ఆ రంగుల టేబుల్ మీద కుంచె నేనే !

ప్రసిద్ధ రచయిత శీలా వీర్రాజు గారి మొదటి వర్ధంతి సందర్భంగా…

ప్రకృతి, కళా వేర్వేరంటారు సంజీవ్ దేవ్ గారు. జీవితంలో అణువణువునీ కళాత్మకం చేసుకోవడం, మన చుట్టూ ఉండే చిన్న చిన్న వాటిల్లో కూడా అందాన్ని ఆరాధించడం వీర్రాజు గారిని చూసే నేను నేర్చుకున్నాను. వారికి కళ అనేది ఏదో తెచ్చిపెట్టుకున్న అభిరుచో, సరదానో ,హాబీ నో కాదు… కళ అనేది వారి జీవన శైలి. వారి వ్యసనం. సౌందర్యోపాసనలో ఆయన ఇల్లు నాకొక బెంచ్ మార్క్ ని చూపెట్టింది. అందుకే వీర్రాజు గారి గురించి చెప్పాల్సివస్తే ఆయన ఇల్లే నాకు మొదటి వాక్యమవుతుంది.

ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, నవలాకారుడు చిత్రకారుడు- అన్నింటికీ మించి గొప్ప మానవతావాది. సౌమ్యుడు. సహనశీలి, నిబద్ధత, క్రమశిక్షణ కూడా కలవారు. గంభీరంగా కనిపించే అతి సున్నిత మనస్కుడు.

ఆయన జీవితంలో అతిపెద్ద గెలుపూ అదేనేమో.ఒక మంచి మనిషిగా గుర్తింపబడడం కంటే పెద్ద గుర్తింపు ఇంకేముంటుందని నమ్మిన మనిషి కనుకే ఆయన జీవితం అంత సరళంగా సంతృప్తికరంగా ఆశారాహిత్యంగా సాఫల్యంగా సాగిందనుకుంటా.

ఆయనతో నా పరిచయం నాకు ఊహ తెలియని రోజులనుంచీ ఆయన చివరిరోజుల వరకూ కూడా కొనసాగింది. ఎంతో గర్వంగా కూడా అనిపిస్తుంది. ఆయన్ను ఆఖరి ప్రయాణం లో కూడా నేను దగ్గరుండి సాగనంపగలగడం అదృష్టమో దురదృష్టమో తేల్చుకోలేను. ఒక మనిషి పరిచయమే గర్వకారణంగా అనిపిస్తే ఇక జీవితాంతం ఆ మనిషి సాన్నిహిత్యం, స్నేహం, ప్రేమ, మమకారం పొందడం ఇంకెంత గుండెల్ని ఉప్పొంగేలా చేస్తుందో మాటల్లో చెప్పలేను.

ఆ ఇంట్లో ప్రతి మలుపూ ఒక అబ్బురమే
ప్రతి వస్తువూ ఒక ఆశ్చర్యమే
ప్రతి మరకా ఒక వర్ణచిత్రమే
ప్రతి మనిషీ ఒక అద్భుతమే

ఆ ఇంట్లోకి ప్రవేశించగానే బాల్కనీలో పలకరించే పొడవాటి కాక్టసు చెట్లు. మళ్ళున్న వాటినైనా మేము ప్రేమతో మచ్చికచేసుకుంటామని చెపుతున్నట్టు ఉండేవి.ఇక ఆ పూలు,లతలూ,చిలుకలూ చెక్కిన తలుపు…తలుపుని కూడా అంత కళాత్మకంగా మలచాలనుకోవడం వెనుక రహస్యమేమిటో మరి..ఇంట్లోకి వచ్చినవారందరినీ తిరిగి వెళ్ళనీయకుండా కట్టిపడేయాలనేమో.

సుభద్రాదేవి గారి ప్రేమ,అభిమానం వారు చేసిపెట్టే టిఫిన్లూ,టీలంత కమ్మగానూ ..వారి రచనలంత ఆర్ద్రంగానూ..మళ్ళీ మళ్ళీ కావాలనిపించేలా ఉంటాయి.ఇక పల్లవి అక్కలో చిన్న వయసునుంచీ చూసిన వినయం, విధేయత, చక్కటి మాటతీరు, వీణా పరిజ్ఞానం, బొమ్మలు గీయడం , పెయింటింగ్, కుట్లు అల్లికలు, ఎంబ్రాయిడరీ.. సకలకళాకోవిదురాలంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ తను నాకొక ప్రేరణ. తనలాగే మరో స్ఫూర్తి ఇప్పుడు వాళ్ళింట్లో .. ఆశ్లేష!!

నాన్న చేయి పట్టుకుని నడుచుకుంటూ వాళ్ళింటికి వెళ్ళిన కాలం లో .. దారిలో మొక్కలకి మొలిచే చిన్ని కాయలను కోసుకెళితే… దాన్ని తెరిచి అందులో కూడా అందమైన బొమ్మలను చూపిన మాంత్రికుడు వీర్రాజుగారు!!

గడిబిజి గందరగోళపు రంగు కాగితంలో…

ధ్యాసపెట్టి చూస్తే దేవుడు కూడా కనిపిస్తాడని నేర్పిన ఇంద్రజాలికుడు.(ఆ రోజుల్లో రంగు డిజైన్ల పేపర్లలో చూపుని కేంద్రీకరించి చూస్తే 3D బొమ్మలు కనపడేవి. అలా మొదటిసారి వాటిని మాకు చూపినది ఆయనే).

పుస్తకాలని అందంగా సర్దుకోవడమే కాక, వాటి అట్టలని కూడా అందంగా బైండింగ్ చేయించి పెట్టుకునేవారు.ఇంటికి ఎప్పుడెళ్ళినా ఏదో ఒక బొమ్మల పుస్తకమో, కథల పుస్తకమో ఇవ్వకుండా పంపేవారు కాదు.అలా పుస్తకాల మాయా ప్రపంచంలోకి నన్ను వేలు పట్టి నడిపించినది ఆయనే.
అందరికీ ఉన్న 24 గంటల్లోనే..ఎన్ని పనులు చేయచ్చో, ఎంత సున్నితంగా బతకచ్చో చేసి చూపించారాయన. సున్నితత్వాన్ని భరించడం ఎంత కష్టసాధ్యమైన విషయం కదా !

చిన్న చిన్న విషయాల్ని కూడా గమనించి ప్రోత్సహించడం ఆయనలో విలక్షణమైన లక్షణం గా ఉండేది. చిన్నపుడు నేనే పిచ్చి బొమ్మ గీసినా, కాగితంపై ఏ లేత రంగులు పామినా..భయం భయం గానే ఆయనకి చూపించేదాన్ని. ఏదో చిన్నపిల్ల వేసినదని పక్కనపడేయకుండా, చులకన చేయకుండా, శ్రద్ధగా చూసి,దేన్నైనా చక్కగా మెచ్చుకుని, ఇంకా ఎలా మెరుగుపరచవచ్చో దాన్నింకా ఎలా అందంగా తీర్చిదిద్దచ్చో చెప్పేవారు, లేదా చూపేవారు ఓపికగా…నాకు బాగా గుర్తు… నేను పాత అట్టముక్కలతో.. పనికి రాని వస్తువులతో ఓసారి ఒక నెమలి బొమ్మ తయారుచేసి.. వారింటికి వెళ్ళినపుడు తీసుకెళ్ళి చూపిస్తే… ఎంతో మెచ్చుకుని , తన దగ్గరే పెట్టుకున్నారు. కొన్నాళ్ళకి ఓ రోజు ఆయనే స్వయంగా మా ఇంటికొచ్చి అందంగా ఫ్రేము కట్టించి తెచ్చిన నెమలి బొమ్మని నా చేతిలో పెట్టారు. నా చిన్ని మనసుకి అంతకన్నా ధైర్యం, ప్రోత్సాహం ఇంకేం కావాలి!! వానకి పులకరించి పురివిప్పి నాట్యమాడే నెమలిలా గంతులేసింది నా మనసు. ఆ తరువాత ఇక ఏ అట్టముక్కనీ, ఏ పిచ్చికాగితాన్నీ పారేయనీయలేదు మా అమ్మని. అది వేరే కథ !!

నాకు బాగా గుర్తు. మా నాన్నని ఎవరికైనా భయపడడం నేను చూసానంటే, అది వీర్రాజు గారికే. నాన్న ఉద్యోగంలో పడో, వక్తిగత పరంగానో, సంసారం పిల్లల గొడవలో పడో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుల పనులు మర్చిపోతూ ఉండేవారు. ఫోన్లు లేని రోజుల్లో సరే కానీ, ఫోన్లున్న రోజుల్లో కూడా .. వచ్చి మాట్లాడేంత దూరంలోనే ఇల్లున్నా కూడా వీర్రాజు గారు ఒక ఉత్తరమే రాసేవారు.ఆ బాధ్యతను గుర్తుచేస్తూ.అంతే ఆ పోస్టుకార్డు వచ్చిందంటే వీర్రాజు గారికి కోపమొచ్చిందని అర్థం.ఇక ఆ పై ఆదివారం నాన్న, వెనుక నేనూ పొద్దున్నే టిఫిన్లు కూడా చేయకుండా వెళ్ళి వారింట్లో వాలిపోయేవారం, సుభద్రాదేవి గారు ఏదోటి పెడతారనే నమ్మకంతో. మావరకూ ఆయన ఉత్తరం ఓ అల్టిమేటం.

బహుశా మా నాన్నాకి నాన్న లేని లోటూ, ఒక బాధ్యతాయుతమైన అన్న లేని లోటూ ఆయన తీర్చారేమో. మా నాన్న నాకు హీరో అయితే… నాకు తెలిసినంతవరకూ మా తాతగారైన కుందుర్తి గారి తరువాత వీర్రాజుగారే నాన్నకి హీరో. మా తాత మీదున్నంత గౌరవం, అంత ప్రేమా, అంత గర్వం ,అంత అభిమానం నాన్నకి వీర్రాజు గారి మీదే ఉండటం చూసాను. వీర్రాజు గారు కూడా బహుశా నాన్నలో ఒక పోగొట్టుకున్న కొడుకునో, ఒక చిన్న తమ్ముడినో చూసుకున్నారేమో.మన అనుకున్నవారిపైనే కదా ప్రేమైనా,కోపమైనా హక్కైనా!! ఈ విషయం వాళ్ళిద్దరూ ఒకరికొకరు చెప్పుకునే అవకాశం ఏరోజూ వచ్చి ఉండకపోవచ్చు కానీ …వీర్రాజు గారి పిలుపు రాగానే నాన్న ఏరోజైనా రెక్కలు కట్టుకు వాలిపోడమూ, నాన్న పోయినపుడు వీర్రాజు గారు చిన్నపిల్లల్లా గుక్కపెట్టి ఏడవడమూ నాకు బాగా గుర్తుంది. ఇంత జీవనోద్వేగం ఎక్కణ్ణుంచి వచ్చింది ? సాహిత్యం పుణ్యమే కదూ ? ఒక్క కవిత్వం మనుషుల్నింత దగ్గరచేయడం చిన్న విషయం కాదు. నాకు కవిత్వంలో వస్తువూ, శిల్పమూ లాంటివేమీ తెలీదు. వీర్రాజుగారిని చూశాక నాకు ఒకటే అర్ధమయ్యింది. కవిత్వమంటే మనుషుల్ని పొందడం. పొందినవారిని వదలకుండా అపురూపంగా దాచుకోవడం. అంతే.

ఆయన మీద నాకున్న గౌరవం, ప్రేమా కూడా మా నాన్న నాకిచ్చి వెళ్ళిన వారసత్వమేనని నేను నమ్ముతున్నాను.

పెళ్ళయి సింగపూరుకి వచ్చాక కూడా ఎప్పుడు ఇండియాకి వెళ్ళినా వారింటికి వెళ్ళి కలవకుండా ఉండే ప్రసక్తే లేదు. నేనెక్కడికి టూరుకి వెళ్ళినా అక్కడే కళాత్మకమైన వస్తువు కనపడినా , ఇది వీర్రాజు గారికి నచ్చుతుంది అని కొనితెచ్చేదాన్ని. వారిని కలవడానికి వెళినపుడు ఆ వస్తువుని ఇంకా అందంగా మార్చి ఎక్కడా ఒక గోడ, ఒక అర కూడా ఖాళీ లేని ఇంట్లో ఎక్కడో అక్కడ దానికో స్థానం కల్పించి తనదైన ప్రత్యేక రీతిలో అమర్చిపెట్టి ,ఇదిగో నువ్విచ్చినది ఇక్కడ పెట్టానంటూ చూపించేవారు. తిరిగి నాకు ఏదో ఒకటి ఇచ్చి పంపేవారు.

వారి మనసులో కూడా పరిచయమున్న ప్రతి ఒక్క మనిషికి, అలాగే నాకూ ఒక ప్రత్యేక స్థానం అమరుస్తూనే ఉన్నారు చివరిదాకా.

నేను ఆఖరుసారి కలిసి మాట్లాడినపుడు కూడా అదే చెదరని ఉత్సాహం, ప్రోత్సాహం నాలో నింపారు. లేని పురుగుని నా మెదడులోకి ఎక్కించి పంపారు.బహుశా ఆయన నాతో మాట్లాడిన ఆఖరి మాటలు అవే. వెళిపోయేప్పుడు వద్దంటుంటే కూడా నడవలేని స్థితిలో కూడా లిఫ్టు దగ్గిరికి సాగనంపడానికి వచ్చి “కవితా!! బాగా రాస్తున్నావు,తప్పకుండా వచ్చే సంవత్సరం లోపు పుస్తకం ప్రచురించాలి గుర్తుంచుకో”, అన్నారు. ఇప్పటికీ ఆ మాటలు ఆజ్ఞలానే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.

ఇక ఆయన చివరి రోజుల్లో జరిగిన రెండు విషయాలకి చాలా బాధ పడతాను ఈనాటికీ.

ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుల వెనుక వీర్రాజు గారి కృషి, ఆ అవార్డుకి అంత గొప్ప పేరూ, స్థాయి రావడం వెనుక గల ఆయన నిబద్ధత నిజాయితీ అందరికీ తెలిసినవే. తాతగారి శతజయంతి వేడుకగా 50 వ అవార్డు సభ చేసి ముగించాలని అనుకున్నాం. దానికోసం చేయాల్సిన పనులూ, ఉత్తరాలు రాయడం , ఎంపిక చేయడం అన్నీ వీర్రాజుగారే చేసారు ఎప్పటిలాగే. మొమెంటోలు కూడా చేయించి పెట్టారు. ఆ విషయమై ఒకటి రెండు సార్లు ఫోనులో కూడా చర్చించుకున్నాం. ఒక తేదీ అనుకుని జూం లో మీటింగు చేయాలనుకున్నాం. కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల ఆ తేదీకి చేయడం కుదరక దాన్ని పోస్టుపోను చేయాల్సి వచ్చింది.ఆలోపే వీర్రాజు గారు అందరినీ వదిలి వెళ్లిపోయారు. ఆ తరువాత రెండు నెలలకి ఆ మీటింగు విజయవంతంగా జరిగింది కానీ ఆయన లేని లోటుని మాత్రం మేమెవ్వరమూ పూరించలేకపోయాము. పోస్టుపోను చేయకపోయి ఉంటే ఆయనే స్వయంగా ఆ ఆఖరి సభను జరిపించేవారు. అది నా వలనే జరగనందుకు నేనీరోజుకీ కుమిలిపోతున్నాను. నేను ఆయనకి పడిన బాకీ అది!!

ఆయన పెయింటింగ్ ఒకటైనా మా ఇంట్లో పెట్టుకోవాలని నాకు ఎప్పటినుండో కోరిక. కానీ తొందరేముందిలే ఎప్పుడైనా అడిగి తీసుకోవచ్చు అనుకుని అడగడం మానేసాను. అంతలోనే వారు తన పెయింటింగ్స్ అన్నీ రాజమండ్రి లో గ్రంధాలయానికి డొనేట్ చేసారని తెలిసింది ఒకరోజు.. వెంటనే ఫోను చేసి నాకు ఒక్క పెయింటింగైనా ఉంచండి అని అడిగితే అన్నీ నిన్నే పంపించేసామన్నారు. నాకు ధుఃఖం పొంగుకొచ్చింది. నేను ఇండియా వెళ్లినపుడు కలిసి నాకెందుకు ఇవలేదని, ఒకటైనా కావాలని మారాం చేసాను. అంత చనువూ వారిచ్చిన వరమే.అపుడు ఆయన నాతో “ఒక పెయింటింగ్ ఉంది , దానికి మెరుగులు దిద్దాలి, అది బాగుచేసి నువ్వు మళ్లీ వచ్చినపుడు ఇస్తాను” అని చెప్పారు ఓపికగా. ఆపాటికే ఆరోగ్యం బాగా క్షీణించి ఎక్కువసేపు కూర్చూలేకపోయేవారు. కానీ చివరి రోజుల్లో హాస్పిటల్లో కూడా కవితకి పెయింటింగ్ పూర్తి చేసి ఇవ్వాలి అని కలవరిస్తూనే ఉన్నారట. ఆ విషయం పల్లవి అక్క చెప్తుంటే మనసు అతలాకుతలమయ్యింది. అదే వీర్రాజు గారు నాకు పడిన బాకీ!!

