ఇంకా చదవాలనే తపనలోంచి– శేఫాలికలు!

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి- అంటే పరిచయం అవసరమా సారంగ చదువరులకు!!?! ఏమాత్రం అక్కర్లేదు. సారంగ పత్రికలో ఎంతో విజయవంతమైన సాహిత్య శీర్షిక- కొన్ని శేఫాలికలు! ఇప్పటికీ పాఠకులు వెనక్కి వెళ్ళి చదువుకునే ఆహ్లాదకరమైన/ అందమైన రచన. ఈ వ్యాసాలన్నీ పుస్తక రూపంలో వెలువడిన సందర్భంగా ఈ ముఖాముఖీ: 

ఆకులో ఆకునై, మా ఊళ్ళో కురిసిన వాన, జాజిపూల పందిరి ఈ సాహిత్య వ్యాసాల కంటే శేఫాలికలు ఎలా భిన్నమైనది?

ఆకులో ఆకునై లో సాహిత్య ప్రసక్తి తక్కువ. ఎక్కువగా నా జ్ఞాపకాలు, అనుభవాలు.. వాటిని సార్వజనీనం చేయడం కోసం అన్నట్టుగా రాశాను. వాటిల్లో మానవ సంబంధాల పట్ల జాగృతి, పర్యావరణ స్పృహ కూడా అంతర్భాగాలుగా నడిచేయి. ఉదాహరణకి అనుభూతికి సంబంధించి ఒక కాలం ఉంటుంది అందులో. రచయిత తను  పలు దేశాలు, అందమైన ప్రాంతాలు తిరగలేకపోయినా గోడ మీద ఉన్న మంచి  పోర్ట్రైట్ చూసి కూడా ఆ ప్రాంతం లోకి వెళ్లి మైమరిచిన అనుభూతి పొందుతాడు. నిజానికి అవన్నీ తిరిగి వచ్చిన వాళ్ళు వాటి గురించి కాక, అక్కడ దొరికే తిండి గురించి, హోటల్స్ గురించి మాత్రమే మాట్లాడతారు. ఇదంతా చెప్తూ అనుభూతి అనేది మనిషి ఆనందానికి ఎంత అవసరమో చెప్తాడు.

ఇలా ఒక్కొక్క సంఘటనతో మొదలుపెట్టి చివరికి తన వైయక్తిక సంఘటనని సార్వజనీనం చేయడం ఆకులో ఆకునై లో ఉంటుంది. మా ‘ఊళ్లోకురిసిన వాన’ ఒకరకంగా దానికి పొడిగింపు. కానీ దీంట్లో కొంత సమకాలీన సామాజిక స్పృహ తోడైంది. ఇప్పటి కార్పొరేట్ నాగరికత మనుషుల తిండి మీద దగ్గర నుంచి, స్త్రీ పురుష సంబంధాలు దాకా ఎలా ప్రభావం చూపించుకుంటూ వస్తోందో అదంతాఅందులో ఉంది. కానీ అందులో కూడా పర్యావరణ స్పృహ, ప్రకృతికి సమీపంగా వెళ్లడం ఎలాగా అంటే, మానసికంగా దగ్గరతనాన్ని అనుభవించడం ఎలాగా అన్న ఆలోచన కూడా ఉంది.

‘జాజిపూల పందిరి’ పూర్తిగా సామాజిక స్పృహకు సంబంధించినదే. మనం మాట్లాడుకునే వ్యక్తిత్వ వికాస లక్షణాలు పుస్తకాల్లో నుంచి మాత్రమే తీసుకో అక్కర్లేదని, జీవితంలో కూడా కాస్త జాగ్రత్తగా చూస్తే ఎన్నో దొరుకుతాయని చెప్తూ ఉండే వ్యాసాలు జాజిపూలు పందిరిలో ఉంటాయి. అంతేకాక స్త్రీలకు సంబంధించిన వివక్షలు, చైతన్యాలు వాటి స్వరూప స్వభావాలు వాళ్ల మీదఎలా పడ్డాయి అనే విషయాల మీద కూడా కొన్ని వ్యాసాలు ఉన్నాయి.

ఇక ఇప్పుడు వచ్చిన ఈ ‘కొన్ని శేఫాలికలు’ శీర్షికా రచన వీటన్నింటి కన్నా పూర్తిగా భిన్నమైనది. ఇందులో అన్నీ కేవలం సాహిత్య రసాస్వాదనే ప్రధానంగా రాసినవి.

మనం చదువుకున్న అనేక అనేక కావ్యాలు గానీ, నవలలు గాని, కథలు గాని వాటిలో ఉన్న అంతరార్ధాలు ఏమిటి? వాటిని మనం అందుకోవటానికి అవసరమైన దృక్కోణం ఏమిటి?  వాటిని అందుకున్నందువల్ల మనకి కలిగే ప్రయోజనం ఏమిటి? అన్న వాటిని కూలంకషంగా చర్చించి సరళంగా క్లుప్తంగా అందించే ప్రయత్నం ఈ శీర్షికా రచనలో జరిగింది. ఆ విధంగా ఇది ఆ మూడు పుస్తకాలు కన్నా విభిన్నమైనది మరింత ప్రత్యేకమైనది.

ఠాగూర్, చలం ఇద్దరి ప్రస్తావన మీ రచనల్లో ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కారణాలు ఏమై ఉంటాయి?

చలం టాగూర్ కథల మీద, వ్యాసాల మీద మీరన్నట్టు ఇందులోఎక్కువ వ్యాసాలే ఉన్నాయి. కారణం వారు సమస్యల మూలాలు చూసిన వారు. ప్రేమ గురించి చెప్పినా స్వేచ్ఛ గురించి చెప్పినా మూలాలకు వెళ్లి అంతరార్థాలు చెప్పారు. కానీ విప్పి చెప్పలేదు. ఆ పని ఇక్కడ నేను చేశాను. మైదానం లో’ రాజేశ్వరి చెప్పిన కథ’ అలాంటి వ్యాసమే. ఠాగూర్ రాసిన ఆదర్శ ప్రేమ కథ కూడా అలాంటిదే. అందుకని ఈ మూలాలకు వెళ్లి సమస్యలను చర్చించి వాటి అంతరార్ధాలు చెప్పగలిగిన వాళ్లలో అతి ప్రధానమైన వాళ్ళు వాళ్ళిద్దరే అనిపించింది నాకు. బహుశా నా అభిరుచికి, నా స్వభావానికి వాళ్లు తగిన వాళ్ళు అనిపించి ఉండవచ్చు. వారి మాటల ప్రభావం కూడా నామీద చాలా ఉంది. అందువల్ల బహుశా వారి గురించి ఈ వ్యాసాల్లో ఎక్కువసార్లు వచ్చి ఉండవచ్చు. ఇందులో టాల్ స్టాయ్ కూడా చేరుతాడు.

ప్రేమ కథల మీద అంత ప్రేమ ఎందుకు?

ఇది చిత్రమైన ప్రశ్న. ప్రేమ గురించి రాయని కవి గాని రచయిత గాని ఉండరు. ఎంత విప్లవాల గురించి, పోరాటాల గురించి రాసే వాళ్ళు కూడా ఎక్కడో చోట ప్రేమానుభవాలు గురించి మాట్లాడకుండా ఉండరు. జీవితాన్ని పట్టి ఊపేసే శక్తి ప్రేమకు ఉంది. సాహిత్యానికి కూడా ఉంది. ఒక విధంగా ప్రేమానుభవం నిజమైన సాహిత్యానుభవానికి సమానంగా ఉంటుంది. అందుచేత సాహిత్యాన్ని ప్రేమించే వాళ్ళు ప్రేమ కథల గురించి ప్రేమానుభవాలు గురించి మాట్లాడకుండా ఉండటం సాధ్యం కాదు. ప్రేమ తాలూకు నిర్వచనాలు అనేకం ఉండొచ్చు. కానీ నిర్వచనాలను మించింది కదా ప్రేమ. అంచేత శేఫాలికల్లో చాలా చోట్ల ప్రత్యేకించి ప్రేమ కథల గురించి చెప్పిన కాలమ్స్ ఉన్నాయి.

విమర్శ ను కళ అంటున్నారు. ఎలా సమర్థిస్తారు?

ఈ పుస్తకంలో ఒక వ్యాసం ప్రత్యేకంగా దీని మీదే రాశాను. విమర్శ కళగా ఎలా మారుతుందో చాలా ఉదాహరణలతో కాటూరి వెంకటేశ్వరరావు గారు ఒక పెద్ద వ్యాసం రాశారు. అందులో ఇచ్చిన ఒకటి రెండు ఉదాహరణలు ఈ వ్యాసంలో కూడా ఇచ్చాను. ప్రత్యేకంగా చెప్పాలంటే ఏ పుస్తకాన్నైనా విమర్శించి చెప్పేటప్పుడు విశ్వవిద్యాలయాల పద్ధతిలో కాకుండా కొంత భిన్నమైన పద్ధతిలో చెప్పిన వాళ్ళు ఉన్నారు. భిన్నమే కాదు ప్రత్యేకమైన పద్ధతుల్లో కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రత్యేకత ఏమిటో మనం గమనిస్తే కనుక అప్పుడు విమర్శ కళగా ఎలా మారిందో అర్థం అవుతుంది. కాటూరి వెంకటేశ్వరరావు గారు రాసిన వ్యాసం పేరే విమర్శకళ.  మనం చూసిన చిత్రాలు గాని, శిల్పాలు గాని, కవిత్వాలు గానీ, కథలు గానీ ఉన్నవి ఉన్నట్టుగా కాక ఒక దశలో రూపాంతరం చెంది కొత్త అర్ధాలను ఇస్తాయి. ఆ కొత్త అందాలను అర్ధాలను విప్పి చెప్పగల విమర్శ ఆ స్థాయిలో కళగా మారుతుంది. కవిత్వం చదువుతున్నప్పుడు కలిగిన పరవశం విమర్శ చదివినప్పుడు కూడా కలుగుతుంది.అంటేఅప్పుడు అది కళ గా మారిందనమాట.

