చిత్రంగా, నీకిది రాయాలని ఇలా కూర్చొని, సగం పేజీలు నిండిన పుస్తకంలోని ఖాళీ పేజీ వరకొచ్చి పైన ఒక తారీఖు, దాని కింద ఒక టైమ్ వేసి బయటికి చూస్తాను. ఈ ఉదయమే బయట వాతావరణం ఇంత బాగుండటం బాగుంది.
పొద్దు పొద్దున్నే చీకట్నుంచి, ఈ ప్రపంచమంతా వెలుగు పరుచుకునే సమయాన్ని అలా కళ్లార్పకుండా చూస్తూ ఉండు. సరిగ్గా ఏ క్షణానికి చీకటి మొత్తం పోయిందో గమనించి నీకది చెప్పాలనుకుంటాను. నీకిది ఇప్పటికే నూట డెబ్బై సార్లు రాసిన విషయమే అయినా మళ్లీ రాస్తాను – ’నువ్వు పరిచయం కాకుంటే నేనిదంతా ఎవరికి చెప్పేవాడిని?’.
గత కొన్ని రోజులుగా, క్రమం తప్పకుండా, మధ్యాహ్నం పూట ఆఫీసులో కూర్చొని నీ గురించి కాకుండా ఆలోచిస్తున్న విషయం ఒకటి ఉంది. అది నన్నెందుకు ఇంతలా రోజూ వెంటాడుతోందో తెలియడం లేదు.
చాలా చిన్నది అది. అందులో పెద్ద విషయం కూడా లేదు. ఇలాంటి రోజే అది. కాలేజీలో చివరి బెంచీలో కూర్చొని కిటికీలోంచి బయటికి చూస్తున్నా. బయట కొద్ది దూరంలో రోడ్డు మీద (పెద్ద హైవే) బండ్లు వెళ్లిపోతున్నాయి. నేనది అలా చూస్తూనే ఉన్నా. క్లాసులు అయిపోతాయి. ఇంటికి వెళ్లిపోతాను. ఇంకో రోజు వస్తుంది. ఇది రాస్తున్న సమయానికి.. సరిగ్గా 6:37కు వచ్చిన కాసేపటి ఎండలా వాతావరణం మారిపోతుంది. ఋతువులు మారిపోతాయి. నేన్నక్కడే కూర్చొని చూస్తూ ఉంటా. సరిగ్గా ఈ ఇమేజ్ నన్ను వెంటాడుతోంది.
ఇందులో ఏముందని నన్ను వెంటాడటానికి, అని ఆలోచిస్తూ, ఇంకేవేవో పనుల్లో పడిపోతా. కాలేజీలో క్యాంటీన్ బండనో, నాలుగో ఫ్లోర్‌లో ఇంగ్లిష్ ల్యాబో.. ఏదో ఒకటి గుర్తొచ్చి ఇదెందుకు గుర్తొస్తోంది సడెన్‌గా అనుకుంటా.
ఆ ఇమేజ్‌ని ఓవర్‌ల్యాప్ చేస్తూ నువ్వొస్తావు. నువ్వు నీ ల్యాప్‌టాప్‌లో ఏదో వీడియో చూపిస్తున్నావు. నేనేదో అన్నాను. ఇంకేదో జోక్ చేసుకున్నాం. టప్‌మని నన్నొకటి కొట్టావు.
“గట్టిగ తాకిందా?” అని నువ్వే ఓదార్చావు. ఇవ్వాళ్టికి ఆ రోజుకు సంవత్సరం మీద పది రోజులు.
నేనెప్పుడన్నా నీ ఆలోచనలకు దూరంగా పోవాలనుకున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తే ఏడుస్తాను. ఈ ఆలోచనలను మోసుకొని నీ దాకా వచ్చినరోజు అలిసిపోతాను.
ఈ రెండింటి మధ్యలో ఇరుక్కున రోజు, నీ ఆలోచనల మధ్య, ఆ కాలేజీ ఇమేజ్ గుర్తొస్తే, అది నీకే చెప్పాలనుకుంటాను.
నువ్వు లేకున్నా, ఒకవేళ ఉన్నా కలవవని తెలిసినా, మూడు బస్సులు మారి మరీ నువ్వుండే ప్లేస్ దగ్గరికొచ్చి ఫోన్ చేస్తాను. ఒక్కోసారి అసలు ఫోన్ చెయ్యను.
ఇదంతా ఎందుకు చేస్తున్నానని నాకు నేనే ప్రశ్న వేసుకొని, “ప్రేమ” అని సమాధానం చెప్పుకోవాలనుకుంటాను.
జూలై చివర్లోనో, ఆగస్టు రెండో వారంలోనో వర్షానికి ముందొచ్చే గాలిలో మనం నడిచిన రోడ్లలో నిన్ను వెతుక్కుంటాను.
నీకు ఫోన్ చెయ్యకుండా, ఈ రోడ్లో నడిచిన రోజు ఇదంతా గుర్తు తెచ్చుకుంటాను.
నీకు నా మీద ఏం హక్కుందని అడగాలనుకుంటాను.
నీ దాకా వచ్చి ఆగిపోవడానికే ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నానని చెప్పాలనుకుంటాను.
8:28కి వచ్చిన ఎండను చూసి పారిపోయి వచ్చి తలుపేసుకొని ఆలోచిస్తుంటే, 8:39కి ఆ ఎండను లాక్కుపోయిన ఇదే ఉదయాన్ని చూసి, మోసం ఆ ఎండదా, పొద్దున్నుంచి ఉన్న ఈ చల్లటి ఉదయానిదా అని ఆలోచిస్తా.
నీ చెయ్యి పట్టుకొని నీ కళ్లలోకి చూస్తూ, నాకొచ్చే వేల వేల ప్రశ్నలకు సమాధానాలు నిన్నే అడగాలనుకుంటా.
“పిచ్చోడా!” అని నువ్వు ఒక్కో సమాధానం చెప్తూ ఉంటే, ఎక్కడో ఒక దగ్గర ఈ జీవితం అయిపోవాలి. అంతే. ఇంకేం వద్దు!
*
చాలా బాగుంది