కాసేపు ఉంటే బావుంటుంది
నీలో…
ఇంకాసేపు లీనమైతే బాగుంటుంది.
క్షణాలకి ఎంత అసూయ
త్వర త్వరగా కరిగిపోతాయి
నీలో ఉన్న మధుర జ్ఞాపకాలను
చూసీ.. చూసీ…
అవి ముందే తరలిపోతాయి..!
నీ అందమైన స్వరం కోసం
భూమి చెవులు రెక్కించిందేమో
అందుకే భూమధ్య రేఖ వద్ద
కాస్త అపభ్రంశ
సూర్యుడు నీ నవ్వులకు
స్థాణువైపోయాడేమో
ఏడాదికి పావు వంతు
నెమ్మదిగా నడుస్తున్నాడు
నీ కోపం ఉపమానమైందేమో
ఋతువులు గతి తప్పి ప్రవర్తిస్తున్నాయి
ఏ సంద్రపు ఒడ్డునో చంద్రుడు
నిన్ను జూసి మోహించి ఉంటాడు
అందుకే ఆటుపోటులతో
అలజడి
తీరానికి దూరమవుతుందనుకుందేమో
అల్పపీడనం
నిను ఉప్పెనై ముద్దాడి పోతుంది..!
పూల తోటలోని ఈ కాలిబాట
నీ అడుగుల చప్పుడు పసిగట్టే ఉంటుంది
సుగంధ పరిమళాన్ని వలవేస్తుంది
రాత్రిపూట తళుకులీనే నక్షత్రాలన్నీ
నీ మోములో కొలువుదీరుంటాయి
అందుకే పగలు అవెక్కడా కన్పించడం లేదు
గల గల పారే నీటి గొంతుకి
నీ నడకే ఉత్ప్రేరకం కాబోలు
సంగీత స్వరమై పలవరిస్తుంటుంది..!
బహుశా నా గుండె
నీ రూపే ముద్రించుకుందేమో
స్వప్నంలోనూ అది నిన్నే స్పందిస్తుంది.
*
Add comment