ఆ పూట మున్నేరు పాడలేదు!

జూలై 22 దాశరథి గారి జయంతి

రో తరగతి సెలవులకి ముందే మా ఇంట్లో హడావుడి మొదలయ్యింది.

“మనం ఖమ్మం వెళ్లిపోతున్నాం” అని ఆ సెలవుల ముందే నాన్నగారు ఇంట్లో చెప్పారు.

ఆ ఎండాకాలం చింతకానిలో నాకు చివరి ఎండాకాలం అవుతుందని తెలియదు. నా చదువు మొదలయ్యింది చింతకానిలో! వీధిబడిలో పంతులయ్య గారి మొదటి బెత్తం దెబ్బ తిన్నది చింతకానిలో! తరవాత ప్రైమరీ స్కూలు. ఆరో తరగతి దాకా అక్కడే! బాల్యం దానికదే వొక ప్రపంచం అనుకుంటే, నా ప్రపంచానికి మొదలూ చివరా చింతకానే!

అక్కడే మా నాన్న గారు బడి పిల్లల కోసం నడిపిన గోడ పత్రిక “మధుర వాణి” లో నేను మొదటి కవిత రాశాను . నాన్నగారికి “కన్యాశుల్కం” కంఠతా వచ్చేది. అప్పుడప్పుడూ స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఆ సంభాషణలు అలా అప్పచెప్పేసే వారు. మధురవాణి ఆయనకి నచ్చిన పాత్ర. అందుకనే, మా గోడ పత్రికకి ఆయన ఆ పేరు పెట్టారు.

మా బడి వార్షికోత్సవానికి ఆ ఏడాది దాశరథి గారిని తీసుకు వచ్చారు నాన్నగారు. అంతకు ముందు రాత్రే నాన్నగారు ఖమ్మం వెళ్ళి, అక్కడ బస చేసి వున్న దాశరథి గారిని చింతకాని పిలుచుకు వచ్చారు.

నాన్నగారు ఎక్కడ పని చేస్తే అక్కడ బడి పిల్లలకి కవుల గురించి చెప్పీ, వాళ్ళ కవిత్వాలూ, పద్యాలూ పాడి వినిపించి సాహిత్యం మీద వొక అంతులేని ప్రేమని పుట్టించే వాళ్ళు. దాశరథి గారు స్టేషనులో దిగగానే మా బడిలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి పిల్లలతో పాటు దాదాపు వంద మంది పైనే అక్కడ ఎదురుచూస్తూ కూర్చున్నాం “మహాకవికి స్వాగతం” అని పోస్టర్లు పట్టుకొని – దాశరథి గారు స్టేషన్లో దిగగానే, అందరం వొక పెట్టున “ దాశరథి జిందాబాద్” అని నినాదాలిస్తూ ఆయన్ని స్టేషన్ బయటికి తీసుకువచ్చాం. (మా వూళ్ళో కమ్యూనిస్టులు ఎక్కువే కాబట్టి, అలాంటి నినాదాలూ, ఊరేగింపులు మాకు కొట్టిన పిండి).

అప్పుడు స్టేషను నించి చింతకాని వూళ్ళోకి పావు గంట పైనే నడిచి వెళ్లాల్సి వుండేది. దాశరథి గారిని ఎడ్ల బండి మీద కూర్చోబెట్టి, ఆయన వెనక మా బడి పిల్లలంతా నినాదాలు ఇస్తూ వూళ్ళోకి తీసుకువచ్చాం. మా ఇంటి దగ్గిర బండి ఆగింది. మా ఇంటి ముందు పెద్ద కోలాహలం. “సాయంత్రం దాశరథి గారు బళ్ళో మాట్లాడతారు. అందరూ అక్కడికి రండి.” అని నాన్నగారు మిగిలిన బడి పిల్లల్ని వెళ్లిపొమ్మన్నారు. దాశరథి గారు అందరికీ వందనం చేస్తూ “ మిమ్మల్ని చూస్తే చాలా ఉత్సాహంగా వుంది నాకు, మీ కౌముది సార్ ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. అందరినీ సాయంత్రం కలుస్తాను.” అని దాశరథి గారు అందరికీ అప్పటికి వీడుకోలు చెప్పారు.

పిల్లలంతా వెళ్లిపోయాక దాశరథి గారి తో కలిసి మేం మా ఇంటి ముందు గదిలో కూర్చున్నాం. మాది ఇరుకు కొంప. రెండు గదుల ఇల్లు. ఆరుగురు పిల్లలు. ఒకరు అడుగు పెట్టాలంటే ఇంకొకళ్లు ఖాళీ చెయ్యాలి. అంత ఇరుకు! మొదటి గది నిండా పుస్తకాలు; నాన్నగారి రాత కుర్చీ, అంటే పడక కుర్చీ.

అయినా అప్పటికే ఇల్లు బాగా సర్ది పెట్టి వుంచింది అమ్మ. అయినా ఇబ్బంది పడుతూ వుంది. అది గమనించి దాశరథి గారు “ఇల్లు అద్దంలా పెట్టావు బహెన్-జి! నాకేం కావాలే, ఇదిగో కూర్చోడానికి ఈ చోటు చాలు. ఏడీ మా అఫ్సూర్యుడు?” అంటూ ఆయన పడక కుర్చీలో శరీరం వెనక్కి వాల్చి ఆరాంగా కూర్చుని నన్ను దగ్గిరకి తీసుకున్నారు. “నీ పేరులో చంద్రుడు(కౌముది) వున్నాడు కాబట్టి, వీడి పేరులో సూర్యుడు వుండాల్రా!” అని నాన్నగారికి చెప్పి నా పేరుకి ఆ తోక తగిలించారు ఆయన.

(ఆ తరవాత రుబాయిలు రాసే కాలంలో నాన్నగారికి రాసే వుత్తరాల్లో ఈ పేరు మీద ఆయన చాలా రుబాయిలు రాశారు.

నాకు గుర్తుంది ఇది:

“ఖమ్మం లో ఎండలు మండిపోతున్నాయని విన్నా. అయినా , కౌముదీ! రేయెండ నువ్వుండ/ ఇంకేల మండుటెండ?)

“బేటా! షాయరీ చదువుతున్నవా?” అని అడిగారు.

లేదు అని తలూపాను, సిగ్గు పడుతూ. అదొక్కటే అప్పుడు తెలిసిన భాష కాబట్టి.

“అరె, యే క్యా హై బేటా! నువ్వు షాయర్ బిడ్డవి!’ అంటూ ఆయన నాన్నగారి వైపు తిరిగారు.

“వాడు రహస్య కవిలే..దాశరథీ!” అని నాన్నగారు అనడం గుర్తు!

ఆ సాయంత్రం దాశరథి గారి సభ బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పటికీ చింతకానిని తలచుకున్నప్పుడల్లా ఆ సాయంత్రపు సభ గుర్తొస్తుంది. కానీ, అది చింతకానిలో నా చివరి స్కూలు వార్షికోత్సవ సభ!

అదే మొదటి సారి నేను దాశరథి గారిని చూడడం! చింతకానిలో అలా ఎంత మంది కవులూ రచయితలూ మా బడికి / మా ఇంటికి వచ్చారో లెక్క లేదు, వచ్చిన వాళ్ళంతా మా ఇంటికి రావడం గొప్పగా వుండేది. చింతకాని వదల్లేకపోవడానికి వున్న అనేక కారణాల్లో ఆ గొప్ప అనుభూతి పెద్ద కారణం!

* * * * * *

మేం ఖమ్మానికి మారడం నాకు పెద్దగా నచ్చలేదు.

“వీడొట్టి పల్లెటూరి మొహం రా!” అని చాలా కాలం బడి పిల్లలు ఎడ్పిస్తూ వుండడం వల్ల ఆ అయిష్టం ఇంకా పెరిగేది అప్పట్లో!పల్లె నించి రావడం వల్ల నాకు పెద్దగా దోస్తులూ ఏర్పడ లేదు. ఆ ఖాళీని భర్తీ చెయ్యడానికి నేను కవిత్వంలో మొహం దాచుకోవడం లేదా తలదాచుకోవడం మొదలు పెట్టాను.

కానీ, కొద్ది రోజుల్లోనే ఖమ్మానికి అలవాటు పడిపోయాను. ఆ రోజుల్లో దాశరథి గారు దాదాపూ ప్రతి నెలా ఖమ్మం వచ్చే వారు, ఆయనంటే ఖమ్మం వాళ్ళకి వున్న విపరీతమయిన గాఢాభిమానం వల్ల!

దాశరథి గారు వచ్చినప్పుడల్లా నన్ను తోడు బెట్టుకొని ఆయన దగ్గిరకి తీసుకు వెళ్ళే వారు నాన్నగారు. లేకపోతే, ఆయనే మా ఇంటికి వచ్చి మా అందరినీ వొక సారి చూసి వెళ్ళే వాళ్ళు. ఖమ్మం రావడం వల్ల ఇదే నాకు జరిగిన మేలు.

దాశరథి గారికి స్నేహితులంటే మహా ప్రేమ!ఒకసారి స్నేహం కుదిరిందంటే ఇక వాళ్ళు ఆయనకి కుటుంబ సభ్యుల కిందనే లెక్క! ఆయన “యాత్రాస్మృతి” చదువుతుంటే ఆయన ఎంత స్నేహజీవో ఇట్టే అర్థమవుతుంది. లేకపోతే – ఆళ్వార్ గురించి అంత గొప్పగా రాయడం సాధ్యమా?

అసలు ఆళ్వార్లు పన్నెండు మందే

పదమూడో ఆళ్వార్ మా వట్టికోట ఆళ్వార్ స్వామి!

దేవునిపై భక్తి లేకున్నా

జీవులపై భక్తి వున్నవాడు

శరీరంలో ప్రతి అణువూ

ఆరోగ్య స్నానం చేసే రీతిని

నిష్కల్మషంగా నవ్వగలవాడు

రాముడి తెలివితేటలు లేని

అమాయకుడు ఆళ్వార్!

అతను పోయినప్పటి నుంచీ

అమృత హృదయం విచ్చి

నవ్వగలవాడు లేకుండా పోయాడు లోకంలో.

ఈ కవిత నాకు చాలా సార్లు గుర్తొచ్చేది. నిజానికి అది ఆళ్వార్ కంటే బాగా దాశరథి గారికే సరిపోతుందని అనిపిస్తుంది, ఆళ్వార్ నాకు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి!

ఖమ్మంలో వుండగా ఆయన మా ఇంటికి రాగానే మొదట నన్ను పలకరించే వాళ్ళు.“జనాబే ఆలం! క్యా హాల్ హై?” అని నవ్వుతూ అడిగే వారు.

అలా అనేక యేళ్ళు, అనేక సాయంత్రాలు, అనేక గంటలు ఆయనతో నాన్నగారి సమక్షంలో చాయ్ పానీ కబుర్లు నడిచేవి. (వాళ్ళిద్దరూ మద్యసేవనం చేసే వాళ్ళు కానీ, ఇంట్లో ఎప్పుడూ నేను చూడలేదు. మా ఇంట్లో చాయ్ అయిన తరవాత వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళే వాళ్ళు. అప్పుడు నాన్నగారు ఆలస్యంగా ఇంటికి రావడమే నాకు గుర్తు) వాళ్ళ మాటలు ఏమీ అర్థం కాకపోయినా నేను అక్కడే చెవులు రిక్కించుకుని కూర్చునే వాడిని. ఆయన పద్యమో/కవితో పాడితే వినాలని! వొక చుక్క చాయ్ గొంతులో పడగానే, ఆయన చప్పున వొక రుబాయీనో, గజల్నో ఎత్తుకుని తీయగా పాడేవారు.

అలా గాలిబ్ గీతాలు ఆయన గొంతులో విన్నాను. అప్పుడే ఆయన రాయడం మొదలు పెట్టిన తెలుగు రుబాయిలూ విన్నాను. అప్పట్లో నాకు ప్రాచీన సాహిత్యం మీద విపరీతమయిన ఆసక్తి వుండడం వల్లా, అదే సాహిత్యం అనే భ్రమల్లో బతుకుతూ వుండడం వల్లా, తెల్లారి లేస్తే పద్యాలు బట్టీయం పాడుతూ, వృత్తాలతో కుస్తీ పాట్లు పడుతూ వుండడం వల్లా – ఆ రోజుల్లో ఆయన వచన కవిత్వం అప్పట్లో పెద్దగా నచ్చేది కాదు. ఆయన వచన కవిత్వం మొదలు పెట్టగానే నా మనసు యాంత్రికంగా స్విచ్ ఆఫ్ అయ్యేది.

కొన్నాళ్ళ తరవాత – అప్పటికి నేను కాలేజీకి వచ్చేశాక – ఆ ముక్క దాశరథి గారిని ముఖం మీద అడిగేశాను, మా నాన్నగారు నావైపు కాస్త కోపంగా చూస్తూ వుండగా-

దాశరథి గారు నవ్వి,నా భుజమ్మీద చెయ్యి వేసి:

“మంచిదే, బిడ్డా! కానీ, ఎంత పద్య కవి అయినా ఏదో వొక నాడు వచన కవిత్వం రాయాల్సిందే. పద్యం గొప్ప పద్యానిది, వచనం గొప్ప వచనానిది. నువ్వు ఇప్పటి దాకా కవిత్వంలో ఒక రకమయిన లయకే అలవాటు పడ్డావు. పైగా నువ్వు వృత్తాల మాయలో వున్నావు కనుక, నీకు వచన కవిత్వంలో వుండే కొత్త లయ తెలియడం లేదు. ఎందుకూ, ఉర్దూలో ఘజల్ అంత గొప్ప సంప్రదాయం కదా! ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రీవర్సు కి వచ్చేస్తున్నారు. వొక్కటే గుర్తు పెట్టుకో – ఇదే అద్భుతం అనుకోని వొక్క చోటే ఆగిపోవద్దు. కాలం నిన్ను ఎటు తీసుకువెళ్తుందో చూడు. వీలయితే కాలం కంటే ముందు వెళ్ళు, లేదా, కాలం వెంట వెళ్ళు. అంతే కానీ, కాలం ఎక్కడో నువ్వెక్కడో వున్నావనుకో – నీ కథ ముగిసినట్టే!” (అంట రాని వారెవరంటే/ మన వెంట రాని వారే! అని అప్పట్లో దాశరథి పాట కొంచెం పాప్యులర్ కూడా!)

బాగా గుర్తు- దాశరథి గారికి ఖమ్మం వూరి బయట పారే మున్నేరు అంటే చాలా ఇష్టం. ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ దాని చుట్టే తిరిగాయి. ఆ మున్నేరు మా ఇంటికి దూరంలో వుండేది. బ్రిడ్జి దాటి వెళ్ళాలి.

వొక సారి ఆయన అడిగారు “నువ్వు ఎప్పుడయినా మున్నేరు వొడ్డుకి వెళ్ళావా?” అని.

“లేదు” అన్నాను నేను అప్పుడే కొంచెం మాట్లాడడం నేర్చుకుంటున్న వాడినై-

‘అరె…సాయంత్రం వూరికే అట్లా నడుచుకుంటూ వెళ్ళు. అక్కడ కాసేపు కూర్చొని రా…ఆ రాత్రి నువ్వు కనీసం వొక్క లైను అయినా రాస్తావ్ తప్పక!”

“నిజమా?’

“అవును, మంచి కవిత్వం రాయాలంటే నువ్వు మంచి ప్రకృతిలో వుండాలి. కాస్త నీళ్లూ, కాసిని చెట్లూ, కొన్ని పక్షులూ…వీటితో నీకు దోస్తీ కుదరాలి.”

తరవాత చాలా వుత్తరాల్లో/ సంభాషణల్లో ఆయన మున్నేరు గురించే రాసే వారు/ చెప్పే వారు. ‘ఈ మధ్య వెళ్ళావా?లేదా?” అని గుచ్చి గుచ్చి అడిగే వారు. “ఈ మున్నేరు లేకపోతే నాకు కవిత్వమే తెలియదు” అన్నారు వొక వొక సారి !

ఆ రోజుల్లో ఎందుకో, నాకు అటు వెళ్లాలని అనిపించేది కాదు. అక్కడ పక్కనే శ్మశాన వాటిక వుండేది. నేను వెళ్ళిన రెండు మూడు సార్లు అక్కడ శవాలు తగలబెట్టడం చూశాను. బహుశా, అది నా మనసులో నాటుకు పోయి వుండాలి. ఆయన తన చిన్నప్పటి మున్నేరు అలానే వుందని అనుకుని ఎప్పుడూ అలా అడుగుతూ వుంటారులే అని వూరుకున్నా.

కానీ,దాశరథి గారు చనిపోయారని తెలిసి నాన్నగారు హడావుడిగా బ్యాగ్ సర్దుకొని కన్నీళ్ళ పర్యంతం అవుతూ హైద్రాబాద్ వెళ్ళిన సాయంత్రం నేను మున్నేరు వొడ్డుకి వెళ్ళాను.

ఆ సాయంత్రం మున్నేరు అలసిపోయిన తల్లిలా ప్రశాంతంగా పడుకుని వుంది.

దాని గలగలలు నాకు వినిపించక కాసేపటికి వెనక్కి మళ్లాను!

– మళ్ళీ ఎప్పుడూ నేను మున్నేరు దాకా వెళ్లనే లేదు!

*

చిత్రాలు: మృత్యుంజయ్ 

అఫ్సర్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మున్నేరు పేరిట రాసిన బాల్యం దాశరథి జ్ఞాపకాలు,నాన్నతో దాశరథి అనుబంధం బాల్యమంత చక్కగా సహజంగా చెప్పారు. ఇలా గడిచిన కాలాన జ్ఞాపకాలు రాస్తే చదవడానికి ఎంతహాగా వుంటాయో! దాశరథి జన్మదిన సందర్భంగా చక్కని కావ్యం అందించారు. అభినందనలు.
    బి ఎస్ రాములు.

  • అఫ్సూర్యా, దాశరథి ఒళ్లో కూర్చుని కౌముది చిటికెన వేలు పట్టుకుని నడిచావు. అందుకే కవివయ్యావు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు