2020 చివర్లో తెలుగు సాహిత్యానికి సుపరిచితులైన ఇద్దరు రవి వీరెల్లి, స్వాతి బండ్లమూడి ఒక మరచిపోలేని కానుక మనకి అందించారు. ఎర్నెస్ట్ హెమింగ్వే నిజానికి మనకి బాగా తెలిసిన పేరే. హెమింగ్వే నవల “ద ఓల్డ్ మాన్ అండ్ ద సీ” వివిధ రూపాల్లో మనకి తెలిసిన కథే! ఆ నవలని తేటతెలుగులో తేలికైన తెలుగులో అందించారు రవీ, స్వాతి. ఈ సందర్భంగా ఆ ఇద్దరితో చిన్న సంభాషణ:
హెమింగ్వే నవలే ఎందుకు అనువాదం చేశారు?
తెలుగులో ఈ నవల వస్తే బాగుంటుందని మొదట అనల్ప బలరాం గారు అన్నారు. ఆయన సూచన బాగుందనిపించి ఈ అనువాదం మొదలుపెట్టాం. తీరా మొదలుపెట్టాక ఇదొక మంచి ఎక్సర్సైజ్ అనిపించింది. హెమింగ్వే వచనంలో ఉన్న గాఢత, ప్రత్యేకత వల్ల అనువాదం చేయడం ఆసక్తికరంగా అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా నోబెల్ బహుమతి పొందిన ఈ పుస్తకాన్ని గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలకి అందుబాటులోకి తెస్తే బాగుంటుంది అనుకున్నాం.
ఇంతకుముందు ఈ నవల తెలుగు అనువాదాలు వచ్చి వున్నాయి. మీ అనువాదం ఎందుకు చదవాలి?
ఇప్పుడు మార్కెట్ లో ఏ అనువాదమూ అందుబాటులో లేదు. ఇంతకుముందు వచ్చిన వాటిలో లేనిది దీనిలో ఉన్నది ఏమిటి అనేది చదివినవారు చెప్పాల్సిన విషయం.
అనువాదంలో ఎదుర్కొన్న పెద్ద సమస్యలు ఏంటి?
అతిపెద్ద ఛాలెంజ్ అంటే ఈ నవలలోని వచనం అనే చెప్పాలి. హెమింగ్వే వాక్యాలు చాలా పొడుగ్గా చాలా విషయాలని కలగలిపి ఉంటాయి. వాటిని తెలుగు నుడికారానికి తగ్గట్టు కత్తిరించాలా లేక ఉన్నదున్నట్టు చేయాలా, ఎక్కడెక్కడ మన వాతావరణానికి తగ్గ మార్పులు చేయాలి, ఎక్కడ యధాతధంగా అనువాదం చేయాలి అనే నిర్ణయాలు కష్టంగా ఉండేవి. ఈ నవలకి సంబంధించిన ప్రత్యేకమైన ఇబ్బంది ఏంటంటే, దీన్లో వాడిన సాంకేతిక పదజాలం. ఈ పదాల్ని, వాక్యాల్ని వీలైనంతవరకు సరళమైన తెలుగు భాషలోనే చెప్పడానికి ప్రయత్నించాము. అలా చెప్పడం వీలుకాని చోట ఫుట్ నోట్స్ ఇచ్చాము.
మీ అనువాద పద్ధతి ఏమిటి?
అనువాదం చేసేముందు, అసలు ఎవరికోసం ఈ అనువాదం చేస్తున్నాం అని మాకు మేము ప్రశ్నించుకున్నాం. సాహిత్యంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారందరూ, ముఖ్యంగా రచయితలు, విమర్శకులు నోబెల్ బహుమతి పొందిన ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ లో ఇదివరకే చదివిఉంటారు. ఇంగ్లీష్ సాహిత్యంతో మంచి పరిచయం ఉన్న తెలుగు పాఠకులు ఎలాగూ తెలుగు అనువాదాలు చదవరు. అనువాదం ఎంత గొప్పగా ఉన్నా అనుభవం కొత్తగా ఏం తీసుకురాలేం. మరి ఎవరికోసం? ముందు మా దృష్టిలో మెదలిని వాళ్ళు, తెలుగు మీడియం చదివే మిడిల్ స్కూల్, హై స్కూల్ పిల్లలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని బళ్లలో చదివే తెలుగు పిల్లలు. వీళ్ళే మా టార్గెట్ రీడర్స్. పుస్తకం తెలుగులో వేసుకోడానికి పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా హెమింగ్వే ఎస్టేట్ వాళ్ళకి మేము ఇదే చెప్పాం. పిల్లల కోసమే ఈ అనువాదం చేస్తున్నాం అన్నాం. స్కూల్ లో అభ్యాసం చేయడానికి ఈ అనువాదం ఉపయోగపడాలి అనుకున్నాం. అందుకే మూలానికి దగ్గరగా ఉండేట్టు అనువాదం చేశాము. వీలయినంత వివరంగా footnotes లో వివరాలు పొందుపరిచాం. పుస్తకంలో హెమింగ్వే ప్రస్తావించిన ముఖ్యమైన చేపల గురించి పుస్తకం చివర వివరంగా రాశాం.
హెమింగ్వే రాసిన టోన్ ని కాపాడుకుంటూ, మూలానికి దగ్గరగా ఉండేట్టు, సాంకేతిక భాష తేలిగ్గా అర్థమయ్యేట్టు, వీటన్నీటితో పాటు ముఖ్యంగా తెలుగులో చదవడానికి హాయిగా ఉండేట్టు అనువాదం చేయాలి అనుకున్నాం. పుస్తకం అంతటికీ ఒకే పద్దతి అని కాకుండా, ఈ పుస్తకం చదివే పాఠకులను దృష్టిలో పెట్టుకుని, ఒక హైబ్రిడ్ పద్దతిని ఎంచుకున్నాం.
మీరిద్దరూ కవులూ, కథకులు. నవల జోలికి వెళ్ళడం ఇదే మొదలు. ఎట్లా అనిపించింది?
చాలా కొత్తగా అనిపించింది. ఇదివరకు అనువాద కవితలు, కథలు రాసినా వాటి తరహా వేరు. కవిత్వంలో ఎక్కువగా భావోద్వేగాలు, అమూర్త భావనలు రాసిన అలవాటు ఎక్కువ. కానీ ఈ నవలలో ఉన్న వస్తువు వాటికి పూర్తిగా భిన్నమైంది, ఇక్కడ ఊహ తక్కువ, వాస్తవం ఎక్కువ. పైగా హెమింగ్వే కథ చెప్పే పద్ధతి చాలా సూటిగా ఉంటుంది. కథలోని ప్రాంతాలు, ఉపకరణాలు, జీవనశైలి వంటివి అర్థం చేసుకోవడానికి మేము కొన్ని డిస్కషన్ గ్రూప్స్ లో చేరి, రిఫరెన్స్ నోట్స్ చదవాల్సివచ్చింది.
***
పుస్తకం వివరాలు:
అతడే ఒక సముద్రం
మూలం: ‘ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ’, ఎర్నెస్ట్ హెమింగ్వే
అనువాదం: స్వాతికుమారి, రవి వీరెల్లి.
ప్రచురణ: వాకిలి, ఛాయా
పుస్తకం కోసం: https://www.amazon.in/Athade-Oka-Samudram-Telugu-Translation/dp/0997736399
*
నిన్ననే చదివాను, ఈ బుక్.. అనువాదం High school పిల్లల్ని దృష్టి లో పెట్టుకొని,చేశారు కాబట్టే, ఈ బుక్ చివర వరకు ఇష్టంగా, చదివించిందిఅందరినీ. ఇంగ్లీష్ నవల, చదివినఇలాంటి,అనువాదం చదవడం లోని అనుభూతే వేరు… మూడు తరాలు వారు చదివిన, bookగా, ఇది ఉండి పోతుంది..🙏అనువాదకులు కు ధన్య వాదాలు.!
Thank you Padma garu!
చాలా మంచి అనువాదం. ముఖ్యంగా తెలుగు భాషలో రాశారా అనేలా వుంది. మూలంలో సాంకేతిక పదాలు చాలా వుండడం వలన సాధారణ పాఠకులకు కష్టమనిపిస్తుంది కానీ ఈ అనువాదం తెలుగు పాఠకులకి ఒక గొప్ప వరం.
Thank you R. S. V garu!