ఆ పాత కవికి ఎందుకు నచ్చలేదు!

ఆ పాత కవికి ఎందుకు నచ్చలేదు!

సారి ఒక చిన్న సంఘటనతో మన సంభాషణ ప్రారంభిద్దాం. ఉత్సాహవంతుడైన ఒక కొత్త కవి ఇంకో ప్రముఖ  కవి దగ్గరికి తను రాసిన కొన్ని కవితలతో వొచ్చాడు. కొత్త కవికి తను రాస్తున్న కవితలపై ఆ పాత కవి అభిప్రాయం పొందాలని తపన. కొంత నిర్మాణాత్మక సూచనలనూ పొందవచ్చని ఆశ. మన పాత కవి మాత్రం కొత్త కవితో ఇది అసలు కవిత్వమే కాదు పొమ్మన్నాడు.

కొత్త కవికి మొదట పాత కవిపై కోపమొచ్చింది. కొంత సమయం తరువాత తన కవిత్వం మీద తనకే అనుమానం వచ్చింది. పాత కవికి తన కవిత్వంలో ఏం నచ్చలేదో? తను రాసింది కవిత్వం కావడానికి తను ఏం చెయ్యాలో? అసలు కవిత్వమంటే ఏమిటి. తన ఉద్వేగాలనే కదా తను కవిత్వంగా రాసింది! అప్పుడెవరో చెప్పినట్లు “Emotions recollected in tranquility”, అన్నట్లుగానే తన ఉద్వేగాలను తన కవిత్వంలో చెప్పాడే. సత్యాన్ని అందంగా చెప్పడానికే ప్రయత్నించాడే! అని మధన పడ్డాడు. ఆ పాత కవి తనకంటే గొప్పగా ఏం రాశాడు? ఆయన కవిత్వమంతా నిరాశా నిస్పృహలే తప్ప తన కవిత్వంలో వలే సౌందర్యం కూడా లేదే! తన కవిత్వం ఆ పాత కవికి ఎందుకు నచ్చలేదు అని మధనపడుతూనే ఉన్నాడు.

ఇక్కడ మనం పాత కొత్త కవులగురించి కాక కొంచం కవిత్వపు ప్రాధమిక లక్షణం గురించి ఆలోచిద్దాం.

యోగ్యతాపత్రంలో చెలం “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ” అంటారు. ఈ వొక్క వాక్యంతో కవిత్వపు ప్రాధమిక లక్షణాన్ని మొత్తం చెప్పేశారు చెలం.

మనం ఇంతకుముందు సంభాషణల్లో చెప్పుకున్నట్లు కవిత్వం రెండు రకాలు. ఆత్మాశ్రయం ఒకటైతే వస్త్వాశ్రయం ఇంకొకటి. కవి కవిత్వంగా  ఏం చెప్పదలచుకున్నా తను చెబుతున్నది తన ఎదుట ఉన్న ప్రపంచంతో అని మరువరాదు. ఎదుటివారికి కవి తన ఉద్వేగాలను కవిత్వంగా ప్రకటిస్తున్నప్పుడు తన ఎదుట ఉన్న ప్రపంచాన్ని తన ఉద్వేగంలో భాగం చేసుకోవాలి. తను ప్రకటిస్తున్నది తన బాధ మాత్రమే అయితే ప్రపంచానికి ఆ బాధతో నిమిత్తం లేదు. ప్రపంచపు బాధను కవిగా సరిగా ప్రకటించలేకపోతే ఆ ప్రకటనతో ప్రపంచానికి అవసరం లేదు. మంచి కవులుగా పేరుగడించిన ఎవరిని ఉదాహరణగా తీసుకున్నా మనం ఈ విషయాన్ని స్పష్టంగా గమనించవచ్చు. దీనినే సాంప్రదాయ విశ్లేషకులు సాంద్రీకరించడం అంటూ ఉంటారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే కవి తన దగ్గర ఉన్న గ్లాసెడు ఉప్పునీళ్ళను  అందరూ తాగే గంగాళంలో పొయ్యడం లాంటిదన్నమాట. ఇక్కడ ఆ ఉప్పటి రుచిని కవి చూసినట్లే కవి కవిత్వం ద్వారా పాఠకులూ రుచి చూడాలి.అప్పుడే ఆ కవిత్వం ప్రపంచానికి ఆమోదమవుతుంది. మన చుట్టూ జరిగే సాధారణ విషయాలపట్ల తన భయాలూ ఊహలూ కూడా కవి తన కవిత్వం ద్వారా ప్రపంచపు భయంగా బాధగా ఎలా మార్చవచ్చో ఈ క్రింది కవితను చూడండి.

నాన్న దిగులు*

 

అంతా అనుకున్నట్టే జరుగుతుంది అనుకుంటాం

కానీ ఎక్కడో చిన్న తేడా, దిగులు పోదు, చెప్పుకున్నా తీరదు

 

వలసపోయిన ప్రతిరూపాన్ని  తడిసిన రెప్పలు సాగనంపుతోంటే

తావి లేని పువ్వులా దేహం రెండు ముక్కలై సెలవు తీసుకున్నట్టుంది

 

ఉన్నట్టుండి ఓ రోజు  ఏ చానలో, పేపరో మెత్తగా భయపెడుతుంది

ఇంట్లో ముసల్ది వద్దన్న మాటలకు ఊతం వస్తుంది

 

ఆఫీసులోనో, కాలేజిలోనో, పచారి కొట్టు వద్దో  భయంగానో, దిగులుగానో, సానుభూతిగానో

నాలుగు మాటల్ని చప్పరిస్తాం

 

ఆ రెండు మూడ్రోజులు దూరమైన దేహానికి  నాలుగైదు ఫోన్ కాల్స్ ఎక్కువ చేసి

నిమ్మళంగా ఉండే ప్రయత్నం చేస్తాం

 

అదుపు తప్పుతోన్న టెస్టోస్టెరాన్లను బూతుల బురదలో ముంచెత్తి అలసి పోతాం

 

ఆ రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర చర్చ జరిగాక

వద్ద చొక్కా విప్పాలంటే సిగ్గుగా ఉంది  భరించలేని ఉక్కా ఉంది

 

రసాయనాల చర్య సెక్సే అయినా  నియంత్రించేది మెదడే కదా

 

ఆ పదహారేళ్ళతో ఏ జాగ్రత్తలు చెప్పను?

సిగ్గు విడిచి వాళ్ళమ్మతో ఏమని మాట్లాడించను

 

ఫోన్ చేయకపోయినా లిఫ్ట్ చేయకపోయినా  బుర్రలో పిరికి పాములు బుస కొడతాయి

 

మాట మౌనమైనా, స్వరం మంద్రమైనా తవ్వకం సిగరెట్ పొగై తరుముతుంది

 

సిస్టమ్ ముందు కూర్చుని ఏమి చేస్తోందోనన్న అనారోగ్య ఆలోచనలు

నీలి నీడలై ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి

 

ఎంతైనా మగవాళ్ళం కదా  ఆలోచనలు అలాగే ఉంటాయి

 

నన్ను నేను పోగొట్టుకుని నిఘానై గస్తీ తిరుగుతోంటే

ఈలోపు విడివడ్డ దేహపు ముక్క ఏ పండుగ సెలవులకో

నా పెదాలపై వాలుతుంది

 

తప్పిపోయిన నేను  దాని కంటిపాపలో దొరికి

నన్ను నేను పుటం పెట్టుకుంటాను

కొండంత ఉపశమనంతో  ( కే. వెంకటేశ్)

పై కవితలో ఎదిగిన కూతురు ఇల్లు వదలి పై వూర్లో చదువుకో ఇంకొక అవసరానికో బయట ఉన్నప్పుడు తండ్రి పడే కలవరపాటు అందరు తండ్రులదీ చేయగలిగిన కవి మనమింతకుముందు అనుకున్న అ ఉప్పునీటి రుచిని తన పాఠకులకు చేర్చగలిగాడు కవి. కవి తన కవితలో వాడిన పదాలు తనకు ప్రత్యేకం అయితే ప్రకటించిన ఉద్వేగంలో ప్రపంచాన్నీ భాగం చేసుకున్నాడు కవి.

కవి కృష్ణశాస్త్రి లా తన బాధను ప్రపంచం బాధగా మార్చొచ్చు. ప్రపంచపు బాధను తన బాధగానూ ప్రకటించవచ్చు. అయితే ప్రపంచపు ఉద్వేగాలను ఉద్దీపించడం మాత్రం మరువరాదు.

*: కవిత: నాన్న దిగులు. కవి: కే. వెంకటేశ్, ప్రచురితం ఆంధ్ర  జ్యోతి వివిధ.

*

 

 

చంద్రశేఖర్ కర్నూలు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు