ఒక్కోసారి గతంలోకి వెళ్ళడం బాగుంటుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. 1973 వ సంవత్సరానికి వెళుతున్నాను. ఆ సంవత్సరం వేసవిలో నేను బుధరావుపేట (వరంగల్ జిల్లా) అనే వూళ్ళో ఏడవ తరగతి పూర్తి చేసుకున్నాక ఆ వూళ్ళో ఉన్నత పాఠశాల లేనందున ఎనిమిదవ తరగతి చదువుకోవడానికి పొరుగూరైన ఖానాపురం అనే గ్రామానికి రోజూ వెళ్ళి వచ్చేవాణ్ణి . ఎనిమిదవ తరగతిలో తేలు లక్ష్మినారాయణ అనే ఉపాధ్యాయుడు మాకు తెలుగును బోధించేవాడు. ఆయనకు కవిత్వమన్నా, పాటలన్నా చాలా చాలా ఇష్టం . ఆయన తన విధిగా హృద్యంగా చెప్పే తెలుగు పాఠాలతో పాటు తాను రాసిన కవితలను కూడా మాకు వినిపించేవాడు. పాటలూ పాడేవాడు చక్కని గొంతుతో . నండూరి వారి ఎంకి పాటలను నేను తొలిసారి విన్నది ఆయన గొంతులోంచే.
తాను రాయడంతో పాటు విద్యార్థులమైన మమ్ములనూ కవితలను రాయమని ప్రోత్సహించాడు. అదే సమయంలో ఇంటి వద్ద మా నాయిన చెబితే సులక్షణసారంలోని చాలా పద్యాలను నేను బట్టీ పట్టాను. పద్యలక్షణాలు తెలియడంతో కొన్ని కంద పద్యాలను , తేటగీతి, ఆటవెలది పద్యాలను రాయడం మొదలుపెట్టాను. వృత్తాలను కూడా ప్రయత్నించినట్లు గుర్తు. అయితే మా లక్ష్మినారాయణ సారు వచన కవితలనే రాసే వాడు కనుక ఆయన ప్రభావం వల్ల కాబోలు నేను పద్యం వైపు కంటే వచన కవిత్వం వైపు ఎక్కువ మొగ్గు చూపించి వాటిని రాయడం మొదలుపెట్టాను. దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన “ అమృతం కురిసిన రాత్రి” అనే కవితా సంపుటిని ఆ రోజుల్లో మా బావగారు కొనుక్కొచ్చి నాకు ఇచ్చారు. పదమూడేళ్ళ ప్రాయంలో దాన్ని చదివాను. అప్పుడు దానిలోని కవితలు ఏ మేరకు అర్థం అయ్యాయో నాకు తెలియదు కానీ ఆ సంపుటి నన్ను బాగా ఆకర్షించిందన్న మాట నిజం.
మా స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా 1974 లో స్కూల్లో కవితల పోటీ పెట్టారు. దానిలో నేను పాల్గొన్నాను . తొమ్మిదవ తరగతిలో వున్న యూసుఫ్ అలీ అనే విద్యార్థికి మొదటి బహుమతి రాగా, నేను రాసిన “ భరత రథం “ కు గాను నాకు రెండో బహుమతి లభించింది. నేను నా జీవితంలో రాసిన తొలి వచన కవిత అదే. స్కూల్ వార్షికోత్సవ సభలో వందలాది గ్రామస్తుల ఎదుట నేనూ , యూసుఫ్ అలీ మా కవితలను చదవడానికి మా టీచర్లు అనుమతించారు. అది వాళ్ళ సహృదయత, ప్రేమ , ప్రోత్సాహం. అట్లా వందల మంది ప్రజల సమక్షంలో తొలి సారి స్వీయ కవితను చదవడం నాకు మరపురాని జ్ఞాపకం. బహుమతిగా “ ప్రపంచ రత్నం ఇందిరా గాంధీ “ అనే ఒక చిన్న పుస్తకాన్ని స్కూల్ నాకు అందజేసింది . (అది ఇప్పటికీ నా దగ్గర పదిలంగా వుంది). ఆ పిదప నేను రాసిన వచన కవితలను మా సారు మా క్లాసులోనే కాక, పై తరగతుల్లోనూ వినిపించే వాడు. అట్లా నేను ఎనిమిదో తరగతి చదువుతున్నపుడే తోటి విద్యార్థుల దృష్టిలో, ఊరి వాళ్ళ దృష్టిలో ఒక “ కవి “ నై పోయాను! మా సారు ఆ రోజుల్లో తమ కవితల్లో సమాజం గురించీ ముఖ్యంగా పేద వాళ్ళ గురించీ ఎక్కువగా రాసేవాడు. ఆ ప్రభావం వల్ల నేమో నేను రాసే కవితల్లోనూ అవే విషయాలు వుండేవి.