సమకాలీన సాహిత్యం పట్ల మీ అభిప్రాయం చెప్పండి?

ఇవాళ చాలా కొత్త కంఠాలు వినిపిస్తున్నాయి. కవిత్వంగాను, కథలు గానూ, నవలలుగాను కూడా చాలామంది సాహిత్యాన్ని సంపన్నం చేస్తున్నారు. అయితే ఇందులో కవిత్వం కొత్తగా రాస్తున్న వాళ్ళకి పఠనాసక్తి అంతగా లేదేమో అనిపిస్తుంది. ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంది అన్నదాన్ని గుర్తిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే కొందరు ప్రతిభావంతులైన కవులు బాగా రాస్తున్నారు. గాని ఇలాగ ఎక్కువ కాలం రాయటం కష్టం.  తమ ముందున్న సాహిత్యాన్ని చదువుకోవటం అవసరం. ఇక నవలల విషయానికొస్తే మంచి ప్రోత్సాహం, రచయితల్లో ఉత్సాహం కూడా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇది మంచి పరిణామం.

కవిత్వం, కథ కూడా ఈరోజు నిరాశాజనకం గానే ఉన్నాయి. కారణం పైన నేను చెప్పిందే. కానీ అక్కడక్కడ మంచి కవితా సంకలనాలు, కథలూ  కూడా మెచ్చుకోదగిన స్థాయిలో వస్తూనే ఉన్నాయి.

ప్రాచీన సాహిత్యం మీద కూడా మీ వ్యాసాలు ఇందులో ఉన్నాయి. వాటి అవసరం ఏమిటి?

నేను  పై ప్రశ్నకు చెప్పిన సమాధానంలో దీనికి జవాబు ఉంది. ప్రాచీన సాహిత్యంలో ముఖ్యంగా కవిత్రయ భారతంలో సాహిత్యానికి సంబంధించిన గొప్ప అందాలు ఉన్నాయి. వాటిని గ్రహిస్తే కొత్తగా రాసే వాళ్ళకి మరిన్ని మెళుకువలు అలవాటు అవుతాయి. అందుకని నేను నన్నయ కథకు ఎలా అద్యుడో, కథను ఎలాగ నిర్వహించాడో, ఆయనే చెప్పుకున్నట్టుగా ఆయన ప్రసన్న కథాకలితార్థయుక్తి ఏమిటి? అన్న విషయాలని చెప్పడానికి చాలా లోతైన అంశాన్ని ఆ వ్యాసాల్లో ప్రస్తావించాను.

గొప్ప భాషని మనకు ప్రాచీన సాహిత్యం అందించింది. మనకి వెయ్యి సంవత్సరాల సాహిత్యమే లేకపోయి ఉంటే ఇవాళ మనం ఏం రాసేవాళ్ళం. ఎలా రాయాలో మనకి ఏం తెలిసేది. కాబట్టి ఇవాళ మనం మన సాహిత్యం తాలూకు వేర్లు ఎక్కడున్నాయో తెలుసుకుంటే మంచిదని ,నేను నన్నయ భారతంలో రహస్యాలను సులువైన భాషలో ఇక్కడ రాశాను.

సంస్కృత నాటకాల గురించి, కావ్యాల గురించి కూడా ఇక్కడ మీరు చెప్పారు కదా ఇప్పుడు అవి ఎవరు చదువుతారు? వాటి అవసరమేంటి?

నిజానికి ఇది కీలకమైన ప్రశ్న ఇప్పుడు ప్రపంచం అంతా భారతీయ సాహిత్యం వైపు, ముఖ్యంగా సంస్కృత కావ్యాల వైపు చూస్తోందని నాకు అనిపిస్తోంది. కొందరు యువ రచయితలు ఇంటర్నెట్లో భాస, కాళిదాసుల మీద వస్తున్న ఉపన్యాసాల క్లాసులను ఎంతో ఆసక్తిగా శ్రద్ధగా వింటున్నామని చెప్తున్నారు.  భారతీయ భాషల్లో వస్తున్న అత్యాధునిక సాహిత్యం, ప్రపంచ భాషల్లో వస్తున్న సాహిత్యాన్ని చదువుతున్న వాళ్ళు. అనువాదం చేస్తున్న వాళ్ళు. ఇది చూస్తున్నప్పుడు రాబోయే కాలం మరింత శ్రద్ధగా సంస్కృతం గురించి ఆలోచిస్తుందనిపించింది. ఇందులో నేను భాస నాటకాల గురించి, కాళిదాసు నాటకం, కావ్యం గురించి ఊరికే చెప్పడం కాకుండా వాటి అందాల మర్మాలు చెప్పే ప్రయత్నం చేశాను. ఇవి నాకు సునాయాసంగా తెలిసినవి కాదు. వాటిని మళ్లీ మళ్లీ చదువుకోవటం వల్ల, వాటిని పాఠాలుగా చెప్పడం కోసం మననం చేసుకోవడం వల్ల తెలిసిన అంశాలు. వాటిని సహృదయులైన పాఠకులకు పంచాలని ఆశతో వాటి మీద కూడా నాలుగైదు వ్యాసాలు ఇందులో రాసాను.

ఆత్మకథ వైపు మీ కలం అడుగులు వేయాలని మీ సోదరుని కోరిక , మీ ఆలోచన ఏంటీ?

మంచి కోరిక కోరిన సోదరునికి ధన్యవాదాలు. ఆత్మకథ అంటే ఎంతో నిజాయితీగా చెప్పవలసింది. ఏ దాపరికాలు లేకుండా మనని పాఠకులకు పరిచయం చేసుకోవాల్సిందే. సోదరుడు అప్సర్ లాగే మరి కొంతమంది మిత్రులు కూడా ఇలాగే నన్ను ఆత్మకథ గురించి అడిగారు. నేను ఇంకా బహుశా కనీసం మరో పదేళ్లయినా ఉంటాను అనుకుంటున్నా. అందుచేత ఈ లోపున రాయాలనే నా ఆలోచన. మా గోదావరి జిల్లా శరభవరం  నేపథ్యంగా  నా ప్రయాణం అంతా రాయాలని ఉంది. అయితే ఇందులో  సొంత గొడవ కాకుండా సమాజానికి పనికొచ్చేది ఏమైనా ఉందా అన్న వడపోతతో రాయాలన్నది నా ఆలోచన. చూద్దాం కాలం ఏం చేస్తుందో.

చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. ఈ కొన్ని శేఫాలికలు శీర్షికా రచన సారంగ అంతర్జాల మాస పత్రికలో ఇంతకాలం రావడానికి కారణం ఆ పత్రికా సంపాదకులే. వారి వల్లనే నేను మానకుండా రాయగలిగాను. అసలు మొదలు పెట్టడానికే కారణం తమ్ముడు అఫ్సర్. తన వేధింపు లేకపోతే ఈ పుస్తకమే లేదు. అతనికి నా ధన్యవాదాలు.

*

సుంకర గోపాలయ్య

పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల లో తెలుగు అధ్యాపకులు. సొంత ఊరు నెల్లూరు.
సంపాదకుడిగా పిల్లల కవిత్వం రెండు పుస్తకాలు తెచ్చారు.రంజని కుందుర్తి,తానా, ఎక్సరే ,పాటూరి మాణిక్యమ్మ మొదలైన పురస్కారాలు అందుకున్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాకులలో ఒకరు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి ఇంటర్వ్యూ. మీ కథలు వ్యాసాల ద్వారా మీ రచనా శైలి, మీ ఆలోచనలు, అభిప్రాయాలు, మనస్సును హత్తుకునేలా, సరళం, సహజం, సున్నితం . ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా విశదంగా మీ ఆలోచనలు ,మీ అభిప్రాయాలు, మీ మనస్సు విచ్చుకున్నాయి. సారంగాలొ వచ్చిన చాలా శేఫాలకలు చదివి ఒక్కొక్క శేఫాలిక ఎలా మనస్సును ఆకట్టుకున్నదని చాలా వివరంగా రాశాను. ఇంకా ఎక్కువ మీ రచనల గురించి తెలిపింది ఈ ఇంటర్వ్యూ. మనఃపూర్వక అభినందనలు మీకు.

    • థాంక్యూ సుశీల గారూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు