ఆ మగాడ్ని నిందించే పదమేదీ..??

రూప రుక్మిణి ‘అనీడ’ కవిత్వ పుస్తకంతో తెలుగు సాహిత్య లోకానికి  తనను తాను పరిచయం చేసుకున్నారు. స్త్రీ వేదనా భరిత జీవితంలోని శకలాల్ని వస్తువుగా స్వీకరించి రాసిన కవిత్వం లో జీవం ఉట్టిపడుతుంది. అంతగా కష్ట పెట్టని వచనం తన కవిత్వ శైలి. సూటిగా ప్రశ్నించడం తన కవిత్వ తత్వం. కవిత్వంతో పాటు గతంలో కడప నుండి వచ్చే ‘తరణం’ దినపత్రికలో  “ఆమె స్వగతం” పేరుతో ఓ ఆరు నెలల పాటు కాలమ్ నిర్వహించిన అనుభవం కూడా ఉంది. “ఒక్క క్షణం” అంటూ మనల్ని ఒకసారి అలర్ట్ చేస్తుంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండే ప్రపంచంలో అంతగా చర్చకు రాని సున్నితమైన అంశాల్ని మనముందు ప్రశ్నల్లా నిలబెడుతోంది. పురుషాధిక్య ప్రపంచపు తీరు తెన్నుల్ని స్కాన్ చేసి చూపెడుతుంది.
*
ఒక్కక్షణం 
~
స్త్రీ చుట్టూనే తిరుగుతూ 
నిందా వాక్యాలన్నీ 
ప్రత్యక్షంగానో పరోక్షంగానో.
ఏమని చెప్పాలి!?
స్త్రీనే.. 
దూషించే వాక్యంగా మలిచే పురుషాహంకారాన్ని.
సమాజం లో 
పురుషుడు చేసే దమన కాండకు 
స్త్రీ మరణమై శ్వాసిస్తుంటే
ఆ మగాడ్ని నిందించే పదమేదీ…??
ఏ మార్పు ఆశించాలి ఈ సమాజం నుండి..!?
మాటల్లో స్త్రీ కోసం పోరాటాలు 
నిందల్లో స్త్రీల స్వాభిమానాల హననాలు.
పెద్దగా మైకులు పెట్టాం.
అరిచాం.
స్త్రీలకు ఎవరో రక్షణ ఇవ్వడం లేదని నినాదాలు చేశాం.
వ్యక్తిగా గౌరవించడం లేదన్నాం.
మళ్ళీ 
ఆ మగాడ్ని నిందించే వస్తువు
వాడి తల్లో, భార్యో అవటం విషాదం కదూ!
..
అమానవీయ చర్యలను ప్రతిఘటించుదాం.
కుటుంబాలకు మూలం స్త్రీ 
ఆ స్త్రీకి అన్యాయం జరిగితే 
ఎలుగెత్తిన స్వరమవుదాం.
మదమెక్కిన పురుషుడి అనైతిక,
రాజకీయ చర్యలకు బలైపోయిన మగువకు 
రక్షణ వాక్యాలు పంచుదాం.
మార్పు మనలోనే మనతోనే అని 
ఒక్కక్షణం ఆలోచించేద్దాం!                                   
*
 కవి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఒకింత కష్టమే. భారతీయ సామాజిక వ్యవస్థలో వేళ్లూనుకొని వున్న భావజాలాల్ని, మూఢ విశ్వాసాల్ని  పెకిలించడం అంత సులువు కాదు. కానీ అసాధ్యం మాత్రం కాదు. సంస్కర్తల కాలం చెల్లింది. వ్యక్తిత్వ వికాసం తోనే మార్పు సంభవించాలి. అయితే కవి ఆశిస్తున్న సమసమాజ నిర్మాణానికి సహనం ఎక్కువ. “ఆ మగాడ్ని నిందించే పదమేదీ..?? ”  అని ప్రశ్నించుకుంటే సమాధానం నేల చూపులు చూస్తుంది. ఈమధ్య ‘విరాట పర్వం’ సినిమా ట్రైలర్లో చూపించినట్లు ‘లం..డి కొడకా..’ అనే ప్రత్యామ్నాయ పరుష పదజాలం మగాడిని నిందించే పదంగా స్వీకరించవచ్చా?  మగాడిని నిందించడానికి ఇప్పటివరకు తన చెల్లినో, తల్లినో, అక్కనో, భార్యనో కలుపుకోకుండా తిట్టిన పదాలేవీ కనిపించవు. మగాడిని తిట్టడానికి కూడా స్త్రీని బాధ్యురాల్ని చేయాల్సి రావడం విషాదకరం. ఎవరి కోపానికైనా ముందుగా బలైపోయేది స్త్రీమూర్తి మాత్రమే. పోరాటాల్లో, ఉపన్యాసాల్లో, చర్చల్లో  స్త్రీ ఔన్నత్యాన్ని గురించి పొగిడే  వ్యక్తులు సైతం స్త్రీని కించపరచకుండా తమ కోపాన్ని ప్రదర్శించలేరన్నది వాస్తవం. వ్యవస్థలో లేనిది సాహిత్యంలోకి దాదాపుగా రాదు( కాల్పనిక సాహిత్యం మినహా). మరి సాహిత్యం ద్వారా వ్యవస్థలోని లోపాలను సరిచేయవచ్చా?  చైతన్యమో, ఒక కదలికనో అయితే తీసుకురావచ్చు. దానికి సంబంధించిన ప్రాథమిక స్పృహను కలిగించడం కవి బాధ్యత. “ఒక్కక్షణం” ఇలాంటి ఒక స్పృహ కలిగించడానికి, ఒక కదలికను అందించడానికి పునాదిగా పనికి వస్తుంది.
*
 కవిత్వం నిర్మాణ పరంగా ఆలోచిస్తే – సమస్యల పరిష్కారాలకు ‘శాస్త్రీయ పద్ధతి’ని అన్వయించవచ్చు. అందులోని సోపానాలను అనుసరించి వస్తువును ఎలివేట్ చేయవచ్చు. కవి ఈ విషయంలో కొంత సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్య విశ్లేషణ/ లక్ష్య నిర్ధారణ, దత్తాంశ సేకరణ, దత్తాంశాలను ప్రతిక్షేపించడం, ప్రాక్కల్పనలను ప్రతిపాదించడం, ప్రాక్కల్పనలను పరీక్షించడం, సాధారణీకరించడం, కొత్త విషయాలకు అన్వయం అనే ఆమోదయోగ్యమైన 9 సోపానాలు ఉన్నాయి. శాస్త్రీయ పద్ధతికి సోపానాలు సూచించిన మొదటి వ్యక్తి కార్ల్ పియర్సన్ (1937). శాస్త్రీయ పద్దతికి సోపానాలు సూచించిన మరొక వ్యక్తి కీస్లర్. “సమస్యను ఒక ప్రత్యేక రీతిలో క్రమబద్ధంగా పరిష్కరించడమే శాస్త్రీయ పద్ధతి” అని చెప్పవచ్చు. జీవశాస్త్ర బోధన పద్ధతుల్లోని ‘శాస్త్రీయ పద్ధతి’ని సామాజిక శాస్త్రాల సమస్యలకు కూడా అన్వయించుకోగలిగితే ఒక మార్గం సుగమం అవుతుంది.
*
 వైయక్తిక మార్పు సామాజిక మార్పునకు, సామాజిక మార్పు పెను విప్లవానికి బాటలు వేస్తుంది. ఒక్కరోజుతో ఉన్నఫలంగా మన లక్ష్యానికి చేరువ కాలేము. కవి సంధిస్తున్న ప్రశ్నల వెనుక వున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు వెతకడం ప్రతి ఒక్కరి బాధ్యత. కవి మరింత పదునైన వాక్యంతో రాణించగలరని ఆశిస్తూ శుభాకాంక్షలు.
*

బండారి రాజ్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ధన్యవాదాలు రాజ్ కుమార్ సర్… ఈ చిన్న మార్పు సమాజం లో రావాలన్న అభిలాష తోనే ఈ ఒక్క క్షణం ఆలోచించండి అంటూ రాసుకున్న కవిత ఇది. మీరు మంచి విశ్లేషణతో ఆలోచించవలసిన ఆవశ్యకతను వివరించారు. మీ సహృదయానికి హృదయ పూర్వక ధన్యవాదాలు 😊🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు