– డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రముఖ పత్రికా సంపాదకుడు
(రెంటాల గోపాలకృష్ణతో కలసి ‘ఆంధ్రప్రభ’ సంపాదక వర్గంలో పనిచేసిన ప్రసిద్ధ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు. పత్రికా రచయితగా రెంటాలను దగ్గర నుంచి చూసిన అనుభవంతో, రెంటాల స్మరణోత్సవ సంచికకు సందేశంగా ఆయన రాసిన మాటలివి)
“రెంటాల గోపాలకృష్ణ గారితో నాది చిరకాల స్నేహం. ఆంధ్రప్రభలో ఆయనా, నేనూ కొంతకాలం కలసి పనిచేశాం. పత్రికా రచయితగా ఆయన ప్రతిభావంతుడు. వార్తను తీర్చిదిద్దడంలో, వార్తలలో దేనికెంత విలువ ఇవ్వాలో నిర్ణయించడంలో కొత్తవారెందరికో ఆయన శిక్షణనిచ్చారు. అంతకన్నా ముఖ్యమైన విషయం మరొకటి ఏమిటంటే – వయసు పైబడుతున్నప్పటికీ, పత్రికా రచయితగా ఆయన పనిలో, అంకితభావంలో అదే నిబద్ధత కనబరచడం. ఆ వయసులోనూ ఆయన అలా కష్టపడి పనిచేసిన తీరు యువ పాత్రికేయులకు స్ఫూర్తినిస్తుండేది.
పత్రికా రచయిత కాక ముందే రెంటాల గారు పేరున్న కవి, నాటకకర్త, అనువాదకుడు, బహుగ్రంథకర్త. మంచి ఉపన్యాసకుడు. ఆ రోజుల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతం నుంచి వచ్చిన ‘నయాగరా’ కవులు సుప్రసిద్ధులు. అలా నయాగరా కవులుగా ప్రసిద్ధి వహించిన కుందుర్తి ఆంజనేయులు గారు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ప్రభృతులతో రెంటాల గారికి సన్నిహిత స్నేహం ఉండేది. వారందరితో పాటే ఆయన కవితా వ్యాసంగం సాగింది. నిజం చెప్పాలంటే, ఆప్తుడైన అనిసెట్టి సుబ్బారావు వివాహానికి ఆ కవి మిత్రులు చిరుకానుకగా ఇచ్చిన ‘నయాగరా’ కావ్యం ప్రచురణలో సైతం రెంటాల తదితరుల హస్తం ఎంతో ఉంది. అందుకే, అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్య చిరుపుస్తకంగా వచ్చిన ‘నయాగరా’ కావ్యంలో రెంటాల కవితలు లేకపోయినా, ‘నయాగరా కవి మిత్రుల’లో ఒకరిగా రెంటాల ప్రసిద్ధుడయ్యారు. అయితే, ఏ ఒక్క సాహిత్య ప్రక్రియకో రెంటాల పరిమితం కాలేదు. అలా పరిమితం కాకుండా సాహిత్య కృషిని బహుముఖంగా విస్తరింపజేసిన ప్రతిభ ఆయనది. కవిగా, రచయితగా మాత్రమే కాక, రంగస్థలంలోనూ రాణించిన కళాకారుడాయన.
మచ్చలేని మనిషి!
రచయితగా, పత్రికా రచయితగా, నాటక కళాకారుడుగా, సినీ రచయితగా బహుముఖ పాత్రలు పోషించినా, రెంటాలలో ఓ గొప్ప గుణం ఉంది. అది ఏమిటంటే, ఏమి చేసినా ఆయన మచ్చ లేని మనిషిగా జీవించారు. వృత్తిలో నిజాయతీ, నడతలో నమ్రత, కష్టసుఖాలను సమదృష్టితో చూడగల స్థితప్రజ్ఞత ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించేవి. అవి ఆయన మూర్తిమత్వంలోని విశిష్ట లక్షణాలు. ఆయనను జ్ఞాపకం చేస్తూ, ఒక సంచిక ప్రచురిస్తున్న స్మరణోత్సవ సంఘం కృషి అభినందనీయం.”
హైదరాబాద్, 22 జూలై 1996
రచనారంగంలో పేరెన్నికగన్న వారు ‘శ్రీరెంటాల’ గారి గురించి తెలియజేస్తున్న విషయాలనుబట్టి నాకు స్పష్టంగా అనిపిస్తున్నది – మామిత్రుడు, సహోద్యోగి రామచంద్ర వాళ్లనాన్నగారు మంచిపేరుగాంచిన రచయిత, కవి, నాటకకర్త, అనువాదకుడు మరియు పత్రికావ్యాసంగంలో చేయితిరిగిన దిట్టయని. ఆయన ఆరోగ్యం క్షీణించి హైదరాబాదుకు ట్రీట్మెంటుగూర్చి మా ఎదురు క్వార్టర్స్ లో రామచంద్రదగ్గర ఉన్న కొద్ది సమయంలో చూసిన పరిచయమే. నిండు భారతీయతను పుణికిబుచ్చుకున్న పెద్దమనిషిగా రెండుచేతులతో తనకన్నచిన్నవారిని కూడా ఆప్యాయతతో నమస్పకరించి పలుకరించగల్గిన సంస్కారవంతుడాయన. ఆయన చివరిసమయంలోనైనా పరిచయంకలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
టి.ఏ.బి. ప్రసాద్ గారు,
మా నాన్న గారిని గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు.
మా నాన్న గారిని అనారోగ్య స్థితి లో చిరు పరిచయం లోనే మీరు ఆయన గురించి సరిగ్గా అర్థం చేసుకున్నారు
.
మీరన్నట్లు వయసు లో చిన్న వారినైనా గౌరవ మర్యాదలతో పలకరించటం ఆయన సంస్కారం. మా అమ్మగారిని కూడా మర్యాద గా ” ఏమండీ” అని పిలిచేవారు.