ఈ బాకీలు తీర్చుకోడానికైనా ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో మళ్ళీ మేము కలుస్తాము అనుకోవడం కొంత డ్రమాటిక్ గా అనిపించినా.. అదే నా నమ్మకం!!

కళను అమ్ముకోవడం ఇష్టం లేక, డబ్బు సంపాదన మీద ఆశలేక, పేరు సంపాదన మీద వ్యామోహం లేక, జీవితం ఎన్ని సవాళ్ళు విసిరినా, ఎన్ని సమస్యలని తెచ్చిపెట్టినా, అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన మనిషి నాకు తెలిసిన వీర్రాజు గారు. నిరాడంబరత లోనే అసలైన సంతోషం ఉంటుందని నిరూపించిన నిజాయితీపరుడు ఆయన. కళలను ఉపాసించిన కళా పిపాసి.

ఆయన ఆసాంతం ఒక స్ఫూర్తి, ఒక ఉత్తేజం, ఒక నిలువెత్తు భావుకత .అన్నిటికీ మించి తమకున్న అతి కాస్త ప్రతిభకే తెగ విర్రవీగే మనుషులున్న ఈ కాలంలో ఒదిగి ఉండటం వీర్రాజు గార్ని చూసి నేను నేర్చుకున్నాను. ఏదో బతకేయడం కాదు, జీవించడం నేర్చుకున్నాను.అప్పుడే ఒక సంవత్సరమైందా ఆయన లేక? నాకింకా ఆ ఇల్లే గుర్తొస్తోంది.

రంగులతో, రకరకాల సైజుల కుంచెలతో, పెన్నులు పెంసిళ్ల తో నిండిన వీర్రాజు గారి టేబుల్ జ్ఞాపకానికొస్తోంది. ఎప్పుడెళ్లినా అక్కడేదో పని చేస్తూనో , చదువుతూనో, రంగులేస్తూనో, బొమ్మ గీస్తూనో , పుస్తకాలకి కవరు పేజీలు డిజైన్ చేస్తూనో, తన అందమైన దస్తూరీతో ఏదో రాస్తూనో ఆయన కనిపించడం గుర్తుకొస్తోంది.

ఆ టేబులుకు ఎన్ని రంగులంటి ఉంటాయో ఆ రంగులన్నీ మన మనసుకి అంటుకోక తప్పదేమో వారి పరిచయంలో !! వారింట్లో కుర్చీలు, బల్లలూ, పెన్నులు పెట్టుకునే హోల్డరు, పుస్తకాల అట్టలూ, కాఫీ కప్పులూ ఒకటేమిటి .. అన్నీ కళాత్మకంగా జీవితానుభవాల్ని ప్రశ్నిస్తున్నట్టే ఉంటాయి. కంటికి కనిపించేదేనా అందమంటే ? ఏమో ? ఆ టేబిలు మీద ఒలికిపోయిన రంగుల్లో నా జ్ఞాపకాలు గడ్డకట్టిన క్షణాన్ని అనుభవిస్తున్నాను. అక్కడే నేనెక్కడో సగం వేసిన బొమ్మలా సుతిమెత్తటి వేళ్ళ స్పర్శ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాను.

*

కుందుర్తి కవిత

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శీలావి బహు ఆత్మీయులు. ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పారు.. మీ వాక్యం అద్భుతంగా ఉంది. శీర్షిక అంతే అద్భుతం.. శీలావి ని చిరస్మరణీయం చేసే వ్యాసాలలో ఇదొకటి అనగలను.

  • “అక్కడే నేనెక్కడో సగం వేసిన బొమ్మలా సుతిమెత్తటి వేళ్ళ స్పర్శ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాను.” మొత్తం వ్యాసాన్నీ… మళ్ళీ చదివింపజేసే ముగింపు…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు