మండే వేసవి మధ్యాహ్నాన్ని మరపిస్తూ ,చల్లని గాలి వీచే సాయం వేళ ఆరుబయట కూర్చున్న ఇల్లాలికి, ఆ గాలి తరగలతో పాటు “నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులూ” అనే పాట వినపడి సేదతీరుస్తుంది.
ప్రతిష్ఠాత్మకమైన పాటల పోటీలలో పాల్గొని మైక్ అందుకుని “పదిమందిలో పాట పాడినా” అనే పాట పాడిన ఔత్సాహికుడికి ప్రథమ బహుమతి లభిస్తుంది.
తొలి పొద్దులో, చీకట్లు విచ్చుకునే సమయాన గుడిగంటలతో పాటు, “నీ లీల పాడెద దేవా, మనవి ఆలించ వేడెద దేవా” (యస్. యమ్. సుబ్బయ్య నాయుడు సంగీతం) అని నాదస్వరంతో పోటీపడే జానకి గొంతు, ఇంటి ముందు ముగ్గేసుకునే ముత్తయిదువ చెవిలో గూడుకట్టుకుని ప్రతిధ్వనిస్తుంది.
చప్పగా సాగుతున్న గాయకుని కర్ణాటక సంగీత కచేరీ “నగుమోము గనలేని నా జాలి తెలిసీ” అనే త్యాగరాజ కీర్తన మొదలు పెట్టి నెరవూ, స్వరకల్పనతో ముగించే సరికి పరమ రంజుగా శ్రోతలనలరించి రక్తి కట్టిస్తుంది.
ఇలా ఇన్ని రకాలుగా అలరించే పాటల వెనుక వున్నదంతా అభేరి రాగ మహిమ అంటే ఆశ్చర్యంగా వుంటుంది.
అభేరి రాగాన్నసలు ఆభేరి అని పిలవాలంటారు కొందరు, ఇంకొందరు దీనిని కర్ణాటక దేవగాంధారి అని పిలిస్తే ముత్తుస్వామి దీక్షితర్ దేవగాంధారము అనే పేరుతో పిలిచేవారట. హిందూస్థానీ సంగీతంలో దీనికి సమానమైన రాగం భీమ్ పలాస్ లేక భీంపలాసీ.
అత్యంత ఆహ్లాదకరమైన, మనోరంజకమైన రాగం, అందువలననే లలిత సంగీతంలో కానీ, సినిమా సంగీతంలో కానీ విరివిగా ఉపయోగించబడిన రాగంగా కనపడుతోంది.
భక్తినీ, ఆర్తినీ, ప్రేమనీ, విరహాన్నీ కూడా చేరవేసే రాగం.
రాగలక్షణాల గురించి చెప్పుకోవాలంటే–
ఈ రాగం 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ నుండీ జన్యము అని చెబుతారు, కొంతమంది ఇది 20వ మేళకర్త అయిన నటభైరవి నుండీ జన్యము అని భావిస్తారు.
ఆరోహణలో అయిదు స్వరాలు—-స గ మ ప ని స
ఆరోహణలో ఏడు స్వరాలు—స ని ద ప మ గ రి స – వుంటాయి అందుకే దీనిని ఔడవ సంపూర్ణ రాగము అంటారు.
ఈ రాగంలో కొంతమంది చతుశ్రుతి ధైవతం, కొంతమంది శుధ్ధ ధైవతం పలికిస్తూ వుంటారు.
కర్ణాటక సంగీతంలో త్యాగరాజ స్వామి చేసిన “నగుమోము గనలేని నా జాలీ తెలిసీ”అనే కీర్తన చాలా ప్రసిధ్ధి పొందినది
మైసూర్ వాసుదేవాచారి చేసిన “భజరే మానస” కూడా బాగా పేరొందినదే!
అన్నమయ్య పదాలలో “పలుకు తేనెల తల్లి పవళించెను, కలికి తనమున విభుని కలసినది గాన”అన్నదీ, “ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగ”అన్నదీ వున్నది అభేరి రాగంలోనే.
ఇంతకుముందే చెప్పుకున్నట్టు లలిత సంగీతంలోనూ, సినిమాలలోనూ విస్తృతంగా వినిపించే రాగం. ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి మన కర్ణాటక సంగీతంలోని అభేరికి, హిందూస్థానీ సంగీతంలోని భీంపలాస్ చాలా దగ్గర అని చెప్పుకున్నాం కదా, లలిత గీతాలలోనూ, సినీ గీతాలలోనూ యెక్కువగా హిందూస్థానీ పధ్ధతిలోనే బాణీ కట్టడం జరుగుతుంది,అందుకని భీంపలాస్ అనే పేరే యెక్కువగా వినపడుతూ వుంటుంది
అభేరి లేక భీంపలాస్ లో వినిపించే లలిత గీతాలు—
*శంకరంబాడి సుందరాచారి గారు రచించిన, మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రగీతం “మా తెలుగుతల్లికి మల్లెపూదండ” గీతం కూడా అభేరి లోనే కూర్చారు. దీనికి మట్టుకట్టింది ఆర్.సుదర్శనం.
*బసవరాజు అప్పారావుగారి గేయం—“తలుపుతీయునంతలోనే తత్తరమది యేలనోయి”, ఈ పాటని చాలామంది చాలా ట్యూన్లలో పాడారు అయితే ,మన మధురగాయని బాలసరస్వతి నోట మరింత మధురంగా వినపడే బాణీ చేసింది సి.ఆర్.సుబ్బరామన్
*బాలసరస్వతి గారే పాడిన ఇంకో రెండు ప్రయివేట్ పాటలు భీంపలాస్ లో వినపడేవి యేమిటంటే
—-“బంగారు పాపాయి బహుమతులు పొందాలి”–రచన–మంచాళ జగన్నాథరావు—ట్యూన్ —యస్ .హనుమంతరావు,
—-“హాయమ్మ హాయి నా పాపాయి”—రచన,సంగీతం –మంచాళ జగన్నాథ రావు.
కొనకళ్ల వెంకటరత్నం గారి “బంగారిమామ పాటలు”, నండూరి సుబ్బారావు గారి “యెంకి పాటలు” స్ఫూర్తి తో తయారయినవి.
ఆ పాటలలో “రావోయి బంగారి మామ” అనే పాట తీసుకుని భీంపలాస్ లో అద్భుతమైన బాణీకట్టి పాడారు ఘంటసాల. అసలు ఆయనకి ఈ రాగమంటే చాలా మక్కువ. ఆయన సంగీత దర్శకత్వంలో ఈ రాగంలో చేసిన పాటల గురించి తర్వాత చెప్పుకుందాం
సినిమా పాటల విషయానికొస్తే సంగీత దర్శకులకి చాలామందికి చాలా అభిమానపాత్రమైన రాగం భీంపలాస్ .
ఒక్కొక్కరు చేసిన పాటలనీ చూస్తుంటే వారి ప్రతిభ తెలియడంతో పాటు ఆ రాగంలో వున్న రంగులూ సొగసులూ కూడా తెలుస్తాయి
మన సంగీత దర్శకులలో యస్.రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు మొదలైన వారు తెలుగు చలన చిత్ర సంగీతాన్ని ఒక స్థాయిలో నిలిపిన వారు. వారి స్టైల్ యెలావుందీ,ఈ మధ్య వచ్చిన సంగీత దర్శకులు కీరవాణి, ఎ.ఆర్ రహ్మాన్ వీరి స్టైల్ యెలా వుందీ మచ్చుకు కొన్ని పాటలు తీసుకుని చూద్దాం.
యస్ .రాజేశ్వరరావుని ఒక జీనియస్ గా చెబుతూవుంటారు. ఆయన మీద హిందూస్థానీ సంగీత ప్రభావమెక్కువ. మరి ఆయన భీంపలాస్ లో యెలాంటి పాటలు చేశారో చూడండి. ఆయన “మల్లీశ్వరి” లో “ఆకాశ వీధిలో హాయిగా యెగిరేవు” అనే పాట ఈ రాగం ఆధారంగా చేశారు. ఘంటసాల, భానుమతి పాడారు. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి,రాజేశ్వరరావు గారు కూడా తన కచేరీలలో యెక్కువగా ఈ పాట పాడుతుండేవారు.
“మిస్సమ్మ”—సినిమాలో “రావోయి చందమామ మా వింత గాథ వినుమా”—రచన –పింగళి నాగేంద్ర రావు,పాడినది పి.లీల, ఎ.యమ్ రాజా.
“భలే రాముడు” చిత్రంలో —“ఓహో మేఘమాలా చల్లగ రావేలా”–రచన సదాశివ బ్రహ్మం—పాడినది ఘంటసాల, పి.లీల
“చదువుకున్న అమ్మాయిలు”—ఈ సినిమా అన్నపూర్ణ పతాకం కింద తయారయింది. డా.శ్రీదేవి రాసిన “కాలాతీత వ్యక్తులు” నవల ఆధారంగా ఈ సినిమా తీశారు.ఈ సినిమాకి యస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో దాశరథి రాసిన “ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోసము” అనే పాట భీంపలాస్ రాగం ఆధారంగా తయారయింది. ఇది పాడిన వారు ఘంటసాల.
చిత్రం “రాణీరత్నప్రభ”–“నిన్న కనిపించింది నన్ను మురిపించింది”—రచన ఆరుద్ర–సంగీతం రాజేశ్వరరావే, ఆలపించింది ఘంటసాల. అసలు ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి.
ఘంటసాల వారికి భీంపలాసంటే యెనలేని మక్కువ. వారీ రాగంలో చాలా పాటలు చేశారు మచ్చుకి కొన్నింటి గురించి చెప్పుకుందాం
చిత్రం —“పాతాళభైరవి”—-
“కలవరమాయె మదిలో నామదిలో”
“ప్రణయ జీవులకు దేవి వరాలే”
ఈ రెండు పాటలకీ భీంపలాసే ఆధారం
రచన—పింగళి
పాడినవారు—ఘంటసాల, లీల.
“నీవేనా నను తలచినది”– చిత్రం “మాయా బజార్ “–రచన పింగళి, పాడిన వారు ఘంటసాల, లీల. సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరున్నప్పటికీ ఈ పాట క్రెడిట్ రాజేశ్వరరావుకే దక్కాలంటారు. మొదటగా ఆయనే మాయాబజార్ సంగీత దర్శకులు అయితే యేదో విబేధం తలెత్తి నాలుగు పాటలు చేసి మానుకున్నారు. ఆయన చేసిన నాలుగు పాటల్లో ఇదొకటి.
“వెన్నెలలోనే వేడి యేలనో ”
“చల్లగ చూడాలి పూలను అందుకు పోవాలి”— ఈ రెండు పాటలూ “పెళ్ళినాటి ప్రమాణాలు” చిత్రం లోనివి, రెండింటికీ భీంపలాసే ఆధారం.
రచన –పింగళి
సంగీత దర్శకుడు —ఘంటసాల
పాడినది—-ఘంటసాల, లీల.
“ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము యేలనో”— చిత్రం “గుండమ్మకథ”–రచన పింగళి–పాడిన వారు ఘంటసాల, సుశీల. సంగీతం ఇంకెవరు ఘంటసాలే!
“అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మథుడు”—చిత్రం -“సారంగధర” –రచన సీనియర్ సముద్రాల–పాడినది పి.భానుమతి.
సంగీతం ఘంటసాల మేష్టారే!
“ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా”—“లవకుశ” చిత్రం—రచన సముద్రాల సీనియర్ —పాడినది—సుశీల, లీల వారిచే అద్భుతంగా పాడించిన వారు ఘంటసాల.
ఇక పెండ్యాల వారి రాగ వైభవం చూద్దామా
“నీలిమేఘాలలో గాలికెరటాలలో నీవు పాడే పాట వినిపించు నే వేళ”—-“బావామరదళ్ళు”—రచన ఆరుద్ర—పాడినది యస్.జానకి
“పదిమందిలో పాట పాడినా”—చిత్రం “ఆనందనిలయం”—రచన –ఆరుద్ర—పాడినది ఘంటసాల.
“చిగురాకులలో చిలకమ్మా”–చిత్రం “దొంగరాముడు”—రచన సముద్రాల సీనియర్
పాడినది —ఘంటసాల, జిక్కి.
అద్భుతంగా చేసిన పెండ్యాల వరసకు కొంచెం జలుబు చేసినట్టున్న ఘంటసాల గొంతు మరింత న్యాయం చేసింది.
“రాగమయీ రావే”—చిత్రం –“జయభేరి”—రచన —-మల్లాది రామకృష్ణశాస్త్రి—పాడినది ఘంటసాల. పెండ్యాల చెక్కిన ఈ స్వరరచనను పాడటం ఒక పరీక్ష లాగా భావిస్తారు చాలామంది ఔత్సాహిక గాయనీ గాయకులు.
“తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే”—“గుండమ్మ కథ”—రచన –సి.నారాయణరెడ్డి—పాడినది ఘంటసాల, సుశీల.
“ఓ నెలరాజ వెన్నెల రాజ”—-చిత్రం —“భట్టి విక్రమార్క”—-రచన అనిశెట్టి -పాడినవారు ఘంటసాల, సుశీల
చూశారుగా పెండ్యాల గారి ప్రతిభ!
సుసర్ల దక్షిణామూర్తి “ఇలవేల్పు” సినిమా కోసం చేసిన “చల్లని రాజా ఓ చందమామ ” అనే వడ్డాది.కూర్మనాథం రచన—పాడినది రఘునాథ్ పాణిగ్రహి, పి.సుశీల, లీల. ఈ పాటకు కూడా భీంపలాసే ఆధారం
యన్ .టి.ఆర్. ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు. ఆయన “గులేబకావళి కథ” లో చేసిన “నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని” అనేపాటకి కూడా భీంపలాసే ఆధారం. పాట రచన సి.నా.రె. ఇది ఆయనకు తొలిచిత్రం. పాడినది ఘంటసాల, సుశీల.
“కొంజుం సెలంగై” అనే తమిళ చిత్రం తెలుగులోకి “మురిపించే మువ్వలు”గా డబ్ చేయబడింది.ఆ చిత్ర దర్శకుడు “నీలీల పాడెద దేవా” అని ఒక అపురూపమైన బాణీ కట్టారు .అది ఒక గాయని నాదస్వరంతో పోటీ పడుతూ పాడే పాట. దానికోసం కారుకురుచి అరుణాచలం చేత ముందుగా నాదస్వరం రికార్డ్ చేసేశారు ,ఆ నాదస్వరం వింటూ ఆస్థాయిలో పాడే గాయని కోసం వెతికి అలా పాడటానికి యస్.జానకే సమర్థురాలని తెలుసుకుని, ఆమెతో పాడించారు. ఆ పాట తెలుగు తమిళాలలో కూడా సూపర్ హిట్టయ్యింది అభేరి రాగానికి చిరునామాగా నిలచింది.
“ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ ” అనే పాట “సుఖదుఃఖాలు” చిత్రం లోనిది .దేవుల పల్లి వారి అనుపమానమైన పదరచనకు యస్ .పి.కోదండపాణి స్వర రచన తోడై ఈ పాటను అత్యున్నత స్థాయిలో నిలబెట్టింది, పాట పాడింది పి.సుశీల .ఈ పాట కూడా భీంపలాస్ ఆధారంగానే తయారయింది
తెలుగు చలన చిత్ర సంగీత జగత్తులో కె.వి. మహదేవన్ కి ఒక ప్రత్యేక స్థానముంది. మరి ఆయన చేసిన భీంపలాస్ బాణీ యెలా వుంటుందో తెలుసుకోవాలంటే “శృతిలయలు” సినిమాలో కె.జె.యేసుదాస్ పాడిన సిరివెన్నెల రచన “తెలవారదేమో స్వామీ” వినాలి. ఇది అసలు అన్నమయ్య పదం అని పొరబడ్డారట చాలామంది.
ఆ తరం సంగీత దర్శకులే కాదు ఈ తరం దర్శకులు కూడా ఈ రాగాన్ని అభిమానించారు మంచి పాటలు చేశారు.
“జీన్స్” సినిమాలో ఎ.ఆర్ రహమాన్ ట్యూన్ చేసిన “కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమౌనా” అనే పాట అచ్చమైన అభేరి. ఈ పాట పాడింది నిత్యశ్రీ మహదేవన్, డి.కె.పట్టమ్మాళ్ మనవరాలు.
ఇంకా కీరవాణి గారు చేసిన బాణీలు చూస్తుంటే ఆయనకీ రాగమంటే యెంత ఇష్టమో అనిపిస్తుంది. చూడండి వరసగా వింటుంటే మీకూ అనిపిస్తుంది
“ఔరా అమ్మకచెల్లా ఆలకించి నమ్మడమెల్లా”–చిత్రం ఆపద్బాంధవుడు–రచన –సిరివెన్నెల–పాడినది—బాలు,చిత్ర
“మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగె”—చిత్రం —“పెళ్ళి సందడి”–రచన వేటూరి—గానం –బాలూ,చిత్ర
“ఏలే ఏలే మరదలా”–చిత్రం –“అన్నమయ్య”—రచన –వేటూరి—పాడింది–బాలూ, సుజాత, అనూరాధా శ్రీరామ్ –ఈ చిత్రానికి సంగీతం చేసినందుకు కీరవాణికి జాతీయ అవార్డ్ లభించింది.
“పూసిందిపూసింది పున్నాగ”—చిత్రం –“సీతారామయ్య గారి మనవరాలు”–రచన వేటూరి –పాడినది బాలూ,చిత్ర
“తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధమో”—చిత్రం–“క్రిమినల్ “–రచన -సిరివెన్నెల –పాడినది బాలూ,చిత్ర
ఇదే ట్యూన్ మహేష్ భట్ గారి హిందీ సినిమాలో కూడా వాడుకున్నారు “తూ మిలే దిల్ ఖిలే “అంటూ వస్తుంది.రెండు భాషల్లోనూ ఈ పాట సూపర్ హిట్
ఇక కొన్ని హిందీ సినిమా వరసలు భీంపలాస్ ఆధారితమైనవి చూద్దాం.
సంగీత దర్శకుడు సి.రామచంద్ర అంటే చాలామందికి గాఢాభిమానం
ఆయన “అనార్కలి” కోసం చేసిన “యే జిందగీ ఉసీకీ హై” అనే పాట లోకప్రియమైనది. దీనిని అసమానంగా పాడినది లతామంగేష్కర్. ఇదే ట్యూన్ ని తెలుగులో ఆదినారాయణ రావు గారు తీసుకుని “జీవితమే సఫలమూ “అని జిక్కీ చేత పాడించారు.
“నయనోం మే బదరా ఛాయే”—చిత్రం “మెరా సాయా”–గాయని లతా–సంగీత దర్శకుడు మదన్ మోహన్ చాలా మంచి పాట
“ఖిల్ తే హై గుల్ యహా”—చిత్రం “షర్మిలీ”—గానం కిషోర్ కుమార్ –దర్శకుడు యస్ .డి .బర్మన్ -చాలా హాంటింగ్ ట్యూన్
-“ఖొయా ఖొయా చాంద్ “—-చిత్రం”కాలా బాజార్ “—-గాయకుడు మహ్మద్ రఫీ —దర్శకుడు యస్ .డి.బర్మన్
“పియా ఐసో జియా మై సమాయగయోరే”—చిత్ర “సాహిబ్ బీబీ అవుర్ గులామ్ “—పాడినది గీతాదత్ —దర్శకుడు హేమంత్ కుమార్.
ఇంకా చాలా పాటలు వుంటాయి అన్నీ చెప్పుకోలేము కదా. ఈ పాటికి భీంపలాస్ లోని రంగుల, అందాలతో మీ మనసు రాగ రంజితమై వుంటుందని భావిస్తూ–
*
మంచి వ్యాసం. Thank Youuu