇంగ్లిష్. ప్రపంచ ద్రవ్య మార్పిడి మార్కెట్లో డాలర్ కి ఎంతటి తప్పనిసరి స్థానం ఏర్పాటై వున్నదో ఇంగ్లిష్ కి కూడా సాహిత్యంలో అటువంటి స్థానం కలిగి వున్నది. అనేక భాషలకి అది వారధిగా వున్న మాట వాస్తవం. కాదనడానికి ఏమీ లేదు. ఆ భాష మీద, అది అందించే సాహిత్యం మీద నిజమైన ప్రేమ కలిగి ఉండటంలో తప్పు లేదు. కానీ ఇంగ్లిష్ స్థానిక భాషల్ని ధ్వంసం చేయటానికి, వ్యక్తులు సమాజంలో ప్రధాన స్రవంతి నుండి, సాంస్కృతికంగా పరాయీకరణ చెందటానికి, చెందించటానికి ఉపయోగ పడుతుంటే ఆమోదయోగ్యం కాజాలదు. నిజానికి ఏ భాష కూడా విదేశం నుండి లాభాపేక్ష రహితంగా ఊడిపడదు. అది ఒంటరిగా రాదు. దానితో పాటు ఆ విదేశీ సంస్కృతి కూడా ఊడి పడుతుంది. ఆ కొత్త సంస్కృతిని దిగుమతి చేయటంలో వున్న వ్యాపార వ్యూహాలు కూడా ఊడిపడతాయి. స్వాతంత్ర్యానికి పూర్వం ఇంగ్లీష్ బ్రిటిష్ వారి గుమస్తా అవసరాల్ని తీరిస్తే, స్వాతంత్ర్యానంతరం వారి విదేశీ వాణిజ్యావసరాలు తీరుస్తున్నది. వలస పాలనలో వనరుల్ని దోచుకెళితే మన స్వీయ స్వతంత్ర పాలనలో వారి మార్కెట్ ఆక్రమణల ద్వారా దోచుకుంటున్నారు. ప్రపంచంలో భారతదేశం ని మించిన మార్కెట్ విదేశీయులకు లేకపోవటం వెనక ఇంగ్లీష్ పాత్రా చిన్నది కాదు. మన జనాలకి తమ ఉత్పత్తుల్ని చేర్చటం విదేశీ కంపెనీలకు చాలా సులువు చేసిన ప్రధానాంశం కేవలం మన ప్రభుత్వ పాలసీలు మాత్రమే కాదు, ఇంగ్లీష్ కూడా ఎంతో దోహదం చేసింది. మన విద్యావ్యవస్థ ఎంతవరకు ఇంగ్లీష్ నేర్పిస్తుందంటే ఆ వినిమయ సంస్కృతి డిమాండ్ చేసేంత వరకే. మన ఇంగ్లీష్ కె.ఎఫ్.సి.లో బర్గర్ ఆర్డర్ ఇచ్చేంత ఉంటే చాలు. అమెజాన్ పోర్టల్లో శాంసంగ్ లేదా ఆపిల్ ఫోన్ బుక్ చేసుకునేంత ఉంటే చాలు. షేక్స్పియర్ అక్కర్లేదు. సోమర్సెట్ మామ్ అక్కర్లేదు. ఇంగ్లీష్ లోకి అనువాదమైన వరల్డ్ క్లాసిక్స్ అక్కర్లేదు. ఆంగ్ల భాషలోని అద్భుత సారస్వతాన్ని విద్యార్ధులకి పరిచయం చేస్తూ, వారి అవగాహనల్ని మెరుగుపరుస్తూ ఆ అభివృద్ధి చెందిన దేశాల్లోని స్వేచ్చాయుత, ప్రజాస్వామిక భావనల్ని పిల్లల ఆలోచనల్లోకి పంపించటం మన ఇంగ్లీష్ మీడియం చదువుల ఉద్దేశ్యం కాదు. అందుకే ఇంతటి కృత్రిమత్వం. హిపోక్రసీనూ! వినిమయ సంస్కృతిని నెత్తికెత్తుకోటానికి అవసరమైన మేరకి భాషని నేర్చుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి? పరాయీకరణ దుష్ప్రయోజనం తప్ప!
****
అనేక అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు, రాజకీయ నాయకులు, అధికారులు ఇంగ్లీష్ మాట్లాడరు. వారికి రాదు. రష్యాలో ఇంగ్లీష్ మాట్లాడారు. వారు మనకంటే అభివృద్ధి చెందిన వారు. అయితే సోవియెట్లో ఉన్నంత కాలం ఇంగ్లీష్ జోలికి పోనప్పటికీ ఇప్పుడు గ్లోబలైజేషన్ పోటీలో పరుగులు పెడుతూ అభివృద్ధిలో వెనుకబడుతున్న దేశం ఉజ్బేకిస్థాన్ మాత్రం ఇప్పుడు ఇంగ్లీష్ కి ప్రాధాన్యం ఇస్తున్నది. భారతీయులు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరని, వారు ఎదురైనప్పుడు వారితో సంభాషించి తమ శక్తీ సామర్ధ్యాలను మదింపు చేసుకోమని తమ టీచర్లు సలహా ఇస్తారని అక్కడి విద్యార్థులు నాకు చెప్పారు. మన కంటే మానవాభివృద్ధి సూచికలో ముందున్న వియత్నాంలో హోటల్ రిసెప్షనిస్టులు, టూరిజంతో సంబంధం వున్నవారు తప్ప మిగతా వారెవ్వరికి ఇంగ్లీష్ రాదు. కంబోడియా పేద దేశం. అక్కడ మన ఆటోల్లాంటి టుక్ టుక్ డ్రైవర్ల కూడా ఇంగ్లీష్ మాట్లాడగలరు. అది వారికి తప్పనిసరి. ఆ రోజు జీవిక సంపాదించుకోటానికి వారికి అది ఆవశ్యకం. పర్యాటకం తప్పు కాదు. ఆహ్వానించాలి కూడా. కానీ పేద దేశాల్లో ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో టూరిజం, ఇంగ్లీష్, సెక్స్ మార్కెట్ కి మధ్య గాఢానుబంధం మనం గమనించాలి. ఇంగ్లిష్ మొత్తానికి సెక్స్ మార్కెట్ తో సంబంధం వుందని అనటం లేదు. టూరిజం ద్వారా ప్రమోట్ అయ్యే సెక్స్ మార్కెట్ కి మాత్రం ఇంగ్లిష్ తో అవసరముంది.
పోటీ ప్రపంచంలో మనుగడే ముఖ్యమైనప్పుడు చేతికి అందివచ్చినదేదైనా అపురూపంగానే కనిపిస్తుంది. రేపటి నష్టం కంటే ఇవాళ్టి లాభమే ముఖ్యమైపోతుంది. ఇంగ్లీష్ కూడా మనకి అలాంటిదే. వలస పాలనలు చేసిన విధ్వంసంలో మిగిలిన అవశేషాల్ని కూడా గుంజుకోటానికి విదేశీ పెట్టుబడిదారులకు ఇంగ్లీష్ ఉపయోగిస్తుంటే, ఆ శిధిలాల నుండే మొలకెత్తాలని, కనీసం అక్కడైనా మనుగడ సాగించాలని మనలాంటి దేశాలు ఇంగ్లీష్ ని నెత్తికెత్తుకుంటున్నాయి.
స్థానిక భాషల్ని చిన్నచూపు చూయించి, ఎంతో కొంత మాట్లాడటం గొప్ప విషయంగా భావించే ఇంగ్లీష్ నిజానికి మన సామాజిక వెనుకబాటుతనానికి ప్రతీక. అది ఇంగ్లీష్ భాష తప్పు కాదు. ఆ భాష మోసుకొచ్చే సంస్కృతి, ఆ సంస్కృతిని నెత్తి మీద మోస్తూ మురిసిపోయే మన బానిస మనస్తత్వం. ఇంగ్లీష్ వెనుకనున్న వాణిజ్య, వినిమయ సంస్కృతిని వద్దనుకుని, కేవలం ఇంగ్లీష్ మాత్రమే కావాలని ఆశించటం ఇప్పటి పరిస్థితుల్లో దురాశేనా?
*
|
ఇంగ్లీష్ చేపా! ఇంగ్లీష్ చేపా! నువ్వెందుకు ఎండటం లేదు?
“నాకు తెలుగు అంత డీప్ గా రాదండీ” అంటూ ఒకింత సగర్వంగా సిగ్గు ఒలకపోసే వారందరిలో ఇంగ్లిష్ వచ్చనే నిబిడీకృత అహంకారం కనబడుతుంది.
చితక్కొట్టేశారు
వందనాలు
ధన్యవాదాలు రాంబాబు గారూ!
Good.సాక్షి essays ను మించి వ్రాసారు. ఇది ఒక సజీవ సమస్య ఎప్పటికీ.
Thank you sir.
Woderful
Thank you vamsikrishna garu!
బాగున్నదండి మీ ఇంగ్లీష్ చేప ఎండని రహస్యం.
అభినందనలు.
Thank you sir.
chaalaa bavundi .
Thanks Nirmala!
ఆంగ్ల భాషలోని అద్భుత సారస్వతాన్ని విద్యార్ధులకి పరిచయం చేస్తూ, వారి అవగాహనల్ని మెరుగుపరుస్తూ ఆ అభివృద్ధి చెందిన దేశాల్లోని స్వేచ్చాయుత, ప్రజాస్వామిక భావనల్ని పిల్లల ఆలోచనల్లోకి పంపించటం మన ఇంగ్లీష్ మీడియం చదువుల ఉద్దేశ్యం కాదు. అందుకే ఇంతటి కృత్రిమత్వం. హిపోక్రసీనూ!
పచ్చి నిజం చెప్పారు.
అందరూ…ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అందరూ చదవాల్సిన వ్యాసం.
Thank you Nitya!
Really thoughtful and useful article for middle class people.