హైస్కూల్ చదువు అయ్యాక నేను నర్సంపేట అనే వూళ్ళో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో (1976 -78) నా కవితా రచనను కొనసాగించాను. ఆ వూరి గ్రంథాలయంలో నెల నెలా జరిగే సాహిత్య మిత్రమండలి సమావేశాలకు వెళ్ళి నా కవితలను వినిపించే వాణ్ణి. ముడుంబై వరదాచార్యులు , నవాజ్ అలీ అనే కవులు ఆ సమావేశాల్లో నన్ను ప్రోత్సహించినట్లు గుర్తు. ఆ రోజుల్లో నేను దాశరథి రాసిన “అగ్నిధార” నూ, శ్రీ శ్రీ “మహాప్రస్థానం” నూ చదివాను. “ శ్రీ రంగం శ్రీనివాస రావు “ తన పొడుగాటి పేరును కుదించుకుని “ శ్రీ శ్రీ “ అనే కలం పేరుతో రాస్తున్నాడని తెలుసుకున్నాక , అదే ఒరవడిలో నేను నా ఇంటిపేరు “దర్భశయనం “ నుంచి ‘ ద ‘, ‘శ ‘ అనే అక్షరాలను తీసుకుని, నా పేరు “శ్రీనివాసాచార్య “ నుంచి ‘శ్రీ ‘ ని తీసుకుని, ఆ మూడక్షరాలను కలిపి “ దశశ్రీ “ అనే కలం పేరును రూపొందించుకున్నాను.
ఆ రోజుల్లో నర్సంపేట శాఖా గ్రంథాలయానికి వెళ్ళి నేను పత్రికలను చదువుతూ వుండేవాణ్ణి . అట్లా చదువుతున్న క్రమంలో వరంగల్ నుంచి వెల్వడే “ఓరుగల్లు “ అనే పత్రిక నా కంట పడింది . అందులో అచ్చయే కవితలను చదివే వాణ్ణి. అప్పటి దాకా కవితలను అచ్చుకు పంపాలని నాకు తెలియదు. ఎవరైనా నాకు సలహా ఇచ్చారో లేదా నా అంతటా నేనే అనుకున్నానో ఇపుడు గుర్తుకు లేదు గానీ “ఓరుగల్లు “ పత్రికకు నా కవితనొకదాన్ని “దశశ్రీ “ అనే అప్పటి నా కలం పేరుతో పంపాలని నిర్ణయించుకుని, 1978 వేసవిలో నేను రాసిన “ కవి” అనే కవితను “ దశశ్రీ “ కలం పేరుతో పత్రిక అడ్రస్ కు పోస్ట్ చేసాను.
1978 సెప్టెంబర్ లో B Sc (Ag ) లో నాకు సీటు రావడంతో ఆ చదువు కోసం హైదరాబాద్ వెళ్ళాను. వ్యవసాయ కళాశాల “ సి “ హాస్టల్ లో నా మకాం. అప్పుడు మా నాయిన నాకు తరుచుగా ఉత్తరాలు రాసే వాడు. మా ఇంటికి “ ఓరుగల్లు” పత్రిక పోస్టులో వచ్చిందని, అందులో నా కవిత అచ్చయిందని మా నాయిన అక్టోబర్ లో రాసిన ఒక ఉత్తరం ద్వారా నాకు తెలియజేస్తూ ఆ పత్రికను కూడా నాకు పంపాడు. అచ్చులో తొలిసారి నా కవితను చూసుకుని నేను ఎంత సంబరపడ్డానో మాటల్లో చెప్పలేను. పత్రికకు పంపిన నా తొలి కవిత అచ్చవడం వల్ల ఆ సంబరం పెద్దదే. నేనే కాదు నా క్లాస్ మేట్స్ కూడా చాలా సంతోషించి నన్ను అభినందించారు. నా రూమ్మేట్ శ్రీనివాసులు రెడ్డి ఎంతో ఉత్సాహంతో మా రూమ్ తలుపు మీద “ దశశ్రీ (కవి ) “ అని స్కెచ్ పెన్ తో రాసాడు. దాంతో నేను కవినని మా కాలేజీలో బాగా ప్రచారం అయింది.
ఇక అచ్చయిన ఆ కవిత “ కవి “ ని గురించే అవడం యాదృచ్ఛికమే . దాని నిడివి 16 పాదాలు. అంత్య ప్రాస పట్ల అప్పటి నా ఇష్టం ఆ కవితలో, మరీ ముఖ్యంగా చివరి పాదాల్లో కనపడుతుంది. రెండో పాదంలో “ వేదిక “ అనే పదం “ వేదిన “ గా అచ్చయింది. స్థూలంగా కవి సమాజ చైతన్యం కోసం పని చేస్తాడని ఆ కవిత చెబుతున్నది. అయితే ఈ కవితలో “ఊహ” కు, “ ఆశ” కు కూడా చోటుంది. ( “ ఊహాగానాల్లో పయనించే వాడు “/ “ఆశా జనక సౌధాలు నిర్మించే వాడు” ). చివరి పంక్తిలో “మధురం” వుంది (“మధురమాతని కవితా గానం”). 1978 లో నేను ఈ కవితను రాసినప్పుడు నాకు లోతైన చింతన గానీ , విశేష రచనానుభవం గానీ లేదు. కానీ ఈ కవితలో కవిని గురించి నేను చెప్పిన చాలా విషయాలతో నాకు ఈ రోజుకీ స్థూలంగా ఏకీభావం వుంది.
“ఓరుగల్లు” పత్రికకు సంపాదకుడు యం యస్ ఆచార్య అని, ఆయన ఆ పత్రిక కోసం ఎంతో పనిచేశాడని, గొప్ప వ్యక్తి అని చాలా ఏళ్ళకు నాకు తెలిసింది. తొంబయిల్లో ఒక సారి వెళ్ళి నేను ఆయనను కలిశాను కూడా. ప్రజా కవి కాళోజీ తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక సారి తన ఇంటి లోగిలిలోనే యం యస్ ఆచార్య గారిని సత్కరించినపుడు ఆ సభలో నేను వున్నందుకు ఎంతో సంతోషపడుతుంటాను. (ప్రముఖ న్యాయ శాస్త్ర ఆచార్యులు మాడభూషి శ్రీధర్ గారు యం యస్ ఆచార్య గారి కుమారుడే)
నా పదమూడవ ఏట (1974) నేను తొలి కవిత “భరత రథం” రాస్తే , నా పదిహేడవ ఏట (1978) అచ్చులో ఈ “కవి” అనే కవితను చూసుకున్నాను. “భరత రథం “ కవితను పోగొట్టుకున్నాను. అదొక విచారం, “ కవి “ మాత్రం పదిలంగా వుంది (పేపర్ కటింగ్ కూడా !). ఇదెంతో సంతోషం. నా తొలి కవిత అచ్చయి 47 ఏళ్లు గడిచాక ఆ జ్ఞాపకాన్ని ఇట్లా నెమరు వేసుకుని రాశాను, “సారంగ “ కోరిక మేరకు. అందుకు సారంగకు నా కృతజ్ఞతలు.
*
Add comment