ఇంకెన్నాళ్ళీ  17సెప్టెంబర్?!

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్‌గారిని కలిసి తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరుతూ, నాలుగు పేజీల లేఖను ఇచ్చారు. ఈ నాలుగు పేజీల లేఖలో ఏమి రాసి ఉంటారు?  తెలంగాణలో 17 సెప్టెంబర్ 1948 చరిత్రను వక్రీకరించే  ఉంటారు. గవర్నర్‌కి వినతి పత్రం ఇచ్చే సంప్రదాయం 1998 నుండి మాత్రమే మొదలైంది. 1951 నాటి నుండే  ఇక్కడ జనసంఘ్ వుంది, 1952 మొదటి ఎన్నికల్లో పోటీ కూడా చేసింది. బిజెపి పార్టీ 1980లో ఏర్పడింది.  జనసంఘ్  వాళ్ళు కానీ, ఇక్కడ బిజెపి పార్టీ ఏర్పడ్డాక పద్దెనిమిదేళ్ళు ఏమీ మాట్లాడని వాళ్ళు ఇప్పుడెందుకు ఈ 17 సెప్టెంబర్ ర్యాలీలు, సభలు, సమావేశాలు…..

తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావటానికి షార్ట్‌ కట్‌గా 17 సెప్టెంబర్ అంశాన్ని ఎంచుకున్నట్లుగా అనిపిస్తుంది. టిఆర్‌ఎస్‌ పరిపాలన  ఆరు సంవత్సరాలు  దాటిపోతుంది. కెసిఆర్‌ వైఫల్యాలను, ఎన్నికల్లో అమలు చేస్తా అని చెప్పి అమలు  చేయని సంక్షేమ పథకాలను, దేశంలో ఆధునిక టెక్నాలజీ పెరిగాక భారీ ప్రాజెక్టుల  అవసరమే  లేదు, అయినా భారీ నీటి ప్రాజెక్టులను  నిర్మించి దాదాపుగా  2.30 లక్షల కోట్ల  రూపాయల  అప్పుతో నిర్మిస్తున్న పథకాలను ప్రజలకు వివరించి అధికారంలోకి రావచ్చు. తెలంగాణలో బలంగా  పాతుకుపోయి వున్న గంగా జమునా తెహజీబు సంస్కృతి  ముందు ఈ షార్ట్‌కట్‌ రాజకీయాలు  పని చేస్తాయని అనుకోవడం లేదు.

బిజెపి రాస్తున్న కొత్త  చరిత్రలో రజాకార్లు హిందువులను చంపారు అని ప్రచారం చేస్తున్నారు. నిజమే అనుకుందాం! వీళ్ళు గ్రామాలలో ఏ దొరలకు అండగా వుండి హింస చేసారో ఆ దొరలంతా  హిందువులే, వీళ్ళని  హిందూ దొరలని ఎందుకు అనరు? కమ్యూనిస్టులు  రజాకార్లను చంపిన చరిత్ర పుస్తకాలు చూస్తే ఈ కమ్యూనిస్టు అగ్ర నాయకులందరూ హిందువులే, వీళ్ళని  హిందూ కమ్యూనిస్టులని అందామా! రజాకార్లు  చేసిన హింస రాజకీయ కారణంగా జరిగింది. విలీనానికి మద్దతు తెలియజేస్తున్నారని హిందువులను, ముస్లింలను కూడా రజాకార్లు చంపారు,  కమ్యూనిస్టులు  వర్గపోరాటంలో భాగంగా రజాకార్లను, భూస్వాములను చంపారు, ఇండియన్‌ ఆర్మీ కమ్యూనిస్టులను చంపడంలో రాజకీయ కోణమే వుంది. ఇరువైపులా నష్టం జరిగింది. సుందర్‌ లాల్‌ కమిటీ 1948 చివర్లో వచ్చిన రిపోర్టు ప్రకారం నలబై వేల  మంది ముస్లింలు  చనిపోయారని రాసారు. బిబిసి లోకల్‌ జర్నలిస్టులు చేసిన సర్వేలో రెండు లక్షల  మంది వరకు ముస్లింలు మరణించారని తెలిపింది.

హిందువులను రజాకార్లు చంపారని ఈ చరిత్రను పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని డిమాండు చేస్తున్నారు. మనం పిల్లలకు  హింస గురించి, ప్రజలపై జరిగిన దాడుల  గురించి ప్రచారంలో పెట్టి భవిష్యత్తు తెలంగాణ సమాజాన్ని ఎటువైపుకు తీసుకపోతారు? భవిష్యత్తులో విద్యార్థులు  ఒకరి పట్ల ఇంకొకరికి ద్వేషం పెంచుకునే విధంగా చేయటం సరికాదు. రాజకీయాలలో ఇప్పటికే విలువలు  లేవు అనేది ప్రజలలో నాటుకపోయింది. ప్రజలకు ప్రజాస్వామ్యమ్  పట్ల, రాజకీయ విలువల మీద  ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని చంపే పని చేయకూడదు.

మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో బిజెపి అధికారికంలోకి (1999) వచ్చిన తర్వాత నుండి 17 సెప్టెంబర్ విమోచన దినాన్నిఅధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. పాత నిజాం  పరిపాలనలోని జిల్లాలలో 17 సెప్టెంబర్ రోజున అధికారులు జాతీయ జెండాను ఎగుర వేస్తారు, స్వీట్లు పంచుతారు, చిన్న చిన్న మీటింగులు పెట్టి పాత తరం వాళ్ళతో మాట్లాడిస్తారు. ఇంతకుమించి దీని వల్ల హిందువులకు  వచ్చిన లాభం లేదు, ముస్లింలకు వచ్చిన నష్టం కూడా లేదు. ఈరెండు రాష్ట్రాలలో బిజెపికి అధికారాన్ని కట్టబెట్టింది 17 సెప్టెంబర్ కాదు.  నిజానికి రజాకార్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు  ఇవి అయినా రాజకీయ అంశంగా అక్కడ ఏమీ ఉపయోగపడలేదు. ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే రజాకార్లు అంత బలంగా ఇక్కడ ఏమీ లేరు. ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలోకి రావటానికి చరిత్రను కాదు, ప్రజల  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు
చేస్తేనే లాభం. అయినా బిజెపీ కోరినట్లు ఒకవేళ ఇక్కడ కూడా అధికారికంగా 17సెప్టెంబర్ ‌ అమలు  చేసినా జెండాలు, స్వీట్లు తప్ప ఇంతకంటే ఒరిగేది ఏమీ లేదు.

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వలసలు  పెరగటం, కొన్ని మతాల  వారిమీద కరోనా పెరగటానికి కారణం వీళ్ళే అని  ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు  వచ్చిన సందర్భములో   ”ఫ్యూ  ఫౌండేషన్”‌ (PEW) వారు ప్రపంచ వ్యాపితంగా  చేసిన సర్వే రిపోర్టులో  ఈ విధంగా ఉంది. ‘‘ఇండియాలో చేసిన సర్వే ప్రకారం, 27 శాతం హిందువులు, ముస్లింలకు వ్యతిరేకంగా వున్నారు, 3 శాతం ముస్లింలు, హిందువులకు వ్యతిరేక అభిప్రాయాలు  కలిగి వున్నారు.’’  బిజెపి ఓట్ల రాజకీయాల కోసం ఈ వ్యతిరేకతను ఏస్థాయికి పెంచాలనుకుంటుంది? తెలంగాణలో ఎంత విద్వేషాన్ని పెంచితే అధికారంలోకి రాగలుగుతామని అనుకుంటున్నారు.

ప్రపంచీకరణ ప్రభావం ప్రజల  మీదనే కాదు, రాజకీయ పార్టీల  ఆలోచనా విధానం మీద కూడా ప్రభావం చూపింది. 1990లకు ముందు రాజకీయ పార్టీల  ప్రధాన ఎజెండా సంక్షేమమే! మేం అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన అందిస్తాం అనేవారు. 1990ల  తర్వాత ఎన్నిక మ్యానిఫెస్టోలో అదనంగా వచ్చి చేరింది ‘దేవుడు’. అయోధ్య స్థల  వివాదం 1948లో  మొదలైంది, కానీ రథ యాత్ర మొదలు పెట్టింది 1990లో, ఎందుకు ఇంత కాలం  ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోలేదు. అధికారంలోకి రావడానికి ప్రజలలో విద్వేష రాజకీయాలతో ఓట్లు దండుకోవచ్చనే అవగాహన దేశ వ్యాపితంగా 1990లో వస్తే, తెలంగాణలో ఇది 1998లో  వచ్చింది. దేశవ్యాప్తంగా అయోధ్య ఫార్ములాను ఉపయోగించిన అధికారంలోకి వచ్చినట్లే,  ఇక్కడ నిజాం రాజును, రజాకార్లను హిందూ వ్యతిరేకులుగా, నిజాం రాజను ముస్లింల  ప్రతినిధిగా చిత్రించే పని చేస్తున్నారు. ఈ వింత చరిత్రలో ఆరోజుల్లో పోరాడింది కమ్యూనిస్టులు, 17సెప్టెంబర్‌తో ఎలాంటి సంబంధం లేనిది  బిజెపి రాస్తున్న కొత్త చరిత్ర ఇది. వాస్తవం ఏందంటే రజాకార్లలో హిందువులు  కూడా పెద్ద సంఖ్యలో  వున్నారు. రజాకార్లకు తెలంగాణ ప్రజందరూ శత్రువు కాదు, ఎవరైతే కేంద్రంలో విలీనం చేయాలని ఉద్యమం చేస్తున్నారో  వాళ్ళ మీదనే ప్రధానంగా దాడులు చేసారు. అది కాంగ్రెసు, కమ్యూనిస్టుల  మీదనే పోరాటం, సామాన్య ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణలో నిజాంకు  మద్దతుగా రజాకార్లు వచ్చినట్లు, అప్పట్లో దేశవ్యాప్తంగా ఉన్న చాలా ప్రిన్సిలీ స్టేట్‌లలో ఈ విధంగా మద్దతు వచ్చింది, రూపాలలో తేడా ఉండచ్చు కానీ స్థానిక రాజుకు  మద్దతుగా, విలీనానికి వ్యతిరేకంగా
వచ్చింది. అవి మైసూరు, ట్రావెంకోర్‌, 1965లో గోవాలో కూడా స్థానికులు విలీనాన్ని వ్యతిరేకించారు.

ఆలోచనాపరుల  అభిప్రాయాల  నుండి చూసినట్లయితే 17సెప్టెంబర్ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చేస్తేనే  మంచిది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వము  విలీనాన్ని అధికారికంగా జరపకపోతేనే బిజెపికి లాభం, ఎందుకంటే ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి. తెలంగాణ ప్రభుత్వము  ఇక్కడి సంస్కృతిని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీనికొక పరిష్కారాన్ని కనుక్కుంటే మంచిది, ఈ సమస్యను వీలయినంతగా తొందరగా ముగింపు
పలకాలి.

*

ఎమ్‌.ఏ.మోయిద్‌, శ్రీనివాస్ ఏశాల

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • విద్రోహ దినం. కమ్యూనిస్టులు బలపడుతున్నా రని కుట్రలో భాగమే సెప్టెంబర్ 17 కుట్ర

  • సెప్టెంబర్ 17 విలీనమా ? విధ్వంసమా ? విద్రోహమా ? అనే విషయం పై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నవి. నిజానికి ఈ విషయం పై మేధావులకు, రచయితలకు, జర్నలిస్టులకు కూడా ఏకాభిప్రాయం లేదు. ఆనాటి సంఘటనలను అంచనా వేసేటప్పుడు ఆనాటి పరిస్థితులను కూడా అంచనా వేయాలి. మీ వ్యాసంలో అది సంపూర్ణంగా జరిగింది. అందరూ ఇదే విజ్ఞతతో ఆలోచించి తెలంగాణ పౌర సమాజానికి ఈ విషయంలో ఒక స్పష్టమైన అవగాహన కలిగించాల్సిన బాధ్యత, అవసరం ఉంది. రాజకీయంగా జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన పై పౌర సమాజానికి భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్య పరిధిలో ఉన్నంతవరకు ఎవరికీ ఏ సమస్యా ఉండదు. కానీ అది కాస్తా అధికారం రుచి చూస్తేనే ప్రమాదం.

  • ఇంకెన్నాళ్ళు ఈ బక్రీద్, ఇంకెన్నాళ్ళు ఈ మొహర్రం, ఎక్కడో ఎవరో కొట్టుకొని చస్తే మీరింకా మిమ్మల్ని మీరు గాయ పరుచుకొని ఆనందించడం ఆపారా, ఆపరు ఎందుకంటే దానికొక చారిత్రక నేపధ్యం వుంది కాబట్టి, అలాగే ఇక్కడ మేమూ ఈ విమోచన దినాన్ని ఆపం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు